• facebook
  • whatsapp
  • telegram

అణు ప్రమాదం అంచున ప్రపంచం

భయానక అనుభవాల నుంచి నేర్వని పాఠం

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించి ఈ ఏడాదికి 76 సంవత్సరాలవుతోంది. ఆనాటి ఘోరకలిని తలచుకుంటూ బరువైన హృదయాలతో ఏటా ఆగస్టు 6న హిరోషిమా దినంగా, ఆగస్టు 9న నాగసాకి దినంగా జరుపుతున్నారు. హిరోషిమాపై పేలిన అణుబాంబు 80వేల మంది ప్రాణాలు తీయగా, నాగసాకిలో 65వేల మంది ఆయువులు అనంత వాయువుల్లో కలిశాయి. అణు దాడుల నుంచి బతికి బయటపడినవారు, వారి సంతానం- క్యాన్సర్‌, జన్యుసంబంధ వ్యాధులతో బాధపడ్డారు. అణ్వస్త్రాలు సృష్టించే విలయం గురించి హెచ్చరిస్తూ సుస్థిర శాంతి ఆవశ్యకతను ప్రపంచం మరచిపోకుండా ఏటా ఈ రెండు  ఘటనలను స్మరించుకుంటున్నారు. కానీ, వీటి నుంచి ప్రపంచం ఏమీ నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ప్రధాన దేశాలు ఇప్పటికీ అణ్వస్త్రాలను తయారుచేసుకుంటూ యుద్ధం వస్తే ప్రయోగించడానికి వాటిని సిద్ధంగా ఉంచుకుంటున్నాయి.

చైనా తెంపరితనం

అవసరమైతే జపాన్‌పై అణు బాంబులు ప్రయోగించడానికి వెనకాడబోనని కొద్ది రోజుల క్రితమే చైనా హెచ్చరించింది. ఏ దేశంపైనా మొదట తానే అణుబాంబులు ప్రయోగించబోనని, ప్రత్యర్థి అణుదాడి జరిపితే అవే అస్త్రాలతో ఎదురుదాడి జరుపుతామన్నది చైనా ప్రకటిత విధానం. కానీ, తైవాన్‌కు మద్దతుగా జపాన్‌ ఒక్క సైనికుడిని, ఒక్క విమానం లేదా ఒక్క నౌకను పంపినా ఆ దేశంపై అణ్వస్త్రాలతో పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతామని చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల హెచ్చరించింది. జపాన్‌ లొంగిపోయేదాకా అణు బాంబులు కురిపిస్తూనే ఉంటామని బెదిరించింది. చైనా ఆన్‌లైన్‌ సైనిక వీడియోఛానల్‌ షిగువాలో ఈ హెచ్చరిక ప్రసారమైంది. చైనా సంతతికి చెందిన మానవ హక్కుల ఉద్యమకారిణి జెనిఫర్‌ జెంగ్‌ ఈ వీడియోను కనిపెట్టి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై నిరసనలు రేగిన తరవాత చైనా ఆ వీడియోను తొలగించింది. జపాన్‌ను బెదిరించి భయపెట్టడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఇలాంటి వీడియోను ప్రసారం చేసింది. అలాగని ఇది తేలిగ్గా తీసుకోదగిన వ్యవహారం కాదు. 1964లో చైనా తొలి అణు పరీక్షను జరిపినప్పుడు, అణ్వస్త్రాలు లేని దేశాలపై తాము అణు బాంబులు ప్రయోగించబోమని హామీ ఇచ్చింది. తీరా ఇప్పుడు మాట తప్పి జపాన్‌పై అణుదాడి ప్రకటనలు చేయడం గర్హనీయం. చైనా అణు క్షిపణులను ప్రయోగ సిద్ధంగా ఉంచడానికి కొత్తగా 250 భూగర్భ గోదాము(సైలో)లను నిర్మిస్తున్నట్లు అమెరికన్‌ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వాణిజ్య ఉపగ్రహాలు పంపిన ఛాయాచిత్రాలను విశ్లేషించిన మీదట వారు చైనాలోని షింజియాంగ్‌ రాష్ట్రంలో హమీ నగరం వద్ద 110 సైలోలను గుర్తించారు. తరవాత పొరుగు రాష్ట్రం గన్సులోని యుమెన్‌ నగరానికి 380 కిలోమీటర్ల దూరంలో 120 సైలోల నిర్మాణ పనులు జరుగుతున్నాయని కనిపెట్టారు. ఇన్నర్‌ మంగోలియాలో జిలాంటాయ్‌ నగరం వద్ద మరో 20 వరకు సైలోలను గుర్తించారు. ప్రపంచం ఇప్పటికీ అణు ప్రళయం అంచున ఊగిసలాడుతోందనడానికి ఇదే నిదర్శనం. దీన్ని గుర్తెరిగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ‘అణు యుద్ధంలో విజేతలెవరూ ఉండరు. ఆ విలయ సదృశ యుద్ధం ఎప్పటికీ జరగకుండా నివారించడం మనందరి కర్తవ్యం’ అని జూన్‌లో జెనీవాలో భేటీ అయినప్పుడు ఉద్ఘాటించారు. తమ దేశాల మధ్య స్తంభించిపోయిన అణు నిరాయుధీకరణ చర్చలను మళ్ళీ కొనసాగించాలని నిర్ణయించారు. అంతమాత్రాన అంతా సవ్యంగా ఉందని భావించకూడదు.

సంతకమే శరణ్యం

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అణ్వస్త్ర నిషేధ ఒప్పందం (టీపీఎన్‌డబ్ల్యూ) ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చినప్పటికీ, అమెరికా అణు విధాన సమీక్షను చేపట్టనుండటం అనిశ్చితికి దారితీస్తోంది. అమెరికా అణ్వస్త్ర నిల్వలను తగ్గించాలని బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతున్నా, రష్యా అణ్వాయుధాలను పెంచుకొంటూ పోతోందని అమెరికన్‌ విశ్లేషకులు అంటున్నారు. రష్యా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి 1.2లక్షల కోట్ల డాలర్ల వ్యయంతో అత్యాధునిక అణ్వాయుధాల రూపకల్పన ప్రాజెక్టు చాలాకాలం నుంచి నడుస్తోంది. ఇలాంటి ప్రయత్నాలను విరమించాలని, ఏ దేశంపైనా తామే మొదట అణు ప్రయోగం జరపబోనని హామీ ఇవ్వాలని బైడెన్‌ సర్కారును పౌర సమాజ ప్రముఖులు కోరుతున్నారు. 130 దేశాల మధ్య సంప్రదింపులతో గత జనవరి నుంచి అమలులోకి వచ్చిన టీపీఎన్‌డబ్ల్యూపై ఇంతవరకు 55 దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి గుర్తించిన అయిదు అణ్వస్త్ర దేశాలతోపాటు- అణ్వాయుధాలున్న భారత్‌, పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియాలు కూడా సంతకాలు చేయడానికి నిరాకరించాయి. జెనీవాలోని నిరాయుధీకరణ సాధన సభ ద్వారా మాత్రమే అణ్వస్త్ర నిషేధ సంప్రదింపులు జరగాలన్నది భారత్‌ అభిమతం. పైగా, ఈ ఒప్పందం కుదిరేముందు జరిగిన సంప్రదింపుల్లో ఏ ఒక్క అణ్వస్త్ర దేశమూ పాలుపంచుకోలేదని ఇండియా గుర్తుచేసింది. భద్రతా మండలి గుర్తించిన అయిదు అణ్వస్త్ర రాజ్యాలు తాము ఇప్పటికే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ)పై సంతకాలు చేసినందువల్ల కొత్తగా టీపీఎన్‌డబ్ల్యూను ఆమోదించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాయి. అణు రాజ్యాలు ఇలా ఏదో ఒక సాకుచెప్పి తప్పించుకొంటున్నంతవరకు భూమండలంపై అణు ప్రళయ కత్తి వేలాడుతూనే ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం ప్రభుత్వాలపై ప్రజలు, పార్లమెంట్లు ఒత్తిడి పెంచడమే శరణ్యమని విజ్ఞులు భావిస్తున్నారు. తదనుగుణంగా హిరోషిమా దినం, నాగసాకి దినం సందర్భంగా అణ్వస్త్ర నిషేధ ఒప్పందంపై అన్ని దేశాల ప్రభుత్వాలు సంతకం చేసేలా ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని శాంతి రక్షక సంఘాలు పిలుపిచ్చాయి. ఈ మేరకు ఐరోపా, అమెరికా, జపాన్‌ తదితర దేశాల్లో సభలు, ప్రదర్శనలు జరగనున్నాయి.

కవ్వింపు విన్యాసాలు

అమెరికా, రష్యాలు అత్యాధునిక అణ్వస్త్రాల తయారీకి వందల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌లో, బాల్టిక్‌, నల్లసముద్రాలలో పైచేయి సాధించడానికి పోటీపడుతూనే ఉన్నాయి. రష్యా సరిహద్దుల్లో అమెరికా కూటమి తరచూ సైనిక విన్యాసాలు జరపడాన్ని కవ్వింపు చర్యలుగా మాస్కో పరిగణిస్తోంది. మరోవైపు తైవాన్‌ స్వాతంత్య్రం కోసం బైడెన్‌ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం చైనాతో అణు యుద్ధ ప్రమాదాన్ని ప్రేరేపిస్తోంది. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా, రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (తైవాన్‌) అంటూ రెండు వేర్వేరు చైనాలు లేవని, ఉన్నది ఒకే చైనా అనే విధానాన్ని అమెరికా ఇంతకాలం గౌరవిస్తూ వచ్చింది. ఇప్పుడు దానికి దూరం జరుగుతూ తైవాన్‌ స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో తైవాన్‌ చుట్టుపక్కల, దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్రాలలో, ఫిలిప్పీన్స్‌ సమీప జలాల్లో యుద్ధ నౌకలు, విమానాలతో కవ్వింపు విన్యాసాలు జరుగుతున్నాయి. బైడెన్‌ ప్రభుత్వం త్వరలో అణు విధాన సమీక్షను చేపట్టబోతున్న సమయంలో ఇటువంటివి ఆందోళన రేపుతున్నాయి. రానున్న సంవత్సరాల్లో అమెరికా అణ్వస్త్ర వ్యూహ రచన, సన్నాహాలను శాసించే సమీక్ష అది.

- ప్రసాద్‌
 

Posted Date: 06-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం