• facebook
  • whatsapp
  • telegram

అపార అవకాశాలతో ముందడుగు

భారత్‌-ఒమన్‌ వాణిజ్య బంధం

భారత పశ్చిమాసియా విధానంలో ఒమన్‌దే కీలక భూమిక. ఒమన్‌తో ఎన్నో ఏళ్లుగా భారత్‌కు వాణిజ్య సంబంధాలున్నాయి. 1955లో దౌత్య సంబంధాలు ఏర్పడగా, 2008లో వ్యూహాత్మక భాగస్వాములుగా మారాయి. ఒమన్‌లో దాదాపు ఆరు లక్షలకుపైగా ప్రవాస భారతీయులు వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. ఇటీవల ఒమన్‌ వాణిజ్య శాఖ మంత్రి బిన్‌ మహమ్మద్‌ యూసఫ్‌ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం భారత్‌లో పర్యటించింది. ఉభయదేశాల మధ్య ప్రాధాన్య వాణిజ్యానికి సంబంధించి అధ్యయనాన్ని నిర్వహించాలని సంయుక్త మండలి సమావేశంలో ప్రతినిధి బృందాలు నిర్ణయించాయి. దీనివల్ల ఉభయుల మధ్య జరిగే వాణిజ్యంలో పలు ఉత్పత్తులకు సుంకాలను తగ్గించే అవకాశం ఉంది. వాణిజ్యపరంగా మన దేశానికి ఒమన్‌ 31వ వాణిజ్య భాగస్వామి. ఆరోగ్యం, ఔషధాలు, గనులు, పర్యాటకం, టెలికమ్యూనికేషన్లు, ఇంధన వనరులు, నౌకాయానం, స్థిరాస్తి తదితర రంగాల్లో ఉభయ దేశాల్లో పెట్టుబడులకు పారిశ్రామిక వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం 2021 ఆర్థిక సంవత్సరంలో 540 కోట్ల డాలర్లు ఉండగా, 2022లో 994 కోట్ల డాలర్లకు పెరిగింది.

ఒప్పందాలతో బలోపేతం

ఇటీవల రెండు దేశాల సంయుక్త సమావేశంలో భాగంగా జరిగిన చర్చల్లో పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాలు కుదిరాయి. గల్ఫ్‌ ప్రాంతంలో ఒమన్‌ భారత్‌కు కీలకమైన వ్యూహాత్మక, వాణిజ్య భాగస్వామి అని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. ఒమన్‌లో భారత్‌కు చెందిన నాలుగు వేలకు పైగా కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ అక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నాయి. ఒమన్‌లోని సొహర్‌ నౌకాశ్రయంలో పలు భారతీయ కంపెనీలు వివిధ వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రెండు దేశాలు సంయుక్తంగా చేపట్టిన ఒమన్‌ ఇండియా ఎరువుల కంపెనీ నుంచి ఉత్పత్తి అవుతున్న యూరియా ఎక్కువభాగం భారత్‌కు ఎగుమతి కావడం దేశీయ వ్యవసాయ రంగానికి ఉపయుక్తమే. వాణిజ్యం, సాంకేతికత, పర్యాటక రంగాల పురోభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. భారత పారిశ్రామికవేత్తలు ఒమన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మరింతగా ముందుకు రావాలంటూ ఆ దేశ వాణిజ్యమంత్రి పిలుపివ్వడం అంతర్జాతీయంగా భారత్‌కున్న కీలక స్థానాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. ఇరుదేశాల వాణిజ్య మండలి సమావేశంలో భారత్‌ నుంచి వచ్చే ఔషధ పరిశ్రమల రిజిస్ట్రేషన్‌కు ఫాస్ట్‌ట్రాక్‌ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. సేవారంగం, ఆహార భద్రత, పునరుత్పాదక వనరులు, అంకురాలకు సంబంధించి విభిన్న రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకునేందుకు తగిన వ్యూహాలు రూపొందించాలని భారత్‌ కోరింది. ఏడాది క్రితం ఒమన్‌ విజన్‌-2040 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి చేయూతనిచ్చేందుకు భారత్‌ నుంచి భారీయెత్తున పెట్టుబడులను ఆహ్వానించింది. దివంగత ఒమన్‌ అధ్యక్షుడు ఖబూస్‌ బిన్‌ సైద్‌ భారత్‌తో సన్నిహత సంబంధాలకు ఎంతగానో కృషి చేశారు. ఆయన శాంతియుత సేవలకు భారత ప్రభుత్వం 2019లో గాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక చేయడం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో అక్కడి నుంచి గోధుమల ఎగుమతులు ఒమన్‌కు ఆగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయంగా గోధుమలను ఆ దేశానికి సరఫరా చేసేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. ఒమన్‌ ఆహార భద్రతకు సంబంధించి ఎలాంటి సవాళ్లు ఎదురైనా అండగా ఉంటామని దిల్లీ హామీ ఇచ్చింది.

పరస్పర సహాయ సహకారాలు

ఉక్రెయిన్‌పై రష్యా దాడితో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. చమురు దిగుమతులపై ప్రధానంగా ఆధారపడిన భారత్‌కు ఈ పరిణామాలు మరింత ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. ఒమన్‌తో సంబంధాలను  బలోపేతం చేసుకోవడంద్వారా అక్కడి నుంచి చమురు దిగుమతులను పెంచుకునే అవకాశాలను భారత్‌ పరిశీలిస్తోంది. ఒమన్‌తో మన దేశ త్రివిధ దళాలు కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల వైమానిక దళాలు జోధ్‌పుర్‌లో విన్యాసాలు నిర్వహించాయి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో సముద్ర దొంగల బెడద నివారణకు భారత గస్తీ నౌకలకు ఒమన్‌ నౌకాశ్రయాలు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఇరాన్‌, ఒమన్‌లోని నౌకాశ్రయాలు భారత దళాలకు చేయూతనిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కరోనా మహమ్మారి తగ్గుతున్న క్రమంలో అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పుంజుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు ఆహార భద్రత, రవాణా రంగాలపై కీలక దృష్టి పెట్టాయి. భారత్‌- ఒమన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోవచ్చు. వివిధ రంగాల్లో పరస్పర అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి. భారత్‌ ఇలాంటి అవకాశాలన్నింటినీ సరైన రీతిలో అందిపుచ్చుకొంటూ అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు మార్గం సుగమం చేసుకోవచ్చు.  

- కె.శ్రీధర్‌
 

Posted Date: 19-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం