• facebook
  • whatsapp
  • telegram

  చదువు ఏ భాషలో సాగాలి?

* చిన్నారులకు ఆహ్లాదకరంగా అమ్మ భాష

మాతృభాషతో సౌకర్యం ఏమిటంటే, దాదాపుగా ఆ భాషలో వ్యాకరణ విషయాలన్నీ బడిలో నేర్చుకోకుండానే తెలిసిపోతాయి. మొదట, మాతృభాషలో విషయాలు తెలిసివుంటే, పరాయిభాషలో ఆ విషయాల్ని నేర్చుకోవడం ఎంతో తేలిక అవుతుంది. పిల్లలకు మాతృభాషలో వాచకాలు సరైనవిగా వుంటే- ఒకటి, రెండు తరగతులు అయ్యేటప్పటికే; రాతా, చదువూ అలవాటైపోతాయి. ఆ తరవాత, పరాయి భాషలో అక్షరాల్నీ, మాటల్నీ చిన్న వాక్యాల్నీ నేర్పడం మొదలు పెట్టవచ్చు. మొదట మాతృభాషలో రాతే లేకుండా, మాట్లాడటం తెలియని ఏ పరాయిభాషలో అయినా చదువు ప్రారంభించడం అంటే- అది పిల్లలను చిత్రహింసలు పెట్టడంతో సమానం.

‘చదువు’ అంటే ఏమిటి, అది ఏ భాషలో సాగాలి?- ‘చదువు’ అంటే ఏమిటో మొదట తెలిస్తేనే, అది ఏ భాషలో సాగాలో తర్వాత తెలుస్తుంది. ‘చదువు’ అన్నప్పుడు, నాలుగైదేళ్ల బాలబాలికల్నే మొదట దృష్టిలో పెట్టుకోవాలి. చదువు జరిగేది చిన్నవయసులోనే అయినా, కొందరి విషయంలో అది, పెద్దవయసులోనూ జరగవచ్చు; లేదా ఏ వయసులోనూ జరగకపోవచ్చు. మూడేళ్ల పిలల్నీ స్కూళ్ళకు పంపించే విధానం, ఏనాడో వచ్చేసింది. అయితే, ఈ పాఠశాలలు చదువుల స్కూళ్ళు కావు; ఇవి, ఆటల్నీ పాటల్నీ నేర్పుతూ, చిట్టిపొట్టి చదువులు కూడా నేర్పించినా, ప్రధానంగా పిల్లలల్ని ఆడించే స్కూళ్ళే. ఇంతకీ, ‘చదువు’ అంటే ఏమిటి, ఎప్పుడు, ఏ భాషలో? చదువు ఏ భాషలో అనే ప్రశ్న ఏమిటి?- పిల్లలు ఏ భాషలో మాట్లాడుతూ, పెరుగుతూ ఉంటారో ఆ భాషలోనే! పిల్లలు పుట్టి, పెరుగుతూఉంటే, వాళ్ళని పెంచే పెద్దవాళ్ళు, పిల్లలతో ఏ భాషలో మాట్లాడతారో, ఆ భాషే పిల్లలకి అలవాటవుతుంది. అది, పిల్లలకు మాతృభాష.

గ్రహింపు సులభం
‘చదువు’ అంటే ఏమిటో ఇంకా చెప్పుకోలేదు. ‘చదువు’ అంటే మాట్లాడే భాషలోనే రాయడమూ, ఆ భాషని చదవడమూ, ఈ రెండూ నేర్చుకోవడమే. మాట్లాడే భాషని, రాయడానికి, దాని అక్షరాలు నేర్చుకుని రాయడంగానీ; అదే భాషలో ఇతరులు రాసినదాన్ని చదవడంగానీ చెయ్యగలగాలి. ఏ భాషనీ చదవలేకపోతే, అది ‘చదువు’ కాదు. ‘అమ్మా, ఏదన్నా తాయిలం పెట్టు!’ అని మాట్లాడే పిల్లలు, ఆ మాటలనే రాయగలిగితే, వాళ్ళకి చదువు మాట్లాడే భాషలో ప్రారంభమైపోయినట్టే. అంటే, మాతృభాషలో. ఏ భాషలో మాట్లాడతారో ఆ భాషని రాయడమూ, చదవడమూ చెయ్యగలిగితే, అది మాతృభాషలో చదవడమే. ఏ భాషలో మాట్లాడే పిల్లలకైనా, ఇంకా బడికి పోవడం ప్రారంభంకాకముందే, ఆ భాషలో వ్యాకరణ సూత్రాలన్నీ అలవాటైపోయి ఉంటాయి. ఆడ మనిషిని గురించైతే, ‘వచ్చింది’ అనీ; మొగ మనిషిని గురించైతే ‘వచ్చాడు’ అనీ అనాలని తెలియడానికి బళ్ళోచేరి చదవనక్కరలేదు. ఒక్క ఆడమనిషిని గురించైతే, ‘వచ్చింది’ అనీ; ఎక్కువ మంది మనుషుల గురించైతే ‘వచ్చారు’ అనీ; ఆ తేడాల్ని మాట్లాడే భాషలోనే నేర్చుకోగలరు. అయితే, ‘అది స్త్రీలింగం- ఇది పుల్లింగం’ అనీ; ‘అది ఏకవచనం- ఇది బహువచనం’ అనీ- ఈ వ్యాకరణ పదాలు ఉపాధ్యాయులద్వారా నేర్చుకునేవి. అలాగే, ‘నిన్న తిన్నాను. ఇప్పుడు తింటూ ఉన్నాను. రేపు తింటాను’ అని, గడిచిన- గడుస్తూ ఉన్న- గడవబోయే కాలాల పనుల్ని మాట్లాడాలన్నా, రాయాలన్నా, వ్యాకరణ పాఠాలు అక్కరలేదు. కాకపోతే, ఆ మూడు కాలాల్ని, ‘భూత-వర్తమాన-భవిష్యత్కాలాలు’ అని- ఈ వ్యాకరణ పదాలు తెలుసుకోడానికైతే ఒక పాఠం కావాలి.

తెలుగులో, ‘వచ్చింది, వచ్చాడు, వచ్చారు’ అంటూ మూడు తేడాలు తెలిసివున్న పిల్లలకు, పరాయి భాషని నేర్పడం ప్రారంభమైనప్పుడు, ఆ భాషలో ఆ తేడాలు ఎలా వుంటాయో చెప్పడం చాలా తేలిక. తెలుగులో వున్న ఆ మూడు తేడాలు, హిందీలో కూడా అలాగే వుంటాయని చెప్పవచ్చు. ఇంగ్లీషులో అయితే, ఆ తేడాలు ఉండనే వుండవని రాసి చూపిస్తే, పిల్లలు ఆశ్చర్యపోతారు. మాట్లాడే భాషలో వ్యాకరణ సూత్రాలు కొన్ని తెలిసివుండటంవల్ల, వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు వేస్తారు. మాట్లాడే భాషలో విషయాలు మొదట తెలిసివుంటేనే, ఏ పరాయిభాషని పరిశీలించడానికైనా ఆసక్తి మొదలవుతుంది. నాలుగైదేళ్ల పిల్లలకు, ఏనాడూ మాట్లాడని పరాయిభాషని బడిలో కూర్చున్న రోజునించీ వినిపిస్తే, భయపడే రోజులు మొదలైనట్టే!

మాట్లాడే భాషలో రాతా-చదువూ అలవాటై, వాచకాల్లో పాఠాలు చదవగలిగితే, ఇక నేర్చుకోవలసినవి, లెక్కలూ-సైన్సులూనూ. వీటిని కూడా మాట్లాడే భాషలోనే అయితే, నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉండవు. ఏది నేర్చుకోవాలన్నా మాట్లాడే భాషలోనే అయితే, దానికి తక్కువకాలము సరిపోతుంది.

మాట్లాడే భాషలో ఒక ‘రుచి’ ఉంటుంది. చదువు ఆ భాషలోనే సాగితే, అది కూడా ‘రుచి’గానే ఉంటుంది. అంటే చదివేటప్పుడు ఆ మాటలూ వాక్యాలూ స్పష్టంగా తెలిసిపోతూవుంటే, అంతవరకూ తెలియని సమాజ విషయాలూ, ప్రపంచ విషయాలూ, ప్రకృతి విషయాలూ... అన్నీ తేలిగ్గా అర్థమవుతూ వుంటాయి. చదివే వాక్యాలే అర్థం కాకపోతే, చదువంతా నిరుత్సాహంతో నిండుతుంది.

పిల్లలు అయిదారేళ్లవాళ్ళే అయినా, వాళ్ళు ఒక చందమామ కథని మాట్లాడే భాషలోనే చదివితే, లేదా అదే కథని పరాయిభాషలో చదివితే; రెండు సందర్భాల్లోనూ ఒకేరకం స్పందన ఉండదు. పరాయి భాషలు ఎప్పటికీ అక్కరలేదని కాదు. పరాయి భాషల్ని నేర్చుకోకపోతే, వేరువేరు ప్రాంతాల మానవుల మధ్య సంబంధాలే ఉండవు. పరాయిభాషలు హాయిగా నేర్చుకోవలసిందే. అయితే, ఎప్పుడూ? మాట్లాడే మాతృ భాషలో చదువు ప్రధానంగా సాగుతూ వున్నప్పుడే. మాతృ భాష తర్వాతే పరాయిభాషలు!

చదువుని, ఏ పరాయిభాషతోనూ ప్రారంభించకూడదు. (ఈ మాతృ భాషలో చదువు గురించి, ఇతర సమస్యలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి, ఒక తమిళ కుటుంబం తెలుగు ప్రాంతానికి బదిలీ అయి వచ్చిందనుకుందాం. ఆ తమిళ పిల్లలకి, తెలుగు బడుల్లో చదువులు ఎలాగ? గిరిజనుల్లో అనేక తెగల వాళ్ళ భాషలకు లిపే లేదు. వాళ్ళ పిల్లలకు చదువులు ఎలాగ? ఒక భాషలోకి, ఇతర భాషల మాటలు అనేకం కలిసిపోతూ ఉంటాయి. తెలుగులో రైలూ, బస్సూ, సైకిలూ, సినిమా, గేటూ, టిక్కట్టూ... ఇలాగ హిందీ నుంచి, సంస్కృతం నుంచి, ఇంకా ఇతర భాషల నుంచి. ఈ పరాయి మాటల్ని ఏం చెయ్యాలి?- ఏమీ చెయ్యక్కర్లేదు. కలిసిపోయిన పదాల్ని కలిపేసి ఉంచుకోవాలి. ‘సైకిల్‌’నీ, ‘రైలు’నీ, తీసెయ్యగలమా? ఇవి, మాతృ భాషలో చదువుకు వ్యతిరేకం కాదు. సమస్య ఉందంటే, పరిష్కారం ఉంటుంది. అవన్నీ ఇక్కడ అనవసరం.

తెలుగు రాష్ట్రాల్లో, కొంతకాలగా ఇంగ్లీషు మత్తుపట్టింది. దానికి రాజకీయ కారణాలు అనేకం ఉంటాయి. అయినా, ఆ చర్చ ఇక్కడవొద్దు. చదువు సంగతే చూడాలి. ఒకటో తరగతినుంచి ఇంగ్లీషు మాధ్యమం ద్వారానే చదువు చెప్పాలని ఒకవాదం. దానిమీద పోటీవాదం కూడా ఉంది. ఈ వాదం, రెండు మాధ్యమాలూ పెట్టాలటుంది. ఒకటో తరగతినుంచే ఇంగ్లీషులో చెప్పేది ఒకచోటా, తెలుగులో చెప్పేది ఇంకోచోటా అనీ! పిల్లల తల్లిదండ్రులు, తమకు ఏది ఇష్టమైతే అందులోనే తమ పిల్లల్ని పెట్టుకుంటారు అనీ! అది, తల్లిదండ్రుల ‘హక్కు’ అని, వాళ్ళ ‘స్వేచ్ఛ’ అనీ! హక్కులూ, ఇష్టాలూ, స్వేచ్ఛలూ, అన్ని విషయాలకూ వర్తించవు. మనకి జబ్బుచేస్తే డాక్టర్‌ దగ్గరికి వెళ్తాం; డాక్టర్‌ చెప్పినట్లు నడవాలి కదా? అలాగాక, ‘అసలు డాక్టర్‌ వొద్దు; స్వాములవారి దగ్గరికివెళ్ళి, మంత్రం వేయించుకుని, చేతికి తాయెత్తు కట్టించుకుంటా. అదే నాకు ఇష్టం, నా హక్కు, నా స్వేచ్ఛ’ అంటే, తర్వాత ఏం జరుగుతుంది? ‘జబ్బుల’ దగ్గర హక్కులూ-స్వేచ్ఛలూ పనికిరానట్టే, పిల్లల చదువుల విషయంలో, ఎవరి హక్కులూ, ఎవరి స్వేచ్ఛలూ పనికిరావు.

అహేతుక వాదనలు
ఇంగ్లీషు చదువుల గురించి ప్రధానమైన ప్రశ్న ఒకటి వుంది. ‘ధనవంతుల పిల్లల, ఇంగ్లీషు స్కూళ్ళల్లోనే చదువుతారు. పేదల పిల్లలలైతే మాతృభాషలోనే చదవాలా?’ అని. ఈ సమస్యను ‘డబ్బు సమస్య’గా చూస్తారు. డబ్బుఉంటే ఇంగ్లీషూ, డబ్బులేకపోతే మాతృభాషా- అన్నట్టు! కానీ, ఇది, డబ్బు సమస్యకాదు. చదువు సమస్య. ‘చదువు’ ఎప్పుడూ మాట్లాడేభాషలోనే ప్రారంభం కావాలి. ధనవంతుల పిల్లలకు కూడా ఇదే సూత్రం! దీన్ని ఎవరు అర్థం చేసుకోకపోతే, అది వాళ్ళ తప్పే. ఆ తప్పు చేసేవాళ్ళు తమ పిల్లలకు, చదువులో ఆనందాన్ని దొరకనివ్వకుండా, ద్రోహంచేస్తున్నారని అర్థం. ఇంకోవాదం ఉంది. ‘ఇంగ్లీషులో చదివితేనే ఉద్యోగాలు గ్యారంటీ’ అని. ఈ వాదంమీద ఒకప్రశ్న ఉంది. బ్రిటన్‌, అమెరికా ఇంగ్లీషు దేశాలే. అక్కడి పిల్లలు ఇంగ్లీషులోనే చదువుతారు. చదవని వాళ్ళు కూడా ఇంగ్లీషు మాట్లాడతారు. అలాంటి దేశాల్లో, నిరుద్యోగం ఎందుకు ఉంది? పెద్దపెద్ద డిగ్రీలున్న వాళ్ళలో కూడా అనేకమందికి ఉద్యోగాలు ఎందుకులేవు? ఇదంతా ఇంగ్లీషు చదువు సమస్యకాదు. వేరే సమస్య. పెట్టుబడిదారీ విధానంలో టెక్నాలజీల్ని పెంచి, ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే శ్రమకాలాన్ని తగ్గిస్తారు. అయినా కార్మికుల పనికాలాన్ని తగ్గించరు. దాన్ని ఇంకా పెంచి, కార్మిక సంఖ్యనే తగ్గిస్తారు. ఇటువంటి కారణాల్ని ఇక్కడ వివరంగా చెప్పుకోలేం. చెప్పుకోవలసిన మాట ఏమిటంటే, ఇంగ్లీషు పండితులైతే ఉద్యోగాలు వచ్చేస్తాయనేది భ్రమ. ఇక్కడ ఇంతకన్నా చెప్పుకోవడం అనవసరం.

విషాదాంతమైన ఒక నిజాన్ని వింటారా? ఒక నిరుపేద కుటుంబంలో ఆడపిల్లల. తండ్రి రిక్షావాలా. తల్లి రోడ్ల స్వీపరు. పిల్లల తెలుగులో ఆసక్తితో చదువుతూ ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణురాలవుతూ ఉంది. అయినా, ఆ పిల్లలని ఇంగ్లీషు మీడియం స్కూల్లోకి మార్చారు తల్లిదండ్రులు. వద్దని పిల్లల ఎంతో వేడుకొంది. పెద్దలు వినలేదు. పిల్లలకి, ఇంగ్లీషుని శ్రద్ధగా నేర్పేవాళ్ళులేరు. ఇక పిల్లలకి ఫెయిళ్ళూ... చివాట్లే. మరో ఇంగ్లీషు మీడియం స్కూల్లోకి మార్చినా పిల్లలకి రక్షణమార్గం దొరకలేదు. తల్లిదండ్రులకే హక్కు! పిల్లలకి హక్కులేదు! ఒకరోజు తండ్రి ఇంటికివచ్చి చూస్తే, గదిలో మసికుప్పలో పిల్ల కాలిపోయి, ఆరిపోయి, తరిగిపోయి కనపడింది. ఇంగ్లీషు మోజు ఫలితం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్ని పరిశుభ్రం చేసి, వాటిని విశాలచేసి, టీచర్ల సంఖ్య పెంచి, ఈ మాత్రపు మార్పులు చేస్తే- తెలుగు నిలబడుతుంది. పిల్లలకు మేలు జరుగుతుంది.

Posted Date: 20-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాష్ట్రీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం