• facebook
  • whatsapp
  • telegram

ఢాకాతో మైత్రీబంధం

బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ

బంగ్లాదేశ్‌ యాభై ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ నుంచి విడివడి స్వతంత్ర దేశంగా అవతరించడానికి భారత్‌ సర్వవిధాలా సాయపడింది. బంగ్లా స్వర్ణోత్సవాల్లో గౌరవ అతిధిగా పాల్గొనవలసిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ దేశం ఆహ్వానించడం, అందుకు ఆయన సమ్మతించడం రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక బంధానికి విశిష్ట ప్రతీక. పాకిస్థాన్‌ ఆవిర్భావానికి పునాది అయిన రెండు జాతుల వాదం- ఎంత తప్పుడు సిద్ధాంతమో బంగ్లా అవతరణ నిరూపించింది. భారతదేశం 1971 డిసెంబరు ఆరో తేదీన బంగ్లాదేశ్‌ను సార్వభౌమ దేశంగా గుర్తించింది. ఈ నెల 26, 27 తేదీల్లో భారత ప్రధాని మోదీ ఢాకాలో బంగ్లా స్వాతంత్య్ర స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొంటారు. దాంతోపాటు బంగ్లాదేశ్‌ జాతిపిత, బంగ బంధు షేక్‌ ముజిబుర్‌ రహమాన్‌ శత జయంత్యుత్సవంలోనూ నరేంద్ర మోదీ పాల్గొంటారు. తాజాగా ముజిబుర్‌ రహమాన్‌కు భారత్‌- గాంధీ శాంతి పురస్కారం (2020) ప్రకటించడం, దీనికి బంగ్లాదేశ్‌ కృతజ్ఞతలు తెలపడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. మోదీ పర్యటనలో రెండు దేశాలు బంగబంధు-బాపూ ప్రదర్శనలు నిర్వహిస్తాయి.

సువర్ణాధ్యాయం వైపు...

కొవిడ్‌ కాలంలో జాగ్రత్తలను పాటిస్తూనే మోదీతోపాటు పలువురు ప్రపంచ నాయకులు బంగ్లా జాతీయ ఉత్సవాల్లో పాల్గొంటారు. 1971 బంగ్లా విమోచన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమర వీరుల స్మారక చిహ్నాన్ని సందర్శించి ఘనంగా నివాళులు సమర్పిస్తారు. బంగ బంధు మ్యూజియంను సందర్శిస్తారు. ప్రత్యేక సైనిక కవాతులను వీక్షిస్తారు. భారత ప్రధాని మోదీ టుంగిపారాలో బంగబంధు ముజిబ్‌ స్వగృహాన్ని సందర్శించి అంజలి ఘటిస్తారు. తరవాత రెండు హిందూ ఆలయాలను దర్శించి, పూజాదికాలు సమర్పిస్తారు. వీటిలో ఒకటి పశ్చిమ్‌ బంగ సరిహద్దుకు సమీపంలో ఉన్న జెసోరేశ్వరియా కాళీ ఆలయం. బంగ్లాదేశ్‌తో భారత్‌కు 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ భౌగోళిక సరిహద్దుతోపాటు సముద్ర సరిహద్దుకు సంబంధించిన వివాదాలను కూడా రెండు దేశాలూ సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. 1974 నుంచి అపరిష్కృతంగా ఉన్న భూ సరిహద్దు వివాదం... 2015లో మోదీ బంగ్లా పర్యటనకు వెళ్లడానికి కొద్ది రోజుల ముందు పరిష్కారమైంది. భారత్‌, బంగ్లాల మధ్య భౌగోళిక సామీప్యతే కాకుండా చారిత్రక, భాషా, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు వర్ధిల్లుతున్నాయి. ఈ స్నేహసహకారాలు, ద్వైపాక్షిక సంబంధాలు సువర్ణ అధ్యాయానికి నాంది పలుకుతున్నాయి.

గడచిన యాభై ఏళ్లలో భారత్‌-బంగ్లా సంబంధాలు పలుమార్లు రాజకీయంగా ఒడుదొడుకులకు లోనైనా ఇతర రంగాల్లో పెనవేసుకున్న ప్రగాఢ బంధాలు రెండు దేశాల స్నేహాన్ని పటిష్ఠంగా నిలబెడుతూ వచ్చాయి. రాజకీయ విభేదాలకు ప్రధాన కారణం నదీ జలాల పంపకమే. గంగ, పద్మ, తీస్తాలతోపాటు మొత్తం 54 చిన్నాపెద్ద ఏరులు, నదులు రెండు దేశాల్లో ప్రవహిస్తూ భారత్‌, బంగ్లా ప్రజలకు జీవనాడులుగా నిలుస్తున్నాయి. బంగ్లాదేశీలు అక్రమంగా భారత్‌లోకి వలస వస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంపాటు రాజకీయ దుమారం రేపాయి. ఇప్పుడు రెండు దేశాలు కలిసి అక్రమ వలసలను నిరోధించాయి. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన, నిరుపేద దేశమైన బంగ్లాదేశ్‌ నేడు మధ్యాదాయ దేశం హోదాకు ఎదిగిందంటే, అది బంగ బంధు ముజిబ్‌ కుమార్తె, ప్రస్తుత బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా ఘనతే. బంగ్లాదేశ్‌ నేడు స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)లో ఏటా ఎనిమిది శాతానికిపైగా వృద్ధి రేటు నమోదు చేస్తూ- యావత్‌ దక్షిణాసియా ప్రగతి రథానికి ఆదర్శంగా నిలవడానికి ఉవ్విళ్లూరుతోంది.

రక్షణ రంగంలో సహకారం

గడచిన అయిదేళ్లలో నరేంద్ర మోదీ, షేక్‌ హసీనాల జమానాలోనే భారత్‌-బంగ్లా భూ, సముద్ర సరిహద్దు వివాదాలు పరిష్కారం కావడంతో ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. అయితే, రాజకీయ విభేదాలవల్ల నిరుడు ఈ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కనిపించింది. 2019 లోక్‌సభ ఎన్నికల తరవాత మోదీ ప్రభుత్వంపై బంగ్లాదేశ్‌లో పలు వర్గాలు అనుమాన దృక్కులు ప్రసరించాయి. భారత పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), బంగ్లాదేశీ వలసదారులపై కొన్ని వర్గాలు అవమానకర వ్యాఖ్యలు చేయడం రెండు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. భారత్‌-బంగ్లాల మధ్య ఏటా జరిగే వెయ్యి కోట్ల డాలర్ల ఆర్థిక లావాదేవీలూ దెబ్బతినే సూచనలు కనిపించాయి. ఈ ముప్పును నివారించడానికి మోదీ సర్కారు గట్టిగా కృషి చేసి ద్వైపాక్షిక బంధాన్ని మళ్లీ గాడిన పెట్టగలిగింది. గత డిసెంబరు 17న మోదీ-హసీనాల మధ్య జరిగిన వర్చువల్‌ సమావేశం ఇందుకు ఎంతో తోడ్పడింది. రెండు దేశాల మధ్య 1.9 కిలోమీటర్ల పొడవైన మైత్రీ సేతు నిర్మాణం, రైలు మార్గాల పునఃప్రారంభాన్ని ఈ కోణం నుంచి చూడాలి. భారత్‌ నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్లను అత్యధిక పరిమాణంలో అందుకొంటున్న దేశం బంగ్లాయే. కరోనా వైరస్‌ రెండుదేశాలనూ మళ్ళీ దగ్గర చేసిందని విశ్లేషకులు అంటున్నారు. భారత్‌, బంగ్లాల మధ్య రక్షణ సహకారమూ బలపడుతోంది. కొవిడ్‌ విరుచుకుపడిన తరవాత నరేంద్ర మోదీ ప్రత్యక్ష్యంగా పాల్గొంటున్న మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. ఈ యాత్ర రెండు దేశాల మైత్రి మరింత బలపడటానికి తోడ్పడనున్నది.

- నిలోవా రాయ్‌ చౌధురి
 

Posted Date: 26-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం