• facebook
  • whatsapp
  • telegram

  భాష - స్వాభిమాన ప్రకటన

* ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా

పిల్లలకు పెద్దలు తెలుగులో ఏమీ చెప్పకూడదని, చెప్పింది బుర్రకెక్కాలంటే ఇంగ్లిషులోనే చెప్పాలని, ఇంటింటా ఇంగ్లిషు మార్మోగాలని... కొత్త విధానం పుట్టుకొచ్చింది. ‘నాయనా అన్నం తినరా...’ అని తల్లి గోముగా బిడ్డతో అనకూడదట. ‘ఐ సే... ఈట్‌ యువర్‌ ఫుడ్‌’ అంటే గమ్మున తినేస్తాడట. పిల్లలకు ఇంగ్లిషులో చెబితేనే వాళ్ల బుర్ర పెరుగుతుందని కొత్త భాష్యకారులు ఉద్ఘోషిస్తున్నారు. కాదన్న మాదన్నలు సంఘవిద్రోహులు, కుట్రదారులేనట!

అసంబద్ధ వాదనలు
ప్రాథమిక విద్య మాతృభాషలోనే బోధించే విషయంలో అంతర్జాతీయ బోధనాసూత్రాలు, యునెస్కో మార్గదర్శకాలు, మనోవైజ్ఞానిక శాస్త్ర ప్రతిపాదనలు... ఇవన్నీ పవిత్ర ఆంగ్లభాషకు వ్యతిరేక ప్రచారాలేనని, మన పిల్లల్ని అమెరికా వెళ్ళనీకుండా జరుగుతున్న కుట్ర అని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడానికే ఇక్కడ ఇంగ్లిషులో చదువులు చెబుతున్నామని, అమెరికాలో ఉద్యోగం రావాలంటే ఇక్కడ మాతృభాష రాకూడదని విద్యాసంస్థలు ప్రచారం చేస్తున్నాయి. మన పిల్లల్ని అమెరికా ఉద్యోగులుగా తప్ప, నవమేధావులుగా, యజమానులుగా తీర్చిదిద్దే చదువు గురించి ఎవరూ మాట్లాడటం లేదు! ఇంత బానిస లక్షణాల్ని జాతిలో నూరిపోయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆంగ్ల మాధ్యమంలో చదివితే ఉద్యోగం తప్పనిసరనేవారు- నిరుద్యోగ ఇంజినీర్లు, వైద్యులు ఎందరున్నారో లెక్కించారా? అమెరికా ఉద్యోగానికి నైపుణ్యం మాత్రమే ప్రధానం అని గుర్తించాలి. ఇంగ్లిషు పేరు చెప్పడం ఆత్మవంచనే కాదు- భవిష్యత్‌ తరాలకు అపకారం కూడా! ప్రభుత్వం నాణానికి ఒక పార్శ్వాన్నే చూస్తోంది. తమ పిల్లల ప్రతిభాపాటవాలను పెంచుకోవటానికి ఏ మాధ్యమం అవసరమో నిర్ణయించుకునే హక్కుని ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం కాలరాస్తోంది. పిల్లల్ని అటు ఇంగ్లిషుకు, ఇటు తెలుగుకు కాకుండా... రెంటికీ చెడ్డ రేవడుల్ని చేస్తుంది. మాతృభాషలోనే బిడ్డ పుట్టి పెరుగుతాడని, చదువులన్నింటినీ మాతృభాషలోనే ఆకళింపు చేసుకుని, జ్ఞాన సముపార్జన చేసుకుంటాడని, మాతృభాష ఎంత బాగా వస్తే అంత జ్ఞాన సంపన్నుడౌతాడని పరిశోధనలు ఘోషిస్తున్నాయి. ప్రాథమిక విద్యలో మాతృభాష తగినంత నేర్పితే పైతరగతుల్లో ఇంగ్లిషు బాగా నేర్చుకోవడానికి కావలసినంత సానుకూలత విద్యార్థికి కలుగుతుంది.

పార్టీల మధ్య వైరుద్ధ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ మన పొరుగు రాష్ట్రం తమిళనాట భాష విషయంలో అందరూ ఒకేమాట, ఒకే బాటగా ఉంటారు. యూపీఏ-1 అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెసువారు కరుణానిది మద్దతు కోరితే, ఆయన మంత్రి పదవుల కోసం బేరసారాలు కాకుండా తమిళ భాషకు ప్రాచీన హోదా కోరాడు. దాన్ని సాధించి, తమిళప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకొన్నాడు. అలాంటి భాషాభిమానాన్ని ఒక స్వాభిమాన ప్రకటనగా తెలుగు ప్రజలు భావించగలగాలి. ఇతర రాష్ట్రాల్లో, మారిషస్‌, మలేషియా తదితర దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమతమ ప్రభుత్వాలపైన అనేక పోరాటాలు చేసి తెలుగు మాధ్యమంలో పాఠశాలలు సాధించుకున్నారు. తమిళనాడులో న్యాయస్థానానికి వెళ్లి తెలుగులో పరీక్షలు రాసేందుకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. హిందీకి బదులు రెండో మాధ్యమంగా తెలుగును బోధనాంశంగా సాధించుకున్నారు. అమెరికాలోని తెలుగువారు ‘మనబడి’, ‘పాఠశాల’లు నెలకొల్పి తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తూ భాషా సంస్కృతుల వ్యాప్తికి కారకులవుతున్నారు. స్వరాష్ట్రంలో తెలుగుని బలహీనపరచే ప్రభుత్వ చర్యల వల్ల తాము పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని ఆందోళన చెందుతున్నారు.

ప్రజల్లో మాతృభాష పట్ల అనురక్తిని పెంపుచేయడం భాషోద్యమం లక్ష్యం. వంద సంవత్సరాలకు పైబడిన సుదీర్ఘ పోరాటం ఇది. ఏ తెలుగు భాషకు పట్టం కట్టాలని పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకున్నారో ఆ స్ఫూర్తిని విస్మరించి, దాన్ని ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంగా చిత్రించడం భాషకు జరిగిన మొదటి అపచారం. ఉమ్మడి పాకిస్థాన్‌ దేశంలో పోలీసు కాల్పుల కారణంగా అయిదుగురు ఢాకా విశ్వవిద్యాలయం మహమ్మదీయ విద్యార్థులు తమ మాతృభాష అయిన వంగభాష కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ త్యాగమూర్తుల ఉద్యమస్ఫూర్తిని మనసుతో ఆకళింపు చేసుకోగలిగే పరిస్థితి లేకుండా పోయింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరవాత ప్రభుత్వాలు భాషపట్ల పూర్తి నిరాసక్తత ప్రదర్శించాయి. తెలుగు జాతిపట్ల, జాతీయత పట్ల అభిమానాన్ని పెంపొందించే కార్యక్రమాలు క్రమేణా కనుమరుగయ్యాయి. భాషాభివృద్ధి చుట్టూ కమ్ముకున్న గాఢాంధకారాన్ని చీలుస్తూ, 1975 ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు దివిటీ వెలిగించి తెలుగు రేఖలను ప్రపంచం అంతా విరజిమ్మాయి. జనంలో భాషానురక్తి మారాకు తొడిగింది. ప్రజలు చైతన్యవంతులు కాసాగారు. తెలుగుభాష కోసం, తెలుగు బోధన కోసం, తెలుగు వ్యాప్తికోసం కార్యక్రమాలు అటు ప్రజల పరంగా, ఇటు ప్రభుత్వాల పరంగా ప్రారంభమయ్యాయి. అప్పటివరకు మరుగున పడిపోయి మదరాసీలుగా పిలిపించుకుంటూ, తెలుగువారిలో వ్యాపించిన చలనం లేని జడత్వాన్ని వదిలేస్తూ, తెలుగువారి ఆత్మాభిమానం అనే ఆయుధంతో ఎన్టీ రామారావు వెల్లువెత్తిన కెరటంలా దూసుకువచ్చి రాష్ట్రపాలన భారాన్ని తలకెత్తుకున్నారు. కానీ, అనంతర కాలంలో ప్రభుత్వాలు తెలుగును నానాటికీ తీసికట్టు చేసి, మరణ శయ్యమీదకు చేర్చాయి. తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు కోసం అనేక ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. ఒక్కటీ అమలుకాలేదు. అన్నీ కంటి తుడుపు చర్యలే! తెలుగు అనేదే లేకుండా కార్పొరేట్‌ విద్యాసంస్థలు మహావిద్యాలయాలను నడుపుతుంటే చర్యలు తీసుకునే తెగువ ప్రభుత్వాలకు లేకుండా పోయింది. ‘నేను తెలుగులో మాట్లాడను’ అని పలకల మీద రాసి మెడలో తగిలించి చంటిపిల్లల్ని ఎండలో తిప్పించిన పాఠశాలల మీద చర్యలే లేవు. ఆంగ్ల భాషను బలవంతంగా రుద్దడం వల్ల చదువులు అర్థంకాక బలవన్మరణాల పాల్పడిన విద్యార్థినీ విద్యార్థుల ఆక్రందనలు పట్టించుకున్న పాపానపోలేదు.

దక్షిణాదిన ఔరంగజేబు కాలంలో అసఫ్‌ జా వంశీకులు ఇక్కడ స్థానిక పాలకులయ్యారు. వీళ్ల పాలనలో చదువుల పరిస్థితి ఎలా ఉండేదో 1934లో సురవరం ప్రతాపరెడ్డి ‘నిజాము రాజ్యములోని తెలుగువారి స్థితి’ అనే వ్యాసంలో- ‘సార్వభౌమ భాష కావుననూ, పాఠశాలలో పాఠ్యమగునట్టిది గావునను ఇంగ్లీషు తప్పనిదయ్యె. ప్రభుత్వ భాష కావున ఉర్దూ నిర్బంధమయ్యె. ఉర్దూలో ప్రావీణ్యత నొందవలెనన్న అరబీ చదవకున్ననూ ఫార్శీ పాత్రము తప్పక చదువవలసినదే! ఇక అభిమాన భాష ఆంధ్రము. ఇక ఐచ్చికము, లాభరహితము. ఎవరు చదువుదురు? కావున ఆంధ్రభాష ఇచ్చట దినదినము క్షీణించుచున్నది.’ అని రాశారు. ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు.

జనజాగృతికి సమయం
ఒకనాడు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు లేనప్పటికీ, భాషాభిమానంతో ప్రజలు వీధిబడులు నిర్వహించుకుని తెలుగు నేర్చుకున్నారు. మహాకవులు సినారె, దాశరథి ప్రభృతులు ఉర్దూలోనే విద్యాభ్యాసం చేసినా, వీధిబడుల్లో తెలుగు నేర్చి లోకంమెచ్చిన కవులయ్యారు. ఆ పరిస్థితి నేడు ఉన్నదా? కవులు కావడం కోసం తెలుగు నేర్చుకోవడం కాదు, మనోవికాసం కోసం, స్వాభిమానం కోసం, ఆత్మబలం కోసం మాతృభాష నేర్వాలి. తెలుగు రాకపోతేనే ఇంగ్లిషు బాగా వస్తుందనే బోధకులు జాతికి అపకారం, అపచారం చేస్తున్నట్లు గుర్తించాలి. జనజాగృతిని కలిగించవలసిన సాహిత్య సాంస్కృతిక పత్రికా రంగాలు పూనుకొంటేగాని మాతృభాష మీద దాడి ఆగదు. బలమైన మాతృభాషోద్యమం అవసరమైన సమయం వచ్చింది. సమయానికి తగిన రీతిలో మేధావి వర్గం ప్రతిస్పందించవలసిన అవసరం ఉంది. ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు, ‘ఆంధ్రత్వ మాంధ్ర భాషాచనాల్పస్య తపసః ఫలం’ అని అప్పయ్య దీక్షితులు, ‘సుందర తెలుంగిళ్‌ పాటిసైతు’ అని సుబ్రహ్మణ్య భారతి... ఇలా ఎందరో కీర్తించిన తెలుగు పట్ల చిన్నచూపు ఏర్పడటం శాపవశాన అనిపిస్తుంది. ఇది మన జాతి, ఇది మన భాష అని సగర్వంగా చాటగలిగేలా భాషాభిమానాన్ని, జాత్యాభిమానాన్ని చాటుకునే జాతి నిర్మాణం జరగకపోతే భాషాజాతిగా తెలుగువారు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. తెలుగు తెలియని తెలుగువారిని తయారు చేయటం వల్ల జాతి వికసిస్తుందంటే నమ్మగలమా?


 

Posted Date: 20-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాష్ట్రీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం