• facebook
  • whatsapp
  • telegram

యాంత్రీకరణతో సాగుకు దన్ను

ఆహార గిరాకీని తీర్చేందుకూ అవసరమే...

మానవ పరిణామ క్రమం అభివృద్ధి చెందినట్లే... వ్యవసాయం కూడా ఎన్నో దశలను చవి చూసింది. వేటతో జీవితాన్ని ప్రారంభించిన మానవుడు తరవాత ఆహారం కోసం పంటలు పండించడం నేర్చుకున్నాడు. అనంతరం వాణిజ్య పంటలనూ సాగు చేశాడు. పోడు వ్యవసాయాన్ని వదిలిపెట్టి స్థిర వ్యవసాయం వైపు అడుగులేశాడు. ఆధునికయుగంలో వచ్చిన మార్పులు వ్యవసాయ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. వివిధ దేశాలు యాంత్రీకరణతో సాగును కొత్తపుంతలు తొక్కించాయి. వ్యవసాయ యాంత్రీకరణలో మనదేశం ఇప్పుడిప్పుడే ముందుకు పోతోంది. 1960ల్లో వచ్చిన హరిత విప్లవం యాంత్రీకరణకు నాందీవాచకంగా నిలిచింది. నేటికీ దేశ వ్యవసాయరంగం అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రకృతి విపత్తులే కాకుండా పెట్టుబడి, సాగునీరు తదితర వ్యవస్థాగత సమస్యలనూ రైతులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు ప్రస్తుతం కూలీల సమస్య వారిని పట్టిపీడిస్తోంది.

పనులు సులభతరం

సాగులో ఖర్చులను తగ్గించేందుకు యాంత్రీకరణ ఉత్తమ పరిష్కారం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు ఇది ఊతమిస్తుంది. పంటల ఉత్పాదకతలో చైనా, జపాన్‌ దేశాలు ముందు వరసలో ఉన్నాయంటే అందుకు యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ప్రధాన కారణాలని చెప్పాలి. పంట దిగుబడి బాగా రావడానికి నాణ్యమైన విత్తనాలు, పైరును ఆశించే చీడపీడలను సమర్థంగా నివారించే మందులు అవసరం. నీటి వసతి ఎంత ముఖ్యమో సరైన సమయంలో విత్తనాలు వేయడం, పంట నూర్పిడి సైతం అంతే ముఖ్యం. ఈ పనులన్నీ చేసేందుకు కూలీలు అందుబాటులో ఉండాలి. తుపానుల సమయాల్లో ముందస్తు సమాచారం తెలిసినా కొన్ని సందర్భాల్లో కూలీల కొరత వల్ల పంటల్ని కాపాడుకోలేని పరిస్థితి నెలకొంటోంది. పంట అన్ని దశల్లోనూ యంత్రాలను వాడే వీలుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది. పత్తి, చెరకు, మిర్చి లాంటి వాణిజ్య పంటల్లో యాంత్రీకరణను విస్తృతం చేయాలి. ఉద్యానపంటల సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించి, ఎగుమతి ప్రమాణాలు సాధించాలంటే సగటు రైతు చెంత]కు సాంకేతికతను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. రాష్ట్రాల్లో ఉన్న వ్యవసాయ వర్సిటీలకు ఇందులో భాగస్వామ్యం కల్పించాలి. చిన్న రైతులకు అందుబాటులో ఉండే ఆవిష్కరణలతోనే లక్ష్యం నెరవేరుతుంది. ఇది పంటల ఉత్పాదకత పెరిగేందుకూ దోహదపడుతుంది. నాబార్డు 2018 ఆగస్టులో వెల్లడించిన సర్వే వివరాల ప్రకారం 2015-16లో మనదేశంలో రైతు సగటు భూమి పరిమాణం 1.1 హెక్టార్లు మాత్రమే. ఇందులో 37శాతం రైతులకు 0.4 హెక్టార్లలోపే ఉంది. 30శాతానికి 0.41 హెక్టార్ల నుంచి 1.0 హెక్టార్ల మధ్య ఉంది. రెండు హెక్టార్లకంటే ఎక్కువ భూమి ఉన్నవారు 13శాతమే. తెలంగాణలో అయిదెకరాల్లోపు భూమి కలిగిన రైతులు 55.45శాతం. ఆంధ్రప్రదేశ్‌లో 2015-16 గణాంకాల ప్రకారం 59.05శాతం రైతులు హెక్టారు లోపు భూమి ఉన్నవారే. చిన్నకమతాలు కలిగిన మన దేశ రైతులకు యాంత్రీకరణ లాభదాయకమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ, మనదేశ రైతులకు అందుబాటులో ఉండేలా యాంత్రీకరణను, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుకు చేరువచేసే బాధ్యత- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. రైతు సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఆధునిక పరికరాలను అందుబాటులో ఉంచాలి. వీటిని ఉపయోగించుకున్నందుకు రైతుల వద్ద నామమాత్రంగా అద్దె వసూలు చేయాలి.

వ్యవసాయంపై విముఖత

భూమిలేని వ్యవసాయ కుటుంబాలు దేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10.67 కోట్లు ఉండగా- 2011 లెక్కల ప్రకారం 14.43 కోట్లకు పెరిగాయని 2016లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. 2015 నాటికి మొత్తం శ్రామికుల్లో 54.6శాతం వ్యవసాయరంగంలో పనిచేస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాగులోకొస్తున్న భూమి విస్తీర్ణం, సాగునీటి వసతుల విస్తృతి పంటలసాగు సరళిలో మార్పులు, ఉద్యాన, వాణిజ్య పంటల సాగు వృద్ధి చెందడం వల్ల కూలీల అవసరం నానాటికీ పెరుగుతోంది. మరోవైపు వ్యవసాయరంగంలో సగటు ఆదాయం తక్కువగా ఉంటోంది. ఏడాది పొడవునా పనిలేకపోవడం తదితర కారణాలతో ఏటా ఇతర రంగాలవైపు మరలుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు వృద్ధి చెందడం, వాటిలో ఏడాదంతా పని దొరుకుతుండటం వంటి కారణాల వల్ల అటువైపు రైతు కూలీలు మొగ్గుచూపుతున్నారు. యాంత్రీకరణలో, సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటంలో జపాన్‌, ఇజ్రాయెల్‌ ప్రపంచంలోనే ముందున్నాయని చెప్పవచ్చు. ఆయా దేశాల్లో సారవంతమైన భూములు లేనప్పటికీ అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అవి ప్రపంచానికి అందిస్తున్నాయి. ముఖ్యంగా జెనిటిక్‌ ఇంజినీరింగ్‌లో జపాన్‌ పరిశోధనలు ఎన్నో అద్భుతాలను సృష్టించాయి. నాణ్యమైన, అధిక ఉత్పత్తులకు ఇది ఎంతగానో దోహదపడుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయరంగంలో ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం పేదరికాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయని 2019 సెప్టెంబరులో ప్రపంచబ్యాంకు నివేదిక వెల్లడించింది. అంతేకాక పెరుగుతున్న ఆహార గిరాకీని తీర్చడం, వాతావరణ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడంలో ఇవి ఎంతో అవసరమనీ ఆ నివేదిక అభిప్రాయపడింది.

- దేవవరపు సతీష్‌బాబు
 

Posted Date: 30-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం