• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ ముంగిట సదవకాశం

జీ7 సదస్సుకు ఆహ్వానం

కరోనా సంక్షోభంతో విలవిలలాడుతున్న ప్రపంచాన్ని పునర్నిర్మించే లక్ష్యంతో ఈ ఏడాది జూన్‌లో బ్రిటన్‌- జీ7 సదస్సును నిర్వహించనుంది. జీ7లో కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, అమెరికా, బ్రిటన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈసారి సదస్సులో పాల్గొనాలంటూ భారత్‌ను ఆహ్వానించారు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాలకూ ఆహ్వానం దక్కింది. జీ7 సభ్యదేశాలు ప్రపంచంలోనే అత్యంత ప్రభావాన్వితమైన, శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థికం ఛిన్నాభిన్నమైన వేళ, దాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు జీ7 ఓ గొప్ప ఆయుధంగా మారే అవకాశముంది.

అమెరికా నేతృత్వంలో కొవిడ్‌ మహమ్మారిపై ఉమ్మడి పోరు సాగించడంలో జీ7 ఘోరంగా విఫలమైంది. చైనాతో గొడవలకు దిగింది. కానీ ఈ ఏడాది జరగనున్న సదస్సులో మార్పులు కనపడుతున్నాయి. పరస్పర విలువలు, మానవ హక్కులపై సమాజం దృష్టి సారించడం, ఆహార భద్రత, వాతావరణ మార్పులపై చర్యలు, టీకాలు, ఆగ్నేయాసియా, ఆఫ్రికాతో సంబంధాలు మెరుగు పరుచుకోవడంపై చర్చించేలా సదస్సు ఇతివృత్తాన్ని రూపొందించారు. భద్రతాపరంగా చైనా, రష్యా దాని పొరుగు దేశాలు, ఇరాన్‌, తూర్పు మధ్యధరాపై ఇందులో విస్తృత చర్చ జరగనుంది. ఇండో-పసిఫిక్‌ అంశం కీలకంగా మారనుంది. 21వ శతాబ్దంలో ఈ ప్రాంతం కేంద్రబిందువుగా మారుతుందని, ఇందులో భారత్‌ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని బ్రిటన్‌ భావిస్తోంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి భారత్‌ ఇంధనంగా మారింది. బలమైన ఆర్థిక వృద్ధితో ప్రస్తుతం ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్న భారత్‌ త్వరలో యూకేను వెనక్కి నెట్టి అయిదో స్థానానికి చేరే అవకాశముంది. జీ7 దేశాలైన ఇటలీ, ఫ్రాన్స్‌, కెనడా ఇప్పటికే భారత్‌ వెనక ఉన్నాయి.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై పట్టుబిగించేందుకు చైనా ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ ప్రాంతంపై అధిక దృష్టి సారించేందుకు బ్రిటన్‌ మొగ్గుచూపుతోంది. ఇందుకు భారత్‌ సహకారం ఎంతో అవసరం. ఫలితంగా భారత్‌ మైత్రిని పెంపొందించుకోవడం యూకేకు ముఖ్యం. ఇంతేకాకుండా భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాను కలుపుకొని ‘జీ7’ను ‘డీ10’ చేద్దామనే కోణంలో బోరిస్‌ ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే జరిగితే ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలకు ఇది మంచి వేదిక అవుతుంది. ఇండో-పసిఫిక్‌లో పారిశ్రామిక ఆధునికీకరణ వల్ల మధ్యాసియా ఆకర్షణీయంగా మారింది. అంతర్జాతీయ నిబంధనలను మార్చి, ప్రపంచంపై తమ ముద్ర వేసేందుకు చైనా, రష్యా చేస్తున్న ప్రయత్నాల వల్ల పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. వాతావరణ సంక్షోభం కూడా ముదురుతోంది. ఈ పరిణామాల్లో పటిష్ఠ ప్రజాస్వామ్య వ్యవస్థలు కలిగిన దేశాలు తమను తాము వ్యవస్థ్థీకృతం చేసుకుని నాయకత్వ పాత్ర పోషించకపోతే పరిస్థితి విషమించే అవకాశముంది. అయితే జీ7లో సంస్కరణలు చేపట్టేందుకు సభ్యదేశాలు ఏ మేరకు మద్దతిస్తాయన్నది ప్రశ్నార్థకం. సంస్థను విస్తరిస్తే అందులో తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని పలు దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జీ7లో ఇటు దక్షిణ కొరియాను చేర్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న జపాన్‌, అటు భారత్‌ కలవడాన్నీ ఇష్టపడటం లేదు. ఆసియా నుంచి తమ దేశం ఒక్కటే ప్రాతినిధ్యం వహించాలని భావిస్తోంది. ఇది ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికే చేటు చేస్తుంది. స్వేచ్ఛాయుత యూరో-అట్లాంటిక్‌ వ్యవస్థ నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇండో-పసిఫిక్‌ సైతం అదే తరహాలో ఉండాలి. ఇందుకు ఆసియాలోని ప్రజాస్వామిక దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి. ఇవన్నీ సాధ్యపడాలంటే భారత్‌ పాత్ర కీలకం. చైనా దుస్సాహసాలకు అడ్డుకట్ట వేసేందుకు కావాల్సిన సమతౌల్యాన్ని భారత్‌ సమకూరుస్తుంది.

విస్తరించిన జీ7లో ఉండటం వల్ల చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల్లో కొంత పైచేయి సాధించే పరిస్థితి భారత్‌కు దక్కుతుంది. కరోనా మహమ్మారిపై పోరుకు విదేశాల మద్దతు కూడగట్టుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందేందుకు మరింత మద్దతు కూడగట్టుకోవచ్చు. ఇండో-పసిఫిక్‌ దేశాలతో భద్రతా పరమైన సహకారం మెరుగుపడుతుంది. టీకాల ఉత్పత్తికి, టీకా దౌత్యానికి తోడ్పడుతుంది. అయితే జీ7ను విస్తరించాలన్న ప్రతిపాదన అంత సులభంగా గట్టెక్కే అవకాశం లేదు. సంస్థలో రష్యాను తిరిగి చేర్చాలన్న ప్రతిపాదనను జర్మనీ, బ్రిటన్‌, కెనడా బహిరంగంగానే వ్యతిరేకించాయి. ఏదేమైనా, తాజాగా జీ7 సదస్సును సదవవకాశంగా ఉపయోగించుకుని ఔషధ రంగానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావచ్చు. చైనా ఆధిపత్యం, పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలు వంటి సమస్యలపై అంతర్జాతీయ అభిప్రాయాలను సేకరించవచ్చు. కరోనాపై పోరు కోసం సభ్యదేశాల మద్దతును కూడగట్టే అవకాశాలుంటాయి.

- డాక్టర్‌ రాధా రఘురామపాత్రుని 
(అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు)

 

Posted Date: 17-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం