ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు ముకుతాడు వేయాలన్న లక్ష్యంతో అంకురించిన చతుర్భుజ కూటమి (క్వాడ్) క్రమంగా తన అజెండాను విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరుకు ప్రత్యేక కార్యనిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అది తాజాగా ప్రకటించింది. తద్వారా అంతర్జాతీయ భద్రత, శాంతి కోసం కృషి చేయాలన్న తన ఆకాంక్షను వెలిబుచ్చింది.
ఇండియా కేంద్రంగా ఇటీవల అంతర్జాతీయ రాజకీయాలు నడిచాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తొలుత జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశంలో వాడీవేడీ చర్చ జరిగింది. ఆ మరుసటి రోజే- ‘క్వాడ్’ సభ్యదేశాలైన ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాల విదేశాంగ మంత్రులు విడిగా భేటీ అయ్యారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని భద్రతా పరిస్థితులను విస్తృత స్థాయిలో సమీక్షించారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు తాజా సమావేశంలో క్వాడ్ శంఖం పూరించింది.
ఉగ్రవాద విస్తరణలో భాగంగా ప్రపంచమంతటా కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్న ముష్కరులు- అమాయక యువతను తమ ముఠాల్లో నియమించుకుంటున్నారు. విద్రోహచర్యలకు పాల్పడేలా వారిని పురిగొల్పుతున్నారు. డ్రోన్ల వంటి మానవరహిత వ్యవస్థలు, అత్యాధునిక సాంకేతికతలు ఉగ్రవాదుల చేతుల్లో మారణాయుధాలుగా మారుతున్నాయి. ఈ దుష్పరిణామాలపై క్వాడ్ విదేశాంగ మంత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు కూటమి తరఫున ప్రత్యేక కార్యనిర్వాహణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్వాడ్ సభ్యదేశాలన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉగ్రవాద బాధిత దేశాలే. ఆ రక్కసిపై ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యకతను గతంలోనూ పలుమార్లు నొక్కిచెప్పాయి. ప్రత్యేక బృందం ఏర్పాటుతో వాటి సుదీర్ఘ అంతర్మథనం కార్యరూపం దాల్చినట్లయింది. క్వాడ్‌తో పాటు ఇండో-పసిఫిక్‌లోని ఇతర మిత్రదేశాలతోనూ ఈ బృందం కలిసి పనిచేయనుంది. ఉగ్రవాద నూతన రూపాలు, హింసాత్మక తీవ్రవాదంపై పోరాడేందుకు ఇది దోహదపడనుంది. కరడుగట్టిన ముష్కరులపై అంతర్జాతీయ ఉగ్రవాదులన్న ముద్ర పడకుండా ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో చైనా పదేపదే మోకాలడ్డుతోంది. తద్వారా తన చిరకాల మిత్రదేశమైన పాకిస్థాన్‌కు సహకారమందిస్తోంది. దీనిపై క్వాడ్ తాజాగా అసహనం వ్యక్తం చేసింది. ఉగ్రవాదులపై ఐరాస ఆంక్షల విధింపు విషయంలో అన్ని దేశాలూ పారదర్శకంగా వ్యవహరించాలంటూ పరోక్షంగా బీజింగ్‌కు చురకలు అంటించింది.
సముద్రజలాల్లో భద్రత నెలకొంటేనే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యపడుతుంది. అందుకే- అన్ని దేశాలూ అంతర్జాతీయ చట్టాలు, ఐరాస నిబంధనలకు కట్టుబడి ఉండాలని క్వాడ్ మొదటినుంచీ కోరుతోంది. ప్రాంతీయంగా ఉద్రిక్తతలను పెంచే, ప్రస్తుత పరిస్థితులను మార్చే ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక బలగాల మోహరింపు, తీర గస్తీ నౌకల ప్రమాదకర వినియోగంపైనా చతుర్భుజ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఇండో-పసిఫిక్‌లో డ్రాగన్ సైనిక దూకుడును నిలువరించడమే అసలు ఉద్దేశమైనప్పటికీ- క్వాడ్ సభ్యదేశాలు తమది భద్రతా కూటమి అనిగానీ, సైనిక కూటమి అనిగానీ ఏనాడూ వ్యాఖ్యానించలేదు. అందుకు వ్యూహాత్మక కారణాలున్నాయి. ఆసియాలోని చైనా వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు అమెరికా నేతృత్వంలో జరుగుతున్న కుట్రగా క్వాడ్‌ను డ్రాగన్ ఆదినుంచీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తమది ‘సైనిక కూటమి’ అని పేర్కొంటే- ఆ దేశం విమర్శనాస్త్రాలతో విరుచుకుపడేందుకు, దుష్ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ఊతమిచ్చినట్లు అవుతుందన్నది క్వాడ్ నేతల భావన. అందుకే వారు అంతర్జాతీయ శాంతి, సుస్థిరతల కోసం పనిచేసే శక్తిగానే చతుర్భుజ కూటమిని పేర్కొంటున్నారు. ఆ మాటల్ని నిజం చేసేలా తాజా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్య భద్రత, పర్యావరణ మార్పులు, శుద్ధ ఇంధనం, మౌలిక వసతులు వంటి రంగాల్లో ప్రాంతీయంగా మిత్రదేశాలతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
రుణ సంక్షోభంలో చిక్కుకున్న దేశాలకు సుస్థిర, పారదర్శక ఆర్థిక విధానాల ద్వారా చేయూత అందించడంపైనా క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు తాజాగా సమాలోచనలు జరపడం ఆసక్తికర పరిణామం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నేరుగా ఖండించకపోయినా- వివాదాలను ‘శాంతియుతంగా’నే పరిష్కరించుకోవాలంటూ వారు సంయుక్త ప్రకటనలో ప్రస్తావించడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. నిరుడు సెప్టెంబరులో అమెరికాలో భేటీ అయినప్పుడు క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రులు తమ ప్రకటనలో ఉక్రెయిన్ పరిణామాలను ప్రస్తావించలేదు. ఇప్పుడు వారి వైఖరిలో మార్పు రావడం- కూటమి అజెండా విస్తృతమవుతోందనడానికి నిదర్శనం. ప్రాంతీయ కూటములతో సన్నిహితంగా మెలగుతూ, విశ్వశాంతి కోసం క్వాడ్ కృషి చేస్తే- అంతర్జాతీయంగా సుస్థిర భద్రతా పరిస్థితులు నెలకొంటాయనడంలో సందేహం లేదు.
- ఎం.నవీన్
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఈ ఏడాదైనా రూపాయి బలపడుతుందా?
‣ అక్షరాస్యతే అభివృద్ధి అస్త్రం