• facebook
  • whatsapp
  • telegram

భారత రాజనీతికి అసలైన పరీక్ష

* డబ్ల్యూహెచ్‌ఓ - సవాళ్లు


   ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కార్యనిర్వాహక సంఘ అధ్యక్షుడిగా భారత ఆరోగ్యమంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఏప్రిల్‌ 22న ఎన్నికయ్యారు. డబ్ల్యూహెచ్‌ఓ పాలనా సంఘమైన ప్రపంచ ఆరోగ్య సభ (డబ్ల్యూహెచ్‌ఏ) 73వ సమావేశం మే 18-19 తేదీల్లో జరిగినప్పుడు భారత్‌కు దౌత్యపరంగా మూడు చిక్కుముళ్లు ఏర్పడ్డాయి. అవి- డబ్ల్యూహెచ్‌ఏలో తైవాన్‌కు పరిశీలక హోదా, కొవిడ్‌ పుట్టుక-వ్యాప్తి మీద స్వతంత్ర దర్యాప్తు, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణలు తీసుకురావడం. ఈ మూడు వ్యవహారాల్లో నేర్పుగా ఒడుపుగా నెగ్గుకురావడమనేది భారత రాజనీతికి పరీక్ష.
తెగేదాకా లాగుతున్న అమెరికా
   డబ్ల్యూహెచ్‌ఏలో తైవాన్‌కు పరిశీలక హోదా ఇచ్చే ప్రతిపాదనను చైనా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. తైవాన్‌ను తమలో భాగంగా బీజింగ్‌ పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడైనప్పటి నుంచి చైనా విషయంలో అమెరికా కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. మునుపటి అమెరికా ప్రభుత్వాలు తైవాన్‌ విషయంలో చైనా విధానాన్ని సమర్థించకపోయినా, తెగేవరకు లాగడానికి ఇష్టపడేవి కావు. ట్రంప్‌ జమానాలో అంతా మారిపోయింది. చైనాను ఖాతరు చేయకుండా అంతర్జాతీయ సంస్థల్లో తైవాన్‌కు సభ్యత్వం లేదా పరిశీలక హోదా ఇప్పించడం ద్వారా చైనాకు పోటీగా నిలబెట్టడానికి ట్రంప్‌ సర్కారు చేయవలసినదంతా చేస్తోంది. అందులో భాగంగానే డబ్ల్యూహెచ్‌ఏలో తైవాన్‌కు పరిశీలక హోదా ప్రతిపాదించారు. దీనికి అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడాలతోపాటు తైవాన్‌కు దౌత్యపరంగా మిత్రులైన 14 దేశాలు మద్దతు పలికాయి. ఏతావతా తైవాన్‌ పరిశీలక హోదా అనేది ప్రపంచ ఆరోగ్యానికి మేలు చేయడంకన్నా రాజకీయ, దౌత్య కక్షలు తీర్చుకోవడానికి ఒక సాకుగా మారిపోతోంది. ఈ భౌగోళిక రాజకీయ స్పర్ధలకు డబ్ల్యూహెచ్‌ఓ సమావేశాలు రంగస్థలమవుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ కార్యనిర్వాహక సంఘ అధ్యక్ష హోదాలో భారతదేశం అటు ఆదర్శాలను, ఇటు ఆచరణీయతను మేళవిస్తూ ముందుకుసాగాలి. చైనా దూకుడు, అమెరికా కూటమి డిమాండ్ల మధ్య సమతౌల్యం సాధిస్తూ ముందుకు కదలాలి.
   తైవాన్‌కు డబ్ల్యూహెచ్‌ఏ సభ్యత్వం విషయంలో చైనా మీద అమెరికా కూటమి ఒత్తిడి పెంచుతున్న సమయంలో, భారతదేశం సంయమనంతో వ్యవహరిస్తోంది. తైవాన్‌కు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాలకు సంబంధించిన అంశాల్లో పరస్పర ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో నడచుకొందామని భారత్‌, చైనాలు అవగాహన కుదుర్చుకుని ఉండటమే దీనికి కారణం. ఈ అంశాల్లో ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించుకోవాలని అంగీకారం కుదిరింది. పైగా క్వాడ్‌ సభ్యదేశాలైన అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌లలో- కేవలం ఇండియాకే చైనాతో సుదీర్ఘమైన 3,488 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. ఈ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి రెండు దేశాల మధ్య తరచూ సరిహద్దు ఘర్షణలు, వివాదాలు తలెత్తుతున్నాయి. 2017లో డోక్లాం వద్ద, తాజాగా సిక్కిం, లద్దాఖ్‌ సరిహద్దుల వద్ద నెలకొన్న సంఘర్షణ పరిస్థితులు- చైనా సైనిక దూకుడుకు నిదర్శనాలు. భారత్‌ను తైవాన్‌ విషయంలో అమెరికావైపు మొగ్గవద్దనే హెచ్చరిక సంకేతాలూ అలాంటివే. దీర్ఘకాలంపాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను, ప్రతిష్టంభనను కొనసాగించే సత్తా చైనాకు ఉందని మరచిపోకూడదు.
   ఇక్కడ సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. డోక్లాం వివాద పరిష్కారానికి నరేంద్ర మోదీ, షీజిన్‌పింగ్‌ల వుహాన్‌ శిఖరాగ్ర సభ ఉపకరించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. అదీకాకుండా భారత్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని గుర్తుంచుకోవాలి. మందుల తయారీకి అవసరమైన యాక్టివ్‌ ఫార్మస్యూటికల్‌ ఇన్‌గ్రెడియంట్స్‌(ఏపీఐ)లో 70శాతాన్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. కొవిడ్‌ మహమ్మారిపై పోరులో ఔషధాల పాత్ర అంతాఇంతా కాదు. వాటికి కావలసిన ఏపీఐలు చైనా నుంచే రావాలి. సరిహద్దు సంఘర్షణలు ముదిరితే ఏపీఐ సరఫరా గొలుసు విచ్ఛిన్నమై ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా కొవిడ్‌ కల్లోలంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న దృష్ట్యా సరిహద్దు ఉద్రిక్తతలు ముదరకుండా చూసుకోవడం, తైవాన్‌ తదితర అంశాలపైకి దృష్టి మళ్లించకపోవడం చాలా అవసరం. దీనివల్ల మన శక్తి, ఉత్సాహం సన్నగిల్లడం తప్ప సాధించేది ఏమీ ఉండదు.
   కరోనా వైరస్‌ పుట్టుక, వ్యాప్తి, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందనపై స్వతంత్రంగా నిష్పాక్షిక విచారణ జరపాలని ఆస్ట్రేలియా చొరవతో భారత్‌ సహా 122 దేశాలు డిమాండ్‌ చేశాయి. తైవాన్‌ సమస్యకు దూరంగా ఉంటూనే ఈ అంశంపై మాత్రం ఆస్ట్రేలియాతో కలిసివెళ్లాలని భారత్‌ నిర్ణయించడం గమనార్హం. అమెరికాతో కలిసి వెళితే చైనా పట్ల శత్రుత్వ వైఖరి అవలంబించడమే అవుతుందని గ్రహించి, సాటి క్వాడ్‌ సభ్యదేశమైన ఆస్ట్రేలియాతో చేతులు కలిపింది. వుహాన్‌ ల్యాబ్‌లో ప్రయోగాల మీద ప్రపంచమంతా చాలాకాలం నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నా, భారత్‌ బీజింగ్‌పై ఖండనమండనలకు దూరంగా ఉంది. ఒక దేశంగా... సంయమనం పాటిస్తూ విచారణకు సమష్టి తీర్మానంతో గొంతు కలిపి లౌక్యం ప్రదర్శించింది. ఇండో పసిఫిక్‌ కీలక బృందం సంప్రదింపుల్లో భారత్‌, అమెరికాలు పాలుపంచుకుంటున్నాయి. చైనా విషయంలో కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందనపై కానీ అమెరికా మాదిరిగా కఠినమైన భాష వాడటానికి భారత్‌ ఇష్టపడలేదు. వ్యూహ విషయాల్లో తనకుతానుగా నిర్ణయాలు తీసుకోగలనని చాటుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరిపై విచారణ జరపాలనడం చైనాను ఇరుకున పెట్టడానికి కాదని సూచించినట్లయింది. తద్వారా చైనా అనుమానాలను నివృత్తి చేయాలని చూస్తోంది. అమెరికా కోసమో, ఇండో-పసిఫిక్‌ భాగస్వాముల కోసమో చైనా, తైవాన్‌ల పట్ల విధానాలను నిర్ణయించుకోలేనని, స్వయంప్రతిపత్తితో ఆలోచించి ముందడుగు వేస్తానని స్పష్టీకరించింది. అలాగని చైనా ఒత్తిళ్లకు తాను లొంగే ఘటాన్ని కానని ఎన్నడో నిరూపించుకుంది. డోక్లాం ఘర్షణల్లో దృఢ వైఖరి అవలబించడం దీనికి నిదర్శనం. అలాగే ‘చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌’ను ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో మొట్టమొదట వ్యతిరేకించినది భారతదేశమేనని మరవకూడదు. చైనా ముందుకుతెచ్చిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్నీ (ఆర్‌సీఈపీ) ఇండియా వ్యతిరేకించింది.

సంస్కరణలకు ప్రాధాన్యం
   డబ్ల్యుహెచ్‌ఓ పాత్రపై చాలా దేశాల్లో అనుమానాలున్నా, కొవిడ్‌ మహమ్మారిపై సమష్టి పోరాటానికి ఆ సంస్థను వేదికగా చేసుకోవడం అవసరమని భారత్‌ భావిస్తోంది. కొవిడ్‌ను కట్టడి చేసినప్పుడు మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పట్టాలెక్కుతుంది. డబ్ల్యుహెచ్‌ఓ కార్యనిర్వాహక వర్గ అధ్యక్ష పాత్రలో భారత్‌ ఈ కృషిలో అందరినీ కలుపుకొని పోవడానికి కృషి చేస్తుంది. 2016, 2019లలో అలీనోద్యమ శిఖరాగ్ర సభలకు వెళ్లకుండా మానుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మళ్లీ అలీనోద్యమ ఆవశ్యకతను చాటిచెప్పడాన్ని ఈ దృష్టితోనే చూడాలి. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలలో 120 దేశాలు అలీనోద్యమ సభ్యులు. సార్క్‌ దేశాల్లో కొవిడ్‌ అదుపునకు భారత్‌ కోటి డాలర్ల నిధిని ప్రకటించడం కూడా ఉమ్మడి పోరాట ఆవశ్యకతను నొక్కిచెప్పడానికేనని గమనించాలి. తదనుగుణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్కరణలకు భారత్‌ ప్రాముఖ్యమిస్తోంది. అమెరికా, చైనా వైరాల చిక్కుముళ్లలో ఇరుక్కుపోకుండా ప్రపంచ దేశాల మధ్య ఐక్యత, సహకారాలను పెంపొందించడమే తన విధానంగా భారత్‌ ముందుకెళుతోంది.

- వీరేశ్‌ కందూరి
(రచయిత- అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు)

Posted Date: 13-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం