• facebook
  • whatsapp
  • telegram

ఐరాసను గుప్పిట పట్టే కుహకం

ఆర్థిక మంత్రంతో చైనా అంతర్జాతీయ తంత్రం

జాతీయ ప్రభుత్వాలు తమ విధానాల అమలుకు పలు సంస్థలను ఏర్పాటుచేసుకున్నట్లే, ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితి ఛత్రం కింద అనేక సంస్థలను నెలకొల్పాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వాణిజ్య సంస్థ, యునెస్కో వంటివి ఈ కోవలోకే వస్తాయి. తన అజెండా అమలుకు ఈ అంతర్జాతీయ సంస్థలను గుట్టుగా గుప్పిట్లోకి తీసుకోవడంలో చైనా సఫలమవుతోంది. ‘నీ సత్తాను దాచుకో, సరైన సమయం వచ్చినప్పుడు చాటుకో’ అన్న డెంగ్‌ జియావో పింగ్‌ ఉద్బోధను ఆచరిస్తూ, ఐక్యరాజ్యసమితి సంస్థల్లో క్రమంగా పాగా వేస్తోంది. పదిహేను ఐరాస అనుబంధ సంస్థల్లో నాలుగింటికి ప్రస్తుతం చైనాయే అధ్యక్షురాలు. ఆ నాలుగూ అత్యంత ముఖ్యమైనవే. అవి- ఆహార, వ్యవసాయ సంస్థ, పారిశ్రామికాభివృద్ధి సంస్థ (యూనిడో), అంతర్జాతీయ టెలికం యూనియన్‌ (ఐటీయు), అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ). మిగిలిన ఐరాస అనుబంధ సంస్థల్లో తొమ్మిదింటికి ఉప అధిపతులుగా చైనా అధికారులు ఎన్నికయ్యారు. ఎంతో కీలకమైన ప్రపంచ బ్యాంకులో మాత్రం ఇప్పటికీ అమెరికాకే ఆధిక్యం ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)కు ఐరోపా సమాఖ్య (ఈయూ) నాయకత్వం వహిస్తుంటే, మానవ సంక్షేమ వ్యవహారాల సమన్వయ సంఘం (ఓసీహెచ్‌ఏ) బ్రిటన్‌ చేతిలో ఉంది. ఐరాస శాంతి రక్షక సేనకు ఫ్రాన్స్‌ అధ్యక్షత వహిస్తోంది. అలాగని చైనా చేతులు ముడుచుకు కూర్చోలేదు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ప్రధాన  పదవుల్లోకి తనవాళ్లను ప్రవేశపెట్టింది. ఐరాస సంస్థలకు ఆర్థిక సాయాన్ని క్రమంగా పెంచుకొంటూ రావడం ద్వారా వాటిలో చాప కింద నీరులా చైనా విస్తరిస్తోంది.  

ఆధిపత్యానికి పునాదిరాళ్లు

ఐరాస అనుబంధ సంస్థల నాయకత్వాన్ని చేజిక్కించుకోవడం చైనాకు ఎలా ఉపయోగకరమో తెలుసుకొంటే, బీజింగ్‌ ప్రచ్ఛన్న అజెండా ఏమిటో అవగతమవుతుంది. కొన్ని సంస్థలకు చైనీయులు నాయకులుగానో, ఉప నాయకులుగానో వ్యవహరిస్తుంటే- మరికొన్ని సంస్థలకు చైనా నమ్మిన బంట్లు నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధెనౌమ్‌ ఘెబ్రేసస్‌ ఇలాంటి బంటేనన్న ఆరోపణలు ఉన్నాయి. చైనా మద్దతుతోనే 2017లో టెడ్రోస్‌ ఈ పదవికి ఎన్నికయ్యారు. గతంలో ఆయన ఇథియోపియా ఆరోగ్య, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆఫ్రికాలో చైనా నుంచి అత్యధిక పెట్టుబడులు అందుకున్న దేశాల్లో ఇథియోపియా ముఖ్యమైనది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ముందుగానే హెచ్చరించి- విమాన, నౌకా ప్రయాణాలపై ఆంక్షలు విధించి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదు. ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సిన అగత్యం నుంచి చైనాను తప్పించడానికే టెడ్రోస్‌ ముందస్తు హెచ్చరిక జారీ చేయలేదని విమర్శలు వస్తున్నాయి. విమాన ప్రయాణాలకు దిశానిర్దేశాన్ని, భద్రతా ప్రమాణాలను నిర్దేశించే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(ఐసీఏఓ)కు నాయకత్వం వహించడం సైతం బీజింగ్‌కు కలిసివచ్చింది. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఏఓ జరిపిన చర్చల్లో తైవాన్‌కు భాగస్వామ్యం దక్కకుండా చైనా అడ్డుపడింది. మరోవైపు మేడ్‌ ఇన్‌ చైనా 2025, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ (బీఆర్‌ఐ) పథకాలతో అగ్ర ఆర్థిక శక్తిగా అవతరించాలని, తమ కంపెనీలను ప్రపంచంలోనే మేటి సంస్థలుగా తీర్చిదిద్దాలని చైనా ఆరాటపడుతోంది. ఈ అజెండాను నెరవేర్చుకోవడానికి తోడ్పడే ఐరాస పదవులను బీజింగ్‌ దక్కించుకొంది. ఉదాహరణకు ప్రపంచమంతటా టెలికం ప్రమాణాలను నిర్దేశించే అంతర్జాతీయ టెలికం యూనియన్‌ (ఐటీయూ) నాయకత్వాన్ని చైనా చేజిక్కించుకోవడం- రాబోయే 5జీ యుగంలో అగ్రగామిగా నిలవడానికి వారధి అవుతుంది. టెలికం పరికరాలు, ఫోన్లు, ఇతర సాధనాలను ఉత్పత్తి చేసే హువావై, జడ్‌టీఈ వంటి చైనా సంస్థలకు అనువైన రీతిలో ప్రమాణాలను తీర్చిదిద్దడానికి ఐటీయూ పదవి తోడ్పడుతుంది. ప్రపంచమంతా సువిశాల చైనా అంతర్గత విపణిలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతుంటే, చైనా యావత్‌ ప్రపంచ విపణిలోకి దూసుకెళ్తోంది. ఐక్యరాజ్యసమితి పారిశ్రామికాభివద్ధి సంస్థ (యూనిడో) నేతృత్వాన్ని ఇందుకు ఉపయోగించుకొంటోంది. వర్ధమాన దేశాల పారిశ్రామికీకరణకు యూనిడో ఏర్పాటైనా, సంపన్న దేశాలు ఆ సంస్థను అలక్ష్యం చేశాయి. ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్న చైనా, బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకాన్ని యూనిడోకు అనుసంధానం చేసింది. ఆసియా, ఆఫ్రికాలలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను, పరిశ్రమల స్థాపనను బీఆర్‌ఐ ఛత్రం కింద చేపడుతోంది. ఇటీవల ఐరాస శాంతి రక్షక విభాగానికి 100 కోట్ల డాలర్లను విరాళంగా ఇవ్వడం ద్వారా, ఆఫ్రికాలోని తన బీఆర్‌ఐ ప్రాజెక్టులు నిరాటంకంగా సాగడానికి వెసులుబాటు కల్పించుకుంది.

భారత్‌ అప్రమత్తం కావాలి

చైనా నుంచి ఈ-కామర్స్‌ ద్వారా వచ్చే సరకులపై స్టాంపు చార్జీలను పెంచడానికి అమెరికా ప్రేరణతో 2019లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం చైనాకు ఆర్థికంగా నష్టదాయకమైంది. దీంతో అంతర్జాతీయ ఈ-కామర్స్‌ నియమ నిబంధనలను ఏర్పరచే యూనివర్సల్‌ పోస్టల్‌ యూనియన్‌(యూపీయూ)ను చేజిక్కించుకోవడానికి చైనా పావులు కదుపుతోంది. అలీబాబా గ్రూపు చైనా కమ్యూనిస్టు పార్టీ పెత్తనంలోకి వెళ్ళిపోవడంతో, ఈ-కామర్స్‌ రంగంలో ఎదురులేని శక్తిగా ఆవిర్భవించడానికి ప్రాతిపదిక ఏర్పడింది. అంతర్జాతీయ సంస్థల్లో చైనా ప్రాబల్యం పెరిగిపోవడానికి సంపన్న దేశాల ఏమరుపాటు, నిధుల కేటాయింపులో వెనకబాటులే ప్రధాన కారణాలు. భారతదేశం ఈ తప్పులను చేయకూడదు. యునెస్కో వంటి ఐరాస అనుబంధ సంస్థలకు అదనపు నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థపై చైనా పెత్తనాన్ని నిరోధించాలంటే, రాబోయే నాలుగేళ్లలో బ్రిటన్‌ ఆర్థిక సాయాన్ని   30 శాతం పెంచాలని ఆ దేశ పార్లమెంటరీ సంఘం తమ ప్రభుత్వానికి సూచించడం ఇక్కడ గమనార్హం. చైనా మాదిరిగానే వివిధ దేశాల భాగస్వామ్యంతో ఇండియా సైతం ప్రత్యేక సంస్థలను నెలకొల్పాలి. తన చొరవతోనే ఏర్పడిన అంతర్జాతీయ సౌర శక్తి కూటమి వంటివాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇతర దేశాల మద్దతుతో తన ప్రతినిధులను ఐరాస సంస్థలకు అధిపతులుగా ఎన్నిక చేయించాలి. అప్పుడే అంతర్జాతీయంగా దేశ ప్రయోజనాలను కాచుకోగలం!

దశాబ్దాల వ్యూహం

సంపన్న దేశాలు, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌, రాక్‌ఫెల్లర్‌, ఫోర్డ్‌ ఫౌండేషన్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే భూరి విరాళాలతో ఐరాస ప్రభావితమవడం చైనాను ఆకట్టుకున్న అంశం.  

తన అజెండా అమలుకు అంతర్జాతీయ సంస్థలు చక్కగా ఉపయోగపడతాయనేది డ్రాగన్‌ యోచన.  

1992 నుంచే వాటిలో పాగాకు ప్రయత్నాలు ప్రారంభం.

ఐరాస అనుబంధ సంస్థలకు భారీ ఆర్థిక సాయంతో తన మాటే నెగ్గేలా పాచిక.- ఐరాసకు అత్యధిక నిధులు సమకూరుస్తున్న దేశాల్లో ప్రస్తుతం డ్రాగన్‌ది అయిదో స్థానం

- వరప్రసాద్‌
 

Posted Date: 13-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం