• facebook
  • whatsapp
  • telegram

గైర్హాజరు వ్యూహాత్మకం

యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో లంకకు భారత్‌ దన్ను!

మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై శ్రీలంకను జవాబుదారీగా నిలబెట్టాలనే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించాలా, వ్యతిరేకించాలా అనే విషయంలో నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. ఈ వ్యవహారంలో భారత్‌ లౌక్యంగా వ్యవహరించింది. యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో తాజాగా మంగళవారం జరిగిన ఓటింగ్‌ ప్రక్రియకు గైర్హాజరవడం ద్వారా తన వైఖరిని తెలివిగా ప్రదర్శించింది. 2009లో లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ)తో సాయుధ పోరు ముగిసిన అనంతరం బాధితులకు సరైన న్యాయం చేయలేదనే ఆరోపణలపై ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సమావేశాల్లో శ్రీలంక మానవ హక్కులపై తీర్మానాన్ని ఎదుర్కొంటోంది.

యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో భారత్‌ ప్రదర్శించిన వైఖరిపై ఈ రంగంలోని నిపుణుల నుంచీ ప్రశంసలు అందుతుండటం గమనార్హం. ‘చైనాతో కొనసాగుతున్న సంబంధాల కారణంగా భారత్‌ విషయంలో శ్రీలంక వైఖరి అర్థం చేసుకోదగినదే. డ్రాగన్‌తో లంక సంబంధాల విషయం మనకు అనవసరం, కాకపోతే, భారత భద్రత, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకూడదు. కొలంబో ఓడరేవు అభివృద్ధి కోసం భారత్‌, జపాన్‌లు చేసిన వినతిని మన్నించే విషయంలో శ్రీలంక సునిశితత్వాన్ని ప్రదర్శించింది. చైనా నావికా సౌకర్యాల విషయంలోనూ లంక నేతలు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి, మన భద్రతా పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటే యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో భారత్‌ నిర్ణయం సరైనదే’ అని మాజీ దౌత్యవేత్త జి.పార్థసారథి వ్యాఖ్యానించారు. దక్షిణ శ్రీలంకలోని తమిళులకు భారత్‌తో ఎలాంటి సమస్యలు లేవు. భారత్‌ భారీస్థాయిలో ఆర్థిక సహాయమూ అందజేస్తోంది. శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని వారికోసం సాయుధ పోరు తరవాత గృహ నిర్మాణం తదితర రూపంలో భారీగా సహాయ సహకారాలు అందజేసింది. తమ అంతర్గత సమస్యలను పరిష్కరించుకొనే విషయంలో లంకదే బాధ్యత. తమిళులు, శ్రీలంక మధ్య చర్చల వాతావరణం నెలకొనేలా భారత్‌ ప్రోత్సాహం అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరవడం స్వాగతనీయ పరిణామం. తమిళుల ఆకాంక్షలను నెరవేర్చడం, పౌరులందరి హక్కులు, స్వేచ్ఛను పరిరక్షించే విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి సాగాలని శ్రీలంక ప్రభుత్వానికి భారత్‌ విన్నవించింది. 2009లో సాయుధ పోరు ముగిసిన అనంతరం ఒక పొరుగు దేశంగా లంక సహాయ, పునరావాస, పునర్నిర్మాణ ప్రక్రియకు భారత్‌ తోడ్పాటు అందించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.

యూఎన్‌హెచ్‌ఆర్‌సీ తాజా ఓటింగ్‌ ప్రక్రియలో చైనా, పాక్‌ సహా మొత్తం పదకొండు దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా, అనుకూలంగా 21 ఓట్లు పడ్డాయి. భారత్‌, నేపాల్‌తోపాటు 14 దేశాలు గైర్హాజరయ్యాయి. ఐరాస మానవ హక్కుల కమిషనర్‌ నివేదిక ఆధారంగా రూపొందించిన తీర్మానంపై ఓటింగ్‌ జరిగింది. మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు, గతంలో యుద్ధనేరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో శ్రీలంక వైఫల్యంపై  ఆ తీర్మానంలో ఆక్షేపించారు. తీర్మానంపై ఓటింగ్‌కు ముందు గొటబయ రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక ప్రభుత్వం యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో మద్దతు కోసం అంతర్జాతీయ సమాజం సహకారాన్ని కోరింది. ముఖ్యంగా, ప్రధానమంత్రి మోదీకి ఫోన్‌ చేసి భారత్‌ సహాయాన్ని కోరుతూ, ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విన్నవించింది. మానవ హక్కుల ఉల్లంఘనపై శ్రీలంకకు వ్యతిరేకంగా యూఎన్‌హెచ్‌ఆర్‌సీ పలు తీర్మానాలు ఆమోదించింది. వాటిని లంక సర్కారు ఖండిస్తూ వస్తోంది. ఐరాస తీర్మానాలను తమ దేశంలో అవాంఛిత విదేశీ జోక్యంగా పరిగణిస్తోంది. 2009 సాయుధ పోరు ముగిసిన తదనంతర కాలంలో యూఎన్‌హెచ్‌ఆర్‌సీ శ్రీలంకకు వ్యతిరేకంగా ఏడు తీర్మానాల్ని తీసుకొచ్చింది. అందులో నాలుగింటిని ఓటింగ్‌కు పెట్టింది. 2009, 2012, 2013 సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన మూడు తీర్మానాలపై భారత్‌ ఓటింగ్‌లో పాల్గొంది. 2014 నాటి తీర్మానానికి మాత్రం గైర్హాజరైంది. 2015 నుంచి తీసుకొచ్చిన మూడు తీర్మానాలు ఏకాభిప్రాయంతో పాటు వాటికి లంక సహకారం ఉండటంతో అవి ఓటింగ్‌కూ రాలేదు. సమానత్వం, న్యాయం, గౌరవం, శాంతి సాధనలతోపాటు, ఐక్యత, సుస్థిరత, ప్రాదేశిక సమగ్రత వంటి అంశాల ప్రాతిపదికగా శ్రీలంకలోని తమిళులకు భారత్‌ మద్దతు అందిస్తూ వస్తోంది.

- చంద్రకళాచౌధురి

Posted Date: 25-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం