• facebook
  • whatsapp
  • telegram

హక్కుల పేరిట అమెరికా దూకుడు

ఆంక్షల విధింపులో అత్యుత్సాహం

ప్రపంచ దేశాల్లో పెద్దన్నగా పేరొందిన అమెరికా- అందుకు తగినట్లుగా నడుచుకోవడంలో మాత్రం విఫలమవుతోంది! ఇతర దేశాలు, విదేశీయులపై ఏకపక్షంగా ఆంక్షలు విధిస్తూ విమర్శల పాలవుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో తాజాగా బంగ్లాదేశ్‌లోని ర్యాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌ (ఆర్‌ఏబీ)కు చెందిన ఏడుగురు ప్రస్తుత, మాజీ అధికారులపై అగ్రరాజ్యం కొరడా ఝళిపించింది. అమెరికా పౌరులు, సంస్థలతో ఆర్థిక లావాదేవీలు జరపకుండా వారిపై నిషేధం విధించింది. సైనిక చర్యలు, యుద్ధాల కోసం నిధులు గుమ్మరిస్తూ పలు దేశాలను సంక్షోభాల్లోకి నెడుతున్న అమెరికా ఇలాంటి ఆంక్షలకు ఉపక్రమిస్తుండటం విచిత్రం!

విమర్శల వెల్లువ

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 10న బైడెన్‌ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బంగ్లాదేశ్‌, చైనా, మయన్మార్‌, ఉత్తర కొరియాలకు చెందిన పలువురు అధికారులు, సంస్థలపై గ్లోబల్‌ మ్యాగ్నిస్కీ చట్టానికి సంబంధించిన ఆంక్షలను విధించింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, తీవ్రస్థాయి అవినీతికి పాల్పడే విదేశీయులపై వీటిని ప్రయోగిస్తుంటారు. అవినీతి, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా బంగ్లాదేశ్‌లో 2004లో ఆర్‌ఏబీని ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి నేరంపైనైనా దర్యాప్తు చేపట్టే అధికారాలు కట్టబెట్టారు. క్రమంగా ప్రభుత్వాలు ఆర్‌ఏబీని తమ చేతుల్లో పావుగా వాడుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. మాదకద్రవ్యాలపై పోరు ముసుగులో బంగ్లాదేశ్‌లో ప్రతిపక్ష పార్టీల సభ్యులు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలను ఈ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దారుణాలపై పలు స్వచ్ఛంద సంస్థలు అమెరికా ప్రభుత్వానికి వినతులు పంపాయి. 2018 నుంచి ఇప్పటిదాకా దాదాపు 600 మందిని ఆర్‌ఏబీ- చిత్రహింసలకు గురిచేసి చంపేసిందని, 2009 నుంచి మరో 600కు పైగా వ్యక్తుల అదృశ్యానికి కారణమైందని ఆరోపించాయి. ఈ విషయాన్ని బైడెన్‌ సర్కారు తీవ్రంగా పరిగణించింది. మానవ హక్కుల చట్టాలను నీరుగార్చడం ద్వారా అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తున్నారని, బంగ్లాదేశ్‌ ప్రజల ఆర్థిక పురోగతిని దెబ్బతీస్తున్నారని పేర్కొంటూ ఆర్‌ఏబీకి చెందిన ఏడుగురు ప్రస్తుత, మాజీ అధికారులపై ఆంక్షలు ప్రకటించింది. వీరిలో బంగ్లాదేశ్‌ ప్రస్తుత పోలీసు అధిపతి కూడా ఉన్నారు. బంగ్లాదేశ్‌తో అమెరికాకు దశాబ్దాలుగా సత్సంబంధాలే ఉన్నాయి. 111 దేశాలతో ఇటీవల తాను నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బైడెన్‌ ఆ దేశాన్ని ఆహ్వానించకపోవడంతో ద్వైపాక్షిక సంబంధాలకు బీటలు పడినట్లయింది. తాజా ఆంక్షలు వాటి మధ్య దూరాన్ని మరింత పెంచే అవకాశముంది. మరోవైపు- ముఖం చూడగానే వీఘర్‌ ముస్లిములను గుర్తించగల ఫేషియల్‌ రికగ్నిషన్‌ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేసినందుకుగాను చైనాకు చెందిన కృత్రిమ మేధ అంకుర సంస్థ సెన్స్‌ టైమ్‌ గ్రూప్‌ను అమెరికా నిషిద్ధ జాబితాలో పెట్టింది. మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు అండగా నిలిచేలా పోలీసులకు ఆయుధాలు సమకూర్చినందుకు- ఆ దేశానికి చెందిన రెండు మిలిటరీ సంస్థలపైనా ఆంక్షలు ప్రకటించింది. చైనా, మయన్మార్‌, ఉత్తర కొరియాల సంగతెలా ఉన్నా- బంగ్లాదేశ్‌ అధికారులపై ఆంక్షలు విధించిన విషయంలో బైడెన్‌ సర్కారు తీవ్ర విమర్శల పాలవుతోంది.

స్వీయ సమీక్ష అవసరం

విదేశాలపై వేలెత్తి చూపడానికి ముందు అమెరికా తన సొంత పరిస్థితిని సమీక్షించుకోవాలి. అగ్రరాజ్యంలో 2020లోనే వేర్వేరు కాల్పుల ఘటనల్లో రమారమి 40 వేల మంది మృత్యువాతపడినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతిరోజూ జాతి విద్వేష ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలోనూ ఘోరంగా విఫలమైంది. పేదలు, ధనికుల మధ్య అంతరం క్రమంగా పెరిగిపోతోంది. విదేశీయులతోపాటు సొంత పౌరులపైనా ప్రభుత్వం అంతర్జాలం, ఫోన్‌ సంబంధిత నిఘా పెడుతోంది. ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయన్న సంగతి గుర్తెరగాలి. ఓ అంచనా ప్రకారం- 2001 నుంచి అమెరికా చేపట్టిన యుద్ధాలు, వివిధ దేశాల్లో సైనిక చర్యల ఫలితంగా పెద్దసంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లింది. ఉగ్రభూతంపై పోరు కోసమంటూ అమెరికా సేనలు రంగప్రవేశం చేశాక ఇరాక్‌, అఫ్గాన్‌, సిరియాల్లో సంక్షోభాలు, రాజకీయ అస్థిరత మరింత పెరిగాయన్నది చేదునిజం. సామూహిక హనన ఆయుధాలను దాచి ఉంచిందంటూ ఇరాక్‌పై దాడులు చేపట్టిన అగ్రరాజ్యం, వాటిజాడను మాత్రం చూపలేకపోయింది. లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూలదోసిన తరవాత శాంతి-సుస్థిరతలను స్థాపించలేక అమెరికా చేతులెత్తేసింది. ప్రపంచానికి పెద్దన్నగా పేరు నిలబెట్టుకోవాలంటే అగ్రరాజ్యం తొలుత తన పరిస్థితిపై స్వీయ మదింపు చేసుకోవాలి. స్వదేశంలో హక్కుల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలి.

- నవీన్‌కుమార్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పంటలను ముంచుతున్న విపత్తులు

‣ ప్రజలపైనే అప్పుల భారం

‣ మోన్‌ మారణకాండకు బాధ్యులెవరు?

‣ సహజత్వం కోల్పోతున్న వాతావరణం

Posted Date: 18-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం