• facebook
  • whatsapp
  • telegram

  ఏపుగా నకిలీ విత్తన కలుపు

    తొలకరి వానలు మొదలయ్యేసరికి విత్తనాలు సిద్ధం చేసుకోవాల్సిన దశలో, రైతాంగాన్ని ఆందోళనపరచే పరిణామాలు ఈ ఏడాదీ పునరావృతమవుతున్నాయి. చిత్తడి నేలలో అదును పదును తప్పిపోకుండా విత్తుకోవాలన్న రైతన్నల ఆరాటాన్ని ఎడాపెడా సొమ్ము చేసుకునే మోసగాళ్ల సంతతి మళ్ళీ ఎక్కడికక్కడ ఉనికి చాటుకుంటోంది. మంచిర్యాల, కాగజ్‌నగర్‌, షాద్‌నగర్‌లలో నకిలీ పత్తి విత్తనాల నిల్వలు బయటపడిన మర్నాడే- కరీంనగర్‌లోనూ అటువంటి బాగోతమే వెలుగుచూసింది. హైదరాబాద్‌ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు కల్తీ సరకు సరఫరా అవుతున్నదన్న సమాచారంతో- కరీంనగర్‌ పోలీస్‌ బృందం 18 క్వింటాళ్ల మేర నకిలీ పత్తి విత్తనాలను వెలికితీసింది. గత జులైలో ఇదే పనిపై నియుక్తమైన పదహారు టాస్క్‌ఫోర్స్‌ బృందాల దాడుల్లో- ఏపీ, మహారాష్ట్రలనుంచి తెలంగాణ నలుమూలలకు రైళ్లలో నకిలీ విత్తనాల సరఫరాల లోగుట్టుమట్లు రట్టయ్యాయి. గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, అనంతపురం జిల్లాల్లో నాసి నకిలీ విత్తన దందాపై కొన్నేళ్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఉత్పాతం కాదు. కిలో సుమారు నూటపాతిక రూపాయల చొప్పున విక్రయించాల్సిన విత్తుల్ని రూ.200పైన అమ్ముతున్నారన్న ఓ రైతు లిఖితపూర్వక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లూథియానా (పంజాబ్‌) పోలీసుల సోదాల్లో నకిలీల భారీ రాకెట్‌ తాజాగా బహిర్గతమైంది. రాష్ట్రాల ఎల్లలు దాటి కేటుగాళ్ల విజృంభణ పెచ్చరిల్లుతున్నదనడానికి గత నెలలో కర్ణాటకలోని ధార్వాడ్‌, బళ్లారి, హావేరి ప్రాంతాల్లో రూ.10కోట్ల కల్తీ సరకు పట్టుబడటమే దృష్టాంతం. నకిలీ విత్తన వ్యాపారుల భరతం పడతామంటూ ఎవరేం చెబుతున్నా, దేశంలో ఈ వార్షిక విషాదం పునరావృతమవుతూనే ఉంది!
    ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల పేర్కొన్నట్లు- కల్తీ విత్తన వ్యాపారులు అక్షరాలా రైతు హంతకులు. నకిలీ విత్తన వ్యాపారాన్ని నూటికి నూరుశాతం అరికట్టాలనడంపై భిన్నాభిప్రాయానికి తావే లేదు. పీడీ చట్టం కింద వాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టాల్సి ఉందనీ ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి దేశంలో 1966 సంవత్సరం లగాయతు విత్తన నాణ్యతకు సంబంధించి నిబంధనలు, సవరణలు, విధి నిషేధాలు లెక్కకు మిక్కిలి పోగుపడి ఉన్నాయి. వాటి స్థానే పటిష్ఠ శాసన నిర్మాణాన్ని లక్షించిన బిల్లు పదహారేళ్లుగా ప్రతిపాదనల దశలోనే నలుగుతోంది. ఇప్పటికీ దేశీయంగా నాణ్యమైన విత్తనాల అందుబాటుకు సరైన భరోసా అన్నది లేదు. రైతు నష్టపోతే విధిగా పరిహారం అందుతుందన్న దిలాసా లేదు. విత్తనాలపై పరిశోధనలకు మౌలిక సదుపాయాలు, మేధా హక్కులు తదితర సాంకేతిక అంశాలతో ఏమాత్రం నిమిత్తం లేకుండా కంపెనీలు నెలకొల్పి విత్తన వ్యాపారంలోకి వచ్చేస్తున్నవారెందరో. మరోవైపు, కాసుల వేటే లక్ష్యంగా చచ్చుపుచ్చు విత్తుల్ని మేలిమి రకంగా భ్రమింపజేస్తూ పొలాల్లో విపత్తులు సృష్టిస్తున్నవాళ్లు మరెందరో! పంటల్ని నాశనం చేసే మిడతల దండును తిప్పికొట్టడానికి వివిధ రాష్ట్రాలు సమాయత్తమవుతున్నాయి. నకిలీ విత్తనాల రూపేణా ఏటా చుట్టుముడుతున్నది అటువంటి మహోత్పాతమే. నాసి విత్తనాలు కొన్న రైతులు ఇతరత్రా పెట్టుబడి వ్యయాన్నీ నష్టపోయి అప్పుల్లో కూరుకుపోతుండగా- ఆహారోత్పత్తిలో కుంగుదల కారణంగా దేశార్థికానికీ కడగండ్లు దాపురిస్తున్నాయి. అందుకు కారకులవుతున్నవాళ్లను క్రూరమైన నేరగాళ్లుగా పరిగణించి కఠినాతికఠినంగా దండించాల్సిందే. మరెవరూ నకిలీ విత్తనాల తయారీ జోలికి పోకుండా, ఆ ఆలోచన వస్తేనే హడలెత్తిపోయేలా పకడ్బందీ చట్టానికి రూపుదిద్ది- దేశమంతటా సత్వరం అమలు జరపాలి. నాసి విత్తనాలవల్ల సాగుదారులు నష్టపోయిన పక్షంలో సంస్థను, నాణ్యతను ధ్రువీకరించిన అధికారుల్ని సైతం తక్షణం శిక్షించే ఏర్పాట్లతోనే- పంటపొలాల్లో సంక్షోభాలు ఉపశమించి, పరిస్థితి కుదుటపడుతుంది!

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం