• facebook
  • whatsapp
  • telegram

మౌలిక వసతుల విస్తృతితోనే అభివృద్ధి.. భద్రత!

చైనా దూకుడుకు పగ్గాలేసే మార్గం

భారతదేశ సరిహద్దుల్లోనే కాకుండా పొరుగు దేశాల్లోనూ పెద్దయెత్తున మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం గురించి రవాణా నిపుణుడు రఘు దయాళ్‌ ఈటీవీ భారత్‌ ప్రతినిధి సంజీవ్‌ కె.బారువాతో మాట్లాడారు. చైనా దూకుడును దీటుగా ఎదుర్కోవడానికి ఇదే సమర్థ విధానమన్నారు. రఘు దయాళ్‌ కేంద్రంలో రవాణా, రైల్వే శాఖలు మొదలుకొని విదేశాంగ శాఖ వరకు అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు.

ప్రశ్న. మయన్మార్‌, లావోస్‌, కంబోడియాల మీదుగా సింగపూర్‌ వరకు చైనా భారీయెత్తున రవాణా, మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టడం- భారతదేశ ‘తూర్పు దిశగా కార్యాచరణ’ విధానాన్ని దెబ్బతీస్తుందా?

జవాబు. తూర్పు ఆసియా దేశాలతో ఆర్థికంగా, వ్యూహపరంగా బంధాన్ని బలపరచుకోవాలని భారత్‌, చైనాలు రెండూ లక్షిస్తున్నాయి. ముఖ్యంగా తన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, మయన్మార్‌లతో భారత్‌కు ఇప్పటికే చారిత్రక, సాంస్కృతిక, ఆర్థికపరంగా పటిష్ఠ భాగస్వామ్యం ఏర్పడి ఉంది. దీన్ని మరింత బలపరచుకోవడానికి భారత్‌ కృషి చేస్తోంది. ఈమధ్య ఆర్థికంగా ఎంతో బలోపేతమైన చైనా మన పొరుగున- ఆ మాటకొస్తే యావత్‌ తూర్పు ఆసియాలో వ్యాపార లావాదేవీలను విస్తరించుకొంటోంది. ఈ ప్రాంతంలో భారత్‌ పలుకుబడిని తగ్గించి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా కదులుతోంది. తన పెట్టుబడులు, శ్రమశక్తి, పరిశ్రమలకు ఆగ్నేయాసియా సంఘం (ఆసియాన్‌)లోని పది దేశాలు విశాల విపణిని అందిస్తాయని చైనా గ్రహించింది. తద్వారా ఆసియాన్‌ ప్రాంతంపై వ్యూహపరంగా పట్టు పెంచుకోవాలని చూస్తోంది. తూర్పు ఆసియా దేశాలతో తన భూభాగాన్ని కలిపే మెగా రోడ్డు, రైలు ప్రాజెక్టులనూ చైనా శరవేగంగా నిర్మిస్తోంది. లావోస్‌, కంబోడియా, థాయ్‌లాండ్‌, మలేసియా, ఇండొనేసియాలలో హైస్పీడ్‌ రైలు మార్గాలనూ చైనా నిర్మిస్తోంది. అయితే, ఈ భారీ ప్రాజెక్టులు కొన్ని దేశాలను అప్పుల ఊబిలోకి లాగే ప్రమాదం దండిగా ఉంది.

ప్రశ్న. ఈ లెక్కన రైలు, రోడ్డు మార్గాల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులు ఆర్థిక, సైనిక సత్తాకు ప్రతీకలుగా మారుతున్నాయా? వీటిని వేగంగా పూర్తిచేయాలనే ఆరాటమే ప్రస్తుత భారత్‌, చైనా ఘర్షణలకు మూలమా?

జవాబు. తుపాకీ గొట్టం నుంచి అధికారం వస్తుందనే మావో సే టుంగ్‌ సూక్తి గుర్తుంది కదా! సైనిక బలమే అధికారానికి సోపానమని దీని అర్థం. ఆర్థిక బలం ఉన్నప్పుడు సైనిక బలం పెంచుకోవచ్చు. కాబట్టి భారతదేశం తన జీడీపీని ఏటా ఎనిమిది శాతాన్ని మించి పెంచుకోగలిగినప్పుడు చైనా సైనిక దుస్సాహసాలను సమర్థంగా ఎదుర్కోగలుగుతుంది. సైనిక, వైమానిక బలగాలను పెంచుకోవడంతోపాటు సరిహద్దుల్లో రోడ్లు, వంతెనలు, విమాన స్థావరాలు, రైలు మార్గాల వంటి మౌలిక వసతులను పెద్దయెత్తున పెంపొందించుకోవడమూ చాలా కీలకం. గడచిన 40 ఏళ్లలో చైనా అద్భుత ఆర్థిక ప్రగతి సాధించి రోడ్లు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, రేవులు, ఆనకట్టలను విస్తృతంగా నిర్మించింది. వాటి పునాది మీదే నేడు బలప్రదర్శన చేస్తోంది. మౌలిక వసతుల పరంగా తన  బలహీనతలను గ్రహించిన భారత్‌ వెంటనే ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి భారీగా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టింది.

ప్రశ్న. ముత్యాలసరం రేవుల ప్రాజెక్టు ద్వారా భారత్‌ను చక్రబంధంలో ఇరికించడానికి చైనా వ్యూహం పన్నిందంటున్నారు. నిజమేనా?

జవాబు. చైనా పెద్దయెత్తున పారిశ్రామికోత్పత్తి సాధించి, దాన్ని ఎగుమతి చేయడం ద్వారానే ఇంత శీఘ్రంగా అభివృద్ధి చెందగలిగింది. చైనా పరిశ్రమలకు, రవాణా అవసరాలకు చమురు చాలా అవసరం. చమురు దిగుమతులు, చైనా వస్తు ఎగుమతులు మలక్కా జల సంధి ద్వారా వస్తూపోతూ ఉంటాయి. ఈ సముద్ర రవాణా మార్గాన్ని కాపాడుకోవడానికే తీరస్థ దేశాల్లో రేవు ప్రాజెక్టులను చేపడుతున్నట్లు చైనా చెప్పుకొంటోంది. ఇందులో భాగంగానే భారత్‌ ఇరుగుపొరుగు దేశాలైన మయన్మార్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, మాల్దీవుల్లో రేవులు నిర్మిస్తోంది. వీటికి తోడు బెల్డ్‌ అండ్‌ రోడ్‌ పథకాన్నీ జోరుగా పరుగులు తీయిస్తోంది. అభివృద్ధి పేరిట తన చుట్టూ చైనా అల్లుకుపోవడం చూసి భారత్‌ తన జాగ్రత్తలో తాను ఉండకతప్పదు.  

ప్రశ్న. ఇటీవలి వరకు భారతదేశం తన తూర్పు సరిహద్దుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టకుండా మిన్నకున్నది. ఈ సరిహద్దు ప్రాంతాలు చైనాకూ తనకూ మధ్య తటస్థ ప్రాంతాలుగా నిలుస్తాయనే అంచనాయే దీనికి కారణమా?

జవాబు. భారతదేశం ఉద్దేశపూర్వకంగా ఇటువంటి విధానాన్ని అనుసరించిందని నేను అనుకోను. అసలు తనకు చెందిన భూభాగాన్ని తటస్థ ప్రాంతంగా ఏ దేశమైనా ఎందుకు పరిగణిస్తుంది? సరిహద్దు ప్రాంతాలను ప్రధాన భూభాగంతో కలుపుతూ రోడ్డు, రైలు మార్గాలను నిర్మించాలనేది భారత ప్రభుత్వ ప్రకటిత విధానం. తదనుగుణంగా జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో రోడ్డు, రైలు మార్గాలు, వంతెనలు, అవసరమైన చోట్ల విమానాలు దిగే నెలవుల నిర్మాణాన్ని కొనసాగిస్తోంది. ఈశాన్య భారతాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించే ప్రాజెక్టులు ఈమధ్య కాలంలోనే ఊపందుకున్న మాట నిజం. సరిహద్దుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని భారత ప్రభుత్వం ఎన్నడూ విస్మరించలేదు. అయితే వాటి నిర్మాణం వేగవంతంగా జరగని మాట వాస్తవం.

ప్రశ్న. భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య భారతంతో కలిపే చికెన్స్‌ నెక్‌ ప్రాంతం శత్రు దాడితో మన చేజారిపోయే ప్రమాదం ఉందా? దీనికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారా?

జవాబు. కేవలం 27 కిలోమీటర్ల వెడల్పు ఉండే చికెన్స్‌ నెక్‌ ప్రాంతానికి ఏర్పడగల ముప్పు ఏమిటో డోక్లామ్‌పై చైనా దురాక్రమణ చేసినప్పుడే కాదు, దేశ విభజన సమయంలోనే అవగతమైంది. ఈ ప్రాంతం ద్వారా సైనికులు సరకులను, ఆయుధాలను వేగంగా రవాణా చేయడానికి అనువుగా రైలు, రోడ్డు మార్గాలు, వంతెనలు, విమాన స్థావరాల నిర్మాణాన్ని ముందుకు ఉరికిస్తున్నాం. 1950లలో ఇక్కడ నిర్మించిన మీటర్‌ గేజ్‌ రైలు లైనును వేగంగా బ్రాడ్‌ గేజిలోకి మారుస్తున్నాం. పౌర, సైనిక అవసరాల కోసం కొత్త రైల్వే లైన్లు, రోడ్లు నిర్మిస్తున్నాం. భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య రోడ్డు, రైలు అనుసంధానం ఇటీవల బలపడటం బాగా అక్కరకు రానుంది. ఏతావతా భారత్‌ భూభాగానికి ఈశాన్య భారతంతోపాటు పొరుగు దేశాలైన నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌లతో కూడా రవాణా అనుసంధానం పెరగనున్నది. ఇదంతా చివరకు ఆర్థిక పురోగతికి, సైనికపరంగా భద్రతకు తోడ్పడుతుంది.

Posted Date: 27-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం