• facebook
  • whatsapp
  • telegram

శరణార్థులకు ఆపన్నహస్తం

మయన్మార్‌ వాసులకు భారత్‌ మద్దతు

దేశంలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన సైన్యానికి వ్యతిరేకంగా మయన్మార్‌ ప్రజలు పెద్దయెత్తున ఉద్యమిస్తున్నారు. నియంతృత్వాన్ని నిరసిస్తూ జరుగుతున్న శాంతియుత ప్రదర్శనలు రోజూ నెత్తుటేళ్లు పారిస్తున్నాయి. నిరాయుధులైన ప్రజలపై కాల్పులు, గ్రామాలపై వైమానిక దాడులతో సైనిక జుంటా కర్కశంగా వ్యవహరిస్తోంది. సైనికుల దాష్టీకం కారణంగా రెండున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారని మయన్మార్‌లో మానవ హక్కుల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పరిశీలకులు టామ్‌ ఆండ్రూస్‌ తాజాగా ప్రకటించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక ఈ రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా 738 మందిని చంపేశారు. 3300 మందిని రాజకీయ ఖైదీలుగా నిర్బంధించారు. దేశంలో ఆహార అభద్రత నెలకొంటోంది. దాదాపు 35 లక్షల మంది ప్రజలు తీవ్ర క్షుద్బాధకు లోనయ్యే ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. ఈ కల్లోల పరిస్థితుల్లో పదవీవీచ్యుతులైన మయన్మార్‌ ప్రజాప్రతినిధులతో పాటు పౌర, పోలీసు అధికారులు, సాధారణ ప్రజలకు భారత్‌ ఓ ఆశాదీపంలా కనిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ప్రస్తుతం 17 మంది మయన్మార్‌ ఎంపీలతో సహా వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ వలసలు ఇంకా పెరిగే ప్రమాదం పొంచే ఉంది. సరిహద్దు దేశంలో ప్రజాస్వామ్యం పునఃప్రతిష్ఠితంకావాలని కోరుకుంటున్న భారత్‌, మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సందర్భమిది.  

‘యిడాంగ్సు లూట్టా ప్రాతినిధ్య సంఘం’ (సీఆర్‌పీహెచ్‌) ఆధ్వర్యంలో సాగుతున్న ప్రజాస్వామిక అనుకూల ఉద్యమాన్ని మయన్మార్‌ సైనిక జుంటా ఉక్కుపాదంతో అణచివేస్తోంది. దాదాపు 150 మంది ప్రజాప్రతినిధులను కటకటాల పాల్జేసింది. ఈ పరిస్థితుల్లో పలువురు ఎంపీలు, ఇతరులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భారత్‌కు వస్తున్నారు. ‘చైనా, థాయ్‌లాండ్‌లతో పాటు ఇతర సరిహద్దు దేశాల మీద మేమిప్పుడు ఆధారపడలేం. శరణార్థులను అక్కున చేర్చుకునే ఏకైక దేశం ఇండియా’ అని మయన్మార్‌ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. సీఆర్‌పీహెచ్‌ నేతృత్వంలో సైనిక జుంటాకు సమాంతరంగా ఏర్పాటు చేసిన జాతీయ ఐక్యతా ప్రభుత్వానికి న్యూదిల్లీ మద్దతు ఇవ్వాలని ఈ ఎంపీలు కోరుతున్నారు.

మయన్మార్‌ శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్‌ అంత సానుకూలత చూపించడంలేదు. మణిపూర్‌, మిజోరం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలకు కిందటి నెలలో రాసిన లేఖలో ‘మయన్మార్‌ అక్రమ చొరబాటుదారుల పట్ల జాగ్రత్తగా ఉండా’లని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ‘చొరబాట్లను నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలి’ అని సూచించింది. మయన్మార్‌ మూలవాసులకు ఈశాన్య రాష్ట్రాల ఆదివాసులతో సన్నిహిత సంబంధాలున్న దృష్ట్యా ఈ లేఖ కలకలం సృష్టించింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన మిజో నేషనల్‌ ఫ్రంట్‌ రాజ్యసభ ఎంపీ కె.వన్లవేన సైతం దీన్ని విమర్శించారు. ‘మయన్మార్‌ ప్రజలు మా సహోదరులు. వారిని వెనక్కి వెళ్ళమని చెప్పలేం. వారి దేశంలో పరిస్థితులు కుదుటపడేవరకు భారత్‌లో ఆశ్రయమివ్వాలి’ అని కోరుతున్నారాయన. మరోవైపు, మయన్మార్‌ శరణార్థులకు ఆవాసం, ఆహారం అందించకూడదంటూ ఆదేశాలిచ్చిన మణిపూర్‌ ప్రభుత్వం- స్థానికంగా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. మయన్మార్‌ వాసులకు మానవతా దృక్పథంతో సాయం చేస్తామంటూ తన ఆదేశాలను ఉపసంహరించుకుంది. శరణార్థుల పట్ల ప్రభుత్వాల వైఖరిని మణిపూర్‌ హైకోర్టూ తప్పుపట్టింది. ‘1951 జెనీవా శరణార్థి ఒడంబడిక, 1967 న్యూయార్క్‌ ప్రొటోకాల్‌ మీద ఇండియా సంతకం చేయలేదన్న మాట వాస్తవమే. కానీ, సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన, అంతర్జాతీయ పౌర, రాజకీయ హక్కుల ఒడంబడికల్లో మన దేశమూ ఓ భాగస్వామి. హింసకు గురయ్యే ప్రమాదమున్న దేశానికి శరణార్థులను బలవంతంగా తిప్పిపంపడాన్ని భారత రాజ్యంగంలోని 21వ అధికరణ నేపథ్యంలో పరిశీలించాలి. జీవించే హక్కుకు హామీ ఇచ్చే 21వ అధికరణ భారత పౌరులకు మాత్రమే పరిమితం కాదు. పౌరులు కానివారూ దీని కింద రక్షణ పొందవచ్చు’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మయన్మార్‌ వాసులకు తగిన రక్షణ, రవాణా వసతులు కల్పించాలని మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సీఆర్‌పీహెచ్‌కు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడం పట్ల భారత్‌ మౌనంగా ఉన్నప్పటికీ, మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని మాత్రం బలంగా కోరుకుంటోంది. ఐక్యరాజ్యసమితిలో భారత ఉప శాశ్వత ప్రతినిధి కె.నాగరాజు నాయుడు ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన మాటల్లో- ‘మయన్మార్‌లో ప్రజాస్వామ్యం గెలిస్తే, అది భారత్‌కూ విజయమే’. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి చొరవ తీసుకోవడం ఎంత ముఖ్యమో, శరణార్థులకు అండగా నిలబడటమూ అంతే ప్రధానం. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ ఇనుమడించడానికీ ఇది దోహదపడుతుంది!

- ఎన్‌.కె.శరణ్‌
 

Posted Date: 23-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని