• facebook
  • whatsapp
  • telegram

  పట్టువిడుపుల సుహృద్భావం

* భారత్‌ - అమెరికా బంధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి భారత పర్యటనను విజయవంతంగా ముగించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రోడ్డు షో సందర్భంగా, అలాగే మోతేరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో ప్రజలు అమెరికా అధ్యక్షుడికి ఉత్తేజకర రీతిలో, భారీ స్థాయిలో స్వాగతం పలికారు. ట్రంప్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలకు అభివందనాలు తెలిపేందుకు ప్రజలు పెద్దయెత్తున తరలివచ్చారు. ఒక అమెరికా అధ్యక్షుడికి మనదేశంలో భారీస్థాయిలో స్వాగతం లభించడం ఇదే తొలిసారి కాదు. 1959లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్‌ తన భారత పర్యటన సందర్భంగా, దిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో లక్షల మందిని ఉద్దేశించి ప్రసంగించారు. అందుకని, మోతేరా కార్యక్రమం గతంలో జరిగిన భారీ స్వాగతాలకు కొనసాగింపు వంటిదే. అధ్యక్షుడు ట్రంప్‌, ప్రధాని మోదీ అమెరికా హ్యూస్టన్‌లో నిర్వహించిన భారీ సభ, 2017లో నాటి జపాన్‌ ప్రధాని షింజో అబె భారత్‌లో పర్యటించినప్పుడు అహ్మదాబాద్‌లో చేపట్టిన భారీ రోడ్డు షో కూడా ఈ తరహా కార్యక్రమాలే.

ఒప్పందాల్లో సంక్లిష్టత
భారత్‌ విషయానికొస్తే, అమెరికాయే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. వస్తూత్పత్తులు, సేవల వాణిజ్య సరళిని పరిశీలిస్తే, 2018లో భారత్‌-అమెరికా వాణిజ్యం 142.6 బిలియన్‌ డాలర్ల మేర జరిగింది. అదే చైనాతో గత కొన్నేళ్లుగా సగటున భారత్‌ సుమారు 50 బిలియన్‌ డాలర్ల మేర సరకుల వాణిజ్య లోటును కలిగి ఉండగా, అమెరికాతో సుస్థిర వాణిజ్య మిగులు పొందుతోంది. మనం అమెరికాతో వాణిజ్య సంబంధాల్ని మెరుగుపరచుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నామనే ప్రశ్నకు... వాషింగ్టన్‌, బీజింగ్‌లతో ఇండియా వాణిజ్యాన్ని సరిపోల్చడం ద్వారా సమాధానం లభిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఖరారు చేసుకోవడానికి ఇండియా-అమెరికాలు తీవ్రస్థాయిలో సంప్రతింపులు జరుపుతున్నాయి. ఇటీవల ట్రంప్‌ పర్యటన సందర్భంగా సీనియర్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే, ఇది త్వరలోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. చర్చలు జరుపుతున్న దేశాల మధ్య భిన్న తరహా ఆర్థిక వ్యవస్థలు ఉంటే, చాలా సందర్భాల్లో సంప్రతింపుల ద్వారా వాణిజ్య ఒప్పందాలు విజయవంతమవుతుంటాయి. భారత్‌, అమెరికాల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఒక వాణిజ్య ఒప్పందం ఖరారులో ఆలస్యానికి అనేక కారణాలు ఉండొచ్చు. ట్రంప్‌ న్యూయార్క్‌ నేపథ్యం నుంచి వచ్చినా, అతని రాజకీయ పలుకుబడి గ్రామీణ అమెరికాలోనే ఉంది. ఫలితంగా, ట్రంప్‌ ఇతర దేశాల నుంచి వ్యవసాయ రంగానికి భారీ రాయితీలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, వ్యవసాయ, పాడి రంగాల్లో రాయితీలు కల్పించడం భారత్‌ వంటి దేశాలకు ఇబ్బందికర పరిణామమే.

ట్రంప్‌ సంప్రతింపుల శైలి కూడా కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతోంది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రాభవం క్షీణించడంపై చింతిస్తున్న భారీ వర్గం ఆ దేశంలో ఉంది. అమెరికా సమాజంలో నెలకొన్న ఇలాంటి ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దుదాం అనే నినాదాన్ని ట్రంప్‌ తలకెత్తుకున్నారు. తన దేశంలో పరిష్కరించుకోవాల్సిన పలు సమస్యలు ట్రంప్‌ ముంగిట ఉన్నాయి. తాను అమెరికాకు అనుకూలంగా ఒప్పందాల్ని సాధించుకొచ్చానని చెప్పుకోవాల్సిన అవసరం ఈ ఎన్నికల ఏడాదిలో ట్రంప్‌కు చాలా ఉంది. ఇది వాణిజ్య ఒప్పందాల సంప్రతింపుల్లో సంక్లిష్ట పరిస్థితులు నెలకొనడానికి కారణమవుతోంది. అమెరికా, భారత్‌ల మధ్య విశ్వాసం బలపడుతుండటంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధ వ్యవస్థను భారత్‌కు బదిలీ చేసేందుకు అగ్రరాజ్యం ముందుకొస్తోంది. సమగ్ర వైమానిక రక్షణ ఆయుధ వ్యవస్థ (ఐఏడీడబ్ల్యూఎస్‌)ను, సముద్రంలో రక్షణ అందించే డ్రోన్లను భారత్‌కు సమకూర్చడంలో సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి. ట్రంప్‌ పర్యటన సందర్భంగా, ఎంహెచ్‌-60ఆర్‌ నావిక్‌, ఏహెచ్‌-64ఈ అపాచీ హెలికాప్టర్లను భారత్‌కు అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. భారత రక్షణ అవసరాలను తీర్చే విషయంలో అమెరికా అమ్మకాలు పెరుగుతున్నా, ఇప్పటికీ భారత రక్షణ కొనుగోళ్లలో 60 శాతం దాకా వాటా రష్యా నుంచే ఉంది. రాబోయే సంవత్సరాల్లో రక్షణ వ్యవస్థకు సంబంధించి కొన్ని కీలక ఉత్పత్తులనైనా దేశీయంగా తయారు చేసుకోవడం భారత్‌ లక్ష్యం కావాలి. ఇరుదేశాల్లో డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, వాణిజ్య, సమాచార మార్పిడికి వీలు కల్పించే స్వేచ్ఛాయుత, విశ్వసనీయ, సురక్షిత అంతర్జాలం భారత్‌, అమెరికాల మధ్య పెరుగుతున్న అనుబంధంలో ఒక ఆసక్తికర కోణం. మన దేశంలో 5జీ నెట్‌వర్క్‌ ట్రయల్స్‌ నిర్వహించుకోవడానికి చైనా హువావై కంపెనీకి ఇప్పటికే అనుమతులిచ్చింది. అయితే, భారత్‌లో 5జీ సేవల నిర్వహణ విషయంలో చైనా కంపెనీలు తుది అనుమతులు పొందుతాయా అనేది వేచిచూడాల్సిన విషయం. అమెరికా అధ్యక్షుడితో పారిశ్రామిక వేత్తల సమావేశంలో రిలయన్స్‌ సంస్థ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ 5జీ ట్రయల్స్‌ కోసం చైనా ఉపకరణాలేవీ ఉపయోగించని ఒకే ఒక్క నెట్‌వర్క్‌ రిలయన్స్‌ జియో అని పేర్కొనగా, ట్రంప్‌ ప్రశంసలు కురిపించడం ఆసక్తికరం.

ఈమధ్య ఆసియాలోని పలుదేశాల్లో చైనా చేపట్టిన అనేక ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకం కాని కారణంగా అవన్నీ అప్పుల్లో కూరుకుపోయాయి. ఆయా దేశాలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఆ పాజెక్టులను చైనా చేపట్టింది. అలాంటి సవాళ్లను ఎదుర్కొనే దిశగా భారత్‌, అమెరికా సంయుక్త ప్రకటన సాగింది. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో మౌలిక రంగ అభివృద్ధి కోసం అత్యున్నత నాణ్యమైన విశ్వసనీయ ప్రమాణాల్ని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ బ్లూడాట్‌ నెట్‌వర్క్‌ భావనపై ఆసక్తిని ప్రదర్శించారు అని అందులో పేర్కొన్నారు. బ్లూడాట్‌ నెట్‌వర్క్‌ అనేది... భౌతిక, డిజిటల్‌ మౌలికరంగ ప్రాజెక్టులను నాణ్యత, పారదర్శకత, ఆర్థిక సుసాధ్యత, భద్రత వంటి పలురకాల పరామితుల ఆధారంగా ధ్రువీకరిస్తుంది. అసాధ్యమైన మౌలికరంగ ప్రాజెక్టులను అమలు చేయకుండా ఆసియాలోని పలుదేశాల్ని నివారించే దిశగా భారత్‌, అమెరికా, ఇతర భావసారూప్య దేశాలు కలిసి పనిచేస్తాయని దీన్నిబట్టి తెలుస్తోంది.

ముప్పిరిగొంటున్న ఆందోళనలు
ట్రంప్‌ పర్యటనలో పలు విజయాలు ఉన్నప్పటికీ, తాలిబన్ల విషయంలో అమెరికా విధానంపై భారత్‌లో ఆందోళనలు పెరుగుతున్నాయి. అమెరికా సైన్యం 19 ఏళ్లుగా తాలిబన్‌లో ఉంటోంది. అఫ్గాన్‌లో కొనసాగే విషయంలో ఆ దేశానికి ఇంకెంతమాత్రం ఆసక్తిలేదు. దిల్లీలో పాత్రికేయ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ, అఫ్గాన్‌ నుంచి బయట పడాలని తమదేశం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో సురక్షితంగా వెళ్లిపోయేందుకు తాలిబన్లతో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఒడంబడిక సైతం కుదిరిందంటున్నారు. అఫ్గాన్‌ నుంచి వైదొలగాలనుకునే అమెరికా ఆకాంక్ష అర్థం చేసుకోదగ్గదే. అయితే, చట్టబద్ధమైన రాజకీయ శక్తిగా తాలిబన్‌ను గుర్తించడానికి జరుగుతున్న యత్నాలే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అఫ్గాన్‌లో తాలిబన్లు శక్తిమంతమైన రాజకీయ వర్గంగా పునరుజ్జీవనం పొందడం భారత్‌కు క్షేమకరం కాదు. ఈ క్రమంలో మధ్య ఆసియా దేశాలతో, అఫ్గాన్‌లోని ఇతర రాజకీయ శక్తులతో భారత్‌ సత్వరమే సంబంధాల్ని మెరుగుపరచుకోవాల్సి ఉంది. భారత్‌, అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకుని పన్నెండేళ్లు అవుతోందన్న సంగతిని ఓసారి గుర్తుచేసుకోవాలి. ఆ సమయంలో భారత్‌ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కోల్పోతుందని, ఆ ఒప్పందం భారత అణు కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే అవేవీ నిజం కాలేదు. పెద్ద దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో కాసింత జాగరూకతతో ఉండటం సహజమే. అయితే, జాగ్రత్త అనేది మన దేశ ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో మనకు బంధనాలు వేయకూడదు. ఇప్పటిదాకా, భారత నాయకత్వం పెద్ద దేశాలతో ఒప్పందాల సందర్భంగా ఎంతో దూరదృష్టిని, నైతిక ధృతిని ప్రదర్శించింది. తాజా ట్రంప్‌ పర్యటన సైతం- భారత విదేశాంగ విధానంలో వివేకంతో కూడిన వైఖరికి నిదర్శనగా నిలిచింది!

సదవగాహన సానుకూలాంశం
చైనాను నిలువరించాలన్న కారణంతోనే భారత్‌, అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయని కొంతమంది వాదిస్తున్నారు. ఈ కోణంలోనూ కొంత నిజం లేకపోలేదు. ట్రంప్‌ మోతేరా స్టేడియంలో చేసిన తన ప్రసంగంలో బలాధిక్య ప్రదర్శనతో, బెదిరింపులతో, దుందుడుకు స్వభావంతో సర్వసహాధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న ఒక దేశానికి... తన ప్రజలకు స్వేచ్ఛను కల్పిస్తూ, వారి కలల సాధనలో తోడ్పడుతున్న మరొక దేశానికి చాలా తేడాలున్నాయి అని పేర్కొన్నారు. ట్రంప్‌ పరోక్షంగా భారత్‌, చైనాల మధ్య తేడాను ప్రస్తావించారనేది చాలామంది విశ్లేషకుల భావన. అయితే, భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల స్థాయిని కేవలం చైనా కోణంలో మాత్రమే చూడలేం. ఈ సంబంధాల్లో బహుళ పార్శ్వాలున్నాయి. చైనా ఎదగక ముందే, గత కొన్ని దశాబ్దాల నుంచే ఇరు దేశాల సంబంధాలు బలపడుతూ వస్తున్నాయన్న సంగతి మరవద్దు. అమెరికాలో భారీ సంఖ్యలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అనుసంధానానికి తోడ్పడుతున్నారు. రెండూ ప్రజాస్వామిక దేశాలు. రెండు దేశాల్లోనూ పనిచేసే నాయకత్వానికి రాజకీయ అవరోధాలు, అవకాశాల విషయంలో స్పష్టమైన అవగాహన ఉంది. ఆ అవగాహన కారణంగానే ట్రంప్‌ భారత్‌ అంతర్గత అంశాలపై వ్యాఖ్యానాలు చేయకుండా మౌనం వహించారు. ఉదాహరణకు... పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రశ్నించినప్పుడు ట్రంప్‌ స్పందిస్తూ నేను ఆ విషయాన్ని చర్చించదలచుకోలేదు. దాన్ని భారత్‌కే వదిలేశాను. తమ పౌరుల కోసం వారు సరైన నిర్ణయాన్నే తీసుకుంటారని ఆశిస్తున్నా. అది భారత్‌కు సంబంధించిన అంశం అని విస్పష్టంగా పేర్కొన్నారు.


 

Posted Date: 18-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం