• facebook
  • whatsapp
  • telegram

రైతుకు ధీమా కల్పించని బీమా

పీఎంఎఫ్‌బీవైతో రక్షణ అంతంతే

ప్రపంచంలోనే అత్యంత భారీ పంటల బీమా పథకాల్లో ఒకటైన ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)’ 2016 ఫిబ్రవరిలో ప్రాణం పోసుకుంది. బీమా కవచంతో పంట నష్టాల నుంచి రైతుకు రక్షణ కల్పించడమే దీని ధ్యేయం. రైతులు చెల్లించే ప్రీమియం అతి తక్కువగా ఉండేలా రాయితీలు కల్పిస్తూ పథకాన్ని రూపుదిద్దారు. ఖరీఫ్‌లో వేసే పంటలకు రెండు శాతం, రబీలో పండించే ఆహార ధాన్యాలు, నూనె గింజల పంటలకు 1.5 శాతం నామమాత్రపు ప్రీమియం నిర్ణయించారు. వార్షిక వాణిజ్య పంటలకు వ్యవసాయదారులు చెల్లించాల్సిన గరిష్ఠ ప్రీమియం అయిదు శాతానికి మించి లేదు. వాస్తవ ప్రీమియం రేట్లకు రైతు చెల్లించే వాటికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని కేంద్రం, రాష్ట్రం చెరిసగం భరించాలి. ప్రతికూల వాతావరణం, చీడపీడలు, కోతల అనంతర నష్టాలు వంటి విభిన్నమైన నష్టభయాల నుంచి రక్షణ నిమిత్తం బీమా సదుపాయం లభిస్తుంది. ప్రాంతం వారీగా పంట నష్టం అంచనా వేస్తారు. ప్రధాన పంటలకు గ్రామ పంచాయతీ ప్రాంతాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు.

రాష్ట్రాల వెనుకంజ
ఖరీఫ్‌, రబీ రెండింటికీ కలిపి 2017-18 ఆర్థిక సంవత్సరంలో అయిదు కోట్లకు పైగా వ్యవసాయదారులు పీఎంఎఫ్‌బీవై కింద నమోదయ్యారు. తొలి బీమా పథకాలు అందుబాటులోకి వచ్చిన 2015తో పోల్చితే వీరి సంఖ్య దాదాపు 40 శాతం అధికం. అయితే, రాష్ట్రాల వ్యాప్తంగా ఇదెంతవరకు పకడ్బందీగా అమలవుతోందనే అంశంపై అనుమానాలున్నాయి. మరోవైపు, కొన్ని రాష్ట్రాలు ఈ పథకం నుంచి వైదొలగుతున్నాయి. బీమా సంస్థలు అసాధారణంగా రూ.4,500 కోట్ల ప్రీమియం డిమాండు చేస్తున్నాయని చెబుతూ గుజరాత్‌ ఇప్పటికే తప్పుకుంది. సీఎం విజయ్‌ రూపాని కేంద్ర పథకం స్థానంలో ముఖ్యమంత్రి కిసాన్‌ సహాయ్‌ యోజన పథకాన్ని రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేశారు. పైసా ప్రీమియం వసూలు చేయకుండా రైతులందరినీ అందులో చేర్చి 2020 ఖరీఫ్‌ సీజనుకు రూ.1700-1800 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించింది. పంజాబ్‌ అసలెన్నడూ పీఎంఎఫ్‌బీవై అమలు చేయలేదు. చాలా రాష్ట్రాలు తాము దీనినుంచి వైదొలగుతున్నట్లు ఈ ఏడాది ఆరంభంలోనే కేంద్రానికి లేఖలు పంపించాయి. పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలు తమ వంతు వాటా ప్రీమియం చెల్లించడంలో విపరీత జాప్యం చేశాయి. దీంతో రైతాంగం బీమా పరిహారం పొందే వీల్లేకుండా పోయింది. అన్ని చెల్లింపులూ సవ్యంగా ఉన్న రాష్ట్రాల్లో బీమా సంస్థలు కొర్రీలు వేస్తున్నాయి. 2019 సీజనులో కర్షకులు క్లెయిము చేసిన దాంట్లో మూడో వంతు మాత్రమే బీమాగా చెల్లించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ఇలా నీరుగారిపోయి చివరకు రైతులకన్నా బీమా కంపెనీలే అధిక లబ్ధి పొందుతున్నాయన్న భావనకు దారితీసింది. ఇలాంటి పరిణామాలు- అధికభాగం కుటుంబాలకు వ్యవసాయమే ఆధారంగా ఉన్న ఈ దేశంలో పేదరికంపై పోరాడుతున్న కర్షకులకు సంపూర్ణ మద్దతు అందించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే పంటల బీమా పథకం పక్కాగా అమలయ్యేలా తగిన విధానం తక్షణమే రూపొందాల్సి ఉంది.

ఎంపిక చేసిన తొమ్మిది రాష్ట్రాల్లో పంటల బీమా పథకం అమలు జరుగుతున్న తీరుపై అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) విద్యాసంస్థ కేంద్ర వ్యవసాయ, రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనం ప్రకారం- దేశవ్యాప్తంగా రైతుల్లో ఈ పథకంపై అవగాహన చాలా తక్కువగా ఉంది. అవగాహన కల్పనలో పశ్చిమ్‌ బంగ పంచాయతీ వ్యవస్థ ముందంజలో ఉండగా, అసోమ్‌లో బ్యాంకులు కీలక పాత్ర వహించాయి. బీమా ఏజెంట్ల పాత్ర చాలా రాష్ట్రాల్లో నామమాత్రంగా ఉంది. రాతకోతల పనికి పట్టే సమయం చాలా ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించాలని రైతులు కోరుతున్నారు. పరిహారం పెంపు, పారదర్శకత, పశుసంపదకు వాటిల్లే నష్టాన్ని చేర్చడం, పంచాయతీ వ్యవస్థకు అధిక పాత్ర కల్పన వంటి సలహా సూచనలు వారు చేశారు. నష్టం మదింపు అనంతరం ఆరు వారాల్లో పరిహారం చెల్లించేట్లయితే... పీఎంఎఫ్‌బీవై తరహా పథకానికి ఇప్పుడు వర్తింపజేసిన దానికంటే చాలా ఎక్కువగా 10 శాతం వరకు ప్రీమియం చెల్లించడానికి సాగుదారులు సిద్ధంగా ఉన్నారన్నది ఐఐఎం అధ్యయనంలో వెల్లడైన కీలకాంశం.

మార్పులు అవసరం...
మొత్తంగా చూసినట్లయితే- రాష్ట్రాలకు, రైతాంగానికి, బీమా సంస్థలకు అంగీకారయోగ్యంగా ఉండేలా పీఎంఎఫ్‌బీవై పథకంలో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం కనిపిస్తోంది. ఈ బృహత్‌ పథకం రైతు జీవితాలపై ప్రభావం చూపేలా సమర్థంగా అమలు జరగాలంటే- జిల్లా, గ్రామ స్థాయి ఏజెన్సీలనూ ఇందులో భాగస్వాములుగా చేయాలి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసికట్టుగా సమష్టి కృషి సాగించాలి. పంటల బీమా అవసరం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ ఎక్కువ. ఇక్కడి వాతావరణంలో అనిశ్చితి అత్యధికంగా ఉంటోంది. భూగోళవ్యాప్తంగా వాతావరణ మార్పుల ఫలితంగా తరచూ తుపానులు, వర్షపాతంలో అసమానతలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక కరవు పరిస్థితులు... వాతావరణ అనిశ్చితికి కారణమవుతున్నాయి. వీటి నుంచి వ్యవసాయాన్ని రైతులను కాపాడేందుకు- ఒక సమగ్రమైన, సంఘటితమైన, అందరూ భరించగలిగిన పంటల బీమా విధానం రూపొందించుకోవాలి. పీఎంఎఫ్‌బీవై అనేది సదుద్దేశంతో తీసుకొచ్చిన మంచి పథకమే. అయితే ఇది పకడ్బందీగా అమలు కావడం లేదు. దీన్ని మరింత పటిష్ఠంగా రూపొందించి సమర్థంగా అమలు చేయని పక్షంలో, రైతులు రానున్న సంవత్సరాల్లో మరింతగా చితికిపోతారు.

నష్టం మదింపే సవాలు
పంటల బీమా లాభసాటి కాదని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఇందులో ‘మంచి రిస్కుల’ కంటే ‘చెడు రిస్కులు’ ఎక్కువగా ఉన్నాయని భావిస్తూ, ప్రస్తుత విధానం పరిశ్రమకు నష్టదాయకమని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో ప్రీమియం చెల్లించకపోవడం మరొక సమస్యగా మారుతోంది. బీమా కంపెనీలకు తాము 50 శాతం ప్రీమియం చెల్లించడం అంటే... అది దానం చేసినట్లే అవుతుందని అవి భావిస్తున్నాయి. కచ్చితంగా పంటనష్టం మదింపు వేయడం పంటల బీమాలో అసలైన సవాలు. బీమా కంపెనీలు పంటల బీమాను లాభసాటి దీర్ఘకాలిక వ్యాపార అవకాశంగా గుర్తించాలి. దీన్ని అందిపుచ్చుకోవాలంటే, అవి నిపుణులైన కార్యాలయ సిబ్బందిని నియమించుకోవాలి. సమాచార సేకరణ, నష్టాల సత్వర మదింపు వంటి అవసరాల కోసం స్మార్ట్‌ఫోన్లు, రిమోట్‌ సెన్సింగ్‌ పరికరాలు వంటి సాంకేతిక మౌలిక సదుపాయాలపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

- డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌. జ్యోతి కుమార్‌ 
(మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాఖాధిపతి)

 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం