• facebook
  • whatsapp
  • telegram

జమ్మూకశ్మీర్‌లో పునర్విభజన రగడ

తాజా ముసాయిదాతో భాజపాకు మేలు?

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ దుమారానికి దారితీసింది. తాజా ప్రతిపాదనతో కశ్మీర్‌కు నష్టం వాటిల్లుతుందని, అదే సమయంలో భాజపాకు లబ్ధి చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ ఆధ్వర్యంలో గతేడాది ఏర్పాటైన సంఘం ఇటీవలే ముసాయిదాను రూపొందించింది. ఇది కశ్మీర్‌లోని ప్రధాన పార్టీలపై బీజేపీ పైచేయి సాధించే విధంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాటి రాష్ట్ర అసెంబ్లీలో జమ్మూకు తగిన ప్రాధాన్యం లభించేది కాదు. ముఖ్యమంత్రి ఎంపిక, రాజకీయ డిమాండ్లను లేవనెత్తే విషయంలో అధిక జనాభా కలిగిన కశ్మీర్‌దే పైచేయిగా ఉండేది. ప్రస్తుతం కశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్మూ డివిజన్‌లో 37 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తాజా ముసాయిదాలో జమ్మూకు అదనంగా మరో ఆరు, కశ్మీర్‌కు ఒక నియోజకవర్గం ఇవ్వాలని పునర్విభజన సంఘం ప్రతిపాదించింది. ఆ సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషన్‌, జమ్మూ-కశ్మీర్‌ ఎన్నికల కమిషనర్‌కి సభ్యత్వం కల్పించారు. అనుబంధ సభ్యులైన భాజపా నేతలు జితేంద్ర సింగ్‌, జుగల్‌ కిశోర్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఫరూక్‌ అబ్దుల్లా, హస్నైన్‌ మసూది, అక్బర్‌లు ముసాయిదా ప్రతిపై తమ స్పందన తెలిపిన అనంతరం దాన్ని ప్రజాభిప్రాయానికి ఉంచే అవకాశం ఉంది.

నియోజకవర్గాల పునర్విభజన కోసం 2011 జనాభా లెక్కలను కాదని, భౌగోళిక స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పర్వతాలు, పర్వతాలు-మైదానాలతో కూడిన ప్రాంతం, మైదాన ప్రదేశాలుగా జమ్మూ-కశ్మీర్‌ను పునర్విభజన సంఘం విభజించింది. మైదాన ప్రాంతాలుండే కశ్మీర్‌తో పోలిస్తే పర్వతాలతో కూడిన ప్రాంతాలు అధికంగా ఉండే జమ్మూకు ఎక్కువ సీట్లు కేటాయించాలని సంఘం ప్రతిపాదించింది. జమ్మూ డివిజన్‌లోని ఉధంపుర్‌, కథువా, సామ్బా, రాజౌరీ, డోడా, కిస్త్‌వాడ్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఆరు స్థానాలు, కశ్మీర్‌లోని కుప్వాడా జిల్లాకు ఒక్క స్థానాన్ని కేటాయించింది. నూతన ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే కశ్మీర్‌లో 47, జమ్మూలో 43 సీట్లు ఉంటాయి. జమ్మూలోని కథువా, ఉధంపుర్‌, సామ్బాల్లో దాదాపు 85శాతం హిందూ జనాభా నివసిస్తోంది. మిగిలిన మూడు జిల్లాల్లో హిందువుల వాటా 35-45శాతం. అందువల్ల తాజా ప్రతిపాదనలతో భాజపాకే మేలు కలుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా 2002, 2008లో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. స్వయంప్రతిపత్తి కారణంగా జమ్మూ-కశ్మీర్‌ను ఆనాడు మినహాయించారు. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం రెండు ప్రాంతాల మధ్య సమానత్వాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతో పునర్విభజన సంఘం ఏర్పాటైంది. తాజా ముసాయిదా అందుకు విరుద్ధంగా ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. కశ్మీర్‌ లోయలో కేంద్రం పట్ల సానుకూల వైఖరి కనబరచే అప్నీ పార్టీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ సైతం అసంతృప్తితో ఉన్నాయి. కశ్మీర్‌కన్నా జమ్మూకే అధిక సీట్లు కేటాయిస్తే ఆయా ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగే అవకాశం ఉందని పలు పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. నాటి జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్ర అసెంబ్లీలో 111 సీట్లు ఉండేవి. లద్దాఖ్‌కు నాలుగు స్థానాలు కేటాయించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 24 సీట్లు కొనసాగుతున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దుకు ముందు ఎస్‌టీలకు ఏడు సీట్లు రిజర్వు చేశారు. ప్రసుత్తం ఎస్‌సీలకు కొత్తగా తొమ్మిది స్థానాలను కేటాయించాలని ప్రతిపాదించారు. ఇదీ భాజపాకు లాభం చేకూరుస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

- బిలాల్‌ భట్‌ 

(కశ్మీరీ వ్యవహారాల నిపుణులు)
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఊపందుకొంటున్న ఉపగ్రహ అంతర్జాలం

‣ ఆశలపల్లకిలో కొత్త ఏడాదిలోకి...

‣ బహుళ ప్రయోజనాల మైత్రీబంధం

‣ ‘హస్త’వాసి బాగాలేదు...

Posted Date: 03-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం