భారత్‌కు నానాటికీ అధికమవుతున్న దిగుమతుల పద్దు వల్ల వాణిజ్యలోటు పెరుగుతోంది. కొన్ని ఉత్పత్తులను దేశీయంగా పెంచుకొనే అవకాశం ఉన్నా, ఇండియా అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనిపై పాలకులు సరైన దృష్టి సారించాలి.
విదేశాల నుంచి భారత్ దిగుమతులు ఏటేటా పెరుగుతున్నాయి. ఫలితంగా అధికమవుతున్న వాణిజ్యలోటు, కరెంటు ఖాతాలోటు, క్షీణిస్తున్న రూపాయి విలువ పాలకుల్లో, ఆర్థికవేత్తల్లో, విధానకర్తల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో భారత్ దిగుమతుల విలువ రూ.130 కోట్లు. 2021-22 నాటివి అవి దాదాపు రూ.49.79 లక్షల కోట్లకు చేరాయి. ఒకవైపు ఇండియా ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి. అయితే, దిగుమతులు-ఎగుమతుల మధ్య భారీ వ్యత్యాసం ఏటా అధికమవుతూనే ఉంది. అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా దిగుమతులు పెరగడం సహజం. అవి దేశార్థికానికి తోడ్పడితే ఎవరూ కాదనలేరు. అలా కాకుండా అనుత్పాదకమైన వాటిని, స్వదేశంలో ఉత్పత్తి చేసుకోగల అవకాశం ఉన్నవాటినీ దిగుమతి చేసుకోవడం సహేతుకం కాదు.
వనరులు ఉన్నా...
భారత ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సుమారు రూ.34 లక్షల కోట్లకు చేరాయి. అయితే, ఎగుమతుల కన్నా దిగుమతులు పెరుగుతుండటం సమస్యగా మారుతోంది. గత ఏప్రిల్‌లోనే రూ.1.6 లక్షల కోట్ల వాణిజ్యలోటు నమోదైంది. ఇది దేశ ఆర్థిక వృద్ధి రేటును పరుగులెత్తించడానికి సహకరిస్తే ఎలాంటి ఆందోళనా ఉండదు. వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. పందొమ్మిదో శతాబ్దమంతా అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య లోటుతోనే కాలం గడిపింది. పెట్టుబడి వ్యయం, మౌలిక వసతులపై భారీగా వెచ్చించి నేడు ప్రపంచంలో బలమైన, ధనిక దేశంగా నిలిచింది. ఈ స్థాయికి రావడానికి అగ్రరాజ్యానికి వందేళ్లకు పైగా పట్టింది. భారత్‌లో బంగారం గనుల కార్యకలాపాలు కుంటువడటంతో దేశీయ బంగారం వినియోగంలో సింహభాగాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం అనుత్పాదక వస్తువు. దాని దిగుమతుల వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదు. ముడి చమురు, బొగ్గు, యంత్రాల దిగుమతులు దానికి భిన్నం. అవి పారిశ్రామికోత్పత్తికి, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. ఇండియాలో సరిపడా ముడి చమురు నిల్వలు లేవు. అందువల్ల దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్నాం. గత ఏప్రిల్‌లో ముడి చమురు, బొగ్గు దిగుమతులు వరసగా 81శాతం, 137శాతం పెరిగాయి.
భారత్ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద బొగ్గు నిల్వలు ఉన్న దేశం. అయినా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కోట్ల విలువైన బొగ్గును దిగుమతి చేసుకున్నాం. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద పత్తి ఉత్పత్తిదారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. కానీ, పత్తి, వంట నూనెలు, పప్పుధాన్యాలు, పండ్లనూ భారీగానే దిగుమతి చేసుకుంటున్నాం. మనకున్న వనరులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్వదేశంలో ఉత్పత్తి పెంచడాన్ని విస్మరించి దిగుమతి చేసుకోవడమే సులభ మార్గమని భావిస్తున్నాం. దేశీయంగా భారీగా బొగ్గు నిల్వలు ఉన్నా, మన విద్యుత్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గును అందించలేకపోతున్నాం. మైనింగ్ రంగంలో సాంకేతికతను మెరుగుపరచి, తగిన మౌలిక వసతులను కల్పించి ఈ సమస్యను అధిగమించవచ్చు. పలు రకాల పండ్లను పండించడానికి భారత్‌లో అనువైన వాతావరణం ఉంది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాల్లో పండే పండ్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీని పెంచడంలో పాలకులు విఫలమవుతున్నారు.
భారీగా దిగుమతులు

********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బాల్య విద్య... భవితకు గట్టి పునాది
‣ ‘ఉచిత’ భారానికి సౌర విద్యుత్ పరిష్కారం
‣ ఆర్కిటిక్... మన ప్రయోజనాలకు కీలకం!