• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ మౌలికానికి మరో వేగుచుక్క

* చైనా బీఆర్‌ఐకి పోటీగా బ్లూ డాట్‌

అమెరికన్‌ అంతరిక్ష నౌక వాయేజర్‌ 1 సౌర కుటుంబం పొలిమేరలను చేరుకునే ముందు భూమిని 640 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఫొటో తీసింది. 1990లో వెలువడిన ఆ ఛాయాచిత్రాన్ని చూసి విఖ్యాత శాస్త్రవేత్త కార్ల్‌ శాగన్‌ మన భూమి లేత నీలి రంగు చుక్క (బ్లూ డాట్‌) లా మెరిసిపోతోందని ఆనందంగా వర్ణించారు. భూగోళంపై నాణ్యమైన మౌలిక వసతుల నిర్మాణానికి నిధులు సమకూర్చే పథకానికి అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు బ్లూ డాట్‌ నెట్‌ వర్క్‌ (బీడీఎన్‌) అని పేరుపెట్టడం చూస్తే శాగన్‌ మరింత సంబరపడిపోయేవారేమో. థాయిలాండ్‌లో గతేడాది నవంబరులో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు బ్లూ డాట్‌ను ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కొద్ది రోజుల క్రితం భారత్‌ సందర్శనకు వచ్చినప్పుడు దిల్లీని కూడా బీడీఎన్‌లోకి స్వాగతించారు. 2024కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకొంటున్న భారతదేశం బ్లూ డాట్‌ను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. వచ్చే అయిదేళ్లలో మౌలిక వసతులకు రూ. 100 లక్షల కోట్లు, రైల్వే విస్తరణకు రూ. 50 లక్షల కోట్లు సమీకరించుకోవాలనుకొంటున్న భారతదేశానికి బీడీఎన్‌ పెట్టుబడుల కల్పవృక్షంగా మారితే ఆనందమే. రాగల రెండు దశాబ్దాల్లో ప్రపంచమంతటా రేవులు, రోడ్లు, విద్యుత్కేంద్రాల వంటి మౌలిక వసతుల విస్తరణకు 94 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాలని జి-20 దేశాల అంచనా. 2030 నాటికి కేవలం ఆసియా దేశాలకే 26 లక్షల కోట్ల డాలర్ల నిధులు అవసరపడతాయని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) లెక్క గట్టింది. వర్ధమాన దేశాలకు పెట్టుబడుల కొరతను తీర్చడానికి చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) పథకంతో ముందుకొచ్చింది. దీనికి పోటీగా అమెరికా-జపాన్‌-ఆస్ట్రేలియాలు బ్లూడాట్‌ను తెరమీదకు తీసుకొచ్చాయి. బీఆర్‌ఐ, బ్లూడాట్‌లలో భాగస్వామి కావలసిందిగా భారత్‌ను రెండు కూటములూ ఆహ్వానిస్తున్నాయి. బీఆర్‌ఐ ఇప్పటికే పట్టాలెక్కగా, బ్లూడాట్‌ ఇంకా తొలి అడుగు వేయాల్సి ఉంది. చైనా ప్రభుత్వం బీఆర్‌ఐకి ఊపిరులూదగా ప్రైవేటు సారథ్యంలో బ్లూ డాట్‌ ముందుకు నడుస్తోంది. బీఆర్‌ఐ, బ్లూడాట్‌ల వల్ల రాజకీయంగా, ఆర్థికంగా ఎదురయ్యే లాభనష్టాలను భారత్‌ బేరీజు వేసుకొంటోంది.

వర్ధమాన దేశాలకు దిక్సూచి
అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు వర్ధమాన దేశాల అభివృద్థికి గ్రాంట్ల రూపేణా కొంత సహాయం చేస్తుంటాయి. ప్రపంచ బ్యాంకు తక్కువ వడ్డీకి రుణాలిస్తుంది. దీనికి భిన్నంగా చైనా బీఆర్‌ఐ ప్రాజెక్టులకు వాణిజ్య వడ్డీ రేట్లపై పెట్టుబడులు అందిస్తోంది. చైనా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఈ నిధులు వస్తున్నాయి. ఆ నిధులు అందుకున్న దేశాలకు రుణ భారం పెరగడంతోపాటు అవి రాజకీయంగా, సైనికంగా చైనా పలుకుబడిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. బీఆర్‌ఐ ప్రాజెక్టు చైనా ప్రభుత్వానికి చెందినది కాగా, ప్రైవేటు సంస్థలు బ్లూ డాట్‌కు ప్రధాన సారథులవుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కూడా రంగప్రవేశం చేస్తుంది. ఉదాహరణకు 2016-17 మధ్య అమెరికాలో ప్రైవేటు పింఛను నిధుల వద్ద 9.1 లక్షల కోట్ల డాలర్లు, ప్రభుత్వ పింఛను నిధుల వద్ద 10 లక్షల కోట్ల డాలర్లు, బీమా సంస్థల వద్ద 5.8 లక్షల కోట్ల డాలర్ల నిధులు పోగుపడి ఉన్నాయి. మొత్తం 25 లక్షల కోట్ల డాలర్లుగా లెక్కతేలుతున్న ఈ మూడు రకాల నిధుల మీద స్థిరంగా రాబడి వస్తేనే పింఛన్లైనా, బీమా మొత్తాలనైనా సక్రమంగా చెల్లించడం సాధ్యమవుతుంది. ఇంకా అమెరికన్‌ ప్రైవేటు కంపెనీలు విదేశాల్లో చేసిన వ్యాపారం మీద దాదాపు 2.5 లక్షల కోట్ల డాలర్ల లాభాలు ఆర్జించాయని అంచనా. అవి చాలావరకు విదేశాల్లోనే మూలుగుతున్నాయి. ఈ ప్రైవేటు పెట్టుబడులనూ బ్లూ డాట్‌ ప్రాజెక్టుల వైపు ఆకర్షించవచ్చు. అందుకేనేమో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్‌ రాస్‌ అమెరికా సంస్థలు ఇప్పటికే ఆసియాలో 1.6 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయనీ, బ్లూ డాట్‌ కింద అవి మరింత పెరగబోతున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీలు, పింఛను, బీమా సంస్థలు మొదట భద్రతను, తరవాత లాభాలను చూసుకుంటాయి. వాటి పెట్టుబడులకు పూచీ ఇచ్చే బాధ్యతను బ్లూ డాట్‌ నెట్‌ వర్క్‌ (బీడీఎన్‌) తీసుకుంటుంది. వర్ధమాన దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఫలానా ప్రాజెక్టులు అనువైనవని ధ్రువీకరిస్తుంది. ఈ ఆమోద ముద్రనే బ్లూ డాట్‌ అంటారు.

చైనా బీఆర్‌ఐ ముసుగులో దక్షిణాసియా, హిందూ మహా సముద్రాల్లో ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని భారతదేశం ఆందోళన చెందుతోంది. నేపాల్‌ లో ట్రాన్స్‌ హిమాలయన్‌ రైల్వే లైనుతోపాటు వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లోకి బీఐర్‌ఐ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. దీనివల్ల నేపాల్‌ కూడా శ్రీలంక, పాకిస్థాన్‌ల మాదిరిగా రుణఊబిలోకి కూరుకుపోయి చైనా ప్రాబల్యంలోకి జారిపోతే తనకు ప్రమాదమని భారత్‌ భావిస్తోంది. ఇప్పటికే చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సిపెక్‌) పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ద్వారా సాగడాన్ని భారత్‌ నిరసిస్తున్న సంగతి తెలిసిందే. సిపెక్‌ సాకుతో చైనా తన పెరట్లోకి చొరబడుతోందని దిల్లీ ఆగ్రహిస్తోంది. తాను కూడా ఆర్థిక దౌత్యం చేపట్టి ఇరుగుపొరుగుతోపాటు ఆఫ్రికా దేశాల్లోనూ మౌలిక వసతుల నిర్మాణానికి చేయూతనిస్తోంది. ఇరాన్‌ తీరంలో చాబహార్‌ రేవు నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకొనడమే కాదు, అఫ్ఘానిస్థాన్‌లో మౌలిక వసతుల నిర్మాణంపై 300 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఈ పూర్వ రంగంలో ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించడానికి భారత్‌ను కలుపుకొనిపోవాలని అమెరికా నిశ్చయించడం విశేష పరిణామం.

చేయీచేయీ కలిపితేనే...
జపాన్‌, ఆస్ట్రేలియాలదీ ఇదే పంథా. బీఆర్‌ఐకి పోటీగా ఆసియాలో మౌలిక వసతుల విస్తరణకు 11,000 కోట్ల డాలర్లు వెచ్చించాలని 2016లో జపాన్‌ నిర్ణయించింది. మియన్మార్‌ నుంచి తూర్పు ఆఫ్రికా తీరం వరకు రేవుల నిర్మాణం, అనుసంధానానికి భారత్‌తో కలసి ఆసియా-ఆఫ్రికా అభివృద్ధి నడవా (ఏఏజీసీ) పథకాన్ని ప్రకటించింది. భారతదేశం ఇప్పటికే పూర్వ సోవియట్‌ రిపబ్లిక్‌లతో సహా ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలలో మొత్తం 63 దేశాలకు సులభ వడ్డీపై రుణాలిస్తోంది. ఆ దేశాల్లో విద్యుత్‌, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలకు 2,800 కోట్ల డాలర్ల రుణాలు మంజూరు చేసినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ గతేడాది లోక్‌ సభకు తెలిపారు. ఈ నిధులతో ఇప్పటికే 254 ప్రాజెక్టులు పూర్తవగా, మరి 194 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే, ఇవి బీఆర్‌ఐ అంత భారీ ప్రాజెక్టులు కావు. ఉదాహరణకు ఈశాన్య భారతాన్ని, మియన్మార్‌, థాయిలాండ్‌లతో కలిపే ఆసియా ప్రధాన రహదారి ప్రాజెక్టును పూర్తి చేయడానికి భారత్‌ నిధుల కొరతను ఎదుర్కొంటోంది. నిధులతోపాటు భారీ ప్రాజెక్టులను నిర్మించే సామర్థ్యంలోనూ చైనాతో భారత్‌ పోటీ పడగలదా అంటే అనుమానమే. అదీకాకుండా చైనాతో పూర్తి స్థాయి ఘర్షణను దిల్లీ కోరుకోవడం లేదు. ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబి), న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు (ఎన్డీబీ)లలో చైనాతోపాటు భారతదేశమూ భాగస్వామిగా ఉంది. భారత్‌లో పలు ప్రాజెక్టులకు ఏఐఐబీ నిధులు సమకూర్చింది కూడా. అందువల్ల చైనాతో పూర్తి తెగతెంపులకు దిల్లీ సిద్ధంగా లేదు. అసలు బ్లూడాట్‌, బీఆర్‌ఐల మధ్య వైరం అవసరమా అన్నది కీలక ప్రశ్న. ఆర్థిక మాంద్యం అంచున దోబూచులాడుతున్న ప్రపంచాన్ని ప్రగతి పథంవైపు మళ్లించాలంటే బ్లూడాట్‌లోకి చైనానూ ఆహ్వానించాలి. అందుకు కొన్ని షరతులు విధించి చైనా వాటిని పాటించేట్లు చూడాలి. అన్ని దేశాలూ చేయీచేయీ కలిపి ముందుకుసాగితే లోకకల్యాణం జరుగుతుంది.
పలుదేశాల ఆసక్తి
బీఆర్‌ఐ ద్వారా 2027కల్లా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా మౌలిక వసతుల ప్రాజెక్టుల్లోకి దాదాపు లక్షా 30 వేల కోట్ల డాలర్లు ప్రవహిస్తాయని మోర్గన్‌ స్టాన్లీ సంస్థ అంచనా. చైనా ఇప్పటికే దీనిపై 20,000 కోట్ల డాలర్లను వెచ్చించింది. బీఆర్‌ఐ పట్ల 130 దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. బీఐర్‌ఐలో అతిపెద్ద ప్రాజెక్టు- 6,800 కోట్ల డాలర్ల చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సిపెక్‌). ఈ పథకం కింద వివిధ దేశాల్లో 50 ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌) నిర్మించాలని చైనా లక్షిస్తోంది. బీఆర్‌ఐ ద్వారా చైనా ప్రపంచదేశాలపై రాజకీయ, ఆర్థిక, సైనిక ఆధిపత్యం సాధించాలనుకొంటోందని ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్‌ఐ ప్రాజెక్టులు నడుస్తున్న దేశాల్లో కనీసం ఎనిమిది రుణ ఊబిలో కూరుకుపోనున్నాయి. మన పొరుగు దేశాలు శ్రీలంక, పాకిస్థాన్‌ ఇప్పటికే అప్పుల పాలైపోయాయి. కొన్ని దేశాల జీడీపీలో బీఐర్‌ఐ రుణ భారం 20 శాతానికి చేరిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బీఆర్‌ఐ ప్రాజెక్టుల కోసం బహిరంగ టెండర్లను పిలవకుండా తన సంస్థలకే వాటిని కట్టబెట్టేట్లు చైనా ఒత్తిడి చేస్తోంది. ఈ తరహా గుత్తాధిపత్యం వల్ల చైనీయులు ప్రాజెక్టుల వ్యయాన్ని అసలుకన్నా ఎక్కువ చేసి చూపుతున్నారు కూడా. మలేసియాలో 2,200 కోట్ల డాలర్ల బీఆర్‌ఐ ప్రాజెక్టుల వ్యయం విషయంలో ఇదే జరిగింది. కజఖ్‌స్థాన్‌లో చైనా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గతేడాది విస్తృతంగా నిరసనలు విరుచుకుపడ్డాయి. లావోస్‌లో బీఆర్‌ఐ కింద చైనా నిర్మిస్తున్న హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు, ఎస్‌.ఇ.జడ్‌ల వల్ల 2017 చివరికి విదేశీ రుణ భారం 1,360 కోట్ల డాలర్లకు చేరింది. ఇంతా చేసి లావోస్‌ జీడీపీ 2,000 కోట్ల డాలర్ల లోపే. బీఆర్‌ఐ పేరిట చైనా సాగిస్తున్న చెక్‌ బుక్‌ దౌత్యానికి సైనిక కోణం ఉందని గ్వాడర్‌, జిబూటీ రేవులు రూఢి చేస్తున్నాయి. చైనా-పాక్‌ కారిడార్‌లో భాగంగా అరేబియా సముద్ర తీరంలో నిర్మితమవుతున్న గ్వాడర్‌ రేవు ద్వారా బీజింగ్‌ ప్రపంచ చమురు వ్యాపారానికి పక్కలో బల్లెమవుతుందని భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు ఆందోళన చెందుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును అడ్డుకోవడానికి ఈ నాలుగు దేశాలు క్వాడ్‌ కూటమిగా ఏర్పడుతున్నాయి. క్వాడ్‌కు మరో పార్శ్వమే బ్లూ డాట్‌ నెట్‌ వర్క్‌ (బీడీఎన్‌).

- కైజర్‌ అడపా

Posted Date: 18-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం