• facebook
  • whatsapp
  • telegram

  రెట్టింపు ఆదాయం ఆలస్యం

* కొత్త గడువు 2024

రైతుల ఆదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేస్తామన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా సవరించింది. లక్ష్య సాధన గడువును మరో రెండేళ్లు పొడిగించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాత్రికేయులకు పంపిణీ చేసిన ప్రచార ప్రతిలో ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని 2024గా పేర్కొంది. ‘భారత్‌ పరివర్తన: ఆరేళ్ల సమ్మిళిత పాలన’ పేరిట రూపొందించిన పుస్తకంలో రెండో అధ్యాయం శీర్షికలో ‘2024 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు’ అని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌, సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌లు పాల్గొన్న పత్రికా సమావేశంలోనే ఈ పుస్తకాలను పంపిణీ చేయడం విశేషం. లక్ష్యాన్ని మార్చడానికి సంబంధించి ప్రశ్నించినప్పుడు కేంద్రమంత్రి జావడేకర్‌ నేరుగా జవాబివ్వలేదు. అయిదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని పేర్కొనడం గమనార్హం. దీంతో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన నుంచి పక్కకు మరలినట్లయింది. రైతుల ఆదాయం రెట్టింపునకు సంబంధించిన ప్రకటన చేసినప్పటి ప్రధాని ప్రసంగంలో ‘ప్రియమైన దేశవాసులారా... నవభారత్‌ దిశగా ప్రతిన తీసుకుని ముందుకు సాగాలని కోరుతున్నాను. మనం చేపట్టిన పనిని నిర్దిష్ట సమయంలో పూర్తిచేయకపోతే, అనుకున్న ఫలితాల్ని పొందలేం’ అని పేర్కొనడం విశేషం. ‘మనమంతా కలిసి, రైతులు ఏ ఆందోళనా లేకుండా నిద్రించే భారత్‌ను నిర్మిద్దాం. రైతులు ప్రస్తుతం ఆర్జిస్తున్న దానితో పోలిస్తే, 2022 నాటికి రెట్టింపు సంపాదిస్తారు’ అని ప్రకటించారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటూ ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యంపై చాలామంది వ్యవసాయ రంగ నిపుణులు అప్పట్లోనే సందేహాలు లేవనెత్తారు. ఆ లక్ష్యాన్ని అందుకోవాలంటే వ్యవసాయం రంగం ఏటా 15 శాతం వృద్ధిరేటు సాధించాలన్నారు. గత శతాబ్ది కాలంలో ప్రపంచంలో ఎక్కడా వ్యవసాయ రంగం ఈ స్థాయిలో వృద్ధిరేటును నమోదు చేయలేదని కొంతమంది నిపుణులు ఎలుగెత్తి చాటారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభలో వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధిరేటు గత ఆరేళ్ల కాలంలో కేవలం మూడు శాతం మేరకే ఉండటం గమనార్హం. జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నివేదిక 2012-13లో ఒక వ్యవసాయ కుటుంబ సగటు నెలవారీ ఆదాయం కేవలం రూ.6,426 ఉన్నట్లు తేల్చింది. అయితే, ఆ ఆదాయంలో మూడింట ఒకవంతు సాగుయేతర కార్యకలాపాల ద్వారా వచ్చిందే. కేవలం నెలకు రూ.4,370 మాత్రమే సాగు, పాడి వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయమని తేలింది. ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి చాలీచాలని ఆదాయం కారణంగా రైతులు తమ భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకోవడానికి చేతుల్లో ఏ మాత్రం డబ్బులు మిగలని పరిస్థితి నెలకొంటోంది. సగటున ఒక కుటుంబ నెలవారీ వ్యయం రూ.6,223 వరకు ఉంటోందని, మొత్తం నెలవారీ ఆదాయంలో అది 97 శాతమని నివేదిక స్పష్టం చేయడం గమనార్హం.

ప్రధాని మోదీ తాను ప్రకటించిన లక్ష్యాల్ని సాధించేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పలురకాల పథకాల్ని ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి సాగునీటి పథకానికి (పీఎమ్‌కేవై) కేటాయింపుల్నీ పెంచారు. పంటల బీమాకు సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎమ్‌ఎఫ్‌బీవై)లో పలు మార్పులు జోడించారు. మృత్తిక ఆరోగ్య కార్డును జారీ చేయడం, యూరియా పక్కదారి పట్టకుండా వేపపూత వేయడం వంటి పలురకాల చర్యల్నీ తీసుకున్నారు. తోటల పెంపకం తదితర అనుబంధ కార్యకలాపాల్నీ చేపట్టాల్సిందిగా రైతుల్ని కోరారు. సేంద్రియ పద్ధతిలో సాగును చేపట్టాలని సూచించారు. వ్యవసాయ ఆదాయానికి అదనపు విలువను జోడించాలని కోరారు. 2018లో ప్రభుత్వ సేకరణ పథకం కింద ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధరను పెంచారు. 2019 ఎన్నికల్లో రైతుల ఓట్లను ఆకట్టుకునేందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు విమర్శలు చేశాయి. 2018 డిసెంబర్‌లో మోదీ సర్కారు దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ ఎగుమతి విధానాన్ని ప్రకటించింది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఈ తరహా అనేక నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకున్నా ప్రభావం మాత్రం పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. మరోవైపు, ప్రధాని మోదీ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత జీడీపీని రెట్టింపు చేయడం, 2024 నాటికి భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలు ఎంతమేరకు నెరవేరుతాయనేది వేచిచూడాలి.

- కృష్ణానంద్‌ త్రిపాఠి

Posted Date: 26-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం