• facebook
  • whatsapp
  • telegram

  పాక్‌కు కనువిప్పు కలిగేదెప్పుడు?

* దాడులను తిప్పికొడుతున్న భారత్‌

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న ఓ వాహనంలో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌) శ్రేణిపై జరిపిన దాడిలో 40 మంది మృతి చెందారు. ప్రతిగా ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం బాలాకోట్‌లోని జైష్‌ ఎ మొహమ్మద్‌ ఉగ్రవాదుల శిబిరంపై దాడి జరిపింది. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తూంఖ్వా ప్రావిన్సులో బాలాకోట్‌ ఉంది. పాకిస్థాన్‌ గడ్డపై భారత యుద్ధవిమానం దాడి చేపట్టడం 1971 తర్వాత ఇదే తొలిసారి. ఆ మరుసటి రోజు, పాకిస్థాన్‌ వైమానిక దళం ప్రతి దాడి ప్రారంభించినా, పెద్దగా ఎలాంటి నష్టాన్ని కలిగించలేకపోయింది. అయితే, గగనతల పోరులో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానం భారత్‌ చేసిన దాడిలో నేలకూలగా, మన దేశం సైతం ఓ మిగ్‌-21 యుద్ధ విమానాన్ని కోల్పోయింది. అందులోని పైలట్‌ పాకిస్థాన్‌ భూభాగంలో దిగి, శత్రుదేశానికి బందీగా చిక్కారు. ఆ తరవాత ఇరుదేశాల మధ్యా పరిస్థితి తీవ్రస్థాయి దాడుల వరకూ వెళ్లేలా కనిపించినా, అదృష్టవశాత్తు ఇరుపక్షాలూ అంతకుమించిన సైనిక చర్యకు దిగకుండా తమను తాము నిగ్రహించుకున్నాయి. అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి కూడా ఇరువర్గాల్నీ వెనకంజ వేసేలా చేసింది. అంతలోనే భారత పైలెట్‌ త్వరగా స్వదేశానికి చేరుకోవడం కూడా పరిస్థితులు చల్లబడేలా చేసింది. బాలాకోట్‌ ఘటన భారత రాజకీయ క్షేత్రంలో తీవ్రస్థాయి చర్చకు దారితీసింది. బాలాకోట్‌లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నారు. విదేశీ మీడియా కూడా చర్చలో వచ్చి చేరింది. బాలాకోట్‌కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు అంతర్జాలంలో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందాయి. కొంతమంది భారత్‌ చేసిన వాదనను సమర్థించగా, మరికొంతమంది పలు ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తానికి ఆ సంఘటన జరిగి ఏడాది గడిచింది. వివాదం దాదాపు సద్దుమణిగింది. ఈ క్రమంలో బాలాకోట్‌ వైమానిక దాడులు ఎంతమేర ఫలితాన్ని సాధించాయనే దిశగా ఎలాంటి పక్షపాతం లేకుండా సమీక్షించే యత్నం చేయాలి. ఆ ఘటన నుంచి భవిష్యత్‌ పాఠాలు నేర్చుకోవాలి.

ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదం విషయంలో భారత్‌ రక్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపించింది. ఫలితంగా పాకిస్థాన్‌ సైన్యానికి కశ్మీర్‌లో పరోక్ష యుద్ధం చేయడానికి ప్రోత్సాహం లభించినట్లయింది. ప్రస్తుతం భారత రాజకీయ నాయకత్వం సైనిక శక్తిని ఉపయోగించే విషయంలో సుముఖంగా ఉంటూ, స్థిర నిశ్చయాన్ని ప్రదర్శిస్తుండటంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. భారత్‌లో ఉగ్రదాడులకు సహాయ సహకారాలు అందిస్తే, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే భావన పాకిస్థాన్‌లో నెలకొంది. ఉగ్రదాడికి ప్రతిగా వైమానిక శక్తిని ఉపయోగించడం కూడా బాలాకోట్‌ ఘటనతోనే తొలిసారిగా చోటుచేసుకుంది. బాలాకోట్‌ దాడి- దేశం ముందున్న లక్ష్యాల సాధన కోసం వైమానిక శక్తిని ఉపయోగించుకునే దిశగా పరిస్థితుల్ని సమూలంగా మార్చివేసిందనీ, ఉపఖండంలో సంప్రదాయక చర్యల భావనే మారిపోయిందని భారత వైమానిక దళాధిపతి భదౌరియా ఇటీవల ఒక పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రతిసారీ మనదేశం వైమానిక దాడికి దిగకపోవచ్చు. కాకపోతే, పాకిస్థాన్‌ యత్నాల్ని దెబ్బతీసే క్రమంలో వైమానిక శక్తిని వినియోగించడం ద్వారా భారత ప్రతిస్పందన స్థాయిని గణనీయంగా పెంచిందని మాత్రం చెప్పవచ్చు. దూకుడు, దృఢనిశ్చయంతో ఉన్న భారత్‌- ఉగ్రదాడులను ఏమాత్రం సహించే పరిస్థితిలో లేదు. ఇదంతా పాకిస్థాన్‌ ప్రవర్తనలో మార్పు తీసుకురాగలదా? అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ విషయంలో పాకిస్థాన్‌ ఆత్మపరిశీలన చేసుకుంటుందనడంలో సందేహం లేదు. పాక్‌ నేతలు కశ్మీర్‌ కోసం ఎంతకాలమని తమ దేశాన్ని ఇక్కట్లపాలు చేసుకుంటారనేదీ చర్చనీయాంశమే. కార్గిల్‌ యుద్ధం తర్వాత కూడా పాకిస్థాన్‌లో ఇదేతరహా చర్చ జరిగింది. ‘దేశం తన పరిమితులు, ప్రాధాన్యాల విషయంలో వాస్తవాల్ని గుర్తించేందుకు ఇదే సరైన సమయం. కశ్మీర్‌ అంశంలో మన ప్రమేయం వంటి అంశాలకన్నా ముందు పాకిస్థాన్‌ మనుగడే ముఖ్యం’ అని మాజీ రాయబారి షాహిద్‌ ఎం.అమిన్‌ ఓ పత్రికలో అభిప్రాయపడటం గమనార్హం. అయితే, పాకిస్థాన్‌లో ఎలాంటి ఆత్మపరిశీలన జరిగిందనేది తెలియదు. తమ ముందు సంప్రదాయ సైనిక శక్తిని వినియోగించడానికి పలు అవకాశాలు ఉన్నాయని, పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడానికి భారత్‌ తన అత్యున్నత సామర్థ్యాన్ని వినియోగించాలని భారత సైన్యం భావిస్తోంది. మరోవైపు, తనకున్న అణుశక్తి భారత్‌ను ఒక పరిమితికి మించిన ఆపరేషన్‌తో దూకుడుగా ముందుకు రాకుండా నిలువరిస్తుందని, తద్వారా సంప్రదాయ శక్తిని తటస్థీకరిస్తుందని పాకిస్థాన్‌ సైన్యం భావిస్తోంది. ఇలాంటి అనిశ్చితితో కూడిన వాతావరణంలో ఇరుపక్షాలు తమ ముందున్న ఐచ్ఛికాలను, రాజకీయ లక్ష్యాలను వాస్తవిక దృక్పథంతో, సహేతుక రీతిలో మదింపు చేసుకోవాలి. భారత్‌పై ఉగ్రదాడి చేయడమనేది ఉద్రిక్తతల్ని పెంచే దిశగా తొలి అడుగు, దానిని పరిహరించినట్లయితే, రెండో అడుగు వేసే అవసరమే ఉండదన్న సంగతిని పాకిస్థాన్‌ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

- డి.ఎస్‌.హూడా
(రచయిత- విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌)

Posted Date: 14-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం