• facebook
  • whatsapp
  • telegram

మౌలిక వసతులే భవితకు బాటలు

రేపటి నగరాల అభివృద్ధికి జీ-20 ప్రాధాన్యం

పుణెలో జనవరి 16, 17వ తేదీల్లో ‘జీ-20’ మౌలిక వసతుల కార్యబృంద కీలక సమావేశం జరుగనుంది. ప్రపంచంలో వివిధ దేశాలు, ప్రాంతాల అభివృద్ధికి మౌలిక వసతులు ఎంతో కీలకం. వాటి కల్పనకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి, భావి నగరాల అభివృద్ధికి బాటలు పరిచేలా ఈ సదస్సు మేటి పరిష్కారాలు చూపనుంది.

ఒక దేశం లేదా ప్రాంతం అభివృద్ధికి నాణ్యమైన మౌలిక వసతులే కొలమానం. ఈ వసతులు లేనిదే సామాజిక-ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ సాధ్యపడదు. రహదారులు, విద్యుత్‌ కేంద్రాలు, రేవులు, నీటి సరఫరా వంటి సదుపాయాల కల్పనకు ఎంత భారీగా పెట్టుబడులు పెడితే అంత ఎక్కువగా ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని అన్ని ప్రభుత్వాలకూ తెలుసు. అందుకే బడ్జెట్‌ కేటాయింపుల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తాయి. ఆ నిధులను వెచ్చించి అనేక కార్యక్రమాలు చేపడతాయి. మౌలిక వసతుల విస్తరణకు నిధుల కేటాయింపును 10 శాతం పెంచితే స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఒక్క శాతం పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు గణించింది.

ఆర్థిక సవాళ్లకు పరిష్కారాల దిశగా...

తూర్పు ఆసియా ఆర్థిక సంక్షోభం విరుచుకుపడిన దరిమిలా 1999లో ఏర్పడిన గ్రూప్‌ ఆఫ్‌ 20 (జీ-20)లో 19 దేశాలు, ఐరోపా సమాఖ్య సభ్యులుగా ఉన్నాయి. ఈ బృందం అంతర్జాతీయ పెట్టుబడులు, ఆర్థిక సంబంధ సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను ప్రతిపాదిస్తుంది. ప్రపంచ జనాభా, జీడీపీ, వాణిజ్యం, పరిశోధన-అభివృద్ధి వ్యయంలో సింహభాగం జీ-20 దేశాలదే. అందువల్ల అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించే బాధ్యతను ఎక్కువగా ఈ బృందమే తీసుకోవాలని యోచించారు. తదనుగుణంగా 2009లో దేశాధినేతల స్థాయిలో అంతర్జాతీయ సహకార సాధనకు ప్రధాన వేదికగా జీ-20ని ప్రకటించారు. అభివృద్ధికి కారణమయ్యే మూలస్తంభాల్లో ఒకటిగా మౌలిక వసతులను గుర్తించారు. పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉత్పాదకత, జీవన ప్రమాణాలు... ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయని 2012లో మెక్సికోలోని లాస్‌ కాబోస్‌ నగరంలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం ఉద్ఘాటించింది. అప్పటి నుంచి ఈ అంశం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. మౌలిక వసతుల విస్తరణలో పెట్టుబడులు, రుణాలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాలు నిరూపించాయి.

ఆస్ట్రేలియాలో 2014లో నెలకొల్పిన అంతర్జాతీయ మౌలిక వసతుల కేంద్రం, ప్రపంచ బ్యాంకు నెలకొల్పిన అంతర్జాతీయ మౌలిక వసతుల ప్రోత్సాహక సంస్థలు మౌలిక వసతుల అభివృద్ధికి సంస్థాగతంగా మద్దతు అందిస్తున్నాయి. అన్నిదేశాలు అభివృద్ధి సాధనకు మౌలిక వసతులే మూలాధారమన్న భావనకు రావడంతో పాటు- ఈ వసతుల విస్తరణకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని గుర్తించాయి. జీ-20 నెలకొల్పిన మౌలిక వసతుల కార్యబృందం (ఐడబ్ల్యూజీ) ఈ అవగాహనతోనే ముందుకు వెళుతోంది. ప్రభుత్వాలు మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంత భారీగా వ్యయం చేసినా వివిధ మార్గాల నుంచి మరిన్ని నిధులు సమీకరిస్తేనే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రైవేటు రంగం, అంతర్జాతీయ సంస్థలు, ద్వైపాక్షిక, బహుళ పక్ష సహకారం ద్వారా మౌలిక వసతుల అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు సాధించవచ్చు. బాండ్లు, వాటాలు వంటి విత్త సాధనాల ద్వారా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి అదనపు నిధులు సేకరించవచ్చు. తుర్కియే, చైనా, జర్మనీలు జీ-20 సారథ్యం వహించిన సంవత్సరాల్లో వీటి ప్రాధాన్యాన్ని గుర్తించాయి. 2018లో అర్జెంటీనా జీ-20 అధ్యక్ష స్థానాన్ని అలంకరించినప్పుడు మౌలిక వసతులను ప్రత్యేక ఆస్తిగా వర్గీకరించారు. అప్పటి నుంచి జీ-20 నాణ్యత, సాంకేతికత, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా స్థిరంగా మౌలిక వసతుల అభివృద్ధిని సాధించేందుకు ప్రాధాన్యమిస్తోంది.

మరింత జోరుగా పట్టణీకరణ

జీ-20 సారథిగా భారత్‌ 2022 డిసెంబరు నుంచి పగ్గాలు స్వీకరించడంతో మౌలిక వసతుల విస్తరణను వసుధైవ కుటుంబం దృక్కోణంలో పరికిస్తోంది. ఒకే ప్రపంచం, ఒకే భవిత అన్నది వసుధైవ కుటుంబ నినాద సారాంశం. జీ-20 మౌలిక వసతుల కార్యబృందానికి భారత్‌ ‘భావి నగరాల అభివృద్ధికి నిధుల సమీకరణ’ అనే సరికొత్త ప్రాధాన్య అంశాన్ని అందించింది. ఈ అంశానికి జీ-20 మునుపెన్నడూ ప్రత్యేకించి ఇంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రపంచ జనాభాలో మూడింట రెండువంతుల మంది 2050 నాటికి నగరాలు, పట్టణాల్లోనే నివసిస్తారు. ధనిక, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పట్టణీకరణ మరింత జోరు అందుకోనున్నది. పట్టణీకరణ విస్తరణ జీడీపీ అభివృద్ధికి చోదకశక్తి అవుతుంది. ఇప్పటికే ప్రపంచ జీడీపీలో 80శాతం పట్టణాలు, నగరాల నుంచే వస్తోంది. కాబట్టి పట్టణీకరణ ప్రక్రియ మరింత సమర్థంగా, స్థిరంగా సాగితేనే గొప్ప ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై), స్వచ్ఛభారత్‌, ఇంటింటికీ తాగునీరు (హర్‌ ఘర్‌ జల్‌), పట్టణ మౌలిక వసతులకు కొత్త ఊపు (అమృత్‌), మెట్రో, బీఆర్‌టీఎస్‌ వంటి పట్టణ రవాణా ప్రాజెక్టులు... సాంకేతికత ఆధారంగా ఆదర్శ నగరాల అభివృద్ధి వంటి పథకాలతో భారతదేశం పట్టణీకరణలో ముందుకెళుతోంది. అదే సమయంలో పట్టణీకరణ మరింత కర్బన ఉద్గారాలకు దారితీయకుండా జాగ్రత్త వహించాలి. ఉద్గారాలపరంగా నికర సున్నా (నెట్‌ జీరో ఎమిషన్స్‌) లక్ష్యసాధనకు అన్ని దేశాలూ అంకితం కావాలి. రేపటి నగరాలు, పట్టణాలు సమ్మిళిత అభివృద్ధికి, సుస్థిరాభివృద్ధికి ప్రతీకలుగా నిలిచేలా జాగ్రత్త వహించాలి.

నిధుల సమీకరణపై కీలక చర్చలు

పుణె నగరం జీ-20 మౌలిక వసతుల కార్యబృందం (ఐడబ్ల్యూజీ) శిఖరాగ్ర సమావేశ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. రేపటి నగరాలు స్వావలంబన యుతంగా, ఆత్మవిశ్వాసపూరితంగా, ఆర్థిక సాధికారతతో అవతరించాలి. ఈ లక్ష్యసాధనకు కావలసిన నిధుల సమీకరణపై పురపాలక సంఘాలు, నగర పాలికలు దృష్టి సారించడం ఎంతో అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి అన్ని విధాలా చేయూత అందించాలి. ఐడబ్ల్యూజీ సమావేశాలకు తోడు పుణె విశ్వవిద్యాలయంలో పట్టణ పాలనపై మున్సిపల్‌ కమిషనర్ల భేటీ జరుగుతుంది. పట్టణాలు, నగరాల అభివృద్ధికి నిధుల సమీకరణలో ఎదురయ్యే సవాళ్లపై ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) మరో సమావేశం ఏర్పాటు చేస్తుంది. సమాజంలో అన్నివర్గాల అవసరాలను తీరుస్తూనే సుస్థిర నగరాభివృద్ధి కోసం అనుసరించాల్సిన మార్గాల గురించి వక్తలు విలువైన సూచనలు చేయనున్నారు. ఐడబ్ల్యూజీ శిఖరాగ్ర సమావేశం వసుధైవ కుటుంబం స్ఫూర్తితో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మధ్య మౌలిక వసతుల అనుసంధానం సాధించేందుకు ప్రాధాన్యమివ్వాలి. జీ-20 అధ్యక్ష హోదాలో భారత్‌ ఈ దిశగా కృషిని ద్విగుణీకృతం చేయాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నదుల్ని కాటేస్తున్న వ్యర్థాలు

‣ మానవ తప్పిదం... ప్రకృతి ఆగ్రహం!

‣ ఎగుమతులు పెరిగితేనే ఆర్థిక ప్రగతి

‣ తుర్కియే జిత్తులకు పైయెత్తు!

Posted Date: 14-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం