• facebook
  • whatsapp
  • telegram

రైతు సంక్షేమంతోనే ఆహార భద్రత

పథకాల అమలులో చిత్తశుద్ధి అవసరం
 

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనలు- కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలపై కర్షకుల్లో నెలకొన్న భయాలకు అద్దం పడుతున్నాయి. గ్రామీణ యువత ఉపాధిÅకి కీలకమైన వ్యవసాయ రంగాన్ని పునరుత్తేజ పరచాల్సిన ఆవశ్యకతనూ చాటుతున్నాయి. వ్యవసాయరంగ సమస్యలు, రైతు ఆదాయం రెట్టింపు చేసే దిశగా చర్యలు, నియంత్రిత సాగు విధానం అమలు; పీఎం కిసాన్‌, రైతుబంధు, కలియావంటి పథకాల అమలు తీరుపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా సుమారు 15శాతం. దేశంలోని 55శాతానికి ఉపాధిని అందిస్తూ ఆర్థికవృద్ధి, ఆహార భద్రతలో కీలక భూమిక పోషిస్తోంది.
 

అడుగడుగునా సంకటాలే!
ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు కాలం చెల్లడం, జనాభా పెరుగుదలవంటి కారణాలతో వ్యవసాయ భూమి చిన్న కమతాలుగా రూపాంతరం చెందింది. చిన్న సన్న కారు రైతులు, రుతుపవన ఆధారిత వ్యవసాయంలో నిమగ్నమయ్యారు. కనీస మద్దతు ధర, సాగులో యాంత్రీకరణవంటి విషయాలపై అవగాహన లేకపోవడం- రుణ సదుపాయం లభించక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం వల్ల రైతులు ఆదాయం, ఉత్పత్తిపరంగా ప్రగతి సాధించలేకపోతున్నారు. రసాయన ఎరువుల వాడకం పెచ్చుమీరింది. దానివల్ల నేలలో సారం తగ్గడంతో పాటు ఉపరితల నీటి కాలుష్యమూ పెరిగింది. వాతావరణంలో మార్పులవల్ల ప్రకృతి విపత్తులు పెచ్చరిల్లుతూ పంటలు నాశనమవుతున్నాయి. ఎరువులు, విత్తనాల కొనుగోలు నిమిత్తం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడంవల్ల రైతులు అప్పుల ఊబిలో కురుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి దాపురిస్తోంది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌, జాతీయ ఆహార భద్రత మిషన్‌, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, పీఎం కుసుమ్‌ వంటి పథకాల్లో పలుకారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పొందలేకపోతున్నాయి. ప్రధానమంత్రి పంటల బీమా ఝార్ఖండ్‌, తెలంగాణవంటి రాష్ట్రాల్లో అమలు కావడం లేదు.
 

జిల్లా స్థాయిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు తగిన సలహాలు అందించి, ప్రణాళికాబద్ధమైన పంట సాగును ప్రోత్సహించాలి. గిరాకీ, సరఫరాలను సమన్వయ పరచడం ద్వారా రైతుకు మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. భూసార పరీక్షలు నిర్వహించి ఏ నేల ఏ పంటకు అనువైనదో రైతులకు తెలియజేయాలి. సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన పెంచాలి. నూతన సాగు పద్ధతులను ప్రోత్సహించాలి. నీటి నిర్వహణలో బిందు, తుంపర సేద్యాల ప్రాధాన్యాన్ని తెలియజెప్పాలి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్న డిజిటల్‌ సేవలను కర్షకులు వినియోగించుకునేలా వారికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనివల్ల సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరిగి, పంట ధరల విషయంలో రైతులకు అవగాహన ఏర్పడుతుంది. వ్యవసాయ రుణాల ప్రక్రియను సులభతరం చేసి- సకాలంలో అందించాలి. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులపై రైతులకు అవగాహన కల్పిస్తూ, వాటిని ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలి. సరఫరా గొలుసు మౌలిక సౌకర్యాలను రైతులకు అందుబాటులోకి తెస్తే- పంట నష్టాలను నివారించవచ్చు. వ్యవసాయ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా సేంద్రియ ఉత్పత్తులను పండించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతుల రంగంలో కర్షకులు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సహకార సాగు విధానాల ద్వారా రైతుల ఆదాయం పెంచవచ్చు.
 

ఆహారశుద్ధి పరిశ్రమతో మేలు
ఆహార శుద్ధి పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ నిరుద్యోగితను తగ్గించవచ్చు. ఈ పరిశ్రమ ద్వారా దేశీయ అవసరాలే కాకుండా, ఎగుమతులూ ఊపందుకునే అవకాశం ఉంది. తద్వారా విదేశ మారక ద్రవ్యం పెరుగుతుంది. గ్రామీణ వలసలకూ అడ్డుకట్ట వేయవచ్చు. ఆహారశుద్ధి పరిశ్రమ ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో పరిశోధన అభివృద్ధికి ప్రాముఖ్యం పెరుగుతుంది. ఇది గ్రామీణానికి ఆర్థికంగా ఊతమిచ్చే పరిణామం. రైతులు వాణిజ్య దృక్పథంతో సాగును కొనసాగించినట్లయితే వారి ఆదాయం రెట్టింపు కావడం అందుకోలేని లక్ష్యమేమీ కాదు. భారత ఆర్థిక సామాజిక అభివృద్ధిలో రైతుల కృషిని అభినందిస్తూ... సమకాలీన చట్టాలపై అవగాహన కల్పిస్తూ, ఉత్తమ రైతులను ప్రోత్సహిస్తూ రైతు సాధికారతను సాధించవచ్చు. నూతన సాంకేతికత వినియోగంపై అవగాహన సదస్సులను నిర్వహిస్తూ- రైతుల్లో పరిజ్ఞానాన్ని పెంచాలి. వ్యవసాయ వర్సిటీలు, విద్యాసంస్థల సంఖ్యను పెంచాలి. పాడి, ఆహార శుద్ధి సంస్థల స్థాపన గొలుసు సరఫరా వ్యవస్థను ప్రోత్సహించాలి. వ్యవసాయ ఉత్పతులకు విలువను జోడించడం, వాటిని చక్కగా ప్యాక్‌ చేసి విక్రయించడం వంటి ఆర్జిత విధానాలపై కర్షకుల్లో అవగాహన పెంచాలి. రాజకీయాలకు అతీతంగా రైతు సాధికారత దిశగా చిత్తశుద్ధితో పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. అమలులో ఎదురయ్యే లోటుపాట్లను అంచనా వేస్తూ పరిష్కారాల కోసం ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. విధానపరమైన లోపాలను సవరించుకుంటూ, నిరంతరం రైతుల సంక్షేమం దిశగా కృషి చేసినట్లైతే అన్నదాతల ఆదాయాన్ని పెంచడంతోపాటు- ఆహార ఆర్థిక భద్రతనూ సాధించవచ్చు!
 

- డాక్టర్‌ ఎం.బుచ్చయ్య 
(రచయిత- వాణిజ్య శాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యులు)

 

Posted Date: 21-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం