• facebook
  • whatsapp
  • telegram

  వ్యవసాయానికి వాణిజ్య ఒరవడి

* ఎగుమతుల పెంపే లక్ష్యం కావాలి

దేశంలో వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులు పడిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో వీటి ఎగుమతులు నిరుటితో పోలిస్తే రూ.10,842 కోట్ల మేర కోసుకుపోయాయి. ఉల్లిగడ్డలను ఈజిప్ట్‌ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. 2018-19లో రికార్డుస్థాయిలో 11.64 కోట్ల టన్నుల బియ్యం దిగుబడి వచ్చిందని ఘనంగా చాటుకున్నాం. ఏడాది తరవాత అదే బియ్యం ఎగుమతులు ఏకంగా ఎనిమిది లక్షల టన్నుల మేర తగ్గాయి. ఆహార ధాన్యాల దిగుబడులు ఇనుమడిస్తున్నా అంతర్జాతీయ విపణికి ఎగుమతులు ఎందుకు పెరగడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది. దేశ జనాభా ఏటా ఒకటిన్నర శాతం చొప్పున వృద్ధి అవుతున్నా అదేస్థాయిలో ఆహారోత్పత్తులు అందించడం సాధ్యం కావడం లేదు. దేశప్రజలకు తలసరి ఆహార ధాన్యాల లభ్యత పెరగకపోవడమే ఇందుకు తార్కాణం. దేశ అవసరాలకు మించి ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంటేనే ఇతర దేశాలకు ఎగుమతి చేయగలం. అప్పుడే రైతులకు తగిన ఆదాయం లభిస్తుంది. ఎగుమతులు అధికంగా ఉన్న దేశాల్లోనే రైతులకు అధిక ఆదాయం వస్తోంది. ప్రజలకు సరిపడా ఆహారం అందించలేని ఏ దేశంలోనూ రైతుల ఆదాయంలో ఎదుగుదల ఉండటంలేదు. భారత్‌లో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు తగ్గిపోతున్నాయని అంకెలు చెబుతున్నందువల్ల పరిస్థితులు ఎలా మారుతున్నాయనేది చర్చించాల్సి ఉంది.

దిగుబడుల లెక్కల్లో గందరగోళం
కేంద్ర వ్యవసాయశాఖ అధికారికంగా వెలువరించే గణాంకాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు కుటుంబాలు, వారి సంఖ్య ఎంతనే లెక్కలు పక్కాగా లేవు. వీటి సేకరణకు జాతీయస్థాయిలో కార్యదళం (టాస్క్‌ఫోర్స్‌) ఏర్పాటుచేసినట్లు కేంద్రం ఇటీవల పార్లమెంటులో ప్రకటించింది. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ఆరువేల రూపాయలు సాయం అందజేసే ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’(పీఎం కిసాన్‌) పథకాన్ని కేంద్రం అమలుచేస్తోంది. ఈ సొమ్ము ఇవ్వడానికి ఆన్‌లైన్‌లో ఇప్పటికి తొమ్మిది కోట్ల కుటుంబాల లెక్క తేలింది. ఊరూరా పంట విస్తీర్ణాలు, దిగుబడుల అంచనాల లెక్కల్లో ఎంత వాస్తవముందనే సందేహాలూ ముసురుతున్నాయి. భూముల రెవిన్యూ ఖాతాల లెక్కలన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఆ శాఖ వద్ద ఉన్నాయి. పంటలవారీ విస్తీర్ణం లెక్కలను వ్యవసాయశాఖ వారం వారం కేంద్రానికి పంపుతోంది. మార్కెట్లకు అమ్మకానికి వచ్చే పంటల వివరాలు మార్కెటింగ్‌ శాఖ వద్ద ఉంటున్నాయి. ఈ మూడు శాఖలతో సంబంధం లేకుండా అర్థ గణాంకశాఖ నేరుగా క్షేత్రస్థాయిలో పంటల సాగు విస్తీర్ణం, ఉత్పాదకత, పంటలవారీ దిగుబడి అంచనాలను ఏటా నాలుగుసార్లు విడుదల చేస్తోంది. నాలుగు శాఖలు చెప్పే లెక్కల్లో ఏ రెండింటి మధ్య పొంతన లేకపోవడం విచిత్రం. తెలంగాణలో ప్రస్తుత ఏడాది 46.92 లక్షల ఎకరాల్లో పత్తి సాగైందని 4.23 కోట్ల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ తొలుత అంచనా వేసింది. కానీ, ఇంత సరకు మార్కెట్లకు రావడం లేదు. అర్థ గణాంకశాఖ ఇచ్చే దిగుబడుల అంచనాలనే కేంద్ర ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుని అధికారికంగా ప్రకటిస్తోంది. పంటలను మద్దతు ధరకు కేంద్రం కొనాలన్నా ఈ శాఖ ఇచ్చినవాటినే పరిగణనలోకి తీసుకుంటోంది. అర్థ గణాంకశాఖ ఇచ్చిన అంచనాల నివేదిక ప్రకారం ఒక రాష్ట్రంలో ఒక పంట ఎంత దిగుబడి వస్తుందనే లెక్కలో 25 శాతం పంటనే మద్దతు ధరకు కొంటామనే నిబంధనను కేంద్ర వ్యవసాయశాఖ విధించింది. దీనివల్ల ఎక్కువ మంది రైతుల నుంచి మద్దతు ధరలకు పంటలను కొనలేకపోతున్నామని, కొనుగోలు పరిమితిని పెంచాలని, పైగా దిగుబడి లెక్క ఇంకా ఎక్కువగా ఉందని తెలంగాణ వ్యవసాయశాఖ పలు పంటల విషయంలో అధికారికంగానే కేంద్ర వ్యవసాయశాఖకు లేఖలు రాసింది. వ్యవసాయ గణాంకాల్లో స్పష్టత లేదనడానికి, పంటలను మద్దతు ధరకు కొనే విషయంలోనూ ఇబ్బందులు వస్తున్నాయనడానికి ఈ లేఖలే తార్కాణం. కనీసం అర్థ గణాంకశాఖ ఇచ్చే లెక్కల ప్రకారం చూసినా చిల్లర, టోకు మార్కెట్‌ ధరలకు, పంటల దిగుబడులకు మధ్య పొంతనే కుదరడం లేదు. నిరుడు రికార్డుస్థాయిలో దేశంలో 11.64 కోట్ల టన్నుల బియ్యం దిగుబడి వచ్చిందని అర్థ గణాంక శాఖ వెల్లడించింది. 2017-18లో వచ్చిన 11.27 కోట్ల టన్నులకన్నా 37 లక్షల టన్నులు అదనంగా దిగుబడి వచ్చినట్లు ప్రకటించింది. కానీ, దేశంలో ఎక్కడా బియ్యం చిల్లర విపణిలో ధరలు తగ్గలేదు. పైగా 10 శాతం వరకు పెరిగాయి. దిగుబడులు పెరిగితే మార్కెట్‌లో ధరలు పడిపోవాలి. అయినా బియ్యం, పప్పుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే కాలవ్యవధిలో ఇతర దేశాల బియ్యం ఎగుమతులు 1.28 కోట్ల టన్నుల నుంచి 1.20 కోట్ల టన్నులకు తగ్గాయి. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా పండే బాస్మతేతర సాధారణ బియ్యం ఎగుమతులు ఏకంగా 35.83 శాతం(12.18 లక్షల టన్నులు) తగ్గాయి. బాస్మతి బియ్యం ఎగుమతులు స్వల్పంగా పెరగడం వల్ల మొత్తమ్మీద తగ్గుదల ఎనిమిది లక్షల టన్నులకు పరిమితమైంది. కొన్నేళ్లుగా దేశంలో బియ్యం దిగుబడులు బాగా పుంజుకొంటున్నాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. కానీ దేశజనాభా పెరుగుదలకు అనుగుణంగా దిగుబడులు అధికం కానందున ధరలు తగ్గడం లేదు. అందువల్లనే ఇతర దేశాలకు అధికంగా అమ్మలేకపోతున్నాం. పొరుగున ఉన్న చైనా, ఫిలిప్పీన్స్‌ మొదలుకొని సుదూర దేశాలనేకం బియ్యం సహా ఇతర పంటలను కొనడానికి సిద్ధంగా ఉన్నాయి. భారతదేశ జనాభా 2015లో 125.91 కోట్లుండగా 10.54 కోట్ల టన్నుల బియ్యం దిగుబడి వచ్చింది. అంటే తలసరి రోజుకు 186 గ్రాముల బియ్యం లభ్యత ఉంది. 2018 నాటికి దేశ జనాభా 130.28 కోట్లకు చేరగా బియ్యం దిగుబడి 11.15కోట్లకు పెరిగినా దీనివల్ల తలసరి లభ్యత ఇంచుమించు 186 గ్రాములే ఉందని కేంద్రమే తాజాగా వెల్లడించింది. నాలుగేళ్ల వ్యవధిలో తలసరి బియ్యం లభ్యత పెరగకపోవడం విశేషం. జనాభా ఏటా 1.5శాతం చొప్పున పైకి ఎగబాకుతుంటే పంటల దిగుబడులు క్రమేపీ పతనమవుతున్నాయి. దేశంలో అత్యధిక ప్రజలు వినియోగించే గోధుమల లభ్యత తలసరి 2016లో 199.7 గ్రాములుంటే, 2018కల్లా 174.4 గ్రాములకు తగ్గిపోయింది.


బడ్జెట్‌పై ఎన్నో ఆశలు
రైతుల ఆదాయం పెరగాలంటే క్షేత్రస్థాయిలో పటిష్ఠ చర్యలుండాలి. మనదేశంలో మొత్తం 36 రకాల వాతావరణ మండలాలున్నాయి. వాటికి తగిన విధమైన సాగుకు ‘పంటల కాలనీలు’ ఏర్పాటుచేయాలని గతంలోనే రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. నగరాలకు వంద కిలోమీటర్ల పరిధి భూముల్లో కూరగాయలు, పండ్లతోటల సాగు పెంచితే ప్రజలకు పోషకాహారం అందుతుంది. తెలంగాణలో గత ఖరీఫ్‌లో 1.16 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయితే, 46.95 లక్షల ఎకరాల్లో కేవలం పత్తి పంటే వేశారు. ప్రాంతాలవారీగా అనువైన పంటలు సాగుచేస్తే దేశ ప్రజల నిత్యావసరాలు తీర్చడమే కాకుండా, ఇతర దేశాలకు ఎగుమతులు పెంచడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు సరిపడా లేక, ఉత్తర ప్రదేశ్‌ లాంటి సుదూర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. గతేడాది తొలి అర్ధ భాగంలో 19.58 లక్షల టన్నుల తాజా కూరగాయలు ఎగుమతి కాగా, ఈ ఏడాది ఎగుమతులు 10.09 శాతం తగ్గాయి. ఈ ఎగుమతులపైనే ఏటా రూ.7,000 కోట్ల ఆదాయం వస్తోంది. దీన్ని రూ.10 వేలకోట్లకు చేర్చడానికి అవకాశముంది. ఇలా ప్రతి పంటను అమ్ముకోవడం ద్వారా మన వ్యవసాయానికి విదేశీ విపణుల నుంచి ఆదరణ పెరిగే అవకాశం ఉంది. కేవలం ఆయిల్‌పాం అనే ఒకే ఒక పంట ద్వారా ఇండొనేసియా, మలేసియాలు భారత్‌ నుంచి ఏటా రూ.50 వేలకోట్ల ఆదాయం పొందుతున్నాయి. చిన్నదేశమైనా న్యూజిలాండ్‌ రైతులు ప్రపంచ పాల ఉత్పత్తుల విపణిని శాసిస్తున్నారు. చిలీ రైతులు పండ్లు, అర్జెంటీనా రైతులు వంటనూనెను భారత్‌కు అమ్ముతున్నారు. ఆయా దేశాల రైతులు సాగిస్తున్న ఈ తరహా వాణిజ్యాన్ని భారతీయ రైతాంగమూ అందిపుచ్చుకోవాలి. అందుకోసం ఊరూరా ఆహారశుద్ధి పరిశ్రమలు రావాలి. పంటలను గిట్టుబాటు ధరకు కొని శుద్ధి చేసి అమ్మడానికి రైతులతోనే ‘వ్యవసాయ ఉత్పత్తిదారు సంఘాల’(ఎఫ్‌పీఓల) ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహకాలిస్తూ ఉండటం ఆహ్వానించదగిన అంశం. ఈ సంఘాల ఏర్పాటుకు రూ.10 వేల కోట్లను వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలనే ప్రతిపాదన ఉంది. ఈ సంఘాల్లోని రైతులు పండించి, శుద్ధి చేసే ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారించాలి. ఇది సాకారం కావాలంటే రాజకీయ చిత్తశుద్ధి, పటుతరమైన కార్యాచరణ, పర్యవేక్షణ అవసరం.


రైతు ఆదాయం అంతంతమాత్రం
భారత్‌లో రైతు ఆదాయం 2022కల్లా రెట్టింపు చేయాలని నాలుగేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. దీనికోసం ‘సమగ్ర వ్యవసాయ ఎగుమతుల విధానం’ తెచ్చింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు తమ ఎగుమతి విధానాలను రూపొందించాలని సూచించింది. కానీ, పలు రాష్ట్రాలు చురుగ్గా కదలలేదు. తెలంగాణలో విధానపత్రమే బయటకు రాలేదు. కేంద్రం కొత్త విధానం ప్రకటించిన మరుసటి ఏడాది(2019-20) తొలి అర్ధభాగంలోనే వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులు ఏకంగా 14.95 శాతం పడిపోవడం గమనార్హం. ప్రపంచ వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌లో భారతదేశం వాటాను రెట్టింపు చేయాలనేది కొత్త విధానం లక్ష్యం. అంతర్జాతీయ విపణిలో వ్యాపారావకాశాలను మన రైతులకు ఆదాయంగా మార్చాలనేది మరో లక్ష్యం. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన కాలపరిమితి మరో రెండేళ్లలో ముగియబోతున్నా, ఆదాయం పెరిగిన దాఖలాలే లేవు.

- మంగమూరి శ్రీనివాస్‌
 

Posted Date: 27-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం