• facebook
  • whatsapp
  • telegram

  పాక్‌కు దివాలా ముప్పు!

* ప్రస్తుతం ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే జాబితాలో...

అంతర్జాతీయ సంస్థ ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) సమావేశంలో పాకిస్థాన్‌ను తిరిగి ఇతర పర్యవేక్షక అధికార పరిధిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. దీనినే గ్రే జాబితాలో ఉంచడంగా వ్యవహరిస్తారు. పారిస్‌లోని ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్రధాన కార్యాలయంలో ప్లీనరీ సమావేశం జరిగే 2020 జూన్‌ వరకూ ఈ నిర్ణయమే అమల్లో ఉంటుంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ను 1989లో ఏర్పాటు చేశారు. డబ్బుల్ని అక్రమంగా తరలించే మనీలాండరింగ్‌ వ్యవహారాలు; ఉగ్రవాదులకు నిధుల సరఫరా తదితర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమగ్రతకు ఎదురయ్యే ముప్పులపై పోరాడే దిశగా న్యాయపరమైన, నియంత్రణ, నిర్వహణలకు సంబంధించిన చర్యలను, ప్రమాణాలను నిర్దేశించడం ఈ సంస్థ విధి. మనీలాండరింగ్‌ నిరోధకం, ఉగ్రవాదులకు నిధుల అందజేతపై పోరాటం దిశగా ఆయా దేశాలు తీసుకునే చర్యల ప్రభావాన్ని ఎఫ్‌ఏటీఎఫ్‌ పర్యవేక్షిస్తుంది. ఈ అంశాల్లో విధివిధానాల్ని రూపొందిస్తూ, ప్రపంచ దేశాలకు గట్టి సిఫార్సుల్ని అందిస్తుంది. ప్రస్తుతం ఇందులో 37 దేశాలు, ఐరోపా కమిషన్‌, గల్ఫ్‌ సమన్వయ మండలి వంటి రెండు ప్రాంతీయ సంస్థలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని ఆర్థికంగా బలమైన పెద్ద దేశాలన్నీ ఇందులో సభ్యులే. ఎఫ్‌ఏటీఎఫ్‌కు మరో ఎనిమిది ప్రాంతీయ అనుబంధ సభ్య సంస్థలూ ఉన్నాయిు. వాటికి మనీలాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధుల సరఫరా వంటి సమస్యల పరిష్కారం బాధ్యతను అప్పగించారు. ఆసియా పసిఫిక్‌ గ్రూప్‌ (ఏపీజీ)గా పిలిచే అనుబంధ సభ్య సంస్థలో భారత్‌, పాకిస్థాన్‌ రెండింటికీ సభ్యత్వం ఉంది. వీటికితోడు, ఎఫ్‌ఏటీఎఫ్‌కు పది పరిశీలక సంస్థలున్నాయి. ప్రపంచబ్యాంకు కూడా అందులో ఒకటి. ఎఫ్‌ఏటీఎఫ్‌ అధ్యక్షుడిని ఏడాది కాలవ్యవధి కోసం రొటేషన్‌ పద్ధతిలో సభ్య దేశాల నుంచి నామినేట్‌ చేస్తుంటారు. ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతల్ని చైనా నిర్వర్తిస్తోంది. ఏటా ఎఫ్‌ఏటీఎఫ్‌ మూడు ప్లీనరీ సమావేశాల్ని ఫిబ్రవరి, జూన్‌, అక్టోబరు మాసాల్లో నిర్వహిస్తారు. ఆ సమావేశాల్లో తమ పరిశీలనలో ఉన్న దేశాలు విధివిధానాలు, మార్గదర్శకాలకు ఏ మేరకు కట్టుబడి ఉన్నాయనేది చర్చించి, నిర్ణయం తీసుకుంటారు. అందులో 40 తప్పనిసరి ప్రామాణికాలు, తొమ్మిది అదనపు ప్రామాణికాలు ఉంటాయి. వాటి ఆధారంగానే ఆయా దేశాలు మనీలాండరింగ్‌, ఉగ్రనిధులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని పర్యవేక్షిస్తారు. తప్పనిసరి ప్రామాణికాల్ని కచ్చితంగా నెరవేర్చాల్సిందే. తప్పనిసరి ప్రామాణికాలు చాలా వరకు మనీలాండరింగ్‌, ఉగ్రనిధులను అడ్డుకునే వ్యవస్థను సక్రమ రీతిలో నడిపించేందుకు తోడ్పడతాయి. వినియోగదారుల శ్రద్ధ, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, రికార్డుల సక్రమ నిర్వహణ, దొంగ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేసే జాతీయ స్థాయి అధికారులకు అందించడం వంటివాటిని చక్కదిద్దుతుంది.

తప్పనిసరి ప్రామాణికాల పరామితుల ఆధారంగా ఒక దేశాన్ని గ్రే జాబితాలో ఉంచాలా, చర్యలు తీసుకోవాల్సిన బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచాలా అనేది ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి పాకిస్థాన్‌ సహా 14 దేశాలు గ్రే జాబితాలో ఉన్నాయి. ఇరాన్‌, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్‌లిస్టులో ఉన్నాయి. ఏదేని దేశాన్ని గ్రే జాబితాలో చేర్చాలన్నా, తొలగించాలన్నా 12 దేశాలు ఓటు వేయడం అవసరం. గ్రే జాబితా నుంచి తొలగించేందుకు ప్రత్యక్ష తనిఖీతోపాటు ఎఫ్‌ఏటీఎఫ్‌ నుంచి సానుకూల నివేదిక కూడా అవసరమవుతుంది. అప్పటికే గ్రే జాబితాలో ఉన్న ఒకదేశాన్ని బ్లాక్‌లిస్ట్‌లోకి మార్చాలంటే కనీసం 37 సభ్య దేశాల ఓటు అవసరం. ఈ కారణంగానే పాకిస్థాన్‌ రెండు పర్యాయాలు బ్లాక్‌లిస్ట్‌లో చేరకుండా తప్పించుకుంది. 2019 అక్టోబర్‌, 2020 ఫిబ్రవరిలో రెండుసార్లూ పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చైనా, మలేసియా, టర్కీ ఓటేశాయి. 2019 అక్టోబర్‌లో 27 చర్యలకుగాను 22 మాత్రమే అమలు చేసినట్లు తేలింది. ఈసారి ఇచ్చిన 27 చర్యలకుగాను పాకిస్థాన్‌ 14 మాత్రమే నెరవేర్చినట్లు ఎఫ్‌ఏటీఫ్‌ గుర్తించింది. మిగతా కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి విభిన్న స్థాయుల్లో పురోగతి సాధించినట్లు తేల్చారు. 2020 జూన్‌ నాటికి పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళికను వేగంగా పూర్తి చేయాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ పాక్‌ను కోరింది. లేనిపక్షంలో జరిమానా విషయంలో గణనీయమైన తేడాను చూడాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలు, లావాదేవీలపై ప్రత్యేక దృష్టి. పెట్టేలా తమ సంస్థలకు ఆదేశాలివ్వాలని ఎఫ్‌ఏటీఎఫ్‌ తన సభ్యులను కోరుతుంది. దీనివల్ల పాకిస్థాన్‌పై కత్తి వేలాడుతున్నట్లే భావించాలి. అంటే వచ్చే ప్లీనరీ నాటికి పాక్‌ తీసుకోవాల్సిన చర్యల్ని పూర్తిస్థాయిలో నెరవేర్చకపోతే, వ్యాపార, వాణిజ్య లావాదేవీలన్నీ స్తంభించిపోతాయి, ఫలితంగా పూర్తిస్థాయిలో దివాలా తీసి, పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుంది. ఈ కారణంగానే పాకిస్థాన్‌ తన మూడు మిత్ర దేశాలతో కలిసి ఎఫ్‌ఏటీఎఫ్‌ ఉచ్చు నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తోంది. పాకిస్థాన్‌లో సైనిక బలగాలు ఉగ్రవాద సంస్థల మధ్య ఉన్న బలమైన సంబంధాలు, వారు ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందించి భారత్‌లోకి చొరబడేలా చేయడం అందరికీ తెలిసినవే. ఇలాంటి చర్యలే పాకిస్థాన్‌కు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. జైష్‌ ఎ మొహమ్మద్‌ అధినేత అజర్‌ మసూద్‌ పారిపోయాడనీ, తమ దేశంలో ఉన్నట్లు గుర్తించలేకపోయామంటూ ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్‌ చిన్నపిల్లల తరహాలో వాదనలు వినిపించగా, పాక్‌ అబద్ధాల్ని భారత్‌ తేటతెల్లం చేసింది. అమెరికా సహా పెద్ద దేశాలన్నీ భారత్‌ వైపు నిలవగా, పాక్‌కు మరొక అవకాశం ఇవ్వాలనే పేరిట చైనా అండగా నిలిచింది. వచ్చే జూన్‌ నాటికి పాకిస్థాన్‌ ఉగ్రవాద తండాలను నియంత్రించగలదా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సుస్థిర, సుస్పష్ట చర్యలు తీసుకున్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్‌ను ఒప్పించగలదా అనేది చూడాల్సి ఉంది. అప్పటి వరకూ పాకిస్థాన్‌పై దివాలా ముప్పు పొంచి ఉన్నట్లే భావించాలి.

- జేకే త్రిపాఠి
(రచయిత- జింబాబ్వేలో భారత రాయబారిగా పనిచేశారు)

Posted Date: 18-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం