• facebook
  • whatsapp
  • telegram

ఆచితూచి తాలిబన్ల అడుగులు

వాస్తవాలు గ్రహించి సామరస్య ధోరణి

అఫ్గానిస్థాన్‌ మరోసారి తాలిబన్ల వశం కావడంతో ఇక అక్కడి నుంచి ఉగ్రమూకలు పొరుగు దేశాల్లోకి చొరబడే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కశ్మీర్‌ సమస్యపై పాక్‌ పంథాను తాలిబన్లు సమర్థించడం భారత్‌లో అనుమానాలు పెంచింది. అఫ్గాన్‌ నుంచి తమ దేశాల్లోకి అస్థిరత వ్యాపించకుండా నివారించడానికి భారత్‌, రష్యా, ఇరాన్‌లతోపాటు అయిదు మధ్యాసియా దేశాల జాతీయ భద్రతా సలహాదారులు నవంబరు 10న దిల్లీలో సమావేశమయ్యారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రతిఘటిస్తామని ప్రతినబూనారు. తమ మిత్రులైన పాకిస్థాన్‌, చైనాలతో సహా ప్రపంచంలో ఏ దేశమూ తాలిబన్‌ ప్రభుత్వానికి అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. అందువల్ల తాలిబన్లను దిల్లీ సమావేశానికి ఆహ్వానించలేదు. అయినా ఆ సమావేశం అఫ్గాన్‌కు మేలు చేస్తుందని తాలిబన్లు హర్షం వ్యక్తం చేశారు. అమెరికా ఒత్తిడివల్ల తాలిబన్‌ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వడానికి పాక్‌ సాహసించి ఉండకపోవచ్చు. భారత్‌, రష్యా, ఇరాన్‌లు తమ ప్రభుత్వాన్ని గుర్తిస్తే మిగతా ప్రపంచమూ అదే బాటలో నడుస్తుందని తాలిబన్ల ఆశ. అందువల్ల దిల్లీ సమావేశానికి ముందునుంచే ఆ మూడు దేశాలతో తాలిబన్లు సామరస్యంగా వ్యవహరిస్తున్నారు. చాబహార్‌ రేవు ద్వారా ఎగుమతులు దిగుమతులు మళ్ళీ ఆరంభం కావడమే దానికి నిదర్శనం.

అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశం అయ్యాక చాబహార్‌ రేవు కార్యకలాపాలు నిలిచిపోయాయి. భారత్‌, ఇరాన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ రేవు భవితవ్యంపై సందిగ్ధం నెలకొంది. అనుమానాలను పటాపంచలు చేస్తూ సెప్టెంబరు రెండు నుంచి చాబహార్‌ రేవు తిరిగి పనిచేయడం మొదలుపెట్టింది. తమ దేశంలో భారత్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని తాలిబన్లు ఆశిస్తున్నారు. అంతర్యుద్ధం, కరోనా వైరస్‌, సుదీర్ఘ అనావృష్టి అఫ్గాన్‌ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. 3.8 కోట్ల అఫ్గాన్‌ జనాభాలో ఇప్పటికే 22శాతం ఆకలితో అలమటిస్తున్నారు. మరో 36శాతం తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడానికి భారత్‌ ట్రక్కుల్లో 50 వేల టన్నుల గోధుమలను పంపుతానని గత నెలలో ప్రకటించింది. అవి పాక్‌ భూభాగం మీదుగా వెళ్ళడానికి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం నిరాకరించింది. చివరకు అఫ్గాన్‌ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్‌ ఖాన్‌ ముతాకీ విజ్ఞప్తితో గోధుమల రవాణాకు పాక్‌ పచ్చజెండా ఊపింది.

భారత్‌ మానవతా దృక్పథంతో గత పదేళ్లలో అఫ్గాన్‌కు పది లక్షల టన్నుల గోధుమలను అందించింది. జనాభాలో సగానికిపైగా దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్నందువల్ల బయటి ప్రపంచ సహాయ సహకారాలు తాలిబన్‌ ప్రభుత్వానికి అత్యవసరం. బయటి నుంచి సహాయం అందుకోవడానికి పూర్తిగా పాక్‌ భూభాగంపై ఆధారపడటం సరికాదని భారత గోధుమల ఉదంతం తాలిబన్లకు తెలియజెప్పింది. అందుకే పాక్‌తో పని లేకుండా చాబహార్‌ రేవు ద్వారా సరకుల ఎగుమతి దిగుమతులను వారు స్వాగతిస్తున్నారు. ఆగస్టు 15న రేవు కార్యకలాపాలు నిలిచిపోయిన తరవాత ఆగస్టు 31న ఖతర్‌లో భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌, అక్కడి తాలిబన్‌ ప్రతినిధి మహముద్‌ అబ్బాస్‌ మధ్య చర్చలు జరిగాయి. ఆ వెంటనే సెప్టెంబరు రెండు నుంచి చాబహార్‌లో కార్యకలాపాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఆ రేవు ద్వారా అఫ్గాన్‌కు రష్యా 5.3 లక్షల టన్నుల గోధుమలను పంపింది. అఫ్గాన్‌ వ్యాపారులు తాజా, ఎండిన పండ్లను ఆ రేవు ద్వారా భారత్‌కు ఎగుమతి చేయడానికి ఇరాన్‌ అనుమతించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వస్తే చాబహార్‌ రేవు మూలన పడుతుందని, ఇరాన్‌లో చైనా ప్రాబల్యం పెరుగుతుందని వినవచ్చిన ఊహాగానాలకు ఈ పరిణామాలు తెర దించుతున్నాయి. చాబహార్‌ సమీపంలో బలూచిస్థాన్‌లోని గ్వాదర్‌లో చైనా, పాకిస్థాన్‌లు నిర్మించిన రేవు అభివృద్ధి చాబహార్‌ వల్ల దెబ్బతింటుందని ఆ రెండు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. భారత్‌తో సామరస్యం విలువను గుర్తిస్తున్న తాలిబన్లు, పాకిస్థాన్‌ చెప్పినట్లు నడుచుకోవడానికి సిద్ధంగా లేరు. బ్రిటిష్‌ హయాములో పాక్‌, అఫ్గాన్లను విభజిస్తూ గీసిన డ్యురాండ్‌ రేఖను తాలిబన్లు ఆమోదించడం లేదు. ఆ రేఖ పాక్‌, అఫ్గాన్లలోని పష్తూన్‌ తెగవారి నివాస ప్రాంతాలను విడగొడుతోంది. తాలిబన్‌ నాయకులు, కార్యకర్తల్లో అత్యధికులు ఆ తెగకు చెందినవారే. అఫ్గాన్‌లోని హక్కానీ నెట్‌వర్క్‌ను పాకిస్థాన్‌ తమపై ప్రయోగించడం తాలిబన్లకు ఆగ్రహం కలిగిస్తోంది. అలాగని తాలిబన్లు పాక్‌తో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే పెద్దన్న చైనాకు సైతం వారు దూరం కావలసి వస్తుంది. పూర్తిగా పాక్‌, చైనాలపైనే ఆధారపడటం సరికాదని గ్రహించి భారత్‌, రష్యా, ఇరాన్‌లతో సామరస్యం చెడకుండా తాలిబన్లు జాగరూకతతో వ్యవహరిస్తున్నారు.

- వరప్రసాద్‌
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మహానగరాల్లో మాయగాళ్లు

‣ ఆకలి మంటల్లో అఫ్గాన్‌

‣ పర్యావరణ స్పృహే పుడమికి రక్ష

‣ పత్తికి పరిశ్రమ తోడైతేనే భవిత

Posted Date: 27-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం