• facebook
  • whatsapp
  • telegram

ప్రగతి పేరిట విధ్వంసం

దీవుల్లో దుర్రాజకీయాలు

మాల్దీవులు అభివృద్ధి చెందడం వెనక పర్యాటక రంగం పాత్ర కీలకమైంది. అదే తరహాలో భారత్‌ సైతం ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు దీవుల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళిక రూపొందించింది. లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళికను నీతిఆయోగ్‌ 2019లో సిద్ధం చేసింది. తాజాగా అయిదు సూత్రాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దీనికి జోడించి ‘పంచరత్న’గా అభివర్ణించింది. కానీ, దీనిపై పర్యావరణవేత్తలు, శాస్త్రజ్ఞులు, స్వచ్ఛంద సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రణాళిక తరతరాలుగా నివసిస్తున్న జరావా, ఒంగీ, అండమానీలు, సెంటీనీలు, నికోబారీలు, షోంపెన్‌ వంటి ఆదిమ జాతులను, పర్యావరణాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం.

అండమాన్‌ నికోబార్‌లో 12, లక్షద్వీప్‌లో అయిదు దీవులను అభివృద్ధి చేయాలని నిర్దేశించుకున్నారు. లక్షద్వీప్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ రెగ్యులేషన్‌ 2021 ఇటీవల విడుదల చేసిన ముసాయిదా నిబంధనలు వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకోసం స్థానిక ప్రజల భూములను స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పించాయి. దాంతో స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే స్థానికులు తీర ప్రాంతంలో పడవలు పెట్టుకునే షెడ్లు, చిల్లర దుకాణాలను కోస్ట్‌ గార్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ పడగొట్టడంతో వివాదం మరింత ముదిరింది. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఆ దీవులను కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తించి, అక్కడి ప్రజల జీవనోపాధిని, పర్యావరణాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు  వాటిమీద పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల దృష్టి పడింది. అక్కడ సముద్రాల్లో ఖనిజాల నిక్షేపాలు, అపారమైన కొబ్బరి, మత్స్య సంపదలు ఉన్నట్లు నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. ఆయా సంపదల ఎగుమతులకు ఆ దీవులు ఎంతో సామర్థ్యం కలిగి ఉన్నాయని భావిస్తోంది.  

జల రవాణాకు మాత్రమే వీలుండే అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో పోర్ట్‌ బ్లెయిర్‌ నుంచి డిగలిపూర్‌ వరకూ రైలు మార్గంతో అనుసంధానించనున్నారు. పెట్రో కెమికల్‌ సంస్థ, విశేష ఆర్థిక అభివృద్ధి మండలి, కొత్త పోర్టుల నిర్మాణంతో పాటు పవన, సౌర శక్తి కేంద్రాలను దశల వారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ ఏడాది జనవరి అయిదో తేదీన వన్య ప్రాణుల జాతీయ బోర్డు (ఎన్‌బీడబ్ల్యూఎల్‌) స్టాండింగ్‌ కమిటీ తాబేళ్లు విరివిగా సంచరించే గలాతీయ బే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని అంతర్జాతీయ పోర్ట్‌ నిర్మాణం కోసం గుర్తించింది. తదనుగుణంగానే పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ ప్రాంతాన్ని పర్యావరణం పరంగా సున్నితమైన జోన్‌ పరిధి నుంచి మినహాయిస్తూ ఆమోదముద్ర వేసింది. విచిత్రం ఏమిటంటే గలాతీయ రిజర్వ్‌ ప్రాంతం యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటి. అత్యంత అరుదైన వృక్ష జంతు జాతులకది నిలయం. అక్కడ ఉండే ‘నికోబరి అడవి పంది, సర్పెంట్‌ గద్ద, తోలుసంచి తాబేలు, మెగాపోడ్‌ పక్షి’ వంటివి ఈ ప్రాజెక్టు అమలైతే అంతరించే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో నివసించే షోంపెన్‌ తెగ మనుగడకూ ప్రమాదం పొంచిఉంది.

లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంప తీవ్రత ఎక్కువ. 2014 డిసెంబరులో వచ్చిన సునామీ ప్రభావంతో గ్రేట్‌ నికోబార్‌లో తీర ప్రాంతాలనే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న నికోబారీలు, షోంపెన్‌ గిరిజనులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పునరావాసంలో భాగంగా వారిని తీర ప్రాంతాలకు దూరంగా తరలించారు. దాంతో వారు సాగు భూమి కొరతతో ఇబ్బందికి గురవుతున్నారు. కొత్త ప్రాజెక్టు అమలైతే వారు చేపలను వేటాడే ప్రాంతాలనూ కోల్పోవాల్సి వస్తుంది. భారతదేశ పగడపు స్వర్గంగా పిలుచుకునే లక్షద్వీప్‌ దీవుల్లో సుమారుగా 4,000 చ.కి.మీ. వరకు వ్యాపించి ఉన్న మడుగుల్లో వాటర్‌ విల్లాలు నిర్మించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నీతిఆయోగ్‌ ప్రణాళికలో పొందుపరచింది. పగడపు దిబ్బలు (కోరల్‌ రీవ్స్‌) ఎన్నో జలచరాల మనుగడకు దోహదం చేస్తున్నాయి. విల్లాల నిర్మాణం కోసం జరిపే తవ్వకాల్లో ఇవి దెబ్బతినే అవకాశం ఉంది. అంతే కాకుండా మత్స్య సంపద మీదే ఆధారపడ్డ గిరిజనులు, స్థానికులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితులూ ఉత్పన్నమవుతాయి. వీరికి ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను ఈ ప్రణాళికలో ప్రస్తావించక పోవడం విడ్డూరం. ‘సేవ్‌ లక్షద్వీప్‌’ ఫోరం ఇప్పటికే ఆన్‌లైన్‌లో శాంతియుత  ప్రజస్వామ్య నిరసనల ద్వారా ప్రజల్లో ఈ ప్రాజెక్టు ప్రభావం గురించిన అవగాహనను కల్పిస్తోంది. అభివృద్ధి ప్రణాళికలు మానవాళికి మేలు చేకూర్చే విధంగా ఉండాలే తప్ప, భావి తరాలకు శాపం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది.  

- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌

(మధ్యప్రదేశ్‌లోని ఇందిరాగాంధీ గిరిజన వర్సిటీ సహాయ ఆచార్యులు)
 

Posted Date: 12-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం