• facebook
  • whatsapp
  • telegram

హద్దుమీరుతున్న పెడసరంపాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని శక్స్‌గామ్‌ లోయలో చైనా అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్‌ తీవ్రంగా నిరసించింది. ఇప్పటికే చైనా పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌)- పాక్‌ ఆక్రమిత భారత భూభాగాల మీదుగా వెళ్తోంది.  తాజాగా శక్స్‌గామ్‌ లోయలో చైనా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఇండియా భద్రతకు ఇబ్బందిగా పరిణమించే ప్రమాదముంది.


పాకిస్థాన్‌ శక్స్‌గామ్‌ లోయను 1963లో చైనాకు అప్పగించింది. ఆక్రమిత కశ్మీర్‌పై ఎలాంటి యాజమాన్య హక్కులూ లేని పాకిస్థాన్‌ ఏకంగా సుదీర్ఘ విస్తీర్ణం కలిగిన ప్రాంతాన్ని బీజింగ్‌కు ఇవ్వడం గర్హనీయం. 1963లో ఇస్లామాబాద్, బీజింగ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంలో ఆరో అధికరణ కీలకమైనది. కశ్మీర్‌పై భారత్, పాక్‌లు ఒక అంగీకారానికి వస్తే శక్స్‌గామ్‌పై తిరిగి చైనాతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆ అధికరణం పేర్కొంది. కశ్మీర్‌ సమస్య పరిష్కారం దిల్లీ, ఇస్లామాబాద్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చల ద్వారానే సాధ్యమని 1972నాటి శిమ్లా ఒప్పందం స్పష్టంచేసింది. అయితే అంతర్జాతీయ చట్టాలను విస్మరిస్తూ పాక్‌ ఈ లోయను చైనాకు అప్పగించింది. తాజాగా అక్కడ నిర్మాణాలు ఆరంభమయ్యాయి. కాబట్టి ఇండియా జాగ్రత్తపడాల్సిన అవసరముంది.


పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సమస్యకు బీజం 1947లోనే పడింది. కశ్మీర్‌ పాలకుడు హరిసింగ్‌ స్వతంత్రంగా ఉండాలని అభిలషించగా, పాకిస్థాన్‌ సైన్యం గిరిజన తెగలతో కలిసి కశ్మీర్‌పై యుద్ధానికి దిగింది. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడంతో భారత దళాలు రంగంలోకి దిగాయి. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఐక్యరాజ్యసమితి జోక్యంతో కాల్పుల విరమణ జరిగింది. అప్పటికే గిల్గిట్, ముజఫరాబాద్‌లను పాక్‌ ఆక్రమించింది. ఐరాస రెండు దేశాల మధ్య నియంత్రణ రేఖను ఏర్పాటుచేసింది. అప్పట్నుంచి ఈ సమస్యకు పరిష్కారం లభించకపోగా, పాక్‌ ఆగడాలు మాత్రం శ్రుతిమించుతున్నాయి. 1950ల తరవాత చైనా దృష్టి ఈ ప్రాంతంపై పడింది. ఇరుదేశాల మధ్య సరిహద్దులకు సంబంధించి చిన్నపాటి ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. 1963లో అప్పటి పాక్‌ పాలకుడు ఆయూబ్‌ఖాన్‌ బీజింగ్‌తో సరిహద్దు ఒప్పందంలో భాగంగా ట్రాన్స్‌ కారాకోరం (శక్స్‌గామ్‌)ను చైనాకు అప్పగించారు. అప్పటినుంచి దీనిపై భారత్‌ ఎన్నిసార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా రెండుదేశాలు పట్టించుకోలేదు. చైనాలోని షింజియాంగ్‌ను కొత్తగా నిర్మిస్తున్న రహదారి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్‌తో అనుసంధానిస్తుంది. అక్కడి సహజ సంపదను కొల్లగొట్టేందుకే డ్రాగన్‌ దీన్ని నిర్మిస్తోందనే ఆరోపణలున్నాయి.


ప్రపంచంలో అత్యంత ఎత్తులోని యుద్ధభూమి సియాచిన్‌ హిమనీనదం. భారత్‌కు చెందిన ఈ ప్రాంతానికి సమీపంలోనే శక్స్‌గామ్‌ ఉంది. చైనా నిర్మిస్తున్న ఈ మార్గం కారాకోరం రహదారిని శక్స్‌గామ్‌ను కలుపుతుంది. వ్యూహాత్మక రణక్షేత్రమైన సియాచిన్‌కు సమీపంలో రహదారి నిర్మించడం మనకు ఇబ్బంది కలిగించే పరిణామమే. సియాచిన్‌ మనదేశంలో ఉండటంతో మనకు ఆధిపత్యం లభిస్తోంది. దీనికి అత్యంత చేరువలో చైనా దళాల కదలికలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గల్వాన్‌ తరహా చొరబాటు యత్నాలు భవిష్యత్తులో శక్స్‌గామ్‌ నుంచి కూడా చోటుచేసుకునే అవకాశాలున్నాయని అంచనా. వాస్తవాధీనరేఖకు సమాంతరంగా టిబెట్‌ నుంచి అక్సాయ్‌చిన్‌ మీదుగా చైనా ఇప్పటికే జీ219 రహదారిని నిర్మించింది. సియాచిన్‌కు దాదాపు 50 కి.మీ. దూరంలోనే నూతన రహదారి వస్తోంది. ఇప్పటికే సీపెక్‌ రహదారి చైనాలోని కష్గర్‌ నుంచి పాక్‌లోని గ్వాదర్‌ను కలుపుతున్న విషయం తెలిసిందే. ఈ రహదారిని సైతం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా నిర్మించడంపై భారత్‌ పలుమార్లు నిరసన వ్యక్తం చేసినా బీజింగ్‌ పట్టించుకోలేదు. కొత్త రహదారితో చైనా దళాలు శక్స్‌గామ్‌లో స్థావరాలు నెలకొల్పే అవకాశముంది. భవిష్యత్తులో ఘర్షణలు సంభవిస్తే చైనా తన దళాలను త్వరితంగా తరలించే ప్రమాదముంది. మరోవైపు పాక్‌ కూడా రంగంలోకి దిగే ముప్పుంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఆక్రమిత శక్స్‌గామ్‌ను చైనాకు ఇవ్వడం విచిత్రం. కానీ బీజింగ్, ఇస్లామాబాద్‌ వీటిని పట్టించుకునే స్థితిలో లేవు. ఇప్పటికే చైనా సరిహద్దుల్లో భారత్‌ మౌలిక సౌకర్యాలను కల్పించింది. సరిహద్దుల్లో మన దళాలు మోహరించాయి. సియాచిన్‌ స్థావరాలను మరింతగా బలోపేతం చేయడం, నిరంతర నిఘా, సైనిక దళాల అప్రమత్తత ద్వారా చైనాను నిలువరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


- కె.శ్రీధర్‌
 

Posted Date: 20-05-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని