• facebook
  • whatsapp
  • telegram

ఉపసంహరణే ఉత్తమం!

కలుపు ఏరివేతతో సేద్యానికి శ్రీకారం చుట్టే రైతు, తనకు చెరుపు చేసే శాసనాల్ని పెరికిపారేయాలంటూ దేశ రాజధానిలో కదన భేరి మోగిస్తున్నాడు. 40 రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళన 1988లో మహేంద్ర సింగ్‌ తికాయత్‌ సారథ్యంలో సఫలీకృతమైన బోట్‌క్లబ్‌ మహోద్యమాన్ని స్ఫురణకు తెస్తోందనడంలో సందేహం లేదు. ‘మాకోసం కాదు, మా బిడ్డల కోసం’ అంటూ కదం తొక్కుతున్న కర్షకలోకంలో భాజపా పాలిత రాష్ట్రాల రైతులూ పాల్పంచుకొంటున్నారు. కనీస మద్దతు ధరల విధానాన్ని కొసాగిస్తామని, వివాదాస్పద చట్టాల్లో ఎనిమిది సవరణలు చేస్తామని నాలుగో విడత సంప్రదింపుల్లో కేంద్రం ప్రతిపాదించినా- ససేమిరా అన్నదే రైతు సంఘాల సమాధానం. ‘ఒకే భారత్‌-ఒకే వ్యవసాయ మార్కెట్‌’ అంటూ కేంద్రం చేసిన శాసనాల్ని పూర్తిగా ఉపసంహరించాల్సిందేనన్నది రైతుల ఏకీకృత నినాదం! కొవిడ్‌ సంక్షోభంతో కకావికలమైన ఆర్థిక రంగానికి నవోత్తేజం కల్పించేందుకంటూ మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన దాదాపు రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీలోనే వ్యవసాయ మార్కెట్‌ సంస్కరణల ప్రతిపాదనలూ కొలువుతీరాయి. విస్తృత సంప్రదింపుల అవసరాన్ని విస్మరించి వాటిని ఆర్డినెన్సులుగా వెలువరించిన కేంద్రం- పార్లమెంటులో బిల్లుల్ని నెగ్గించేటప్పుడు మిత్రపక్షాల్నీ విశ్వాసంలోకి తీసుకోలేదు. రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనా, వాటినీ సంప్రదించనేలేదు. అంతర్రాష్ట్ర వాణిజ్యం తన పరిధిలోనిదంటూ ఆ ప్రకారం ‘వ్యవసాయ సంస్కరణ’లకు చట్ట రూపమిచ్చిన ఎన్‌డీఏ సర్కారు- మంచీ చెడులపై రైతు సంఘాలతోనూ చర్చించలేదు. మండీలకు ముంతపొగ పెట్టే చట్టాలు- బడుగు రైతు బతుకును కార్పొరేట్ల దయాధర్మానికి వదిలేస్తాయని రైతులోకం భీతిల్లుతోంది. ప్రపంచీకరణకు గవాక్షాలు తెరిచిన దాదాపు మూడు దశాబ్దాల్లో బడుగురైతు బాగుకు భరోసా ఇచ్చే ఏ సంస్కరణా పొలంబాట పట్టని దేశం మనది. అన్నదాతల పొట్టకొట్టే కరకు చట్టాల్ని ఉపసంహరించాలన్న రైతు సంఘాల డిమాండులో కర్షకుల అభిమతమే కాదు, జాతి హితమూ దాగుంది
 

సోమరి సత్రాలుగా మారిన యంత్రాంగాల్ని వదిలించుకోవడం, అంతర్జాతీయ పోటీకి దీటుగా వస్తూత్పాదనలు, సేవల రంగాల్ని పరిపుష్టం చేయడం, జాతి ఆహార భద్రతకు ఆసరాగా నిలిచే రైతుకు అన్నిందాలా తోడ్పాటునందించడం వంటివన్నీ దేశ దేశాల ఆర్థిక సంస్కరణల అర్థం, పరమార్థం. ఐరోపా సంఘంలో కమతాల సగటు పరిమాణం 14 హెక్టార్లు. అదే అమెరికాలో 170 హెక్టార్లు కాగా ఇండియాలో అది 1.16 హెక్టార్లు! ఈ ఏడాది అమెరికా వ్యవసాయ రంగానికిస్తున్న సబ్సిడీలు 4600 కోట్ల డాలర్లు. అదే ఐరోపా సంఘంలో వెల్లువెత్తనున్న రాయితీలు 5400 కోట్ల యూరోలు! కాయకష్టాన్ని కాస్తంత అదృష్టాన్ని నమ్ముకొని, చీడపీడల్ని ప్రకృతి ఉత్పాతాల దాడుల్ని తట్టుకొంటూ, గిట్టుబాటు కాని సేద్యం తన ఆశలకు ఉరి బిగిస్తుంటే, మౌనంగా చితికిపోతున్న భారతీయ రైతు- ఏనాడైనా లాభదాయక ధరకోసం ఒక్కుమ్మడిగా పిడికిలెత్తాడా? లేదే! సేద్యరంగ సముద్ధరణ కోసమంటూ 70కిపైగా విశ్వవిద్యాలయాలు మరెన్నో పరిశోధనా సంస్థల్ని నెలకొల్పినా, వాటి నిష్పూచీతనం తననెంతగా కుంగదీస్తున్నా రైతు ఏనాడైనా ఆగ్రహించాడా? లేదే! అరకొరగానైనా కేంద్రం ప్రకటించే కనీస మద్దతే ఆశారేఖగా ఉంటే, అది కూడా కనుమరుగవుతుందంటే- రైతు తట్టుకోలేకపోతున్నాడు. 2050నాటికి వాతావరణ మార్పుల కారణంగా ఆహార కొరత దాపురించనుందన్న అధ్యయనాల నేపథ్యంలో అడుగడుగునా రైతు శ్రేయానికి పూచీపడుతూ జాతి ఆహార భద్రతకు ముందస్తు వ్యూహరచన సాగాల్సిన సమయమిది. ‘సబ్‌కా సాత్‌- సబ్‌ కా వికాస్‌’ అన్న మోదీ ప్రభుత్వం ‘సబ్‌ కా విశ్వాస్‌’ను నిరుడు జోడించింది. ‘సబ్‌ కా వికాస్‌’ అంటూ ఏకపక్షంగా తెచ్చిన చట్టాలు కర్షకుల విశ్వాసం చూరగొనడంలో విఫలమైనందున- ఏమాత్రం ప్రతిష్ఠకు పోకుండా వాటిని ఉపసంహరించడమే, ‘సబ్‌ కా సాత్‌’ స్ఫూర్తిని చాటగలిగేది!
 

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం