• facebook
  • whatsapp
  • telegram

  అమ్మభాషతోనే పఠనాసక్తి

* బుర్రకెక్కని చదువులతో సతమతం

పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని అమ్మ ఎలాగైతే విద్యాబుద్ధులు నేర్పిస్తుందో, అలాగే బడిలోనూ అమ్మ భాషలోనే బోధన ఉండాలని పండితులు, నిపుణులు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు తమ పాఠశాలల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇంట్లో మాట్లాడే భాషలో పిల్లలకు బోధించినప్పుడే వారు భాషపై పట్టు, నైపుణ్యాలు సులువుగా సాధిస్తారన్నది నిపుణుల మాట. ఎన్నో అంతర్జాతీయ అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాయి. మనం మాత్రం ఆ మాటలు పెడచెవినపెట్టి పరభాష మోజులో మాతృభాషను విస్మరిస్తున్నాం. తాజాగా ప్రపంచబ్యాంకు నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది. దేశంలో దాదాపు 55 శాతం విద్యార్థులు ‘అభ్యసన లేమి’ (లెర్నింగ్‌ పావర్టీ) సమస్య ఎదుర్కొంటున్నట్లు నివేదించింది. పదేళ్ల వయసున్న విద్యార్థి చిన్నవాక్యాలను కూడా చదివి అర్థం చేసుకోలేకపోతున్నారన్న చేదు నిజాన్ని బయటపెట్టింది. దీన్నే అభ్యసన లేమిగా వ్యవహరిస్తారు. ఇలా చదవలేకపోవడానికి ఆయా దేశాల విద్యావిధానం, పాఠ్యపుస్తకాల లేమి, సుశిక్షితులు కాని ఉపాధ్యాయులు, బోధన భాష వంటి అంశాలు ప్రభావితం చేస్తాయని విశ్లేషించింది. మానవ మూలధనాన్ని పెంచే, సుస్థిరాభివృద్ది లక్ష్య సాధనలో భాగంగా ‘యునెస్కో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌’ భాగస్వామ్యంతో ప్రపంచబ్యాంకు ఈ నివేదిక రూపొందించింది. ప్రాథమిక విద్యాభ్యాసంలో మార్పులు రావాల్సి ఉందని, విద్యార్థులకు సరిగ్గా చదవడం రాకపోతే అది వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడింది. తద్వారా ఆయా దేశాలు నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ది లక్ష్యాలను సాధించడానికి ఇది అవరోధంగా మారుతుంది. పదేళ్లలోపు పిల్లలకు మాతృభాషలో బోధన చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించింది.

చక్కటి పునాది
జ్ఞాన సముపార్జనలో కీలక అంశమైన పఠనానికి పునాదులు పడాల్సింది బాల్యంలోనే. పాఠశాల విద్యాభ్యాసంలో పఠనం అనేది ప్రవేశద్వారం వంటిది. అలాంటి పఠనా సామర్థ్యమే లేకుంటేే విద్యాభ్యాసానికి ద్వారాలు మూసుకుపోయినట్లే. పదేళ్ల వయసు వచ్చేసరికి చదవడం రానివారు, పాఠశాల విద్యానంతరం విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని దాదాపు 10 సంవత్సరాలలోపు పిల్లల్లో 53 శాతానికి సరిగ్గా చదవడమే రావడం లేదు. ఇందుకు వారు బాల్యంలో నేర్చుకునే భాషలోనో, బోధనలోనో దోషం ఉన్నట్లు అర్థమవుతోంది. ఇలాంటి ప్రాథమిక నైపుణ్యాలు లేని కారణంగా పాఠశాల విద్యానంతరం, ఉద్యోగ జీవితంలో ఉత్తమ ఫలితాలు కనబరచడంలో అవరోధాలు ఏర్పడతాయన్నది నిపుణుల అభిప్రాయం. అందుకే ఇంట్లో మాట్లాడే భాషలో బోధించినప్పుడే విద్యార్థులు పఠనా నైపుణ్యాల్ని తొందరగా పొందగలరని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

పాఠశాలలో బోధించే భాష, ఇంట్లో మాట్లాడే భాష ఒకటే కానట్లయితే విద్యార్థులు నేర్చుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. ఫలితంగా పిల్లలు విసుగు చెంది పాఠశాలకే దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రాథమిక తరగతుల్లో మాతృభాషలో విద్యను అభ్యసించేవారు అధిక పఠన గ్రహణశక్తి కలిగి ఉన్నట్లు పరిశోధనలు వివరిస్తున్నాయి. ఇది క్లిష్టమైన అంశాలను గ్రహించడానికి పునాదిలా ఉపయోగపడుతుంది. విద్యార్థులు మాతృభాషను చదవగలిగే స్థాయిలో ఉన్నప్పుడే మరో భాషను సులువుగా నేర్చుకుంటారు. ‘అంతర్జాతీయ గణిత, సామాన్యశాస్త్ర ధోరణుల అధ్యయనం’ (టీఐఎమ్‌ఎస్‌ఎస్‌) ప్రకారం మాతృభాష, బోధన భాష వేరుగా ఉన్న ప్రాంతాల్లో గణితంలో ఆశించిన ఫలితాలు రావడంలేదని నిరూపితమైంది.

ఇటీవల డాక్టర్‌ కస్తూరి రంగన్‌ అధ్యక్షతన రూపొందిన జాతీయ విద్యావిధాన ముసాయిదా సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మూడు నుంచి అయిదు తరగతుల పిల్లలకు మాతృభాషలో బోధించడం వల్ల వారు పఠనాసక్తితో పాటు రాయగల జ్ఞానాన్ని పొందుతారు. ఆరు నుంచి ఎనిమిది తరగతులకు వచ్చేసరికి మాతృభాషతో పాటు ఆంగ్లంలోనూ (ద్విభాషా పద్ధతిలో) బోధించడం వల్ల రెండు భాషల్లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని సాధిస్తారు. అందువల్ల బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలని డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కమిటీ సిఫార్సు చేసింది.

సాధారణంగా పదేళ్ల వయసు వచ్చేసరికి విద్యార్థులు నాలుగో తరగతికి చేరుకుంటారు. ఈ సమయంలో వారు పదాలను సొంతంగా చదవడం, విశ్లేషించడం ప్రారంభిస్తారు. ఇలా వేగంగా చదవడం అలవాటు పడిన తరవాత పదాల అర్థాల కోసం వెతుకుతారు. తద్వారా పూర్తిగా వాక్యాలను అర్థం చేసుకుంటూ చదవగలిగే నైపుణ్యాన్ని, పదకోశంపై పట్టుతో పాటు పఠనాసక్తిని అలవరచుకొంటారు. పదేళ్ల వయసుకు పఠన పరిజ్ఞానాన్ని సాధించలేకపోతే భవిష్యత్తులో చదువులు కష్టమవుతాయన్నది నిపుణుల అభిప్రాయం. అందుకే పదేళ్లలోపు వయసే పఠనానికి

ఎంతో కీలకం!
భారత్‌లో అభ్యసన లేమి 55 శాతంగా ఉంది. చైనాలో అది 20 శాతం లోపే. పేద దేశాల్లో 90 శాతం, ఐర్లాండ్‌, ఫిన్లాండ్‌, సింగపూర్‌ వంటి ధనిక దేశాల్లో తొమ్మిది శాతం విద్యార్థులు మాత్రమే చదవలేకపోతున్నారు. ఈక్వెడార్‌, మాలి వంటి దేశాలు మాతృభాషతో పాటు మరో భాష (బై లింగ్వల్‌ పద్ధతి)లోనూ బోధనా పద్ధతులు అనుసరిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఫిన్లాండ్‌ తమ కిండర్‌ గార్డెన్‌ పిల్లలకు విద్యానైపుణ్యాలను భిన్నమైన ఆటలతో కూడిన పద్ధతిలో నేర్పిస్తోంది. ఈ పద్ధతిలో విద్యార్థులు పది సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పూర్తిగా చదవగలిగే నైపుణ్యం సాధిస్తున్నారు. ఇలాంటి విభిన్న పద్ధతులు అవలంబిస్తున్న అధిక ఆదాయ దేశాలు తమ దేశంలో అభ్యసన లేమి పూర్తిగా తగ్గించగలిగాయి.

తీరు మారాలి
పాఠశాలల్లో చేరినవారి పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 26 కోట్ల మంది చిన్నారులు అసలు బడికే వెళ్ళకపోవడం ఆందోళనకరం. ఇలా భిన్న సమస్యలు ఎదుర్కొంటున్న విద్యారంగంలో ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులు ఇకముందూ కొనసాగితే ప్రస్తుతం 53 శాతం ఉన్న అభ్యసన లేమిని 2030 నాటికి సగానికి కూడా తగ్గించలేం. అందువల్ల దీన్ని సాధ్యమైనంతవరకు తగ్గించాలని ప్రపంచబ్యాంకు సూచించింది. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలి. ఉపాధ్యాయులకు స్థానిక భాషలో బోధించే విధంగా శిక్షణ ఇవ్వడం అవసరం. ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి విద్యార్థికి సొంతంగా పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇవి మాతృ భాషలో ఉన్నట్లయితే విద్యార్థులు మరింత తేలికగా అర్థం చేసుకోగలుగుతారు. బోధనలో మార్పులతో పాటు పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, పోషకాహారం, ఆడుకోవడానికి కావలసిన మైదానాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పడంతోపాటు మాతృభాష మాధుర్యాన్ని పిల్లలకు రుచిచూపాలి. ఇతర భాషల అవసరాన్ని తెలియపరుస్తూ వాటిని నేర్చుకునే వాతావరణం కల్పించాలి!

- అనిల్‌ కుమార్‌ లోడి

Posted Date: 20-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాష్ట్రీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం