• facebook
  • whatsapp
  • telegram

జాతి రాత మార్చే విలక్షణ వనరు

అరుదైన లోహాల విలువ తెలియాలి

ఆర్కిటిక్‌ ధ్రువానికి సమీపంలోని మంచు ద్వీపం గ్రీన్‌ ల్యాండ్‌లో అధికారం ఒక సామ్యవాద పార్టీకి దక్కడం పర్యావరణానికి గొప్ప విజయం. అరుదైన లోహాలను భూగర్భం నుంచి తవ్వితీసే గ్రీన్‌ ల్యాండ్‌ మినరల్‌ కంపెనీకి, అందులో వాటాలున్న చైనాకు... ఇది తీరని నష్టం. డెన్మార్క్‌ ఏలుబడిలో స్వయంప్రతిపత్తి కలిగిన ద్వీపం గ్రీన్‌ ల్యాండ్‌. అక్కడ అనేక అరుదైన లోహాల నిక్షేపాలు పుష్కలంగా ఉన్నందువల్ల రెండేళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏకంగా ఆ దీవిని కొనేస్తానని ప్రతిపాదించారు. తాము అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేసిన గ్రీన్‌ ల్యాండ్‌ వాసులు, ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో గని తవ్వకాన్ని వ్యతిరేకించే డెమోక్రటిక్‌ సోషలిస్ట్‌ పార్టీ ఇనుయీట్‌ అటజీట్స్‌కు పట్టం కట్టి, గ్రీన్‌ ల్యాండ్‌ మినరల్స్‌ కంపెనీ ఆశలపై నీళ్లు చల్లారు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ కంపెనీలో చైనా ప్రధాన వాటాదారు. ఇప్పటికే ప్రపంచ అరుదైన లోహాల మార్కెట్లో 70 శాతాన్ని గుప్పిట్లో పెట్టుకున్న చైనా- గ్రీన్‌ ల్యాండ్‌లో తవ్వకాలు సాగించగలిగితే తన మార్కెట్‌ ఆధిపత్యానికి తిరుగులేకుండా చేసుకోగలిగేది.

ప్రపంచంలో అరుదుగా లభించే 17 లోహాలు ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు. అవి లేకుంటే- మన చేతిలోని మొబైల్‌ ఫోన్లు మొదలుకొని కార్లు, ఎలక్ట్రిక్‌ కార్లు, టీవీ తెరల వరకు ఏవీ పని చేయవు. రక్షణ రంగంలో యుద్ధ విమానాలు, క్షిపణులు రివ్వున దూసుకుపోలేవు. శత్రు లక్ష్యాలపై గురిచూసి దాడి చేయడానికి తోడ్పడే టార్గెటింగ్‌ సిస్టమ్స్‌ రూపకల్పనకు టెర్బియం, ట్రైటియం, యూరోపియం లోహాలు అవసరం. పునరుత్పాదక ఇంధన రంగంలో విండ్‌ టర్బైన్ల తయారీకీ అరుదైన లోహాలు కావాలి. 17 అరుదైన లోహాల్లో నియోడైమియం, లిథియం చాలా కీలకమైనవి. ఎలక్ట్రిక్‌ కార్లకు అమర్చే బ్యాటరీల తయారీకీ ఆధారమైన లిథియం నిక్షేపాలు బొలీవియా దేశంలో పుష్కలం. నియోడైమియం లేనిదే ఐఫోన్లు వైబ్రేట్‌ కావు. వైర్‌లెస్‌ బ్లూటూత్‌ సాధనాలైన ఎయిర్‌ పాడ్స్‌ పనిచేయవు. వ్యోమనౌకల విడిభాగాల తయారీకి శ్కాండియం, అణు బ్యాటరీలకు ప్రొమిథియం, క్యాన్సర్‌ చికిత్సకు గ్యాడోలినియం లోహాలు ఆవశ్యకం.

ఆధునిక ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి

కొవిడ్‌ అనంతరం ఎలక్ట్రిక్‌ కార్లు, పునరుత్పాదక విద్యుదుత్పాదన సాధనాలు, స్మార్ట్‌ ఫోన్లు, రోబోలు తదితర డిజిటల్‌ సాధనాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విజృంభించనున్నది. వీటి తయారీకి కీలకమైన అరుదైన లోహాలు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటిని తవ్వితీయడం ఎంతో వ్యయప్రయాసలతో కూడిన పని. అరుదైన లోహాల గనుల వల్ల పర్యావరణానికి హాని చేసే కాలుష్య పదార్థాలు పెద్ద యెత్తున విడుదలవుతాయి. చైనా పర్యావరణ పట్టింపులను పక్కనపెట్టి ప్రపంచంలో అతిపెద్ద అరుదైన లోహాల ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా ఆవిర్భవించింది. ఒకప్పుడు ప్రపంచ అవసరాల్లో 90 శాతాన్ని తీర్చిన చైనా, ఇప్పుడు 60-70 శాతం అవసరాలను తీరుస్తోంది. చైనా వాటా తగ్గడానికి కారణం- అరుదైన లోహాల ఎగుమతులను ఇతర దేశాలపై రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగించుకోవడమే. ఉదాహరణకు, 2010లో వివాదగ్రస్త సెంకాకూ దీవుల సమీపంలోకి వెళ్ళిన ఓ చైనా చేపల పడవను జపాన్‌ నిర్బంధించినపుడు ఆ దేశానికి బీజింగ్‌ అరుదైన లోహాల ఎగుమతులను నిలిపేసింది. దీంతో జపాన్‌ కంపెనీలు ఆస్ట్రేలియా అరుదైన లోహాల గనుల్లో పెట్టుబడి పెట్టి, అక్కడి నుంచి ఆ లోహాలను దిగుమతి చేసుకుంటున్నాయి. జపాన్‌ అవసరాల్లో మూడో వంతును ఆస్ట్రేలియా గనులే తీరుస్తున్నాయి. ఈ విధంగా జపాన్‌ అరుదైన లోహాల కోసం చైనాపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తగ్గించుకుంది. అంతకుముందు తన అవసరాల్లో 91.3 శాతాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకున్న జపాన్‌, ఇప్పుడు దాన్ని 60 శాతానికి తగ్గించుకుంది. 2019లో అమెరికా తనపై వాణిజ్య యుద్ధం ప్రారంభించినప్పుడు అరుదైన లోహాల ఎగుమతులకు కోతపెట్టి అమెరికా పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీస్తానని బీజింగ్‌ హెచ్చరించింది. అమెరికా ఇప్పటికీ తన అవసరాల్లో 80శాతం కోసం చైనాపైనే ఆధారపడుతోంది. అరుదైన లోహాల ఎగుమతులను బంద్‌ చేయడం ద్వారా చైనా ‘క్వాడ్‌’ దేశాలైన అమెరికా, జపాన్‌, భారత్‌లను ఇబ్బందిపెట్టగలదు.

భారత్‌ తక్షణం మేల్కొనాలి

భారత్‌లో ఉన్న అరుదైన లోహ నిక్షేపాలు తక్కువేమీ కావు. 2020లో అమెరికా 38,000 టన్నుల అరుదైన లోహాలను తవ్వితీయగా, భారత్‌ కేవలం 3,000 టన్నులతో సరిపెట్టుకుంది. అదే చైనా 1,40,000 టన్నులను వెలికితీసింది. అరుదైన లోహాల ఎగుమతులపై గుత్తాధిపత్యం ఉండటం వల్లనే చైనా, 2010లో ఆ లోహాల ధరలను తొమ్మిది రెట్లు పెంచేయగలిగింది. స్వదేశంలో అరుదైన లోహాల ఉత్పత్తిని పెంచలేకపోవడం వల్ల భారత్‌ ఇప్పటికీ ఆ లోహాలను చైనా నుంచి దిగుమతి చేసుకోకతప్పడం లేదు. హైటెక్‌ పరిశ్రమల్లో వాడుతున్న ఈ లోహాలు భారత ఆర్థిక వ్యవస్థకు 20,000 కోట్ల డాలర్ల విలువను జోడిస్తున్నాయి. భారతదేశ సముద్ర తీరంలోని మోనజైట్‌ ఇసుకలో పలు అరుదైన లోహాలు లభిస్తాయి. వీటిని వెలికితీసే బాధ్యతను కేంద్రం ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌ (ఐరెల్‌) అనే ప్రభుత్వ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ అరుదైన లోహాల ఆక్సైడ్‌ను వెలికితీసి, ఆ ముడి పదార్థాన్ని విదేశీ కంపెనీలకు ఎగుమతి చేస్తోంది. అవి ఈ ఆక్సైడ్‌తో లోహాలను, హైటెక్‌ పరికరాలనూ తయారుచేస్తున్నాయి. అమెరికా, జపాన్‌ల విషయంలో జరిగినట్లే భారత్‌ పైనా చైనా అరుదైన లోహాలను రాజకీయ అస్త్రంగా ప్రయోగించదనే భరోసా ఏమీ లేదు. చైనాపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తప్పించుకోవడానికి అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు ప్రపంచమంతటా అరుదైన లోహ నిక్షేపాల వెలికితీత, వినియోగాలపై పెట్టుబడులు పెడుతున్నాయి. వివిధ దేశాల్లోని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. భారత్‌ కూడా ఇలా భాగస్వామ్యం కుదుర్చుకుంటే 1,21,000 కోట్ల రూపాయల పెట్టుబడులను దక్కించుకోగలదని, అందులో 50,000 కోట్ల రూపాయలు విదేశ మారకద్రవ్యం రూపంలో లభిస్తాయని 2016నాటి అధ్యయనమొకటి సూచించింది. భారత్‌ తన సముద్ర తీరంతోపాటు దక్షిణ భారతంలోని కార్బొనటైట్‌ శిలల నుంచీ అరుదైన లోహాలను సేకరించవచ్చు. ఈ రంగంలోకి స్వదేశీ, విదేశీ పెట్టుబడులు, పరిజ్ఞానాలను ఆహ్వానిస్తే 21వ శతాబ్ది హైటెక్‌ పారిశ్రమిక విప్లవంలో భారత్‌ కీలక భాగస్వామి కాగలుగుతుంది.

పట్టుబిగిస్తున్న చైనా

ప్రపంచవ్యాప్తంగా 2018లో అరుదైన లోహ, ఖనిజ నిక్షేపాల్లో 36.7 శాతం చైనాలో ఉండగా, 22 శాతం నిక్షేపాలతో బ్రెజిల్‌, 18 శాతం నిక్షేపాలతో వియత్నాం, 10 శాతం నిక్షేపాలతో రష్యా తదుపరి స్థానాలను ఆక్రమిస్తున్నాయి. 5.8 శాతం నిక్షేపాలతో భారత్‌ అయిదో స్థానం ఆక్రమిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియాలకన్నా భారత్‌లోనే అత్యధిక నిక్షేపాలు ఉన్నాయి. అయినా, భారత్‌ తనకున్న ఆధిక్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతోంది. ఫలితంగా ఈ వనరులను ఉపయోగించుకొని అంతర్జాతీయ వాణిజ్యంపై చైనా రోజురోజుకూ పట్టుబిగిస్తోంది.

- వరప్రసాద్‌
 

Posted Date: 17-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం