• facebook
  • whatsapp
  • telegram

  అన్ని అనుకూలతలూ అమరావతికే!

* పాలన సౌకర్యమే ప్రాతిపదిక కావాలి

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని ఒక్కచోట కాకుండా మూడుచోట్ల నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదగ్రస్తమైంది. ఒక్క రాజధానిని మూడు ముక్కలు చేయడమేమిటని నిరసన గళాలు నిలదీస్తున్నాయి. ఈ వివాదం కేవలం భావోద్వేగపూరితమా లేక హేతుబద్ధమైనదా అని తరచి చూసుకోవడం ప్రస్తుత సమయంలో చాలా చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని నిర్మాణానికి ఎంచుకున్న స్థలం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా, దాన్ని విజయవాడ నగర సమీపంలో నిర్మించాలన్న నిర్ణయాన్ని తప్పుపట్టలేం. ఇతర దేశాల రాజధానులను చూసినా- ఆర్థిక, రాజకీయపరంగా చూసినా... విజయవాడ పొరుగున రాజధాని నిర్మాణం సమర్థనీయమని అవగతమవుతుంది.

విజయవాడ-గుంటూరు ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డున ఉంది. రోడ్డు, రైలు, విమాన అనుసంధానంలో ఈ ప్రాంతానికి దీటైన నగరం కానీ పట్టణం కానీ యావత్‌ రాష్ట్రంలో మరెక్కడా లేదు. వ్యాపారపరంగానూ ఇది రాష్ట్రానికి కేంద్ర బిందువు. రేపు ఇక్కడ విస్తరించబోయే మహానగరానికి కావలసిన తాగు నీరు, ఆహారం, పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులను నిరాటంకంగా అందించే సత్తా విజయవాడ-గుంటూరు ప్రాంతానికి ఉంది. విజయవాడ, దాని చుట్టుపక్కల ఉన్న మౌలిక వసతులు, పౌర జీవన సౌకర్యాలు రాష్ట్రంలో మరెక్కడా లభ్యం కావు. విజయవాడ-గుంటూరు ప్రాంతంలోని వైద్య చికిత్సా సౌకర్యాలకు దీటైనవి ఆంధ్రప్రదేశ్‌లో మరే నగరం లేదా పట్టణంలో కనిపించవు.

భౌతిక పరిమితులు ప్రతిబంధకం కాదు
ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉప కులపతి సర్‌ సి.ఆర్‌.రెడ్డి అలనాటి బెజవాడను మేధాపరంగా సహారా ఎడారి అని వర్ణించారు. ఇక్కడ మండే ఎండలను చూసి ‘బ్లేజ్‌వాడ’ అని మారుపేరు పెట్టారు. ఈ కారణాలను చూపి ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని బెజవాడ నుంచి వాల్తేరుకు మార్చారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విజయవాడ చదువులవాడగా పేరుతెచ్చుకుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలూ ఎండలతో భుగభుగలాడుతున్నాయి. విశాఖపట్నంలో ఎండలు కాస్త తక్కువే కానీ, సముద్రం ఒడ్డున ఉండటం వల్ల తేమ ఎక్కువగా ఉండి ఉక్కపోస్తుంది. ఏదిఏమైనా ‘ఎయిర్‌ కండిషనింగ్‌’ సాధనాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఎండలు ఒక సమస్యే కాదు. మండుటెండల్లోనూ పండు వెన్నెలను సృష్టించడం ఆధునిక సాంకేతికతకు చిటికెలో పని. 2014లో ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతిని ఎంపిక చేసినప్పుడు ఆమోదం తెలిపినవారే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. దీనికి వాళ్లు చెబుతున్న అభ్యంతరాలు విశ్లేషణకు నిలబడవు. అమరావతి కృష్ణానది ఒడ్డున ఉన్నందున తేలిగ్గా వరదలకు గురయ్యే ప్రమాదం ఉందని, అక్కడ పునాదులు బాగా లోతుగా వేయాలి కనుక నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతుందనీ విమర్శలు వినవస్తున్నాయి. ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తీకరిస్తున్నవారు బయటి ప్రపంచంవైపు ఒకసారి దృష్టి సారించాలి. ఉదాహరణకు అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరాన్నే తీసుకోండి. బ్రిటన్‌ వలస పాలకులతో పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్న దరిమిలా రాజధాని ఎంపికకు అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) త్రిసభ్య సంఘాన్ని నియమించింది. దానికి ఆ దేశపు ప్రథమ అధ్యక్షుడు జార్జ్‌ వాషింగ్టన్‌ నాయకత్వం వహించారు. అప్పట్లో అమెరికాలో 13 రాష్ట్రాలే ఉండేవి. వాటన్నింటికీ కేంద్ర స్థానంలో, పొటామిక్‌ నది ఒడ్డున ఉన్న ప్రాంతాన్ని రాజధానికి అనువైన ప్రాంతంగా ఆయన ఎంపిక చేశారు. నదీ తీరంలో, బురద నేలలున్న ప్రాంతాన్ని అమెరికా రాజధాని నిర్మాణానికి ఆనాడు ఎంపిక చేశారు. అయినా అమెరికా రాజధానిని వాషింగ్టన్‌ డీసీ నుంచి తరలించాలనే ప్రతిపాదన ఎన్నడూ రాలేదు. అది అక్కడే వర్ధిల్లుతోంది.

కెనడా రాజధాని ఆటవా లారెన్స్‌ అఖాతం తీరస్థ భూమిలో ఆటవా, గాటినో, రిడో నదుల సంగమ స్థలంలో నిర్మితమైంది. ఈ త్రివేణీ సంగమ భూమి ఎప్పుడు చూసినా నీరు ఊరుతున్నట్లు ఉంటుంది. నెదర్లాండ్స్‌ రాజధాని అమ్‌స్టర్‌డాం నగరమైతే సముద్ర మట్టంకన్నా దిగువన ఉంటుంది. సముద్ర ముంపునుంచి రక్షించడానికి నగరం చుట్టూ అడ్డుగోడలు (డైక్స్‌) నిర్మించారు. ఇటలీలో వెనిస్‌ నగరం కూడా సముద్రం ఒడ్డున బురద నేలల్లో నిర్మితమైంది. జపాన్‌ రాజధాని టోక్యోను సరిగ్గా భూకంప కేంద్రంలో నిర్మించారు. అక్కడి భవంతులను భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మించారే తప్ప మొత్తం నగరాన్ని వేరేచోటుకు మార్చేయాలనే ప్రతిపాదన ఎన్నడూ రాలేదు. టోక్యోకు ముందు నరా నగరం జపాన్‌ రాజధానిగా ఉండేది. దాన్ని మళ్ళీ నరాకు తరలించాలనే ప్రతిపాదన మాటవరసకైనా రాలేదు. ఆధునిక సాంకేతికత పుణ్యమా అని భౌతిక పరిమితులను అధిగమించే శక్తి మన నగరాలకు సమకూరింది. కాబట్టి, వరద ప్రమాదం పేరు చెప్పో, నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందనో అమరావతిని ‘వీటో’ చేయడం సరైన పని కాదు.

రాజధానుల విషయంలో దక్షిణాఫ్రికా నమూనాను ఆదర్శంగా తీసుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ, దక్షిణాఫ్రికా, భారత్‌ పాలన వ్యవస్థల మధ్య మౌలికమైన తేడాలున్నాయి. శతాబ్దాలుగా జాత్యహంకార పాలన బారినపడిన దక్షిణాఫ్రికా ప్రజలు చివరకు జాతి విచక్షణ నుంచి విముక్తులై, సమైక్య దేశ నిర్మాణానికి అహరహం శ్రమిస్తున్నారు. దేశాధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఆయన చట్టసభల సభ్యులను కాక బయటి నిపుణులను తన మంత్రులుగా నియమించుకుంటారు. దేశాధ్యక్షుడి నిర్ణయాలను చట్టసభలు శల్య పరీక్ష చేస్తాయి. చట్టాలను చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉంటుంది. ఆ చట్టాలు తనకు నచ్చకపోతే అధ్యక్షుడు ‘వీటో’ చేయవచ్చు. అక్కడ అధ్యక్ష తరహా పాలన వ్యవస్థ ఉంటే- భారత్‌లో పార్లమెంటరీ వ్యవస్థ ఉంది. ఇక్కడ పాలన, శాసన వ్యవస్థలు చెట్టపట్టాలుగా పనిచేస్తాయి. ప్రధానమంత్రి, ఇతర మంత్రులు శాసన వ్యవస్థ- అంటే చట్టసభల నుంచే ఎంపిక అవుతారు. మన దేశంలో పాలన, శాసన వ్యవస్థలు ఒకదానికొకటి జవాబుదారీగా ఉంటాయి. భారత్‌లో ఏ చట్టాన్నయినా పాలన వ్యవస్థే ప్రతిపాదిస్తుంది. శాసన వ్యవస్థ దాన్ని లోతుగా చర్చించి ఆమోదించిన తరవాతనే అది సాధికార చట్టంగా మారుతుంది. కాబట్టి పాలన, శాసన వ్యవస్థలు రెండూ నిరంతరం సమన్వయంతో పనిచేయాల్సిందే. ఈ వ్యవస్థలు రెండూ ఇరుగుపొరుగున ఉన్నప్పుడు మాత్రమే కలిసికట్టు కార్యాచరణ సాధ్యమవుతుంది. మరోవిధంగా చెప్పాలంటే సచివాలయం, విధానసభ ఒక్కచోటు నుంచే పనిచేయాలి. కావాలంటే విధాన సభ శీతకాల సమావేశాలనో, వేసవి సమావేశాలనో వేరేచోట జరుపుకోవచ్చు. కర్ణాటక, మహారాష్ట్రల్లో జరుగుతున్నది ఇదే. పాలన వ్యవస్థకు శాశ్వత ప్రధాన కార్యాలయం ఒక్కచోటనే ఉండాలి. తాత్కాలిక ప్రాతిపదికపై కొన్ని సమావేశాలను వేరేచోట జరుపుకోవచ్చు. ఇక న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కాబట్టి అది పాలన వ్యవస్థకు కొంత దూరం పాటించడం సహజమే. ఇవి రెండూ ఒక్కచోట ఉండాల్సిన అవసరం లేదు. కనుక హైకోర్టు రెండు మూడు చోట్లనుంచి పనిచేస్తే అభ్యంతరపెట్టాల్సినది ఏమీ ఉండదు.

కొత్త ఖర్చులను తలకెత్తుకోవడం ఎందుకు?
ఇంతవరకు చర్చించుకున్నదాన్నిబట్టి సచివాలయం, చట్టసభలను అమరావతిలోనే ఉంచడం అన్ని విధాలా అభిలషణీయం, శ్రేయస్కరం. పైగా అమరావతిలో మౌలిక వసతుల నిర్మాణానికి ఇప్పటికే గణనీయంగా ధనాన్ని వెచ్చించారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మూడు రాజధానుల పేరిట కొత్త ఖర్చులను తలకెత్తుకోవడం వల్ల నష్టమే ఎక్కువ. హైకోర్టును మాత్రం రాయలసీమకు తరలించవచ్చు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం జరగాల్సిన పని అదే. ఒక రకంగా కర్నూలుకన్నా హైకోర్టుకు కడప అన్ని విధాలా అనువైనది. కడపకు రవాణా అనుసంధానత ఎక్కువ. ఇంకో ప్రత్యామ్నాయమేమంటే- హైకోర్టును అమరావతిలోనే ఉంచి; రాయలసీమ, ఉత్తరాంధ్రలలో రెండు ధర్మాసనాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేదా హైకోర్టును రాయలసీమలో, ధర్మాసనాలను అమరావతి, విశాఖల్లో నెలకొల్పినా ఉత్తమమే. గడచిన తొమ్మిది దశాబ్దాల్లో విశాఖపట్నం విశ్వవిద్యాలయ నగరం స్థాయి నుంచి జాతీయ రక్షణ కేంద్రంగా ఎదిగింది. సైనిక వ్యూహపరంగా చూస్తే విశాఖను పాలనా కేంద్రంగా చేయడం అభిలషణీయం కాకపోవచ్చు. పారిశ్రామిక కేంద్రంగా ఎదిగిన విశాఖలో కాలుష్యమూ పెరిగిపోతోంది కనుక అక్కడ రాజధాని నిర్మాణం సమంజసం కాదు.

ఏదిఏమైనా విధాన నిర్ణయాల మీద పాలకులు చీటికిమాటికి మనసు మార్చుకోవడం మంచిది కాదు. దీనివల్ల చట్టపరమైన ఒప్పందాలకు భంగం కలిగి దీర్ఘకాలంలో విపరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతిని రాష్ట్రంతోపాటు దేశ ఆర్థిక ప్రగతి కుంటువడుతుంది. ఒక రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సమాన ఫాయాలో అభివృద్ధి చెందడమనేది రాజధాని ఎక్కడున్నదనే అంశం మీద కాకుండా ప్రభుత్వం అనుసరించే పకడ్బందీ విధానాల మీద ఆధారపడి ఉంటుంది. రాజధాని ఎంపికకు ప్రమాణాలు వేరే. అమెరికా అనుభవం దీనికి నిదర్శనం. రాజధానికి సంబంధించి నా దృక్పథాన్ని ఇక్కడ వివరించిన సందర్భంలో నా స్వస్థలం విజయవాడ అని వెల్లడించడం భావ్యంగా ఉంటుంది. అయితే గత ఏడు దశాబ్దాలుగా నేను ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నాను.
 

దక్షిణాఫ్రికాతో పోలికేల?

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను సమర్థించుకోవడానికి దక్షిణాఫ్రికా దేశానికీ మూడు రాజధానులు ఉన్నాయని గుర్తుచేస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌, దక్షిణాఫ్రికాల మధ్య పోలిక పెట్టడం సరికాదు. ఒకటి రాష్ట్రమైతే రెండోది అనేక రాష్ట్రాల సమాహారమైన సార్వభౌమ దేశం. ఆ దేశానికి ఉన్న చారిత్రక, సాంఘిక, ఆర్థిక అనివార్యతలు వేరు; ఆంధ్రప్రదేశ్‌ అవసరాలు వేరు. పైగా అధ్యక్ష పాలన వ్యవస్థను కలిగిన దక్షిణాఫ్రికాలో పాలన, శాసన, న్యాయ వ్యవస్థలు దేనికవే స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అందుకు భిన్నంగా భారత్‌లో ఏ చట్టాన్నయినా పాలన వ్యవస్థే ప్రతిపాదిస్తుంది. శాసన వ్యవస్థ దాన్ని లోతుగా చర్చించి ఆమోదించిన తరవాతనే అది సాధికార చట్టంగా మారుతుంది. కాబట్టి పాలన, శాసన వ్యవస్థలు రెండూ నిరంతరం సమన్వయంతో పనిచేయాల్సిందే. ఈ వ్యవస్థలు రెండూ ఇరుగుపొరుగున ఉన్నప్పుడు మాత్రమే కలసికట్టు కార్యాచరణ సాధ్యమవుతుంది. మరోవిధంగా చెప్పాలంటే సచివాలయం, విధానసభ ఒక్కచోటు నుంచే పనిచేయాలి.


 

Posted Date: 20-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాష్ట్రీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం