• facebook
  • whatsapp
  • telegram

అన్నదాత బాగుకు ఆధునిక సాగు

అంతర్జాతీయ సస్యశాస్త్ర సదస్సు

వ్యవసాయరంగంలో అత్యాధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఎల్లలెరుగని సాంకేతికతను ఒడిసి పట్టేందుకు మన పరిశోధకులు సిద్ధంగా ఉంటున్నా వాటిని రైతులకు చేరవేసే వ్యవస్థ ఘోరంగా విఫలమవుతోంది. శాస్త్ర విజ్ఞానాన్ని పంట పొలాలకు చేర్చే క్రమంలో ఆధునిక అంశాలపట్ల అవగాహన కల్పించకపోవడంవల్ల సంప్రదాయ-వినూత్న సాగు పద్ధతులను అమలు చేసే విషయంలో రైతులోకం ఊగిసలాడుతోంది. నేలలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, జన్యు సాంకేతికత, సస్యరక్షణ, యాంత్రీకరణ,  వాతావరణ మార్పులు, సేంద్రియ వ్యవసాయ విధానాల ఆచరణ సహా అన్ని వ్యవసాయశాస్త్ర అంశాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తున్నప్పటికీ- మన రైతుల సాగు సమస్యలు పరిష్కారం కావడంలేదు. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో వ్యవసాయం పరంగా ఎంతో ప్రగతి సాధించినా సగటు రైతుల సంక్షోభం అలాగే కొనసాగుతోంది. శాస్త్ర పరిశోధనలను రైతులకు చేరువచేసే కృషి మరింత వేగిరం కావాల్సిన అవసరం చాలా ఉంది. ఈ తరుణంలో 2021 నవంబర్ 23 నుంచి అయిదు రోజులపాటు జరగనున్న అంతర్జాతీయ సస్యశాస్త్ర (అగ్రానమీ) సదస్సుకు హైదరాబాద్‌లోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది.

రైతులకు అందని ఫలాలు

శాస్త్రీయ అవగాహన లోపించిన కారణంగా దేశంలో పరిశోధన ఫలితాలు రైతులోకానికి అందడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడమూ రైతులకు గగనమవుతోంది. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తున్నా, ఉత్పత్తులకు విలువ చేకూర్చే సాంకేతికత రైతు స్థాయికి చేరనే లేదు. దేశంలో వ్యవసాయ వ్యాపారం పుంజుకొంటున్న దిశగా రైతులకు ఆ సాంకేతికతను అందించడంలో విఫలమవుతున్నాం. ఎంతసేపూ స్థానిక మార్కెట్లలో మద్దతు ధరల గురించి కొట్లాడేందుకే అన్నదాతల పోరాటం పరిమితమవుతోంది తప్ప- సగటు రైతుకు అపరిమితంగా ఉన్న మార్కెట్లను అందుకోవడం సుదూర స్వప్నంగానే మిగులుతోంది. ప్రపంచంలో ఏ దేశానికీ తీసిపోని రైతులు భారత్‌లో ఉన్నారు. అంతర్జాతీయ పోకడలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు సరికొత్త సాగు పద్ధతులు, ఆవిష్కరణల్ని రైతుల్లోకి తీసుకువెళ్ళవలసిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం రైతుల్ని కుంగదీస్తోంది. ఇవన్నీ సుస్థిరాభివృద్ధి సవాళ్లను అందుకోవడంలో రైతులను నిస్సహాయుల్ని చేస్తున్నాయి.

నేలల స్థితిగతులు మారుతున్నాయి. ఇష్టానుసారం పురుగుమందుల వాడకంతో భూభౌతిక పరిస్థితి దెబ్బతింటోంది. తినే ఆహారం కలుషితమవుతోంది. ప్రపంచమంతా సేంద్రియ వ్యవసాయ విధానాలను ఆచరిస్తుంటే మనం పంట పొలాల్లో విషాన్ని పండిస్తున్నాం. ఒక పరిమితి లేకుండా చల్లుతున్న విష రసాయనాలు అటు నేలలు, ఇటు రైతుల ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి. రసాయన అవశేషాలతో నిండిన ఉత్పత్తులను విదేశాలు తిరస్కరిస్తున్నాయి. వాతావరణ మార్పులు తెస్తున్న నష్టాలు వీటికి అదనం. పరిమితికి మించి రసాయనాలను ఉపయోగించవద్దని చెప్పే విస్తరణ యంత్రాంగం అందుబాటులో లేకపోవడంతో ఎరువులు, పురుగుమందుల డీలర్ల మాటే రైతుకు వేదవాక్కవుతోంది. సకాలంలో ఎరువులు అందవు. నేలలోని పోషకాల ఆధారంగా వాటిని ఎంత మోతాదుకు పరిమితం చేయాలని సూచించే వారుండరు. వాతావరణ హెచ్చరికలను పక్కాగా అందించే సాంకేతికత అందుబాటులో ఉన్నా పంట నష్టాలను నివారించలేకపోతున్నాం. వరదలు, తుపానులు ఏటా పరిపాటి అవుతూ పంటలు నీట మునుగుతున్నాయి. స్వల్ప నష్టాలతో బయటపడే వంగడాలను రూపొందించామని చెబుతున్నా యంత్రాంగం వాటిని రైతులకు అందించలేకపోతోంది. కూలీల సమస్యతో నానా అగచాట్లు పడుతున్నా- కోతలు, నూర్పిళ్ల కాలంలో గ్రామాలకు యంత్రాలు, పనిముట్లను విరివిగా అందించే ప్రయత్నమూ కొనసాగడంలేదు. పెట్టుబడి ఖర్చులు చాలా రెట్లు పెరిగి సేద్యంలో మిగులు ఉండటం లేదు. వాస్తవ ఖర్చుల ఆధారంగా ధరలను మదింపు వేయాల్సిన కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను రైతులకు అందించడంలో విఫలమవుతోంది. రైతుల శ్రమను దళారులు దోచుకునే దుస్థితి తలెత్తుతోంది. ధరలు పతనమైన సందర్భాల్లో ఉత్పత్తికి విలువ జోడించే పరిజ్ఞానం అందుబాటులో ఉండటంలేదు. ఫలితంగా కొనే నాథుడు లేక విసిగి వేసారుతున్న ఎందరో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను తగలబెట్టడం, రోడ్లపై పారబోయడం వంటి దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్నో కష్టాలకోర్చి పండించిన పంటలను రోడ్లపాలు చేస్తున్న రైతుల ఆవేదనను ప్రభుత్వాలు అర్థం చేసుకోలేకపోవడం తీవ్ర విషాదం. దుక్కి దున్నే నాటి నుంచి పంటను విక్రయించుకునే వరకు రైతుకు సాగు చేయూత నామమాత్రమవుతోంది.

సవాళ్లను అధిగమిస్తేనే...

డిజిటల్‌ వ్యవసాయం సరికొత్త మార్గాలను చూపుతున్న ఈ తరుణంలో, సంప్రదాయ సేద్యం నుంచి మన రైతుల్ని మళ్ళించే బృహత్తర యజ్ఞం సాకారం కావాలంటే ముందుగా పాలకుల ధోరణి మారాలి. సాగు సంస్కరణలను వ్యవస్థీకృతం చేసి సరికొత్త వ్యవసాయ విధానాలను ఆచరణలో పెట్టాలి. సమకాలీన సాగు సవాళ్లను ఎదుర్కొని పంట పొలాల్లో సస్య విప్లవాన్ని సాకారం చేసే చిత్తశుద్ధిని ప్రదర్శించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంకిత భావాన్ని చూపాలి. నూతన సాగు సవాళ్లను అధిగమించే క్రతువులో గ్రామీణ రైతులకు విస్తృత భాగస్వామ్యం కల్పించాలి. కొన్నేళ్లుగా కేంద్రం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీఓలు) సమన్వయం చేసే యంత్రాంగాన్ని మండలాల వారీగా పాదుకొల్పాలి. సీజన్‌లో ఏటా రైతుల్ని విసిగిస్తున్న సమస్యలన్నీ ఎఫ్‌పీఓల స్వయం నిర్ణయాధికారంతో తొలగిపోతాయి. ఏ రాజకీయ పార్టీకి వీటిలో ప్రమేయం లేకుండా చేయడం మరో ప్రధాన అంశం. రాజకీయాలకు అతీతంగా రైతుల్ని సంఘటితపరిస్తే సాగు సంస్కరణల ఫలితాలు అన్నదాతలకు అందుతాయి. తద్వారా భూసారం నుంచి అంతర్జాతీయ విపణుల వరకు మన రైతులు తమదైన ముద్ర వేయగలరు. పంట పొలాల్లో సస్య విప్లవాన్ని సాధించగలరు.

పాలకులదే పాపం

‘చేరాల్సిన వారికి చేరనప్పుడు శాస్త్ర పరిశోధనలు కొరగాకుండా   పోతా’యని ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పేర్కొన్నారు. ఓ వైపు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని అంకుర సంస్థలు ప్రభావశీలంగా ఎదుగుతుంటే, గ్రామీణ రైతు భారతం సంప్రదాయ పద్ధతులను అంటిపెట్టుకుని ఆధునికతకు దూరంగా అడుగులేస్తోంది. ఇందులో పాలకుల నిర్లక్ష్యమే అధికంగా కనిపిస్తోంది. అందువల్లనే భారత్‌లో వ్యవసాయం రైతులకు దుర్భరంగా మారింది. దేశంలో ఏ స్థాయిలోనూ రైతు మేలు కోరే సంస్కరణలు అందుబాటులోకి రావడంలేదు. అందరికీ నాణ్యమైన విత్తనాలు అందడంలేదు. ఏటా నూరు శాతం విత్తన మార్పిడిని అందుకోలేకపోతున్నాం. వాహనాలను కొనేందుకు తక్కువ వడ్డీకి పోటీపడి రుణాలందించే బ్యాంకులు కర్షకులందరికీ పంట రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. దేశంలో సంస్థాగత రుణాలు అందుకునే రైతుల సంఖ్య 30శాతం దాటడం లేదు.

- అమిర్నేని హరికృష్
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముడివీడుతున్న అపనమ్మకాలు

‣ భారత్‌ మెడపై కాట్సా కత్తి

‣ కులగణనకు పెరుగుతున్న డిమాండ్లు

‣ ప్రజాప్రయోజనం నెరవేరుతుందా?

Posted Date: 26-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం