• facebook
  • whatsapp
  • telegram

అమృత కాలానికి పటిష్ఠ మార్గం

 

 

రాబోయే కేంద్ర బడ్జెట్‌ అమృత కాలానికి పటిష్ఠ మార్గాన్ని ఏర్పరుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో మధ్య, దీర్ఘకాలికంగా అధిక వృద్ధి రేటు సాధించడంపై 2023-24 బడ్జెట్‌ దృష్టి సారించాలి. కరోనా మహమ్మారి వల్ల కోల్పోయిన ఉపాధి అవకాశాలను మళ్ళీ పెంచాలి. ఉపాధికి, అభివృద్ధికి అది సమాన ప్రాధాన్యమివ్వాలి.

 

జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) తొలి ముందస్తు అంచనాల ప్రకారం స్థిర ధరలపై దేశ జీడీపీ కొవిడ్‌ ముందునాటి 2019-20 కన్నా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8.6శాతం అధికంగా ఉండబోతోంది. అంటే గడచిన మూడేళ్లలో భారత్‌ ఏటా 2.86శాతం వృద్ధి రేటును సాధించిందన్న మాట. 2019-20లో అభివృద్ధి రేటు కేవలం 3.7శాతమని గుర్తుపెట్టుకోవాలి. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఇంధన ధరలు అమాంతం ఎగబాకాయి. అమెరికా, ఐరోపా, చైనాలలో వృద్ధిరేటు మందగించింది. అధిక ద్రవ్యోల్బణమూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఇండియాపై ఈ పరిణామాలు చూపే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడం అత్యావశ్యకం.

 

సమర్థ విధానాలు కీలకం

ప్రస్తుతం చైనాలో కొవిడ్‌ కరాళ నృత్యం కొనసాగుతోంది. ఆ దేశం త్వరలోనే కొవిడ్‌ కోరల నుంచి బయటపడి మళ్ళీ ఆర్థికంగా తెప్పరిల్లితేనే యావత్‌ ప్రపంచ ఆర్థికానికి మేలు చేకూరుతుంది. పెట్టుబడి వ్యయ పెంపునకు, మౌలిక వనతుల విస్తరణకు గత రెండు బడ్జెట్లు ప్రాధాన్యమిచ్చాయి. రాబోయే 25 ఏళ్ల అమృతకాలానికి గత సంవత్సర బడ్జెట్‌ పునాది ఏర్పరచింది. ప్రధానమంత్రి గతిశక్తి, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, పెట్టుబడుల వృద్ధి, శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనాలకు మళ్లడానికి, వాతావరణ మార్పుల నిరోధానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికీ ప్రాధాన్యమిస్తోంది. ఇంతకుముందు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో ఈ అంశాలు ప్రతిబింబించాయి. 2023-24 బడ్జెట్‌ వీటిని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. బడుగు వర్గాలు, రైతులు, యువత, మహిళలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి.

 

కార్పొరేట్‌ పెట్టుబడులు, కుటుంబాల పొదుపు రేట్లు పెరగడం వల్లనే 2000వ దశకంలో అధిక వృద్ధి రేట్లు సాధ్యమయ్యాయి. కొవిడ్‌ వల్ల గత రెండేళ్లలో పడకేసిన ప్రైవేటు పెట్టుబడులు ఇప్పుడు మళ్ళీ పెరగడం శుభ సూచకం. కంపెనీలు మితిమీరిన అప్పుల భారాన్ని తగ్గించుకోవడం, బ్యాంకులు నిరర్థక ఆస్తుల బెడద నుంచి బయటపడటమూ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయి. కంపెనీలకు, వ్యక్తులకు రుణ వితరణ 17శాతం పెరిగింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం అదనపు పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ధరలను, ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించి, విధానపరంగా అనిశ్చితికి తావులేకుండా చూసి, సులభంగా వ్యాపారాలను ప్రారంభించి నిర్వహించే వాతావరణం కల్పిస్తే ప్రైవేటు పెట్టుబడులు పెద్దయెత్తున వస్తాయి. ఎగుమతులను పెంచడం అభివృద్ధికి మరో ఆలంబన అవుతుంది. కొవిడ్‌ వల్ల చైనా అంతర్జాతీయ విపణికి దూరమైన వేళ భారత్‌ సరైన విధానాలతో ఎగుమతుల వృద్ధికి పూనుకోవాలి. దురదృష్టవశాత్తు, భారత ప్రభుత్వం స్వీయ వాణిజ్య రక్షణకు ప్రాధాన్యమిస్తోంది. దిగుమతులపై సుంకాలు పెంచుతోంది. ఇది ఇండియా వాణిజ్య విస్తరణకు దోహదం చేయదు. తూర్పు దేశాలవైపు చూపు విధానంతో తూర్పు ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించుకోవాల్సిన సమయమిది. రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి భారత ప్రభుత్వం సరైన ద్రవ్య విధానాలను చేపట్టాలి. అంతర్జాతీయ మాంద్య ప్రమాదాన్ని గుర్తెరిగి దాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి. స్థిరంగా అధిక జీడీపీ వృద్ధి సాధించడానికి, మేలైన ఉద్యోగాలు సృష్టించడానికి, వివిధ రంగాలను పునర్వ్యవస్థీకరించడానికి, వాతావరణ మార్పులను నిరోధించడానికి సమర్థమైన విధానాలను చేపట్టాలి.

 

భారత జనాభాలో యువశక్తి అధికం. సరైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ ద్వారా యువశక్తిని అధిక ఉత్పాదక సాధకులుగా తీర్చిదిద్దితే ప్రైవేటు పెట్టుబడులు పెద్దయెత్తున ప్రవహిస్తాయి. వ్యవసాయాన్ని రూపాంతరం చెందించి గ్రామీణ ఆదాయాలను పెంచాల్సిన అవసరమూ ఉంది. పంటల వైవిధ్యం, గిట్టుబాటు ధరల చెల్లింపు, మార్కెటింగ్‌, వ్యవసాయ వాణిజ్య సంస్కరణలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి సాధన, ఎరువులు, క్రిమినాశకాలను తక్కువ మోతాదులో వాడేలా చూడటం వంటి వాటిపై కేంద్రం దృష్టి సారించాలి. చిన్న సన్నకారు, మహిళా, యువ రైతులకు మేలు చేసే విధానాలు చేపట్టడం, వర్షాభావ ప్రాంతాల్లో సేద్యానికి ఊతమివ్వడం, గ్రామీణులకు పోషకాహారం అందించడం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా సేద్యరంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్ళాలి. అదే సమయంలో ప్రజలను వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు మళ్ళించే విధానాలనూ చేపట్టాలి. వరి, గోధుమ పంటలకు ప్రాధాన్యం తగ్గించి పర్యావరణ హితకర చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించాలి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధాన్ని సడలించాలి.

 

అవకాశాల విస్తరణ

కేంద్ర బడ్జెట్‌ వ్యవసాయం, గ్రామాల రూపు మార్చడానికి ప్రాధాన్యమివ్వాలి. శ్రామికశక్తిని అధికంగా ఉపయోగించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించాలి. డిజిటల్‌ సాంకేతికతలనూ ఉపాధి వృద్ధికి వినియోగించుకోవడం తప్పనిసరి. ఇండియా నేడు ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. మరో దశాబ్దంలో జపాన్‌, జర్మనీలను అధిగమించి మూడో స్థానానికి ఎగబాకనుంది. అయితే, తలసరి ఆదాయ పరంగా 197 దేశాల్లో భారత్‌ 142వ స్థానంలో నిలుస్తోంది. డాక్టర్‌ రంగరాజన్‌ ఉద్ఘాటించినట్లు భారత్‌ వేగంగా అధిక వృద్ధి రేటును సాధిస్తేనే తలసరి ఆదాయాన్ని పెంచుకోగలుగుతుంది. రానున్న కేంద్ర బడ్జెట్‌ ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.

 

మూలధన వ్యయంపై దృష్టి

ఏ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికైనా పెట్టుబడులు, ఎగుమతులే మూలాధారం.

భారత్‌లో 2011-12లో 39శాతంగా ఉన్న పెట్టుబడుల రేటు 2019-20లో 31శాతానికి తగ్గింది.

భారత్‌ అభివృద్ధి చెందిన దేశం కావాలంటే 2047కల్లా పెట్టుబడి రేటు 36శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి.

ఇండియా 2020-21 బడ్జెట్లో రూ.4.12 లక్షల కోట్లుగా ఉన్న మూలధన వ్యయం- తరవాతి సంవత్సరం రూ.5.54 లక్షల కోట్లకు పెరిగింది. 2022-23లో రూ.7.5 లక్షల కోట్లకు చేరింది.

మూలధన వ్యయాన్ని కేంద్రం పెంచుకుంటూ వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దాన్ని ఇతోధికం చేసేలా చూడాలి.

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వావలంబనే పటుతర రక్షణ

‣ లాభసాటి పద్ధతులతో పండుగలా సేద్యం

‣ మౌలిక వసతులే భవితకు బాటలు

‣ నదుల్ని కాటేస్తున్న వ్యర్థాలు

‣ మానవ తప్పిదం... ప్రకృతి ఆగ్రహం!

‣ ఎగుమతులు పెరిగితేనే ఆర్థిక ప్రగతి

‣ తుర్కియే జిత్తులకు పైయెత్తు!

Posted Date: 18-01-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం