• facebook
  • whatsapp
  • telegram

ఇస్రో గఘన యాత్ర

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో విజయ యాత్రను కొనసాగిస్తోంది. ఇటీవలే 200వ సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాన్ని జయప్రదం చేసింది. మరోవైపు ప్రైవేటు రంగానికీ అవకాశాలు కల్పిస్తోంది. భవిష్యత్తులో మరెన్నో ప్రాజెక్టులు చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.

పరిమాణంలో చిన్నగా, తక్కువ బడ్జెట్‌తో ప్రయోగించే వాటిని సౌండింగ్‌ రాకెట్లుగా వ్యవహరిస్తారు. వీటిని ప్రయోగాత్మక ప్రయోజనాల కోసం, వాతావరణ అధ్యయనాల కోసం ఉపయోగిస్తుంటారు. శాస్త్రీయ సమాచారాన్ని సేకరించడానికి, భూమిపై వాతావరణాన్ని పరిశీలించడానికి, పెద్ద రాకెట్లలో ఉపయోగించే ముందు కొత్తగా అభివృద్ధి చేసిన ఉపభాగాలను పరీక్షించడానికి ఈ తరహా రాకెట్లను వాడతారు. ఇలాంటి సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చరిత్రను నమోదు చేసింది. తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం (వీఎస్‌ఎస్‌సీ) తుంబా స్టేషన్‌ నుంచి ఇటీవల ప్రయోగించిన ‘రోహిణి ఆర్‌హెచ్‌-200’ సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఇది స్వదేశీ రోహిణి సౌండింగ్‌ రాకెట్‌కు సంబంధించి 200వ విజయం. ఆర్‌హెచ్‌-200 రాకెట్‌ 70 కిలోమీటర్ల ఎత్తుదాకా పయనిస్తుంది. మొదటిసారి తుంబా నుంచి 1963లో అమెరికాకు చెందిన సౌండింగ్‌ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఆ తరవాత రష్యా, ఫ్రాన్సుల నుంచి దిగుమతి చేసుకున్న రెండు దశల రాకెట్లను విజయవంతంగా ప్రయోగించారు. 1967లో ఇస్రో తన సొంత రోహిణి ఆర్‌హెచ్‌-75ని అభివృద్ధి చేయడం ప్రారంభించింది. కాలక్రమేణా రోహిణిని పలు రకాలుగా అభివృద్ధి పరిచారు. 2015లో తుంబాలో రోహిణి సౌండింగ్‌ రాకెట్లు వరసగా 100 విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

మానవ సహిత అంతరిక్ష యాత్ర  

సౌండింగ్‌ రాకెట్‌ కార్యక్రమం దేశ అంతరిక్ష ప్రయోగాలకు పునాది. ఆరు దశాబ్దాల కాలంలో చిన్న రాకెట్ల నుంచి భారీ వాహక నౌకలను పంపే స్థాయికి ఇస్రో ఎదిగింది. నేడు ప్రపంచ దేశాల సరసన తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఏపీలోని షార్‌ కేంద్రం నుంచి ఇప్పటి వరకు 84 రాకెట్‌ ప్రయోగాలు జరిగాయి. ఇందులో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం, ఎస్‌ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ వాహకనౌకలతోపాటు, నాలుగు ప్రయోగాత్మక రాకెట్లు కూడా ఉన్నాయి. ఇస్రో తన రాకెట్లతో విదేశీ ఉపగ్రహాలనూ సులువుగా కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా వాణిజ్యపరంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. 2019లో ప్రధాని మోదీ భూటాన్‌ పర్యటన తరవాత ఇరుదేశాలు అంతరిక్ష ప్రయోగాలను సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించి భారత్‌-భూటాన్‌ ఉపగ్రహాన్ని తాజాగా శనివారం శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి54 ద్వారా విజయవంతంగా ప్రయోగించారు.

శ్రీహరికోటలో రెండు ప్రయోగ వేదికలు ఉన్నాయి. వీటిద్వారా పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం-3 లాంటి భారీ రాకెట్లను  ప్రయోగిస్తున్నారు. మన రాకెట్ల ద్వారా తమ ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు విదేశాలూ ఆసక్తి చూపుతున్నాయి. అయితే, అవన్నీ చిన్న ఉపగ్రహాలు. వాటికోసం పెద్ద రాకెట్‌ ప్రయోగాలు చేయడం, భారీ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించారు. ఇందుకోసం తక్కువ ఖర్చుతో చిన్న ఉపగ్రహ వాహకనౌకలను తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద మరో రాకెట్‌ ప్రయోగ కేంద్రానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ భూసేకరణ పూర్తికావడంతో, త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఇస్రో కీలక లక్ష్యమైన మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం గగన్‌యాన్‌ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. వచ్చే ఏడాదిలో రెండు మానవ రహిత ప్రయోగాలు చేపట్టి, ఆ తరవాత మానవ సహిత యాత్ర చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. ఇప్పటికే ఆరుగురు వ్యోమగాములను ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇస్తున్నారు. మానవ సహిత యాత్ర విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్‌కు స్థానం దక్కుతుంది.

ప్రైవేటు సంస్థల రంగప్రవేశం

ఇప్పటికే కొన్ని దేశాల్లో అంతరిక్ష యాత్రల కోసం రోబో సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇస్రో కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ఇందుకుగాను ప్రయోగాత్మకంగా తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రంలో ఓ రోబోను తీర్చిదిద్దింది. వ్యోమమిత్రగా దానికి నామకరణం చేశారు. దానిపై వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పారాచూట్‌లను పరీక్షించారు. రానున్న రోజుల్లో ఇస్రో ఆదిత్య-ఎల్‌1, ఎక్స్‌రే పొలారిమీటర్‌ శాటిలైట్‌, చంద్రయాన్‌-3 తదితర ప్రయోగాలను కూడా చేపట్టనుంది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ స్కైరూట్‌ రూపొందించిన విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ను శ్రీహరికోట కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ పరిణామంతో భారత అంతరిక్ష ప్రయోగ వాహనాల సాంకేతికత సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రైవేటు సంస్థలూ కీలకపాత్ర పోషించే దశ ప్రారంభమైనట్లుగా భావించాలి.

- కల్లిపూడి దేవేంద్రరెడ్డి
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రాజకీయ చట్రంలో రాజ్యాంగ సంస్థలు

‣ సమస్యల ఊబిలో సూక్ష్మ రుణ సంస్థలు

‣ ఎగుమతుల్లో ప్రాంతీయ భాగస్వామ్యం

‣ ఈసీ స్వతంత్రతపై నీలినీడలు

‣ పంట వ్యర్థాల దహనానికి విరుగుడు

Posted Date: 03-12-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం