• facebook
  • whatsapp
  • telegram

చైనా విస్తరణ కుట్రలు

మయన్మార్‌ వేదికగా పన్నాగాలు

చైనా 2021 జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త జాతీయ రక్షణ చట్టం తీసుకొచ్చింది. ఇది విదేశాల్లో చైనా సైనిక చర్యలను చట్టబద్ధం చేసింది. దీనిప్రకారం ఏ దేశంలోనైనా ‘డ్రాగన్‌’ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే- అది నేరుగా చర్యలకు దిగవచ్చు. ఈ క్రమంలో తాజాగా మయన్మార్‌లో ఇదే తరహా పరిస్థితులు నెలకొనడంతో చైనా తన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)ని మయన్మార్‌కు పంపుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మిజోరంలో భవిష్యవాణికి ప్రసిద్ధుడైన సైఖుమా ప్రవచనాలను ఇప్పుడు చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. 1965లో మరణించిన సైఖుమా ప్రవచనాల్లో- మిజో హింసాత్మక తిరుగుబాటు ఉద్యమం ప్రస్తావన ఉంది. భారత్‌, మయన్మార్‌ల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా ఉన్న కలదాన్‌ నది ఒడ్డున భారత్‌, చైనా సైన్యాలు హోరాహోరీగా తలపడతాయని, ఆ యుద్ధం ఫలితంగా సరికొత్త మిజోరం అవతరిస్తుందని ఆయన ఊహించారు. ఇప్పుడు పొరుగు దేశమైన మయన్మార్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో సైఖుమా చెప్పిన అంశాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.

విదేశాల్లోనూ సైనిక చర్యకు దిగేలా చట్ట సవరణ చేపట్టడానికి చైనాను ప్రేరేపించింది ఏమిటనేది పరిశీలించాల్సి ఉంది. అవతలి దేశం అనుమతి కూడా తీసుకోకుండా సైనిక జోక్యం చేసుకొనేలా ఈ సవరణ ‘డ్రాగన్‌’కు అవకాశం కల్పిస్తోంది. తన ప్రయోజనాలకు భంగం వాటిల్లేందుకు చైనా అనుమతించబోదని, మయన్మార్‌లో ఆందోళనలు ఇదే తరహాలో కొనసాగితే, స్వీయ ప్రయోజనాల పరిరక్షణకు కఠిన చర్యలకు దిగుతుందంటూ ఆ దేశ అధికార మీడియా సీజీటీఎన్‌ ఇటీవల హెచ్చరించడం గమనార్హం. ప్రస్తుతం మయన్మార్‌లో చైనా వ్యతిరేక భావనలు తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో ఆందోళన బాటపట్టారు. ఈశాన్య భారత రాష్ట్రమైన మిజోరం, మయన్మార్‌ల మధ్యనున్న 500 కి.మీ. పొడవైన సరిహద్దులనూ దాటేస్తున్నారు. మయన్మార్‌ సైనిక పాలకులు ఫిబ్రవరి ఒకటో తేదీన చేపట్టిన తిరుగుబాటుకు చైనా ఆశీస్సులు ఉన్నాయనేది చాలామంది నమ్మకం. ఐరాస సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మయన్మార్‌ సైనిక పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మయన్మార్‌ ప్రజలు తమ దేశంలోని చైనా యాజమాన్యంలోని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై దాడులకు తెగబడుతుండటం పట్ల ‘డ్రాగన్‌’ అసహనం వ్యక్తపరు స్తోంది. ఆందోళనకారులు మృతి చెందడాన్ని ప్రస్తావించకుండా, దాడులను మాత్రం తీవ్రస్థాయిలో ఖండిస్తూ, హింసను అణచివేసేలా ఒత్తిడి పెంచుతూ, కారకులైన వారిని శిక్షించాలని, చైనా వాణిజ్య సంస్థలను, ప్రజలను కాపాడాలంటూ ఆ దేశ దౌత్య కార్యాలయం ఇటీవల డిమాండు చేసింది!

చైనా కఠిన చర్యలకు సిద్ధపడటానికి- మయన్మార్‌లో ఆ దేశం ఏర్పాటు చేసుకున్న చమురు, గ్యాస్‌ పైపులైన్లే కారణమవుతున్నాయి. ‘సైనో-మయన్మార్‌ పైప్‌లైన్స్‌’ ప్రాజెక్టులోని గొట్టం మార్గాన్ని పేల్చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల పలు పోస్టులు దర్శనమిచ్చాయి. పేలిపోయిన గొట్టాలతో కూడినవంటూ మార్ఫింగ్‌ చేసిన చిత్రాలూ చక్కర్లు కొట్టాయి. మయన్మార్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సాయుధ పోరాటాన్ని సాగిస్తున్న కరెన్‌, షాన్‌ వంటి జాతిపరమైన తెగలు అధికంగా ఉండే ప్రాంతాల గుండానే ఈ గొట్టంమార్గం ఉంది. దీన్ని కాపాడాల్సిందిగా ఇప్పటికే మయన్మార్‌ సైనిక పాలకులను చైనా కోరినట్లు సమాచారం. చైనా ఇంధన అవసరాలు తీర్చడంలో ఈ గొట్టంమార్గం ఎంతో కీలకం.

విదేశీ గడ్డపై చైనాకు ఆర్థిక, ఇతరత్రా ప్రయోజనాలకు భంగం వాటిల్లినప్పుడు సైనిక చర్య తీసుకోవడానికి వీలు కల్పించేలా సవరించిన జాతీయ రక్షణ చట్టాన్ని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌కు చెందిన స్థాయీసంఘం ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చైనా ప్రయోజనాలు దెబ్బతిన్నచోట ‘పీఎల్‌ఏ’ నేరుగా జోక్యం చేసుకొనేందుకు చట్టబద్ధమైన అధికార ప్రదర్శనకు వీలుంది. ఎక్కడ తనకు సమస్య ఎదురైనా దాడులు చేయడానికి సిద్ధపడుతుంది. చైనా పౌరులు, సంస్థలు, కేంద్రాలు, శత్రు కార్యకలాపాలకు ఉపయోగపడుతున్న క్షేత్రాలు, ప్రాంతీయ అస్థిరత, ఉగ్రదాడులు వంటి అంశాల్లో సైనిక చర్య తీసుకోవడానికి వెనకంజవేయదంటున్నారు. చైనా సైనిక, ఆర్థిక శక్తి పెరుగుదలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మయన్మార్‌లో చైనా ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు తమ సైన్యాన్ని ఆ దేశంలోకి పంపించడం ద్వారా, అక్కడి జుంటా సైనిక పాలనను మరింత బలోపేతం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే- సైఖుమా అంచనాలు నిజమైనట్లే!

- సంజీవ్‌ కె.బారువా
 

Posted Date: 02-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం