• facebook
  • whatsapp
  • telegram

రాయితీల కోత... ఎరువుల వాత

రైతు బాగు కోరేలా సమగ్ర విధానం

యూరియా తప్ప మిగిలిన రసాయన ఎరువుల ‘గరిష్ఠ చిల్లర ధర’ (ఎమ్మార్పీ) పెరగకుండా కేంద్రం తాజాగా అడ్డుచక్రం వేసింది. ఇలా ఎంతకాలం అడ్డుకుంటుందనేది ప్రస్తుతం కీలక ప్రశ్నగా మారింది. ఈ నెలాఖరుతో అయిదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు పూర్తవుతాయి. వచ్చే నెల నుంచి దేశమంతా కొత్త ఖరీఫ్‌ పంటల సాగు సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రసాయన ఎరువుల ధరల్ని కేంద్రం ఆపాలంటే వేల కోట్ల రూపాయల రాయితీలను భరిస్తామనే ప్రకటన జారీ చేయాలి. ఇప్పటి వరకు అలాంటి ఊసెక్కడా లేదు. కొత్త ఖరీఫ్‌ సీజన్‌లో ధరలు పెరగబోవనే పూచీ ఇవ్వలేదు. అంతర్జాతీయ విపణిలో ఎరువులు, వాటి తయారీకి సంబంధించిన ముడి సరకుల ధరలు మండిపోతున్నాయి. ఏ వస్తువు ధర అయినా ముడిసరకుల ధరల ఆధారంగానే నిర్ణయమవుతుంది. వాటిని భరించాలంటే కేంద్రం రాయితీ భారాన్ని మరింత ఎక్కువగా నెత్తికెత్తుకోవాలి. మరోవైపు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాత నిల్వల బస్తాలపై పాత్ర ఎమ్మార్పీలే ముద్రించి ఉన్నందున ఆ ధరలకే అమ్మాలని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి కొత్త ఖరీఫ్‌ సీజన్‌ కోసం ఎరువుల కొనుగోళ్లు, డిమాండు బాగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఆ నిల్వలు మార్కెట్లోకి రానున్నాయి. అయితే, కేంద్ర ధరలు పెంచడం లేదని ప్రకటించినందున కొత్త నిల్వల బస్తాలపై పాత ఎమ్మార్పీలు ముద్రిస్తారా లేదా కొత్త ధరలతో అమ్ముతారా అనేది అస్పస్టంగా ఉంది. కేంద్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. కంపెనీలు మాత్రం ధరలు పెంచక తప్పదని అనధికారికంగా చెబుతున్నాయి. భారత్‌లో ఎరువుల వినియోగం పెరిగేకొద్దీ విదేశీ కంపెనీలకు కాసుల వర్షం కురుస్తోంది. గత ఏడాది (2020-21) 3.50 కోట్ల టన్నులకు పైగా ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అంతర్జాతీయ విపణిలో పెరిగే ధరలు ఇక్కడి వ్యవసాయ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

నియంత్రణలో వైఫల్యం

కేంద్రం అమలు చేస్తున్న రసాయన ఎరువుల రాయితీ విధానంలో లోపాలు, ఎరువుల వినియోగాన్ని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా- ఏటికేడు ప్రభుత్వాలు, రైతులపై ఆర్థికభారం పెరుగుతోంది. గత ఏడాది(2020-21)లో లక్షా 36 వేల కోట్ల రూపాయలను ఎరువుల రాయితీ కోసం కేంద్రం ఖర్చుపెట్టింది. నాలుగేళ్ల క్రితం 2017-18లో ఖర్చుపెట్టిన రూ.66,468 కోట్లతో పోలిస్తే ఇది వందశాతానికి మించి పెరిగింది. ఇక ఈ ఏడాదీ రూ.84,041.39 కోట్లను ఇటీవలి బడ్జెట్‌లో కేటాయించింది. తాజా ధరల పెంపు ప్రతిపాదనలతో ఈ ఏడాదీ రాయితీ పద్దు లక్ష కోట్ల రూపాయలను దాటిపోవచ్చని వ్యాపార వర్గాల అంచనా. ఎరువుల వినియోగం నియంత్రణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడినట్లు కనిపిస్తోంది. నేలను విషపూరితం చేసే రసాయన ఎరువుల రాయితీలకు ఎక్కువ నిధులివ్వడం ఏ తరహా ప్రగతికి సూచిక అనే విమర్శలు లేకపోలేదు. మొత్తం ఎరువుల్లో సగానికి సగం యూరియానే ఉంటోంది. దీని వాడకం ఉత్తర, పశ్చిమ భారత్‌ రాష్ట్రాల్లో చాలా ఎక్కువ. దీనికి ఎప్పుటికప్పుడు రాయితీ పెంచుతూ ధరల నియంత్రణ అధికారాన్ని కేంద్రం తన పరిధిలో ఉంచుకుంది. మిగిలిన ‘డై అమ్మోనియం ఫాస్ఫేట్‌’(డీఏపీ), కాంప్లెక్స్‌, పొటాష్‌ వంటి ఎరువులపై కేంద్రానికి నియంత్రణ లేదు. అందువల్ల వీటికి రాయితీ విస్తరించక ఆయా కంపెనీలు ఎప్పటికప్పుడు ధరలను పెంచేస్తున్నాయి. వీటిపై ఇచ్చే రాయితీ భారాన్ని తగ్గించుకునేందుకు 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘సూక్ష్మపోషక రాయితీ విధానం’ (ఎన్‌బీఎస్‌) అమలులోకి తెచ్చింది. ఈ విధానాన్ని ప్రారంభించే సమయంలో 2010లో టన్ను డీఏపీపై రూ.16,268 చొప్పున కేంద్రం రాయితీగా భరించింది. అప్పుడు 50 కిలోల డీఏపీ బస్తా ధర రూ.600లోపు ఉండేది. కానీ ఇప్పుడు డీఏపీ టన్నుపై కేంద్రం ఇస్తున్న రాయితీ రూ.6,070కి తగ్గిపోగా ఒక్కో బస్తాకు రైతు చెల్లిస్తున్న గరిష్ఠచిల్లర ధర  రూ.1,400కి చేరింది. ఇప్పుడు ముడిసరకుల ధర పెరుగుదలతో ఈ నెల ఒకటి నుంచి బస్తా ఎమ్మార్పీని రూ.1,900కి పెంచడానికి కంపెనీలు సిద్ధపడగా- కేంద్రం చక్రం అడ్డువేసింది. అలాగే కాంప్లెక్స్‌ ఎరువులు టన్ను రాయితీ రూ.15,877 వరకు 2010లో ఉంటే ఇప్పుడు రూ.9,258కి తగ్గిపోయింది. ఎన్‌బీఎస్‌లో లేని యూరియా ఎమ్మార్పీ పెరగకుండా కేంద్రం ఎప్పటికప్పుడు రాయితీని పెంచుతూ వస్తోంది. యూరియా బస్తా రూ.266 ఉంటే ఏమాత్రం పెంచకుండా డీఏపీ ధర రూ.1,400 ఉంటే రూ.1,900కి పెంచాలనే ప్రతిపాదనలు విధానాల్లో డొల్లతనాన్ని చాటుతున్నాయి. యూరియాలో నత్రజని, డీఏపీలో భాస్వరం అనే రసాయన పోషకాలుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏటా గణనీయ స్థాయిలో రసాయన ఎరువులు వాడుతున్నారు. తెలంగాణలో ఆరు వేల మంది రైతులకు చెందిన పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షిస్తే 50 శాతానికి మించి నమూనాల్లో భాస్వరం చాలా ఎక్కువగా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఎక్కువున్న ఈ పొలాల్లో ఇంకా పంట దిగుబడుల కోసం భాస్వరం, కాంప్లెక్స్‌ ఎరువులు వాడుతూ పోతే కొంతకాలానికి భూములు నిస్సారమై ఎందుకూ పనికిరాకుండా పోతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

భూములను కాపాడాలి

ఎరువుల వినియోగం పెరిగేకొద్దీ రాయితీ రూపంలో ప్రజాధనం వృథాతో పాటు, భూములు నిస్సారమవుతాయి. ఏ కమతంలో ఎలాంటి పంట వేయాలి, దాని మట్టి నమూనాల ఫలితాలు ఏమిటనేది ప్రతి పంట సీజన్‌కు ముందే ఆన్‌లైన్‌లో వ్యవసాయశాఖ వెల్లడించాలి. జిల్లాకొక గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడున్న కమతాల మట్టి నమూనాలన్నీ సేకరించి పరీక్షించాలి. వాటిలో ఉన్న లోపాలను గుర్తించి ఆ వివరాలను గ్రామంలో ఫ్లెక్సీల రూపంలో ప్రకటించాలి. ఈ లోపాలకు అనుగుణంగా ఏ రసాయన ఎరువులు వాడాలి, వాటిలో ఏ పంట పండుతుందనే వివరాలను చెబితే రైతుల్లో అవగాహన ఏర్పడుతుంది. దీనివల్ల ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గించవచ్చని కేంద్రం కొన్నేళ్లుగా చెబుతున్నా- ఏ రాష్ట్రమూ పెద్దగా పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం కన్నా ఈ ఏడాది రసాయన ఎరువుల కోటా పెంచి అదనంగా మరిన్ని లక్షల టన్నులు పంపాలని అడగటం రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగా భావించాల్సి ఉంటుంది. యూరియాపై, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరల మధ్య సమతౌల్యం తీసుకురావాలి. ఐరోపా, అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలు రసాయనాలు లేని సేంద్రియ పంటల సాగువైపు దృష్టి సారిస్తున్నాయి. దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని నాలుగేళ్లుగా కేంద్రం చెబుతున్నా పెద్దగా ప్రతిస్పందన లేదు. మార్కెట్‌లో అమ్మే ప్రతి ఎరువు బస్తాపైనా కేంద్రం ఎంతో ప్రజాధనాన్ని రాయితీగా ప్రైవేటు కంపెనీలకు చెల్లిస్తోంది. వాటి వినియోగం ఒక్క కిలో తగ్గినా ఆ మేర ప్రజాధనం ఆదా అయినట్లే!

- మంగమూరి శ్రీనివాస్‌
 

Posted Date: 20-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం