• facebook
  • whatsapp
  • telegram

  ఆహారాన్ని హరిస్తున్న మాయతెగుళ్లు

* వైరస్‌లతో సాగుకూ తీరని నష్టం

    నాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించిన కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉండటంతో మానవాళి అప్రమత్తమైంది. ఒక దేశం నుంచి ఇతర దేశాలకు, ఇతర ఖండాలకు వైరస్‌లు, తెగుళ్ల వ్యాప్తి కొత్తేమీకాదు. ఇదే చివరిదని అనుకునేందుకూ వీలులేదు. మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు వ్యవస్థలన్నీ తీవ్రంగా స్పందిస్తున్నాయి. అది సహజమే. కానీ, మనుషులు తినే పంటలకు ఇలాంటి తెగుళ్లు, వైరస్‌లు వ్యాపించినప్పుడు- అదే స్థాయిలో ప్రభుత్వాల్లో గానీ, ఇతర వ్యవస్థల్లో గానీ స్పందన కానరావడం లేదు. మూడేళ్ల క్రితం అమెరికా ఖండం నుంచి ఆఫ్రికా దేశాల మీదుగా కత్తెర పురుగు భారత్‌లో పంటలకు సోకింది. ఇప్పుడు మొక్కజొన్న సహా పలు పంటలకు ఈ పురుగు తీవ్ర వినాశకారిలా మారింది. అంతకుముందు ఎన్నో ఏళ్ల క్రితం మలేషియా, ఇండొనేషియా, కోస్టారికా వంటి దేశాల నుంచి మనదేశంలోకి దిగుమతి అవుతున్న ఆయిల్‌పాం మొక్కల నారు నుంచి తెల్లబూజు దోమ వచ్చింది. అదిప్పుడు మామిడి, జామ, వరి వంటి పంటలను కబళిస్తోంది. ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి తెగుళ్లు, వైరస్‌లు చుట్టుముట్టడం ఆధికమైంది. పంటలకు సోకుతున్న తెగుళ్లు, వైరస్‌ల వల్ల, కలుపు మొక్కలతో ఏటా రూ.60 వేలకోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. సగటున 18శాతం దిగుబడిని తెగుళ్ల వల్లే కోల్పోతున్నాం. కొన్ని పంటల్లో ఈ నష్టం గరిష్ఠంగా 32శాతం వరకూ ఉంది. అన్ని రకాల పంటలకు 50 వేల రకాల తెగుళ్లు, వైరస్‌లు వ్యాపిస్తున్నాయి.

మితిమీరిన పురుగుమందుల వాడకం
    ఏటా రెండు కోట్ల టన్నులకు పైగా రసాయనాలను ప్రపంచవ్యాప్తంగా రైతులు పైర్లపై పిచికారీ చేస్తున్నారు. ఇందులో 27శాతం భారతదేశంలోని పంటలపైనే చల్లుతుండటం గమనార్హం. దేశంలో వాడే పురుగుమందుల్లో 50 శాతం పత్తి పంటమీదే వినియోగిస్తున్నారు. వరిపైరుపై 18శాతం మందులు చల్లుతున్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించిన అత్యంత విషపూరిత రసాయనాలను మనదేశంలో యథేచ్ఛగా అమ్ముతున్నారు. పలు బహుళజాతి కంపెనీల ఉత్పత్తులకు మనదేశ పంటలు కల్పతరువులా మారాయి. ఇందువల్లే రసాయన మందుల దిగుమతులకు వెచ్చించే సొమ్ము గత ఆరేళ్లలో ఏకంగా 40 శాతం పెరిగి రూ.10 వేలకోట్లకు చేరింది. ఏ పంటకు ఏ తెగులు లేదా వైరస్‌ సోకితే ఏ మందు చల్లాలనే నిబంధనలు భారత మొక్కల ఆరోగ్య సంరక్షణ మండలి నిర్వచించింది. వాటినెవరూ పాటించడం లేదు. ఏ స్థాయిలోనూ తనిఖీ చేసేవారు లేరు. ఉదాహరణకు ‘గ్లైఫోసెట్‌’ చల్లే సమయంలో దాన్ని పీల్చడం వల్ల రైతులకు క్యాన్సర్‌ వస్తుందని ఇటీవల అమెరికాలోని ఓ న్యాయస్థానం తీర్పులో పేర్కొంది. ఈ మందును తేయాకు తోటల్లో కలుపుమొక్కల సంహారానికి మాత్రమే చల్లాలి. కానీ, పత్తి చేలల్లోనూ దీన్ని వాడుతున్నారు. దీని అమ్మకాలను నిషేధించినా, వాడకం ఆగడం లేదు. దీనివల్ల పేద రైతులు, కూలీలకు క్యాన్సర్‌ సోకుతుందన్న స్పృహ కూడా ఎవరికీ లేదు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులవల్ల మనుషులు, పంటలపై తెగుళ్లు, వైరస్‌లు, రోగాల దాడి అధికంగా ఉంటోంది. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా లేదా తగ్గినా పైర్లపై కీటకాల వ్యాప్తి మరో 10శాతం అదనంగా పెరుగుతుందని ఓ అధ్యయనంలో గుర్తించారు. ఇటీవల ఇండొనేసియాలో గాలిలో తేమ పెరగడంతో ఫంగస్‌ వ్యాప్తి చెంది మిరప పంట దెబ్బతింది. తెలంగాణలో నిరుడు రాత్రిపూట చలి పెరగడంతో వరి పైరు దిగుబడిపై ప్రభావం పడింది. ఇదే పరిస్థితి అనేక దేశాల్లోనూ కనిపిస్తోంది.

పర్యావరణానికి హాని
    ‘లాక్‌డౌన్‌’ ఆంక్షలతో పలు దేశాల్లో పర్యావరణంలో సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. వెనీస్‌ నగరంలో నీళ్లు స్వచ్ఛంగా మారాయి. పంజాబ్‌లోని జలంధర్‌ నగరవాసులకు హిమాలయ పర్వతాలు కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. దిల్లీ సహా పలు నగరాల్లో కాలుష్య మేఘాలు తగ్గి, గాలిలో రసాయనాలు పోయి స్వచ్ఛత పెరిగింది. మనిషి విశృంఖల జీవన విధానాలే పర్యావరణాన్ని కబళిస్తున్నాయని ఈ అనుభవాలు మనకు చాటుతున్నాయి. పంటలపై వ్యాపించే తెగుళ్లు, వైరస్‌లు, కీటకాల నివారణ పేరుతో విచ్చలవిడిగా అత్యంత విషపూరిత రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. కీటకాలు రోగ నిరోధకశక్తిని పెంచుకుని మరింత విజృంభిస్తున్నాయి. రసాయనాలతో పంటలకు మేలు చేసే రైతుమిత్ర కీటకాలూ చనిపోయి పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. ఇప్పటికైనా మనుషులనే కాకుండా పంటలను సైతం కాపాడుకునే దిశలో ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, రైతులు ఆలోచించాలి. కంపెనీలిచ్చే కమీషన్ల కోస కక్కుర్తి పడి రైతులకు అవసరం లేని విషపూరిత రసాయనాలు, ఎరువులను వ్యాపారులు అంటగడుతున్నారు. ఒక పైరుపై కొత్తగా వైరస్‌, కీటకాలు, తెగుళ్లు కనిపిస్తే వాటిపై శాస్త్రీయ అధ్యయనం చేసినవారే ఏ రసాయనం చల్లాలో చెప్పగలరు. గ్రామాల్లో మిడిమిడి జ్ఞానంతో వ్యాపారులు తోచిన రసాయనాలను రైతులకు విక్రయిస్తున్నారు. శాస్త్రీయ పరిజ్ఞానంఉన్న వ్యవసాయాధికారి సూచించిన మందులనే అమ్మేలా చట్టం తేవాలి. విషపూరిత రసాయనాలను చల్లిన తరవాత వారం రోజుల వరకూ పంటను కోసి మార్కెట్‌లో అమ్మకూడదు. అయినా కూరగాయలు, పండ్లను కోసి అమ్మేస్తుండటంతో ప్రజలు అనారోగ్యంపాలవుతున్నారు. పంజాబ్‌ రాష్ట్రంలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరగడానికి రసాయనాలే కారణమని తేలింది. తెలుగు రాష్ట్రాల్లోనూ విచ్చలవిడిగా రసాయనాలను వాడుతున్నారు. పాలకులు రసాయనాల వాడకంపై దృష్టి సారించాలి. క్యాన్సర్‌, జీర్ణకోశవ్యాధులు, చర్మరోగాలు వంటి అనేక రుగ్మతల పాలవుతున్న రైతులు, పేద కూలీల సమస్యలపై దృష్టి సారించాలి. కరోనాపై పోరాడుతున్న మాదిరిగానే పంటల మహమ్మారులపై అందరూ కలసికట్టుగా పోరాడినప్పుడే ప్రజారోగ్యానికి, దేశ ఆర్థిక, ఆహార భద్రతకు పూచీకత్తు లభిస్తుందని గుర్తించాలి.

యథేచ్ఛగా ఉల్లంఘనలు
    మనిషి రోజూ తీసుకునే ఆహారంలో 42శాతం వరకూ వరి బియ్యం, గోధుమ, మొక్కజొన్నలే ఉంటున్నాయి. తెగుళ్లు, వైరస్‌లవ్యాప్తి వల్ల పోషహాకార లభ్యత తగ్గుతుంది. 2050నాటికి పెరిగే జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి పంట దిగుబడులు మరో 50శాతం పెరగాలని ప్రపంచ ఆహార సంస్థ హెచ్చరించింది. తెగుళ్లు, కీటకాలు అదే రీతిలో విస్తరిస్తున్నాయి. తెగుళ్లను తట్టుకుంటుందనే నమ్మకంతో దేశంలో రైతులు బీటీ పత్తిని పెద్దయెత్తున సాగుచేస్తున్నారు. రెండేళ్లుగా ఈ పంటపై గులాబీ రంగు పురుగు వ్యాపించి దిగుబడి తగ్గుతోంది. పురుగు నియంత్రణకు రైతులు వందల కోట్ల రూపాయలు వెచ్చించి రసాయనాలు చల్లుతున్నా ప్రయోజనం లేదు. కలుపు మొక్కలను చంపే విషపూరిత రసాయనం గ్లైఫోసెట్‌ను తట్టుకుని బతికే బీజీ-3 పత్తి వంగడాలను అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీ విడుదల చేసింది. ఈ విత్తనాలను వాణిజ్య విపణిలో అమ్మడానికి భారత ప్రభుత్వం అనుమతించకపోయినా రెండేళ్లుగా దేశవ్యాప్తంగా వాటిని అక్రమంగా అమ్ముతున్నారు. వీటిని అమ్మకుండా చూడాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులను పట్టించుకునేవారే లేరు.
 

- మంగమూరి శ్రీనివాస్‌
 

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం