• facebook
  • whatsapp
  • telegram

  కరోనాపై కప్పదాటు ధోరణి

* డబ్ల్యూహెచ్‌ఓ వివాదాస్పద సరళి

   సమస్య ఎదురైన వెంటనే అప్రమత్తమైతే ఫలితం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, ఉదాసీనంగా ఉంటే ఎలాంటి ఫలితాన్ని చవిచూడాల్సి వస్తుందో దక్షిణకొరియా, అమెరికాల వ్యవహారశైలి తేటతెల్లం చేస్తోంది. ఒకరిని చూసి నేర్చుకోవడం ఏమిటన్న ట్రంప్‌ వైఖరే ఇప్పుడు అమెరికాకు పెనుముప్పుగా మారింది. జనవరి 20న దక్షిణ కొరియాలో తొలి కరోనాకేసు నమోదైంది. ఆ తరవాత కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికాలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూసింది. దక్షిణ కొరియా వారంలోపే పరీక్ష కిట్లను అభివృద్ధి చేయాలని, వైద్య పరికరాలను సిద్ధం చేయాలని 20 ప్రైవేటు కంపెనీలను ఆదేశించింది. మరోవారంలో పెద్దయెత్తున పరీక్షలు చేపట్టి, బాధితులను గుర్తించింది. మార్చి 11 నాటికే అక్కడ ప్రతి పదిలక్షల మందిలో సగటున 3,692 మందికి పరీక్షలు నిర్వహించగా- అదే సమయానికి అమెరికాలో సగటున అయిదుగురికి పరీక్షలు నిర్వహించారు. అప్పటికే పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది.
డ్రాగన్‌ తీరుతో పెనుముప్పు
   చైనాలోని డాక్టర్ల నుంచి సమాచారం తెలుసుకున్న తైవాన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉప్పందించింది. తరవాత చైనా అది ‘అంటువ్యాధి’ అనే విషయాన్ని దాచిపెట్టి అధికారికంగా డబ్ల్యూహెచ్‌ఓకు సమాచారం అందించింది. ఆ సంస్థ కూడా చైనాకు వంతపాడటంతో ప్రపంచం అప్రమత్తం కాలేకపోయింది. అప్పటికే నూతన సంవత్సర వేడుకల కోసం వుహాన్‌ నుంచి లక్షల మంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో వైరస్‌ చైనా సరిహద్దులు దాటింది. తరవాతే వుహాన్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇప్పటికీ రోగ లక్షణాలు, మృతుల వివరాలను పూర్తిస్థాయిలో చైనా బాహ్యప్రపంచానికి ఇవ్వలేదు. పైగా ఇటీవల షి జిన్‌పింగ్‌ను ఆకాశానికెత్తుతూ ‘2020 ఎ బ్యాటిల్‌ అగైన్స్ట్‌ ఎపిడమిక్‌’ పుస్తకాన్ని విడుదల చేసింది. చైనాపై ఇటలీ చూపిన అతిప్రేమ వారి ప్రాణాలమీదకు తెచ్చింది. ఇటలీలో 50 ఏళ్లలో దాదాపు 60కి పైగా ప్రభుత్వాలు మారాయి. ఈ రాజకీయ అస్థిరత కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంగిపోయి- ఆ దేశం చైనాను ఆశ్రయించాల్సి వచ్చింది. జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య ఆత్యయిక పరిస్థితిని ప్రకటించిన రెండు రోజుల తరవాత ‘హగ్‌ ఎ చైనీస్‌’ పేరుతో ఇటాలియన్లు చైనీయులను కౌగిలించుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. చైనా పర్యాటకులు భారీ సంఖ్యలో ఇటలీకి వెళ్లారు. ఇది జరిగిన కొన్నాళ్లకే లంబార్డెలో తొలి కరోనా కేసు నమోదైంది. అనంతరం ఈ అంటువ్యాధి కొండచిలువలా ఇటలీని చుట్టేసి 17 వేల మందికి పైగా ప్రాణాలను బలితీసుకొంది.
   కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనాతో పాటు- ప్రపంచ ఆరోగ్య సంస్థా కారణమయింది. చైనా డిసెంబరు 31న ఆ సంస్థకు అధికారికంగా సమాచారం అందించింది. అప్పటికే కరోనా వైరస్‌ అంటువ్యాధి అని తైవాన్‌ చేసిన హెచ్చరికను ప్రపంచ ఆరోగ్యసంస్థ పట్టించుకోలేదు. పైగా జనవరి 14న నావల్‌ కరోనా వైరస్‌ అంటువ్యాధి అనడానికి పూర్తి ఆధారాల్లేవని ట్వీట్‌ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానమ్‌ గెబ్రయేసస్‌ జనవరి 28న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం ‘చైనా కొత్త ప్రమాణాలు నెలకొల్పింది... అత్యున్నత నాయకత్వం పారదర్శకంగా ఉంది’ అంటూ పొగిడారు. ఫిబ్రవరి మొదటి వారంలోనూ కరోనాను ఎదుర్కోవడానికి ప్రయాణాలపై నిషేధం అవసరం లేదని టెడ్రోస్‌ పేర్కొన్నారు. ఆ తరవాత ఆయన ప్రకటనలన్నీ తప్పని రుజువయ్యాయి. ప్రపంచ మహమ్మారిగా ప్రకటించేందుకు అవసరమైన లక్షణాలు దీనికి ఉన్నాయని అమెరికా సీడీసీ మొత్తుకున్నా, డబ్ల్యూహెచ్‌ఓ ఉదాసీనంగా వ్యవహరించింది. మార్చి11న కరోనా వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించారు. అప్పటికే ఆ అంటురోగం వందకు పైగా దేశాల్లో ప్రబలింది. ఈ మొత్తం వ్యవహారంలో టెడ్రోస్‌ తీరు అనుమానాస్పదంగా మారింది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ పదవికి ఎంపికైన, వైద్యేతర రంగానికి చెందిన తొలి వ్యక్తి టెడ్రోస్‌. ఆయన ఎంపికకు చైనా బాగా సహకరించింది. చైనాకు చెందిన మార్గరేట్‌ చాన్‌ డబ్ల్యూహెచ్‌ఓ డీజీగా చేసినప్పటి నుంచి ఈ సంస్థపై డ్రాగన్‌ పట్టు బిగిసింది. ఈ సంస్థకు అధిక నిధులు అమెరికా నుంచి వస్తున్నాయి. కానీ, కార్యనిర్వహణ వర్గంలో చైనా మనుషులు ఉండేలా డ్రాగన్‌ జాగ్రత్తపడుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ వైఖరితో విసిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే ఆ సంస్థకు 2021లో ఇవ్వాల్సిన నిధులను 12.10 కోట్ల డాలర్ల నుంచి 5.80కోట్ల డాలర్లకు కుదించారు. తాజాగా ఆ మొత్తం సైతం ఇవ్వబోమని ప్రకటించారు.

తైవాన్‌ ముందుజాగ్రత్త
   చైనా సంగతి బాగా తెలిసిన తైవాన్‌ డిసెంబర్‌ 31 నుంచే అప్రమత్తమై విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టింది. వుహాన్‌ వాసుల రాకపై జనవరి 23న, చైనా పర్యటనలపై జనవరి 25న, చైనా పర్యాటకులు తైవాన్‌కు రావడంపై ఫిబ్రవరి ఆరున నిషేధం విధించింది. జనవరి 24న వైద్య పరికరాలను సిద్ధం చేయాలని స్థానిక కంపెనీలను ఆదేశించింది. జనవరి 31న మాస్కుల పంపిణీని ప్రభుత్వం చేపట్టింది. అత్యాధునిక సాంకేతికతను వాడుకొని బాధితులపై నిఘాపెట్టింది. ముఖ్యంగా ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన పెంచింది. ఫలితంగా ఏప్రిల్‌ తొమ్మిది నాటికి అక్కడ నమోదైన కరోనా కేసులు 379కి పరిమితమయ్యాయి. చైనా-తైవాన్‌ మధ్య దూరం 81 మైళ్లే. ఫలితాల్లో మాత్రం ఎంతో వ్యత్యాసముంది. ఆరోగ్య ఆత్యయిక సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలను పరిశీలనలోకి తీసుకొంటూనే సొంత విశ్లేషణలతో వ్యూహాలను సిద్ధం చేసుకొని మెరుపువేగంతో అమలు చేయాలి. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వాలు అంతిమంగా ప్రజలకే జవాబుదారి కానీ, ప్రపంచ ఆరోగ్యసంస్థకు కాదని గుర్తించాలి.
 

- పెద్దింటి ఫణికిరణ్‌

Posted Date: 13-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం