• facebook
  • whatsapp
  • telegram

ఆధిపత్యం కోసం డ్రాగన్‌ తహతహ

అమెరికాను అధిగమించడమే లక్ష్యం

అమెరికాను అన్ని విధాలుగా అధిగమించి తానే అగ్రరాజ్యంగా ఎదగాలన్నది చైనా చిరకాల స్వప్నం. కల కనడంతోనే సరిపెట్టుకోకుండా దాన్ని సాధించడానికి పట్టుదలగా కృషి చేస్తోంది. దీనికి కాలమూ కలిసివస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం, 2016లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక, 2020లో కరోనా వైరస్‌ విజృంభణ- చైనా అగ్రరాజ్యంగా ఎదగడానికి పునాదిని ఏర్పరచాయి. 2008, 2020 సంక్షోభాల నుంచి చెక్కుచెదరకుండా బయటపడిన చైనా ఈ దశాబ్దం ముగిసే లోపలే జీడీపీలో అమెరికాను మించనుంది. అమెరికా చిరకాల మిత్రులైన ఐరోపా దేశాలను ట్రంప్‌ దూరం చేసుకోవడంతో ఐరోపా సమాఖ్య (ఈయూ) చైనాకు దగ్గరవుతోంది.  చైనాతో సమగ్ర పెట్టుబడుల ఒప్పందం (సీఏఐ) కుదుర్చుకోనున్నట్లు పది రోజుల క్రితం ఈయూ ప్రకటించింది. ఇది ఆర్థికంగా చైనాకు కీలక మలుపు. తరవాత జనవరి ఒకటిన సైనికంగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రోజు దేశాధ్యక్షుడు, కమ్యూనిస్ట్‌ పార్టీ అధినేత షీ జిన్‌పింగ్‌కు అపార సైన్యాధికారాలను కట్టబెడుతూ తన జాతీయ రక్షణ చట్టాన్ని సవరించింది. విదేశాల్లో తమ పెట్టుబడులు, ప్రాజెక్టులు, కంపెనీలు, పౌరులను రక్షించుకోవడం కోసం సైనిక చర్యకు దిగడానికి సిద్ధమని తాజా సవరణ ద్వారా చైనా చాటిచెబుతోంది. దీనికి కావలసిన సైనిక, పౌర వనరులను సమీకరించే అధికారాన్ని జిన్‌పింగ్‌కు ధారాదత్తం చేసింది. లద్దాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొని ఉన్న తరుణంలో ఈ సవరణ జరగడం కీలక పరిణామమే అయినా, ఇది ప్రధానంగా అమెరికా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఉద్దేశించినది. దానికి తగ్గట్టే చైనా సేనలు నిరంతర శిక్షణతో పోరాట పటిమకు పదును పెట్టుకొంటూ ఎప్పుడు యుద్ధం వచ్చినా తలపడటానికి సన్నద్ధంగా ఉండాలని జిన్‌పింగ్‌ పిలుపిచ్చారు. 2012లో సర్వసైన్యాధ్యక్షుడైనప్పటి నుంచి ఆయన ఇదే మాట చెబుతున్నారు. తన అజెండాను పూర్తిస్థాయిలో అమలుచేయడానికి తాజాగా జాతీయ రక్షణ చట్టానికి సవరణ తీసుకొచ్చారు.

అత్యాధునిక సేనగా పీఎల్‌ఏ

భూతల, సముద్రతల, గగనతల, అంతరిక్ష, ఎలక్ట్రోమేగ్నటిక్‌ సీమల్లో చైనాకు ఎదురుకాగల సవాళ్లను అధిగమించాలని కొత్త సవరణ సూచిస్తోంది. స్వదేశంలో, విదేశాల్లో చైనా ప్రయోజనాలకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను సమన్వయపరచే అధికారాన్ని జిన్‌పింగ్‌కు కట్టబెట్టింది. దీని అర్థం- కొత్త ఆయుధాల రూపకల్పన, ఉత్పత్తి, సైబర్‌ భద్రత, అంతరిక్ష సీమల్లో నవ్య ఆవిష్కరణలకు అన్ని రంగాలు కలిసి పనిచేస్తాయని. పౌర, సైనిక వనరులను మేళవించి దేశవిదేశాల్లో చైనా ప్రయోజనాలను కాపాడుకోవాలని. ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) శతజయంత్యుత్సవ సంవత్సరమైన 2027కల్లా సైనికంగా అమెరికాకు సమఉజ్జీ కావాలని నిరుడు నవంబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ తీర్మానించిన దరిమిలా ఈ సవరణ చేపట్టారు. 2027 కల్లా పీఎల్‌ఏని పూర్తిగా ఆధునిక సైన్యంగా మలచనున్నారు. సముద్ర జలాల్లో ఎంత దూరమైనా పయనించి పోరాడగల బలగంగా నౌకాదళాన్ని తీర్చిదిద్దుతున్నారు. అందుకోసం విమాన వాహక యుద్ధ నౌకలు సమకూర్చుకుంటున్నారు. గగన సీమలో పోరుకు ఆధునిక యుద్ధ విమానాలు, ఉపగ్రహ విధ్వంస క్షిపణులు తదితరాలను సిద్ధం చేసుకుంటున్నారు. నింగి, నేలపై ఎక్కడ, ఎప్పుడు పోరాటం జరిగినా నెగ్గాలని జిన్‌పింగ్‌ లక్షిస్తున్నారు. చైనా అపారంగా పెట్టుబడులు గుమ్మరించిన బెల్ట్‌ రోడ్‌ (బీఆర్‌ఐ)  పథకానికి, తమ నౌకా రవాణా మార్గాలకు ముప్పు ఎదురవకుండా చూసుకోవడం జిన్‌పింగ్‌ ధ్యేయం. ప్రపంచ కర్మాగారంగా ఆవిర్భవించిన చైనా ముడిసరకులు, చమురు దిగుమతికి, పారిశ్రామిక వస్తు ఎగుమతికి నౌకా రవాణా మార్గాలపై ఆధారపడుతోంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ (బీఆర్‌ఐ) పథకమూ ఆర్థిక ఆయువుపట్టుగా నిలుస్తుంది. బీఆర్‌ఐలో అంతర్భాగమైన చైనా-పాకిస్థాన్‌ కారిడార్‌ (సిపెక్‌) ప్రాజెక్టుకు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్‌- బల్టిస్తాన్‌లో, బలూచిస్థాన్‌లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొత్త సవరణ ప్రకారం దేశ, విదేశాల్లో చైనా అభివృద్ధి ప్రయోజనాల సంరక్షణకు సైనిక చర్యకు దిగే అధికారం జిన్‌పింగ్‌కు సంక్రమించింది కాబట్టి, సిపెక్‌ విషయంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. చైనా ఆత్మరక్షణకు, ఆర్థిక ప్రయోజనాల సంరక్షణకు పరిమితమైతే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆర్థిక, సైనిక ప్రయోజనాల కోసం పొరుగు దేశాల భూభాగాలను, సముద్ర జలాలను కబ్జా చేయడంతోనే పేచీ వస్తోంది. తూర్పుచైనా, దక్షిణ చైనా సముద్రాలలో, హిమాలయాల్లో జరుగుతున్నది అదే. బెల్ట్‌, రోడ్‌ పథకానికి దారి కోసం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భూభాగాలను గుప్పిట్లోకి తీసుకుని- డోక్లాం, లద్దాఖ్‌లలో చొరబాట్లకు ప్రయత్నించడం చైనా ఆధిపత్య ధోరణికి నిదర్శనం. పొరుగు దేశాలతో గిల్లికజ్జాలు స్వల్పకాల వ్యూహమైతే, అగ్రరాజ్యంగా ఎదగడానికి అమెరికా నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం దీర్ఘకాల వ్యూహం. 2028కల్లా అమెరికాను ఆర్థికంగా అధిగమించనున్న చైనా, కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వ శత జయంతి (2049) నాటికి దుర్నిరీక్ష సైనిక శక్తిగా ఎదగాలనుకుంటోంది.

ఆర్థిక వ్యూహం

చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఆర్థిక కూటములను కట్టకుండా నివారించడానికి జిన్‌ పింగ్‌ తానే ముఖ్య దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఆసియా దేశాలతో ఇటీవల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సెప్‌) కుదుర్చుకున్న తరవాత, తాజాగా ఐరోపా సమాఖ్య (ఈయూ)తో సమగ్ర పెట్టుబడుల ఒప్పందం (సీఏఐ)పై ముందడుగు వేశారు. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ వద్దని వారిస్తున్నా వ్యూహపరంగా తనకు స్వయంనిర్ణయాధికారం ఉందని చాటుకోవడానికే ఈయూ సీఏఐపై ముందుకెళుతోంది. దీనిపై ఐరోపా పార్లమెంటు చర్చలు జరిపి ఆమోద ముద్ర వేయడానికి కనీసం సంవత్సర కాలం పడుతుంది. సంతకాలు జరిగేది ఆ తరవాతే. ట్రంప్‌ హయాములో ఈయూకు అమెరికాకు మధ్య పెరిగిన దూరాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి చైనా వడివడిగా అడుగులు వేసింది. చైనాలో ఈయూ దేశాల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 14,000 కోట్ల యూరోలైతే, ఈయూలో చైనా ఎఫ్‌డీఐ 12,000 కోట్ల యూరోలకు చేరింది. చైనాలో ఈయూ పెట్టుబడుల్లో సగ భాగం పరిశ్రమల రంగంలోనే ఉంది. వాటిలో జర్మన్‌ ఆటొమొబైల్‌ కంపెనీల పెట్టుబడులే ఎక్కువ. అందువల్ల చైనాతో సీఏఐ కుదుర్చుకోవడానికి జర్మనీయే చొరవ తీసుకుంది. 2021 సెప్టెంబరు వరకు ఈయూ అధ్యక్ష పదవిని జర్మన్‌ ఛాన్సలర్‌ ఆంగెలా మెర్కెల్‌ నిర్వహించనుండటం దీనికి కలిసివచ్చింది. అయితే సీఏఐని ఐరోపా పార్లమెంటు ఆమోదించడానికి కనీసం సంవత్సర కాలం పడుతుంది. కొన్ని ఈయూ దేశాలు చైనాతో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నందువల్ల సీఏఐ కార్యరూపం దాలుస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఈలోగా బైడెన్‌ ప్రభుత్వం ఈయూను చైనా కక్ష్య నుంచి బయటపడేయడానికి ప్రయత్నించక మానదు.

- ఏఏవీ ప్రసాద్‌
 

Posted Date: 09-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం