• facebook
  • whatsapp
  • telegram

ఎగుమతుల్లో ప్రాంతీయ భాగస్వామ్యం

ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతుల్ని పెంచేందుకు రాష్ట్రాలు, జిల్లాల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నారు. ఇకపై దేశ ఎగుమతి ప్రస్థానంలో రాష్ట్రాలు, జిల్లాలు కూడా పాలుపంచుకోనున్నాయి.

దేశానికి నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని రూపొందించే కసరత్తులో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికే దీన్ని రూపొందించాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటించడంలో ఆలస్యమైంది. ఈ క్రమంలో    2015-20 వాణిజ్య విధానమే 2023 మార్చి వరకు కొనసాగుతుంది. ఇకపై అయిదేళ్లకు ఒకసారి కాకుండా మూడు సంవత్సరాలకు ఒకసారి అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కొత్త విధానం రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రపంచంలో కొత్తగా శరవేగంతో తెరపైకి వస్తున్న అనూహ్య సానుకూల, ప్రతికూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని  నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. ఎగుమతిదారులకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించే దిశగా నూతన విదేశీ వాణిజ్య విధానం రాబోతోంది. పీఎం గతిశక్తిలో భాగంగా బహుళ లాజిస్టిక్స్‌ వ్యవస్థను ఏకతాటిపైకి తెచ్చే యోచనపైనా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తునట్లు తెలుస్తోంది.

స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం

ఇకపై ఎగుమతులను పెంపొందించే కసరత్తులో రాష్ట్రాలను, జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా పరిగణించేలా నూతన విదేశీ వాణిజ్య విధానాన్ని తీర్దిదిద్దనున్నారు. దేశంలో కొన్ని జిల్లాలు కొన్ని రకాల ఉత్పత్తులపై ప్రత్యేకత సంపాదించుకొన్నాయి. అటువంటి జిల్లాలను పరిగణనలోకి తీసుకొంటూ, ఆయా జిల్లాల్లో తయారయ్యే ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. తద్వారా ఎగుమతులకు ఇతోధికంగా ఊతమిచ్చినట్లవుతుంది. ఈ కసరత్తులో సరైన జిల్లాలను ఎంపిక చేయడం, తద్వారా వాటిని ఎగుమతుల కేంద్రాలుగా అభివృద్ధి పరచడం నూతన విదేశీ వాణిజ్య విధానం విజయవంతం కావడానికి దోహదపడుతుంది. రాష్ట్ర, జిల్లాల స్థాయిలో ప్రస్తుత ఎగుమతుల తీరును అవగాహన చేసుకోవడం చాలా అవసరం. 2021-22లో భారత్‌ రికార్డు స్థాయిలో సుమారు నలభై వేల కోట్ల డాలర్లకుపైగా విలువైన వస్తూత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది 2020-21 కన్నా నలభై శాతానికిపైగా అధికం. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల పరంగా అయిదో స్థానంలో ఉన్న భారత్‌కు ఈ ఎగుమతులు తక్కువేనని భావించాలి. దేశ జీడీపీకి, పెరిగిన ఎగుమతులకు చైనా లాంటి దేశాలతో పోలిస్తే ఎక్కడా పొంతన ఉండటం లేదు. భారత్‌ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమాహారం. రాష్ట్రాల తీరైన పురోగతితోనే దేశ ఆర్థిక అభివృద్ధి మెరుగవుతుంది. దేశ ఎగుమతుల తీరుతెన్నులు తెలుసుకోవాలంటే దేశ మొత్తం ఎగుమతుల్లో రాష్ట్రాలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయనేది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎగుమతుల మొత్తమే దేశం ఎగుమతులవుతాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలిస్తే మొత్తం ఎగుమతులలో సింహభాగాన్ని కేవలం పది రాష్ట్రాలే సాధిస్తున్నాయి. వీటిలో అత్యధికంగా అయిదు రాష్ట్రాలే అధిక వాటా పొందుతున్నాయి. ఇందులో గుజరాత్‌ 30.05 శాతం, మహారాష్ట్ర 17.33 శాతం, తమిళనాడు 8.33 శాతం, కర్ణాటక 6.33 శాతం, ఉత్తర్‌ ప్రదేశ్‌ 4.98 శాతంతో ఎగుమతుల్లో కీలకంగా నిలుస్తున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో రెండు దక్షిణాది రాష్ట్రాలు, మిగిలిన రెండూ పశ్చిమ రాష్ట్రాలు. ఈ నాలుగు రాష్ట్రాలకు ఉన్న సుదీర్ఘ సముద్రతీరం ఒకవిధంగా ఎగుమతుల పెరుగుదలకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తూ తోడ్పాటు అందిస్తోంది.

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ఎగుమతులను ప్రోత్సహించే విధానంలో భాగంగా జిల్లాలను ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నది కేంద్రం ఆశయం. ‘ఒక జిల్లా-ఒక వస్తూత్పత్తి’ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 557 జిల్లాలను ఎంపికచేశారు. జిల్లాస్థాయి ఎగుమతి ప్రోత్సాహక కమిటీలనూ ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) స్థానంలో సంస్థల అభివృద్ధి, సేవల హబ్‌ (డీఈఎస్‌హెచ్‌) చట్టాన్ని కేంద్రం ప్రతిపాదించింది. పారిశ్రామికవేత్తలను ఎగుమతుల దిశగా ప్రోత్సహించడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలను గుర్తించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం దీని లక్ష్యం. దేశ ఆర్థిక ప్రగతి- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎగుమతుల రంగంలో సాధించిన పురోగతిపై ఆధారపడి ఉంటుంది. కాకపోతే, మనదేశంలో చాలా తక్కువ రాష్ట్రాలు, జిల్లాలు మాత్రమే ఎగుమతుల పురోగతి ప్రస్థానంలో పాలుపంచుకుంటున్నాయి. విదేశాల్లో గిరాకీ ఉన్న వస్తువులను ఉత్పత్తి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిపుణులతో వృత్తి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. హస్తకళా ఖండాలకు, చేనేత దుస్తులకు, డెయిరీ, సముద్ర ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ అధికం. ఇలాంటి పరిస్థితులను, అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవాలి. రంగాల వారీగా ఎగుమతుల లక్ష్యాన్ని నిర్ణయించడం, అంతర్జాతీయ విలువ ఆధారిత గొలుసు వ్యవస్థలను సమూహంలా తీర్చిదిద్దడం, డేటా, ఎనలిటిక్స్‌ వంటి అంశాలతో పటిష్ఠమైన వాణిజ్య విధానాన్ని రూపొందించడం అవసరం.

జిల్లాల మధ్య వ్యత్యాసాలు

జిల్లా స్థాయి ఎగుమతుల్ని పరిశీలిస్తే- జిల్లాల మధ్య చాలా వ్యత్యాసాలు, అసమానతలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం పదిశాతం జిల్లాలు మాత్రమే మొత్తం దేశ ఎగుమతుల ఆదాయంలో 85 శాతాన్ని సమకూరుస్తున్నాయి. ఇందులో ఇరవై జిల్లాలు అయిదు వందల కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే వస్తువులను ఎగుమతి చేస్తున్నాయి. ఎగుమతుల మొత్తం ఆదాయంలో వీటివాటా సగంకన్నా అధికం. ముఖ్యంగా గుజరాత్‌లోని ఆరు జిల్లాలు మొదటిస్థానంలో, మహారాష్ట్రలోని అయిదు జిల్లాలు రెండో స్థానంలో, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని జిల్లాలు మూడోస్థానంలో నిలిచాయి. మరోవైపు, దేశంలోని 82 జిల్లాలు మాత్రం ఎగుమతుల క్రతువులో భాగస్వామ్యం పొందలేకపోవడం   గమనార్హం. ఈ జిల్లాల నుంచి ఏమాత్రం ఎగుమతులు ఉండటం లేదు. అత్యధికంగా ఎగుమతుల ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాటిలో జామ్‌నగర్‌, సూరత్‌, ముంబయి సబర్బన్‌, ముంబయి, పుణె, భరూచ్‌, కాంచీపురం, అహ్మదాబాద్‌, గౌతమ్‌బుద్ధనగర్‌ వంటి తొమ్మిది జిల్లాలు ముందు   వరసలో ఉన్నాయి. ఈ జిల్లాల నుంచి ఎగుమతయ్యే వస్తువుల్లో ఖనిజ ఇంధనాలు, ఖనిజ ఉత్పత్తులు, రత్నాలు, వజ్రాలు, లోహాలు, అణు  రియాక్టర్లు, బాయిలర్లు, యంత్రాలు, యంత్రసామగ్రి, రహదారి వాహనాలు, వాటి విడి భాగాలు, మందులు, విద్యుత్తు యంత్రాలు, పరికరాలు వాటి విడి భాగాలు ముఖ్యమైనవి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా నుంచి ఆర్గానిక్‌ కెమికల్స్‌ ఎగుమతులతో ఆదాయం సమకూరుతోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈసీ స్వతంత్రతపై నీలినీడలు

‣ పంట వ్యర్థాల దహనానికి విరుగుడు

‣ పీడన గుప్పిట్లో స్త్రీ

‣ భాగ్యనగరం... హరిత శోభితం!

‣ సమస్యల ఊబిలో రేపటి పౌరులు

‣ భద్రతతోనే మహిళా సాధికారత

Posted Date: 30-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం