• facebook
  • whatsapp
  • telegram

మళ్ళీ జిన్‌పింగ్‌దే సింహాసనం

చైనాపై పట్టుబిగించిన వైనం

చైనా అధినేత జిన్‌పింగ్‌ వరసగా మూడోసారి అధికారపగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 1949లో వామపక్ష చైనా ఆవిర్భావం అనంతరం మావో జెడాంగ్‌, డెంగ్‌ జియావో పింగ్‌ చైనా ఆధునిక చరిత్రలో తిరుగులేని నేతలుగా ఖ్యాతికెక్కారు. అదే కోవలో ఆర్థిక సంస్కరణల యుగం తరవాత పగ్గాలు చేపట్టిన జిన్‌పింగ్‌ యావత్‌ అధికారాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నారు. 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రమంగా ప్రాబల్యాన్ని పెంచుకొన్నారు. పార్టీలో, దేశంలోని కీలక అధికార పదవుల్లో తన వర్గీయులను నియమించుకోవడం ద్వారా స్వీయాధికారానికి ఎదురులేకుండా చేసుకున్నారు. అంతకుముందు అధికారంలో ఉన్న హు జింటావో పార్టీలో ప్రజాస్వామిక ధోరణులు, సమష్టి నాయకత్వంపై దృష్టి కేంద్రీకరించగా- అందుకు భిన్నంగా ఏకస్వామ్యం, ఏక వ్యక్తి పాలనవైపు జిన్‌పింగ్‌ మొగ్గుచూపడం గమనార్హం. ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతున్న పార్టీ ప్లీనంలో కేంద్ర కమిటీకి చెందిన 370 మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఆధునిక చైనా చరిత్రలో ఇదో కీలకఘట్టమని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో జిన్‌పింగ్‌ మూడో పర్యాయం పగ్గాలు చేపట్టడానికి ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా చూసుకోవడమే సమావేశాల ప్రథమ లక్ష్యమని తేటతెల్లమవుతోంది. వచ్చే ఏడాది జరగనున్న పార్టీ కాంగ్రెస్‌ సమావేశాల్లోనూ అధ్యక్షుడి నాయకత్వంపై ఎవరూ ప్రశ్నించలేని తీరులో తాజా సమావేశాల్లో వ్యూహరచన జరగవచ్చుని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మూడో చారిత్రక తీర్మానం

చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మూడో చారిత్రక తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఇందుకు సంబంధించిన తీర్మాన వివరాలు నాలుగురోజుల సమావేశం ముగిసిన తరువాత లభ్యంకానున్నాయి. ఇప్పటికే అధ్యక్ష కాలపరిమితిపై ఉన్న నిబంధనలను తొలగించిన జిన్‌పింగ్‌ జీవితకాలం అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు పెద్దగా ఎదురుచెప్పేవారు లేకపోవడం గమనార్హం. జిన్‌పింగ్‌ అత్యంత రాజకీయ సామర్థ్యంతో దేశీయంగా, అంతర్జాతీయంగా చైనాను ఆర్థిక, సైనిక శక్తిగా రూపొందించారు. దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవుల నిర్మాణం, విమాన వాహక నౌకలు సమకూర్చుకోవడం, తైవాన్‌ను బలవంతంగానైనా విలీనం చేసేందుకు యత్నించడం, అమెరికాతో వాణిజ్య యుద్ధంవంటివి కీలకమైనవి. వీఘర్‌ తిరుగుబాట్లను నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. బీఆర్‌ఐ రహదారితో ఆసియా, ఐరోపా, ఆఫ్రికాలతో వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు. సమకాలీన చైనాలో తనకు ప్రత్యామ్నాయ నాయకుడు లేడని చైనీయుల మదిలో బలమైన అభిప్రాయం కలిగించారు.  గతంలో 1945లో చైనా అగ్రనేత మావో జెడాంగ్‌ నేతృత్వంలో తొలి తీర్మానం ప్రకటించారు. సంప్రదాయ వామపక్ష ఆలోచనా విధానం నుంచి మావో విధానం వైపు చైనా ప్రయాణం సాగేట్లు ఈ తీర్మానాన్ని రూపొందించారు. అనంతరం 1981లో డెంగ్‌ జియావో పింగ్‌ సారథ్యంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన తీర్మానాన్ని ఆవిష్కరించారు. ఇందులోనే సాంస్కృతిక విప్లవంతో పాటు పలు తప్పిదాలపై విచారం ప్రకటించారు. తరువాత డెంగ్‌ పాలనలోనే సంస్కరణలతో పాటు అనేక ఆర్థిక సంస్కరణలకు వీలుగా పలు చర్యలు ప్రవేశపెట్టారు. ఈ రెండు ఘట్టాల్లోనూ చారిత్రక అవసరాల దృష్ట్యా పార్టీలో అసమ్మతి వర్గాలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించారు. ప్రస్తుత జిన్‌పింగ్‌ హయాములో ఎలాంటి అసమ్మతి స్వరమూ వినిపించడం లేదు. చైనా అంటే జిన్‌పింగ్‌, జిన్‌పింగ్‌ అంటే చైనాగా ఆయన పాలన కొనసాగుతోంది!

అంతా రహస్యమే...

బీజింగ్‌ సమావేశం అజెండా బయటకు రాలేదు. సమావేశం తరవాత తీర్మానంలోని పలు అంశాలపై ఒక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనా సాధించిన ప్రగతితో పాటు భవిష్యత్తు అంశాలనూ ఇందులో పేర్కొనే అవకాశముంది. ప్లీనం తీర్మానాలను వచ్చే ఏడాది జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశం ఎలాంటి చర్చలూ లేకుండా ఆమోదించనుందంటున్నారు. దీంతో ఈ సమావేశం అజెండాపై ఉత్కంఠ నెలకొంది. మూడో దఫా సైతం అధ్యక్షుడిగా కొనసాగేందుకు తీర్మానంలో పేర్కొనే అవకాశముంది. గత సమావేశాల్లోనూ పగ్గాలు స్వీకరించేందుకు వీలుగా- అడ్డుగా ఉన్న అన్ని నిబంధనలను జిన్‌పింగ్‌ తొలగించారు. ఇరుగుపొరుగు దేశాలతో చైనా అనుసరిస్తున్న విధానం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ప్రత్యేకించి భారత్‌తో డోక్లాం, లద్దాఖ్‌ సరిహద్దుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దక్షిణ చైనా సముద్రంతో పాటు తైవాన్‌పై అనుసరిస్తున్న దుందుడుకు విధానాలతో భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు నెలకొనే అవకాశముంది. చైనాలో తిరుగులేని నేతగా ఆవిర్భవించిన జిన్‌పింగ్‌ ఇదే వైఖరిని పొరుగుదేశాలతో పాటు అంతర్జాతీయ యవనికపై ప్రదర్శిస్తే ఎన్నో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

- కొలకలూరి శ్రీధర్‌
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరఫరా స్తంభిస్తే ఇక్కట్లే

‣ టర్కీపైనా ఆంక్షల కొరడా

Posted Date: 10-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం