• facebook
  • whatsapp
  • telegram

బ్రిటన్‌తో భారత్‌ బంధం బలోపేతం.

కలిసొచ్చిన బ్రెగ్జిట్‌ ఒప్పందం అమలు

బ్రెగ్జిట్‌ అనంతర పరిణామాలు భారత్‌కు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐరోపా సంఘం (ఈయూ)లో ఉండి అనవసర ఆర్థిక భారం మోస్తున్నట్లు భావించిన బ్రిటన్‌ వెలుపలికి వచ్చేసింది. ఈ మేరకు 2021 ప్రారంభం నుంచి బ్రెగ్జిట్‌ ఒప్పందం అమలులోకి వచ్చింది. కరోనా కొత్త స్ట్రెయిన్‌ బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థపై పిడుగుపాటులా పరిణమించగా, 2020 క్రిస్మస్‌కు ముందు ఈయూతో హడావుడిగా చేసుకున్న వాణిజ్య ఒప్పందం పెద్దగా ప్రయోజనం చేకూర్చదని తెలుస్తోంది. బ్రిటన్‌కు ఈ వాణిజ్య ఒప్పందం నుంచి ఏ మాత్రం అదనపు లబ్ధి చేకూరినా, ఐరోపా సంఘం  నుంచి బయటకు రావాలనే ఆలోచన మిగిలిన సభ్య దేశాల్లో పుట్టుకొచ్చి మొత్తం ఉనికే ప్రమాదంలో పడుతుందని గ్రహించిన ఈయూ  బ్రిటన్‌కు లబ్ధి చేకూర్చే ఆలోచనే చేయలేదు. ఎలాంటి ఒప్పందం లేకుండా వైదొలగితే బ్రిటన్‌కు పన్నుల తాకిడి తప్పని పరిస్థితి తలెత్తింది. దానివల్ల జీడీపీలో ఆరు శాతం వరకు నష్టం తప్పదని తేలడంతో, బ్రిటన్‌ రెండు మెట్లు కిందకు దిగి ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ జీడీపీలో నాలుగు శాతం మేర నష్టం తప్పకపోవచ్చని తెలుస్తోంది.

గట్టి ఎదురు దెబ్బ...

బ్రిటన్‌ బ్రెగ్జిట్‌కు వెళ్లడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన చేపల వేట విషయంలో ఆశించిన ఫలితం కోసం కొత్త ఒప్పందం ప్రకారం మరో ఐదేళ్లకు పైగా ఎదురు చూడాల్సిందే. ఇక ఇరుపక్షాలు సరకు ఎగుమతులు, దిగుమతులపై పన్నులు, కోటాలు విధించవు. కానీ, ఐరోపా సంఘంలోకి వచ్చే వస్తువులు ఎక్కడ తయారయ్యాయో బ్రిటన్‌ కచ్చితంగా వెల్లడించాలి. దీంతో సరిహద్దుల్లో ట్రక్కుల తనిఖీలు ఇతరత్రా పనులు పెరిగాయి. సేవా రంగం విషయంలో బ్రిటన్‌కు విజయం దక్కలేదు. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థలో 80 శాతం సేవా రంగానిదే. బ్యాంకింగ్‌, ఆర్కిటెక్చర్‌, అకౌంటింగ్‌ రంగాల సంస్థలు మునుపటిలా ఈయూ మార్కెట్లోకి అడుగు పెట్టలేవు. ఇప్పటికే కీలకమైన గెలీలియో నేవిగేషన్‌ ప్రోగ్రాం నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చేసింది. బ్రెగ్జిట్‌ తరవాత దీన్ని వాడుకోబోమని గతంలోనే ప్రకటించింది. బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించిన స్కాట్లాండ్‌ అసంతృప్తితో ఉండటంతో అక్కడ మరోసారి రెఫరెండం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
బ్రెగ్జిట్‌ షాక్‌ నుంచి తేరుకొని బ్రిటన్‌ ఆర్థికంగా పుంజుకోవాలంటే బలమైన వ్యాపార భాగస్వాములు ఉండాలి. చైనా మార్కెట్‌ ఉన్నా- హాంకాంగ్‌ అంశం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. త్వరలో బ్రిటన్‌ ప్రకటించనున్న ఇండో-పసిఫిక్‌ వ్యూహం, స్వేచ్ఛా నౌకాయానానికి మద్దతిచ్చే భారత్‌కు అనుకూలంగానే మారే అవకాశం ఉంది. అతి పెద్ద విపణిగా పేరున్న భారత్‌ యూకేలో రెండో అతి పెద్ద పెట్టుబడిదారుగా అవతరించింది. 2019-20లో 120 ప్రాజెక్టుల్లో భారత్‌ నుంచి పెట్టుబడులు సమకూరినట్లు తెలుస్తోంది. దాదాపు 850కి పైగా భారత కంపెనీలు అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. చిన్న ఉపగ్రహాల ద్వారా అంతర్జాలాన్ని అందుబాటులోకి తీసుకురావాలని బ్రిటన్‌లో ఒన్‌వెబ్‌ సంస్థ ప్రయోగాలు మొదలుపెట్టింది. తొలివిడతలో లక్ష్యంగా పెట్టుకొన్న 648 ఉపగ్రహాల్లో 74 ప్రయోగించాక అది దివాలా తీసింది. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ దీనిలో 45 శాతం వాటా కొనుగోలు చేసింది. బ్రిటన్‌ ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టింది. దీంతో ఈ కంపెనీ కోలుకొని ఇటీవలే మరో 36 ఉపగ్రహాలను ప్రయోగించింది. భవిష్యత్తు తరం అంతర్జాల సేవల్లో ఇది విప్లవాత్మక మార్పులను తెచ్చే అవకాశం ఉంది.

త్రిసూత్ర ప్రాతిపధిక

భారత్‌-బ్రిటన్‌ వాణిజ్యాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి బ్రెగ్జిట్‌ ఓ అరుదైన అవకాశమని నవంబర్‌లో బ్రిటన్‌ వెళ్లిన సందర్భంగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా వ్యాఖ్యానించడం ఆయన పర్యటన ఉద్దేశాన్ని చెబుతోంది. ఆ మరుసటి నెలలోనే బ్రిటన్‌ విదేశాంగశాఖ కార్యదర్శి డోమెనిక్‌ రాబ్‌ భారత్‌లో పర్యటించారు. గణతంత్ర వేడుకలకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పర్యటన రద్దయినా, త్వరలోనే భారత్‌ వస్తానని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విజ్ఞానశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో పరస్పర సహకారం ఉభయతారకం కాగలదు. బ్రిటన్‌లో అభివృద్ధి, భారత్‌లో తయారీ, ప్రపంచవ్యాప్తంగా విక్రయం చేపట్టే విధానం ప్రభావశీలంగా ఉంటుంది. దీనికి ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ మంచి ఉదాహరణ. భారత ప్రధాని మోదీ బ్రిటన్‌లో జరిగే జీ7 సమావేశానికి హాజరు కానున్నారు. అక్కడ డీ10 (డెమొక్రాటిక్‌ 10) దేశాల బృందం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. కొవిడ్‌ పరిస్థితుల నుంచి పూర్తిస్థాయిలో బయటపడిన తరవాత భారత్‌- బ్రిటన్‌ బంధం మరింత బలపడే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి.

- పెద్దింటి ఫణికిరణ్‌
 

Posted Date: 12-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం