• facebook
  • whatsapp
  • telegram

  రైతుల గుండెకోత తప్పించేలా...

    ఆంధ్రప్రదేశ్‌లో దాళ్వాగా, తెలంగాణలో యాసంగి పంటగా పిలిచే రబీ సాగులో రైతుల శ్రమ ఫలించి దిగుబడుల్ని కళ్లజూసే తరుణమిది. ‘కరోనా లేకపోతే డ్యాన్స్‌ చేసేవాడిని’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్విగ్నభరితంగా స్పందించే స్థాయిలో, ఈసారి వరి సేద్య విస్తీర్ణం పెరిగింది. వాస్తవానికి అననుకూల వాతావరణంలో దెబ్బతీసిన ఖరీఫ్‌తో పోలిస్తే- తెలుగు రాష్ట్రాలతోపాటు తరతమ భేదాలతో ఇతర చోట్లా రబీ దిగుబడి అంచనాలు కొత్త ఆశలు మోసులెత్తించాయి. ఇనుమడించిన పంట దిగుబడులు ఆర్థిక మాంద్యంతో కుములుతున్న దేశాన్ని సాంత్వనపరచగలవన్న లెక్కలు, కరోనా వైరస్‌ అనూహ్య విజృంభణతో తలకిందులయ్యాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిలో- చేతికి అందివచ్చిన పంటలు నోటికి దక్కుతాయా అన్న శంకలు రైతాంగం కంటికి కునుకు పట్టనివ్వడం లేదు. అటువంటి భయానుమానాల్ని చెదరగొట్టి అన్నదాతల్ని కుదుటపరచాలన్న సంకల్పం కేంద్ర మంత్రివర్గ తాజా భేటీలో ప్రస్ఫుటమైంది. లాక్‌డౌన్‌ మౌలిక స్ఫూర్తికి ఎక్కడా విఘాతం వాటిల్లకుండా పంటల కోత కార్యక్రమం, సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా జిల్లాస్థాయిలో యంత్రాంగ శ్రేణుల మధ్య అర్థవంతమైన సమన్వయం సాకారం కావాలన్నది మేధామథన సారాంశం. సాధారణంగా చలికాలంలో ఉత్తర, పశ్చిమ భారతాల్లో కోతపనుల్లో పాల్గొని రబీ సీజన్‌ చివర్లో పంజాబ్‌, హరియాణా, యూపీ ప్రభృత రాష్ట్రాలకు అసంఖ్యాక శ్రామికులు తిరిగి చేరుతుంటారు. లాక్‌డౌన్‌ ఆంక్షల దృష్ట్యా పెద్ద సంఖ్యలో నూర్పిడి యంత్రాలు మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్లలో ఇరుక్కుపోయాయి. యంత్రాలు, కూలీల తరలింపు ఎప్పటికి సాధ్యపడుతుందో ఓ పట్టాన అంతు చిక్కని దుస్థితి- ఏపుగా పెరిగి కోతకు సిద్ధంగా ఉన్న పంటలు కళ్లాలకు చేరతాయో లేదోనని అసంఖ్యాక రైతుల్ని చింతాక్రాంతుల్ని చేస్తోంది.

    పంట కోతల కాలం అంటే- పొలాలనుంచి విపణి కేంద్రాల వరకు అంతటా జన సందోహ కోలాహలమే. కరోనా కాలంలో అటువంటి దృశ్యాలను పునరావృతం కానివ్వరాదన్న జాగ్రత్త కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రదర్శితం కావడం సహేతుకమే. అమాత్యులు ఏం చెబుతున్నా, క్షేత్రస్థాయి స్థితిగతులు చూడబోతే- కడకు ఈ కసరత్తు ఎలా ఒక కొలిక్కి వస్తుందన్న ప్రశ్న రేకెత్తకమానదు. స్థోమత కలిగిన పెద్ద రైతులు ఇతర రాష్ట్రాలనుంచి కోత యంత్రాలు తెప్పించడంలో నిమగ్నమయ్యారు. యంత్రాలకు, కూలీలకు సైతం రవాణా వ్యయంతో ఛార్జీలు కలిపి తడిసిమోపెడు కావడం సాధారణ రైతాంగానికి మింగుడుపడటం లేదు. రైతులు ఒక చోట గుమిగూడకుండా నివారించేందుకు గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలు ఏర్పరచి, కూపన్ల పద్ధతిలో మద్దతు ధరపై చివరి గింజవరకు వరిని, ఆఖరి కేజీదాకా మొక్కజొన్న కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అందుకోసం రూ. 30వేల కోట్ల నిధినీ ప్రత్యేకించారు! ఇతరత్రా వసతుల పరంగా తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతటా రబీ పంటల సేకరణకు, సన్నాహాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? చాలాచోట్ల తేమ కొలిచే పరికరాలు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, కడకు గోనెసంచులకు తీవ్ర కొరత వెన్నాడుతోంది. ఒక్క తెలంగాణలోనే 20 కోట్ల గోనె సంచులు అవసరమన్న అంచనాల వెలుగులో, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ దృష్ట్యా- వివిధ రాష్ట్రాలకు వాటి సరఫరా ఎప్పటికి ఒక గాడిన పడుతుందో అంతు చిక్కడం లేదు. రబీ దిగుబడుల సక్రమ సేకరణ, రేపటి కోసం సన్నద్ధత జాతి ఆహార భద్రతతో ముడివడిన అత్యంత కీలకాంశాలు. వీటిపై దశాబ్దాలుగా సమర్థ కార్యాచరణ కొరవడటం వ్యవస్థాగత లోపమని చెప్పక తప్పదు. ఇప్పటికే దేశం మునుపెన్నడెరుగని ఆరోగ్య సంక్షోభంతో కిందుమీదులవుతోంది. కొత్తగా ఆహార సంక్షోభం దాపురించకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అజెండాగా పట్టాలకు ఎక్కితేనే జనం తెరిపిన పడతారు!

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని