• facebook
  • whatsapp
  • telegram

సమైక్యతే కొండంత అండ

ఇండొనేసియా తీరంలో 2004 డిసెంబరులో హిందూ మహాసముద్ర గర్భ భూ ఫలకాలు ఒరుసుకోవడంతో తీవ్ర భూకంపం, భీకర సునామీ సంభవించాయి. దీనివల్ల ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో వేలమంది మరణించారు, లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఆధునిక చరిత్రలో మానవాళి కనీవినీ ఎరుగని ఉపద్రవమది. ఆ సందర్భంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంత ప్రజలు సహాయం కోసం చేసిన ఆర్తనాదాల్ని ఆలకించి మన నాలుగు దేశాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రజాస్వామ్య దేశాలైన ఆస్ట్రేలియా, భారత్‌, జపాన్‌, అమెరికాలు హుటాహుటిన చేతులు కలిపి- ‘క్వాడ్‌’ ఛత్రం కింద సమన్వయ సహకారాలతో ఆపన్నులకు వేగంగా సహాయం అందించాయి. బాధితులు ప్రకృతి ఉత్పాతం నుంచి శీఘ్రంగా తేరుకోవడానికి మానవ కారుణ్య దృష్టితో సకల విధాలుగా తోడ్పడ్డాయి. ఈ విధంగా 2004నాటి పెను సంక్షోభ సమయంలో సాటి మానవ సహాయార్థం అవతరించిన క్వాడ్‌, 2007లో దౌత్యపరమైన సంభాషణల వేదికగా పనిచేసింది. తరవాత కొన్నేళ్లపాటు నిద్రావస్థలోకి వెళ్ళిపోయి, తిరిగి 2017లో కొత్త జవజీవాలతో పునరుత్థానం చెందింది. ప్రస్తుత ప్రపంచం పరస్పర అనుసంధాన యుగంలో ముందుకెళుతోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కొత్త అవకాశాలు వికసిస్తున్నాయి. అదే సమయంలో కొత్త అవసరాలూ ముందుకొచ్చాయి. ఇలాంటి కీలక తరుణంలో ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి క్వాడ్‌ సహాయం మళ్ళీ అవసరమవుతోంది.

అధిగమించాల్సిన సవాళ్లు

సునామీ తరవాత వాతావరణ మార్పులు ప్రమాదకరంగా మారసాగాయి. సాంకేతిక మార్పులు మన రోజువారీ జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగా, అంతర్జాతీయ రాజకీయాలు మహా జటిలంగా మారాయి. ఇవి చాలవన్నట్లు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ఈ పూర్వ రంగంలో ఇండో-పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా, అభివృద్ధి ఫలాలను అందరూ పంచుకునే నెలవుగా, ఒడుదొడుకులను తట్టుకుని ఎదిగే ప్రదేశంగా మార్చాలన్న క్వాడ్‌ ఉమ్మడి ఆశయానికి పునరంకితమవుతున్నాం. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అందరికీ ప్రవేశ సౌలభ్యం ఉండాలి. ఇక్కడి సముద్ర జలాల్లో, గగనంలో అన్ని దేశాల నౌకలు, విమానాలు స్వేచ్ఛగా సంచరించగలగాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, ఎలాంటి విభేదాలనైనా శాంతియుతంగా పరిష్కరించుకొనే పద్ధతిని అందరూ అనుసరించాలి. ఒత్తిళ్లకు అతీతంగా తీరస్థ దేశాలకు తమకు నచ్చిన రాజకీయ పంథాను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి- క్వాడ్‌ దార్శనికతలోని ప్రధానాంశాలు ఇవే. కానీ, ఇటీవలి కాలంలో ఈ ఉదాత్త ఆశయాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అత్యవసర ప్రాతిపదికన కలిసికట్టుగా అధిగమించాలన్న దృఢ సంకల్పం క్వాడ్‌ దేశాల్లో మరింత బలపడింది. క్వాడ్‌ దేశాలు ఎన్నో ఏళ్ల నుంచి చేయిచేయి కలిపి పనిచేస్తున్నాయి. మన అర్థవంతమైన సహకారాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళే ధ్యేయంతో గత శుక్రవారం దేశాధినేతల స్థాయిలో సమావేశమయ్యాం. ఇది క్వాడ్‌ చరిత్రలోనే మొట్టమొదటిది. కొత్త సాంకేతికతలు తెచ్చిపెడుతున్న సవాళ్లను ఉమ్మడి భాగస్వామ్యంతో అధిగమించి, భావి నవీకరణలకు సరైన ప్రమాణాలను నిర్దేశించాలని ఈ వర్చువల్‌ సభలో తీర్మానించాం. వాతావరణ మార్పు యావత్‌ ప్రపంచంతోపాటు ఇండో పసిఫిక్‌ ప్రాంతానికీ ప్రమాదకరంగా తయారవుతోంది. దీన్ని నివారించడం మనందరి ప్రథమ కర్తవ్యం. తదనుగుణంగా ప్యారిస్‌ ఒప్పందాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి అన్ని దేశాలతో కలిసి ముందుకు వెళ్లదలచాం. ప్రపంచ దేశాలు వాతావరణ మార్పుల నిరోధానికి తీసుకునే చర్యలకు క్వాడ్‌ దేశాలు అన్నివిధాలుగా తోడ్పడతాయి. కొవిడ్‌ కొనసాగినంత కాలం ఏ దేశమూ క్షేమంగా ఉండలేదు. ప్రపంచ ప్రజల ఆరోగ్యం, భద్రతల సంరక్షణార్థం ఈ మహమ్మారిని సాధ్యమైనంత త్వరగా అంతమొందించాలని లక్షిస్తున్నాం. ఇటీవలి కాలంలో మన ఆరోగ్యానికి, ఆర్థిక సుస్థిరతకు ఇంత ముప్పును తీసుకొచ్చింది మరొకటి లేదు. దీన్ని అరికట్టడానికి క్వాడ్‌ దేశాలే కాదు- యావత్‌ ప్రపంచం చేతులు కలిపి నడవాలి. ఈ అవగాహనతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికింద భారతదేశంలో భద్రమైన, సమర్థమైన కొవిడ్‌ వ్యాక్సిన్లను పెద్దయెత్తున ఉత్పత్తి చేసి- ఇండో పసిఫిక్‌ దేశాల ప్రజలకు వేగంగా అందించాలని ప్రతిన బూనాం.

ఈ ప్రాంత ప్రజలకు 2022 వరకు కొవిడ్‌ టీకాలను సరఫరా చేయడానికి ప్రతి అంచెలో ఐక్యంగా ముందుకు సాగుతాం. ఈ లక్ష్య సాధనకు క్వాడ్‌ దేశాలు తమ శాస్త్రసాంకేతిక ప్రతిభ, ఆర్థిక వనరులు, టీకా ఉత్పత్తి సామర్థ్యాలను సమర్థంగా మేళవిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కొవాక్స్‌ పథకం, ఇతర అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తాయి. వివిధ వ్యాధుల నియంత్రణకు గతంలో టీకాలు సరఫరా చేసిన చరిత్ర క్వాడ్‌కు ఉంది. ఆ అనుభవం ఇప్పుడు మళ్ళీ అక్కరకొస్తుంది. ఇండో పసిఫిక్‌ దేశాల ప్రజల అవసరాలను తీర్చడానికి భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు క్వాడ్‌ వ్యాక్సిన్‌ నిపుణుల బృందంగా ఏర్పడ్డారు. వీరు కొవిడ్‌ టీకా కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతానికి కొవిడ్‌ వల్ల మేమంతా వ్యక్తిగతంగా సమావేశం కాలేకపోయినా, 2021 ముగిసేలోపు తప్పకుండా ముఖాముఖి భేటీ జరుపుకొంటాం. ఇవాళ మేం చేసే వాగ్దానాలు రేపు ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్‌ అవతరణకు భూమిక ఏర్పరచనున్నాయి. ఈ అవగాహనతోనే సాహసోపేత నిర్ణయాలను ప్రకటించి వాటిని పకడ్బందీగా అమలు చేయడానికి తక్షణం కృషి ప్రారంభించబోతున్నాం.

బలపడనున్న భాగస్వామ్యం

కొవిడ్‌ మహమ్మారిని రూపుమాపి, అది సృష్టించిన విధ్వంసం నుంచి వేగంగా కోలుకోవడం, వాతావరణ మార్పులను అరికట్టడం, ఇండో పసిఫిక్‌ ప్రాంత భద్రత, అభివృద్ధిని సాధించడమనే లక్ష్యాలతో క్వాడ్‌ ముందుకు సాగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అంత సులువు కాదు. పరస్పర సహకారం, సమన్వయం లేనిదే ఈ పని సాధించలేమని మాకు తెలుసు. అందుకే, ఆగ్నేయాసియా దేశాల సంఘం, హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలు, పసిఫిక్‌ దీవుల ప్రజలతో క్వాడ్‌ భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకొంటాం. క్వాడ్‌- భావ సారూప్యతతో ఉమ్మడి లక్ష్యాలు, శాంతి సౌభాగ్యాల సాధనకు అంకితమైన దేశాల సంఘం. మా లక్ష్యాలలో పాలు పంచుకోవడానికి ముందుకొచ్చే ఏ దేశాన్నైనా క్వాడ్‌లోకి స్వాగతిస్తాం. అలాంటి దేశాలతో కలిసి ముందడుగు వేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇటీవలి కాలంలో కొవిడ్‌ వల్ల క్వాడ్‌ దేశాలు, ఇతర ప్రపంచ దేశాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. ఇంత బాధాకర సమయంలో క్వాడ్‌ భాగస్వామ్యం కాంతిరేఖలా నిలిచి దారి చూపుతోంది. మన ప్రజాస్వామ్య పునాదులు, కలిసి పనిచేయాలన్న కట్టుబాటు మనల్ని ఏకతాటిపై నడిపిస్తున్నాయి. అంతర్జాతీయ సంక్షోభాలను సమైక్యంగా ఎదుర్కోవడం ద్వారా మాత్రమే మన ప్రజలకు భద్రత కల్పించగలుగుతాం. ఈ విషాద సమయంలో సమైక్యతే మనకు కొండంత అండగా నిలిచి శక్తి, ఉత్తేజాలను అందిస్తుంది. ఇండో పసిఫిక్‌ను స్వేచ్ఛ, భద్రత, సుస్థిరత, సౌభాగ్యాలు వెల్లివిరిసే ప్రాంతంగా నిలపడానికి క్వాడ్‌ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తున్నాం.

అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిణామాల నేపథ్యంలో ‘క్వాడ్‌’ అవసరాన్ని, దాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాల్ని వివరిస్తూ... క్వాడ్‌ దేశాల అధినేతలు నరేంద్ర మోదీ (భారత ప్రధాని), జో బైడెన్‌ (అమెరికా అధ్యక్షుడు), స్కాట్‌ మోరిసన్‌ (ఆస్ట్రేలియా ప్రధాని), యోషిహిదే సుగా (జపాన్‌ ప్రధాని) సంయుక్తంగా రాసిన వ్యాసమిది.

Posted Date: 17-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం