• facebook
  • whatsapp
  • telegram

నిరసన గళాలపై ఉక్కుపాదం

మయన్మార్‌ సైనిక నేతల అతిపోకడ

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు చేపట్టి, ఆరునెలల నుంచి దేశాన్ని అగ్నిగుండంగా మార్చిన సైనికాధిపతి మిన్‌ ఆంగ్‌ లెయింగ్‌ తాను ప్రధానిగా వ్యవహరించనున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూల్చిన ఆయన ఇటీవల తనను తానే ప్రధానిగా ప్రకటించుకున్నారు. 2023లో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తానని ఆయన చేసిన ప్రకటన వాస్తవరూపం దాల్చదని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సైనిక పాలన(జుంటా)కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ప్రజాస్వామ్యవాదుల ఆందోళనలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం, అనేకమందిని కారాగారాలకు తరలించడంతో పరిస్థితులు చేజారుతున్నాయి. రాజకీయ అస్థిరత పెచ్చరిల్లడంతో పాటు కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. 2020లో జరిగిన ఎన్నికల్లో అనేక అవకతవకలు చోటుచేసుకొన్నట్లు సైన్యం ఆరోపిస్తోంది. గత ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్‌ సూకీ సారథ్యంలోని ఎన్‌ఎల్‌డీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఆ విజయమే సైన్యానికి కంటగింపుగా మారిందన్నది బహిరంగ రహస్యం. ప్రత్యర్థి పక్షమైన యూనియన్‌ సాలిడారిటీకి సైన్యం అన్ని రకాలుగా సాయం అందించినా 33 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ ఓటమిని జీర్ణించుకోలేకే సైన్యం తిరుగుబాటు చేయడం, ఆరునెలల దరిమిలా మిన్‌ ఆంగ్‌ లెయింగ్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టడం వెనక దీర్ఘకాలిక వ్యూహమే ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మయన్మార్‌లో 1958లో అప్పటి సైనిక జనరల్‌ నెవిన్‌ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం మయన్మార్‌ సుదీర్ఘకాలం సైనికపాలనలో మగ్గింది. ఎప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని అప్పటి సైనికపాలకులు అనుసరించిన వ్యూహాన్నే లెయింగ్‌ అనుసరిస్తున్నారని ప్రజాస్వామ్యవాదులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఏదో ఒక కారణంతో రద్దు చేయడం, సైనిక పాలన ప్రారంభించడం సైన్యానికి ఆనవాయితీగా మారింది. 2023లో ఎన్నికలు నిర్వహిస్తామన్న సైనికనేత హామీ బూటకమేనని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా, ఆసియాన్‌ దేశాల కూటమి నుంచి భారీయెత్తున ఒత్తిడి వస్తే తప్ప దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ సాధ్యపడదని వారు విశ్వసిస్తున్నారు. ఇండొనేసియా నేతృత్వంలో ‘ఆసియాన్‌’ పలు దఫాలుగా మయన్మార్‌లోని జుంటాతో చర్చలు నిర్వహించింది. ఏప్రిల్‌లో రెండు బృందాల మధ్య అయిదు సూత్రాల ప్రాతిపదికన ఒప్పందం కుదిరింది. హింసను పూర్తిగా విడిచిపెట్టి శాంతియుత పరిష్కారం కోసం అన్ని పక్షాలతో చర్చలు జరపడానికి ఉభయపక్షాలు అంగీకరించాయి. కానీ, ఈ ప్రక్రియ ఇంకా పూర్తిగా కార్యాచరణ దాల్చకముందే సైనికనేత ఏకంగా ప్రధానిగా పగ్గాలు చేజిక్కించుకున్నారు! దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు భారీయెత్తున ఉద్యమం జరుగుతోంది. సైనికులు కాల్పులకు పాల్పడుతున్నా ప్రదర్శనకారులు సంయమనంతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వీటిని అణచివేసేందుకే ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడప్పుడే అధికారాన్ని బదలాయించేందుకు లెయింగ్‌ సిద్ధపడకపోవచ్చు. జనరల్‌ లెయింగ్‌ సారథ్యంలో ఏర్పడనున్న సర్కారును సంరక్షణ ప్రభుత్వంగా ప్రకటించడాన్ని జాతీయవాద కూటమి తప్పుపట్టింది. ‘ఈ విధానంతో అంతర్జాతీయంగా తమపై వస్తున్న ఒత్తిళ్లను తప్పించుకునేందుకు సైనిక జుంటా వేసిన ఎత్తుగడే ఇది’ అని ఆరోపించింది. సైన్యం సారథ్యంలోని సర్కారును ప్రజలు ఎన్నుకోలేదు. ఇలాంటి ప్రభుత్వంపై దేశ ప్రజలకు ఎలాంటి నమ్మకం లేదని ఒక ప్రకటనలో పేర్కొంది.

బ్రునై విదేశాంగమంత్రి ఎరివాన్‌ యూసఫ్‌ను మయన్మార్‌కు ప్రత్యేక దూతగా ఆసియాన్‌ నియమించింది. పదిదేశాల కూటమి అయిన ఆసియాన్‌లో మయన్మార్‌ ఒక సభ్యదేశం. ఆసియాన్‌ మార్గదర్శకాల ప్రకారం ఒక దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో మరో సభ్యదేశం జోక్యం చేసుకోకూడదు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఇప్పటివరకు 900 మందికిపైగా పౌరులు సైనికుల కాల్పుల్లో అమరులయ్యారు. వేలాది ప్రజలను జైళ్లలో నిర్బంధించారు. దేశంలోని పలుప్రాంతాల్లో నిరాయుధులైన ఆందోళనకారులపై సైన్యం యథేచ్ఛగా కాల్పులు జరుపుతున్న వైనం వెలుగులోకి వస్తోంది. మయన్మార్‌ పరిణామాలు భారత్‌కు ఇబ్బందికరంగా మారాయి. ఈశాన్య భారతంలోని పలురాష్ట్రాలకు మయన్మార్‌తో సరిహద్దులున్నాయి. సైనిక జుంటా ప్రభుత్వం చైనాతో సన్నిహితంగా మసలుతోంది. ఈశాన్యానికి సరకు రవాణా కోసం కలాదాన్‌ రహదారి పూర్తికావాలంటే, మయన్మార్‌ సహకారం తప్పనిసరి. ఆ దేశంతో భారత్‌కు రాజకీయ, దౌత్య, సైనికపరంగా అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో మయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలకపాత్ర పోషించాల్సిన అవసరముంది.

- కొలకలూరి శ్రీధర్‌
 

Posted Date: 10-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం