• facebook
  • whatsapp
  • telegram

  సర్కారీ ప్రోత్సాహంతోనే పాల వెల్లువ

* పాడి రైతుకు గిట్టుబాటు కరవు 

పాడి-పంట రైతుకు రెండు కళ్లలాంటివి. విపత్తుల వల్ల పంట నష్టపోయినా- రైతుల్ని పాడి ఆదుకుంటుంది. ‘కవ్వమాడిన ఇంట కాసులుండు...’ అన్నట్టు పాడి ఉన్నన్నాళ్లూ రైతుల ఇళ్లలో డబ్బుకు కొదవ లేదు. దురదృష్టవశాత్తు ఎన్నో కారణాల వల్ల పశుపోషణకు దూరమవుతున్న కొద్దీ రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడం మొదలైంది. చక్కెర మిల్లులకు కీలకమైన చెరకు రైతులకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం వల్లే దేశంలో పంచదార పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఇప్పుడు ప్రపంచ పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌లో పాడి పరిశ్రమకూ ఆ దుస్థితి రానుందా? ప్రోత్సాహకాలు కొరవడటం, పాడి రైతుల్ని పట్టించుకోకపోవడం, డెయిరీల మధ్య అవాంఛిత పోటీ, పాల ఉత్పత్తి, ధరల్లో అస్థిరత్వం, విదేశీ దిగుమతుల నేపథ్యంలో దేశంలో పాడి పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కోనుంది.

ధరల స్థిరీకరణపై ఆశాభావం
దేశంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలతో రుతుపవనాలు ఆలస్యమై నీరు అందుబాటులో లేకపోవడం, అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో వరదలు సంభవించి పశువుల ఆరోగ్యం పాడవడం, మొక్కజొన్న, చెరకు పంటలు ధ్వంసమై పచ్చిగడ్డి అందుబాటులో లేక దాణా వ్యయాలు పెరగడం వంటి పలు ప్రతికూల కారణాలతో పాల దిగుబడి గణనీయంగా తగ్గింది. తరవాత పరిస్థితి క్రమంగా మెరుగుపడి డిసెంబరు నుంచి ఉత్పత్తి పెరగవచ్చని నివేదిక తెలిపింది. ఖరీఫ్‌ చివర్లో సమృద్ధిగా వర్షాలు పడటమే ఇందుకు కారణం. దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలతో రిజర్వాయర్లు 41 శాతానికి మించి జనవరి నాటికి పదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరడంతో రబీలో గ్రాసాల అందుబాటు మరింత పెరిగి వచ్చే ఆర్థిక సంవత్సరంలో పాల దిగుబడి పెరగవచ్చని కూడా నివేదిక పేర్కొంది. ఈ పరిణామాలు పాల సేకరణ ధరలను స్థిరపరచవచ్చన్న ఆశాభావాన్ని నివేదిక వ్యక్తపరచింది. ఇక ధరల విషయానికొస్తే గతేడాది పాల ధరలు పెంచే విషయంలో దేశంలోని పలు డెయిరీలు పోటీపడ్డాయి. ప్రైవేటు డెయిరీల నుంచి పోటీని తట్టుకునేందుకు అమూల్‌, మదర్‌ డెయిరీలు గతేడాది మే నెలలో పాల గరిష్ఠ చిల్లర ధరను రెండు, మూడు రూపాయల చొప్పున పెంచాయి. ఈ ఏడాది జనవరి చివరి నాటికి చాలా ప్రైవేటు డెయిరీలు లీటరుకు అయిదారు రూపాయల చొప్పున రెండు విడతలుగా పెంచాయి. రైతులకు అందించే ధరలు పెంచేందుకే వినియోగదారులపై భారం మోపాల్సి వచ్చిందని డిసెంబరులో పలు ప్రైవేటు డెయిరీలు ప్రకటించాయి. మళ్లీ ఈ ఏడాది జనవరిలో ధరలు పెంచడంతో పలు సహకార డెయిరీల అమ్మకాలు పడిపోయాయి. ఇదే సమయంలో పాల సేకరణ ధరను ఆశించినంతగా పెంచకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రాసం, దాణా ధరలు ఇతర ఖర్చులు పెరిగిన తరుణంలో పెంచిన ధరలు పాడి రైతుల్ని నష్టాల నుంచి గట్టెక్కించలేకపోయాయి.

పాల ఉత్పత్తి పడిపోతున్న కొద్దీ పోటీలు పడి ధరలు పెంచే ప్రైవేటు డెయిరీలు ఆ పాలను సరఫరా చేసే రైతులకు మంచి ధరలు అందించడంపై దృష్టి పెట్టడం లేదు. తెలంగాణలో విజయ డెయిరీనే ఉదహరిస్తే., డిసెంబరులో లీటరు పాలకు రెండు రూపాయలు, జనవరిలో మూడు రూపాయల చొప్పున ధర పెంచడంతో ప్రస్తుతం లీటరు ధర రూ.47 అయింది. ప్రైవేటు డెయిరీలతో పోలిస్తే కేవలం ఒక్క రూపాయి మాత్రమే ధరలో తేడా ఉండటంతో ఈ కాలంలో పాల ఉత్పత్తుల అమ్మకాలు రోజుకు 3.12 లక్షల లీటర్ల నుంచి ప్రస్తుతం 2.50 లక్షల లీటర్లకు పడిపోయాయి. ఇతర డెయిరీల పాలు 36 లక్షల లీటర్లు అమ్ముడు పోతుండటం గమనార్హం. వేసవిలో ఈ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. పాల పొడి నిల్వలు కూడా పరిమితంగా ఉండటం కలవరపెడుతోంది. డెయిరీ అభివృద్ధి కోసం సదుపాయాలు కల్పించడం, లీటరు పాలకు నాలుగు రూపాయల ప్రోత్సాహం, సబ్సిడీపై 65వేల పాడి పశువుల పంపిణీని ప్రభుత్వం చేపట్టినా విజయ డెయిరీ పరిధిలో పాల సేకరణ పడిపోతోంది.

ప్రస్తుతం దేశంలో నిత్యం 50 కోట్ల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. అయినా అయిదు లక్షల లీటర్లు కొరతగానే ఉంది. దీన్ని అధిగమించేందుకు పాలపొడిని దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని కొన్ని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. అమూల్‌, కేఎంఎఫ్‌ వంటి పెద్ద డెయిరీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దిగుమతులకు అనుమతిస్తే దేశంలో రైతులు దెబ్బతింటారని, ప్రైవేటు డెయిరీల ధోరణి సరికాదని పేర్కొన్నాయి. దేశంలో పాల ఉత్పత్తి గిరాకీకి సరిపడా లేనప్పుడు రైతులకు ధరలు చెల్లించకుండా పాలపొడిని కొనుగోలు చేసి పాలుగా మార్చేందుకు పలు ప్రైవేటు డెయిరీలు ప్రయత్నిస్తున్నాయన్న అపవాదు ఉంది. ఈ కారణంగానే పాలపొడిని దిగుమతి చేసుకోవాలని కోరుతున్నాయనేది అమూల్‌ వంటి డెయిరీల ఆరోపణ. అయితే గుజరాత్‌కు చెందిన డెయిరీల్లో పాల పొడి నిల్వలు అధికంగా ఉండటం వల్లే కేంద్రం పట్టించుకోవడం లేదని పలు ప్రైవేటు డెయిరీలు ఆరోపిస్తున్నాయి. 2018-19లో మిగులు పాల ఉత్పత్తి నమోదవడంతో చాలా డెయిరీలు పాలను పొడిగా మార్చి నిల్వ చేసుకున్నాయి. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలో దేశంలో పాల దిగుబడి తగ్గడంతో కొన్ని ప్రైవేటు డెయిరీలు కొరతను బూచిగా చూపి అమ్మకపు ధరను పెంచడంపై దృష్టి పెట్టాయే కానీ, రైతులకు ధరలు ఇవ్వడానికి మొగ్గు చూపలేదు. కొన్ని డెయిరీలు తమ వద్ద ఉన్న పొడిని పాలుగా మార్చి అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు దండుకుంటున్నాయన్న అపవాదు ఉంది. గడచిన నాలుగు నెలల్లో అమ్మకపు ధరలు పదే పదే పెరగడాన్ని ఇది ధ్రువపరుస్తోందని డెయిరీ రంగ నిపుణులు చెబుతున్నారు.


ఉత్పత్తి పెంచేలా రాయితీలు!
పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు సరిపడా రాబడి లేకపోవడం వల్ల రైతులు పశుపోషణకు దూరమవుతున్నారు. పాల ఉత్పత్తి ఖర్చులో మూడో వంతు మేతకే పెట్టాల్సి రావడం, కూలీల అందుబాటులేక నిర్వహణ ఖర్చులు పెరగడం, కృత్రిమ గర్భధారణ సేవలు లోపించడం, మౌలిక పశువైద్య వసతులు కరవవడం వంటి సమస్యలతో పశుపోషణే వృత్తిగా చేపట్టిన వారెందరో వాటి నుంచి వైదొలిగారు. వీరిలో అధిక భాగం ఆధునిక సాంకేతికతపై ఆధారపడి మౌలిక అంశాలపై అవగాహన లేకపోవడం వల్లే విఫలమయ్యారు. మార్కెట్లో బాగా గిరాకీ ఉన్న పాల ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకుంటూ పాడి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తేనే పరిస్థితులు మెరుగుపడతాయని డెయిరీలు గుర్తించాలి. పెరిగే ఉష్ణోగ్రతల్ని తట్టుకునేలా పాడి జాతులను ఎంపిక చేసుకోవాలి. కరవు పరిస్థితులను తట్టుకునే పశుగ్రాసాలను పెంచడం ముఖ్యం. ఉత్పత్తి పెంచేలా పశుపోషకులకు విరివిగా సబ్సిడీలు అందించాల్సిన అవసరం ఉంది. పశువుల పాకలు, షెడ్లలో వేడిమిని తగ్గించే చర్యల ద్వారా పాల ఉత్పత్తిని తగ్గకుండా చూసుకోవాలి. అధిక ఉత్పాదకత కోసం వాతావరణ మార్పులకు అనుగుణంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల్లో పశువుల పెంపకం చేపడితే మేలు. పాడి పశువులకు సమీకృత దాణాలు, సమతుల ఆహారం అందించడం, మేలు జాతి ఎద్దులు, దున్నల పెంపకం, పరిసరాల పరిశుభ్రత, అధిక పాల దిగుబడికి తోడ్పడే పశుగ్రాసాలను విస్తృతంగా పెంచడం వంటి చర్యలు ఆశించిన రీతిలో పాల దిగుబడుల్ని అందిస్తాయి.


ఉత్పాదకతలో వెనకబాటు

ప్రపంచ పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ పాల సగటు ఉత్పాదకతను మాత్రం పెంచుకోలేకపోతోంది. పాల ఉత్పత్తిలో సాలుసరి వృద్ధి 4.5 శాతంగా ఉంటోంది. ప్రపంచ సగటు 1.8 శాతం. వ్యవసాయంతో పోలిస్తే పశుసంవర్ధక రంగంలోనే వృద్ధి రేటు అధికంగా ఉంది. 2017-18లో దేశంలో సుమారు 17.63 కోట్ల టన్నుల పాలు (ప్రపంచ పాల ఉత్పత్తిలో ఇది 20.12 శాతం వాటా) ఉత్పత్తి చేశాం. తలసరి పాల ఉత్పత్తి 375 గ్రాములుగా ఉంది. 1970లో నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు తీసుకొచ్చిన ఆపరేషన్‌ ఫ్లడ్‌ (పాల వెల్లువ) పథకం వల్లే తరవాత కాలంలో మన దేశం ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా ఎదిగింది. ఒకప్పుడు పాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి నేడు ఎగుమతి చేసే దశకు భారత్‌ చేరుకుంది. దేశంలో పశురంగంపై ఆధారపడిన జనాభా 2.24 కోట్లు. ఇందులో 1.68 కోట్ల మంది మహిళలే కావడం గమనార్హం. వీరంతా చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని కూలీలు. దేశ పాల ఉత్పత్తిలో పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లు తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి. 2019లో పాల ఉత్పత్తి దేశంలో 18.77 కోట్ల టన్నులుగా ఉంది. 2033 నాటికి ఇది 33 కోట్ల టన్నులకు చేరవచ్చని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. అప్పటికి గిరాకీ 29.2 కోట్ల టన్నులు ఉండొచ్చని పాడి పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే దేశంలో పాల ఉత్పత్తిలో స్థిరమైన పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ దేశీయంగా పాల ధరలు మాత్రం అస్థిరంగా ఉంటున్నాయి. కొన్ని ప్రైవేటు డెయిరీలు తాము విక్రయించే పాల ధరలను ఎడాపెడా పెంచేస్తూ లాభాలు దండుకుంటున్నాయి తప్ప రైతుల నుంచి సేకరించే పాలకు మంచి ధరలను అందించడం లేదు. సహకార రంగంలోని డెయిరీలు కొంతమేర రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తుండగా పలు ప్రైవేటు డెయిరీల తీరు ఆక్షేపణీయంగా ఉంది. ఈ ఏడాది మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో దేశంలో పాల దిగుబడి 5-6 శాతం తగ్గవచ్చని ఇది అటూఇటుగా 17.6 కోట్ల టన్నులుగా ఉండొచ్చని ఇటీవల ‘క్రిసిల్‌’ నివేదిక పేర్కొంది. అయితే డిసెంబరు నాటికే పాల ఉత్పత్తి ఆరు శాతం వరకు తగ్గటం గమనార్హం.

- అమిర్నేని హరికృష్ణ

Posted Date: 27-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం