• facebook
  • whatsapp
  • telegram

మద్దతు దక్కని కడగండ్ల సాగు

పంట మార్పిడికి భరోసా కరవు

మద్దతు ధరకు పంటల కొనుగోలు అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందుకోసం చట్టం తెచ్చేదాకా ఉద్యమిస్తామంటూ రైతుసంఘాలు చేసిన హెచ్చరికలకు స్పందించిన కేంద్రం- పంటల మద్దతు ధరల నిర్ణయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ కమిటీలో సుమారు 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సభ్యుల ప్రాతినిధ్యమూ ఉంటుందని హామీ ఇచ్చింది. అయితే, మద్దతు ధరలను నిర్ణయించి, చట్టం తెచ్చినంత మాత్రాన నిజంగా వ్యాపారులు ఆ ధరకు కొంటారా, ప్రైవేటు వ్యాపారులతో చట్ట ప్రకారం మద్దతు ధర ఇప్పించడం సాధ్యమేనా... అనేవి ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు. 2020 అక్టోబరులో పంజాబ్‌ శాసనసభలో కొత్త బిల్లును ఆమోదించారు. దాని ప్రకారం వరి, గోధుమలను మద్దతుధరకన్నా తక్కువకు ఎవరూ కొనకూడదన్న నిబంధన విధించారు. ఆ చట్టం అమలులోకి వచ్చిన తరవాతా మద్దతు ధరకు కొనేందుకు ప్రైవేటు వ్యాపారులు ముందుకు రావడం లేదు. గడచిన ఏడాదికాలంలో పంజాబ్‌లో రెండు కోట్ల టన్నులకు పైగా వరి, గోధుమలను కేంద్రమే మద్దతు ధరకు కొనాల్సి వచ్చింది. ఏటా 25 పంటలకు కేంద్రం ప్రకటించే మద్దతు ధర అనేది కేవలం సూచన మాత్రమే. ఆ ధరలకే పంటలు కచ్చితంగా కొనాలనే చట్టం ఏదీ ఇంతవరకూ లేదు. ప్రైవేటు వ్యాపారులెవరూ దాన్ని పాటించకపోయినా వారిని అడిగే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. కాంట్రాక్టు సేద్యం చేసే కంపెనీలు, వ్యక్తులు మద్దతు ధరకన్నా తక్కువ చెల్లించి రైతుల నుంచి పంటలను కొంటే- వారితో కుదుర్చుకున్న ఒప్పందాలకు రైతు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని 2020 నవంబరులో రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో చట్టం తెచ్చింది. మరోవైపు కేంద్రం ప్రకటిస్తున్న మద్దతు ధరలకు రాష్ట్ర ప్రభుత్వాలు కొంటున్నాయా అనేదీ ఆలోచించాల్సిన అంశం.

ఆహార భద్రత కోసమేనా?

జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశప్రజలకు ఆహార, పోషకాహార భద్రత కల్పించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తుగా ధాన్యం కొని నిల్వలు నిర్వహిస్తూ అందరికీ అందేలా చూడాలి. ఆ చట్టం అమలులోకి వచ్చి దశాబ్దం కావస్తున్నా ఇంతవరకూ పంటల కొనుగోలులో హేతుబద్ధత రాలేదు. ప్రభుత్వాలకు ఇష్టమైతే కొనడం లేకపోతే పంటలను, రైతులను గాలికొదిలేయడం సర్వసాధారణమైంది. దేశంలో గోధుమల దిగుబడుల్లో 2019-20లో మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పండిన పంట 46శాతం; మద్దతు ధరకు కేంద్రం కొన్నపంటలో 85శాతం వాటా ఈ రాష్ట్రాలదే కావడం గమనార్హం. బియ్యం దిగుబడిలో పంజాబ్‌, హరియాణా, ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల వాటా 40శాతం. మద్దతు ధరకు కొన్నపంటలో వీటి వాటా 74శాతం. దేశంలో అత్యధికంగా వరి సాగుచేస్తున్న పశ్చిమ్‌ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వరిధాన్యాన్ని మద్దతుధరకు కొనడంగానీ, బియ్యం సేకరణ గానీ పెద్దగా లేవు. ఆహార భద్రత పేరుతో ఏటా లక్షకు పైగా కొనుగోలు కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటుచేసి వరి, గోధుమలు కొంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదే పద్ధతిని మిగిలిన పంటల కొనుగోలులో ఎందుకు పాటించడం లేదన్నది సమాధానం దొరకని ప్రశ్న. దేశంలో ఉన్న గ్రామీణ వ్యవసాయ కుటుంబాల్లో 62.5శాతం వరి, 41శాతం గోధుమ సాగుచేస్తున్నట్లు 2019లో జరిపిన ‘పరిస్థితి మదింపు అధ్యయనం’లో తేలింది. పది శాతానికి మించి సాగుచేస్తున్న మరో పంట మొక్కజొన్న ఒక్కటే. 2018-19లో రైతులు పండించిన వరిధాన్యంలో ఛత్తీస్‌గఢ్‌లో 82.8శాతం, కేరళలో 73.6శాతం మద్దతు ధరకు కొన్నారు. జాతీయ కొనుగోలు సగటు 24.7శాతమే. రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా ఉంటే కేంద్రం ప్రకటించే మద్దతు ధరకన్నా క్వింటాకు రూ.500 వరకు అదనంగా ఇచ్చి మరీ రైతుల నుంచి కొంటున్నాయి. గత మూడేళ్ల(2018-21)లో మద్దతు ధరకు పంటలను కొనేందుకు కేంద్రం అనుమతించినా, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా కొనలేదు. తెలంగాణలో 2018-19లో పండిన సోయా పంటలో 6.5శాతం, మరుసటి ఏడాది (2019-20) 3.4శాతం కొనుగోలు చేశారు. ఇక మినుము పంట మొత్తం దిగుబడిలో  3.6శాతం, పెసర 11.1శాతం చొప్పున కొన్నట్లు తేలింది. ఏపీలో 2019-20లో వేరుసెనగ రైతుల నుంచి 2.5శాతమే కొనుగోలు చేసినట్లు జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌ (సీఏసీపీ) తాజా నివేదికలో ఎండగట్టింది. ఏపీలో కందుల కొనుగోలు సైతం 10 నుంచి 42శాతం మధ్యే ఉంది.

స్వావలంబనకు అవకాశం

రైతు ఏ పంట సాగుచేయాలో చెబుతున్న ప్రభుత్వాలు- వాటిని ఎంత ధరకు ఎవరు కొంటారనే విషయాన్నీ సాగుకు ముందే కచ్చితంగా చెప్పాలి. వాతావరణానికి తగ్గట్టుగా ‘పంటల కాలనీలు’ ఏర్పాటుచేయాలని కేంద్రం పదేళ్లుగా చెబుతోంది. ప్రాంతాలవారీగా బాగా పండే పంటలను మద్దతుధరకు కొనే హామీ ఇచ్చి సాగుచేయిస్తే దిగుమతులపై ఆధారపడే బాధ తప్పుతుంది. నల్గొండ ప్రాంతంలో బత్తాయి, చిత్తూరులో టమోటా, పలు జిల్లాల్లో మామిడి, ఉత్తర తెలంగాణలో మిరప, పసుపు, తెలుగు రాష్ట్రాల్లో దానిమ్మ పంటల సాగుకు అనుకూల వాతావరణమున్నందువల్ల రైతులకు ఆయా పంటలకు గిట్టుబాటు ధర కల్పించే వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. ‘ఒక జిల్లా-ఒక పంట’ విధానాన్ని కేంద్రం తేవడం ఆహ్వానించదగిన పరిణామం. ఎగుమతి అవకాశాలను పెంచే ఈ విధానం గిట్టుబాటు ధరలకు పూచీకత్తునిస్తుంది. పంటల సాగుకు ఎన్ని రాయితీలిచ్చినా... చివరికి పండిన తరవాత మార్కెట్లకు తెచ్చిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించే మద్దతు విధానాలు లేనంతకాలం పంటలమార్పిడి సాధ్యం కాదు. ఇప్పటి వరకూ రైతులు వరి, గోధుమలకు మద్దతు ధర ఉన్నందువల్లే వాటిని ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఇతర పంటల సాగుకు మళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా రైతులు వినకపోవడానికి ప్రధానకారణం- మద్దతు ధరకు అమ్ముకోవచ్చనే భరోసా కొరవడటమే. తెలుగు రాష్ట్రాల్లో మేలైన టమోటా, మిరప, పసుపు వంటి పంటలను రైతులు పండిస్తుంటే కనీసం వాటిని ఎంత ధరకు కొనవచ్చనే నిర్ణయాలూ తీసుకోని అస్తవ్యస్త విధానాలు కొనసాగినంత కాలం పంటలమార్పిడి సాధ్యం కాదు.

- మంగమూరి శ్రీనివాస్‌

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కుయుక్తులతో కూటమికి విఘాతం

‣ చిరకాల మైత్రికి కొత్త ముడి

‣ సాంకేతికత అండగా విమానయానం

‣ పోషణతోనే బలవర్ధక భారత్‌

Posted Date: 11-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం