• facebook
  • whatsapp
  • telegram

‘గ్రేటర్‌’ నిరాసక్తత

‘ప్రజాస్వామ్యాన్ని వేరెవరూ హత్య చేయలేరు... దానిపట్ల ఉదాసీనత, నిర్లక్ష్యభావం, జాగ్రత్తగా సాకలేకపోవడం వల్లనే క్రమేణా అది కనుమరుగైపోతుంది’ అన్న అమెరికన్‌ తత్వవేత్త విశ్లేషణ పూర్తిగా అర్థవంతమైనది. పౌర బాధ్యతగా ఓటు వేయడంపట్ల వయోజనుల ఉదాసీనత, పటిష్ఠంగా ఓటర్ల జాబితాల్ని తీర్చిదిద్దడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్లక్ష్య భావం, ప్రచారార్భాటంతో మోతెక్కించడమేగాని ప్రజాస్వామ్య మహాక్రతువులో జనావళిని భాగస్వాముల్ని చెయ్యలేని పార్టీల ధోరణి- ‘గ్రేటర్‌’ పోలింగ్‌ పండగలో ఓటింగ్‌ సరళిని ప్రభావితం చేశాయి. 24 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో విస్తరించి, 150 డివిజన్లు, దాదాపు 75 లక్షలమంది ఓటర్లతో అలరారే హైదరాబాద్‌ మహానగర పాలిక ఎన్నికల్లో పొడగట్టిన గ్రేటర్‌ నిరాసక్తత నిశ్చేష్టపరుస్తోంది. 2009 ఎన్నికల్లో 42.04 శాతం, క్రితంసారి 45.29 శాతంగా నమోదైన పోలింగ్‌ ఈసారి నగరవాసుల క్రియాశీల భాగస్వామ్యంతో గణనీయంగా మెరుగుపడగలదన్న అంచనాలు వట్టిపోయాయి. పోలింగ్‌ తేదీకి మూన్నాళ్ల ముందునుంచీ సెలవులు, కొవిడ్‌ భయాలు పోలింగ్‌పై దుష్ప్రభావం చూపాయన్న విశ్లేషణలున్నా, నగర జీవి ఆకాంక్షలకు దీటైన అభ్యర్థుల్ని పార్టీలు ఎంపిక చేయలేకపోవడమూ ఓటర్ల ఉదాసీనతకు ప్రధాన కారణంగా మారింది. గత ఎన్నికల్లో ఇంటింటికీ ఓటర్‌ స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరగక పోవడాన్ని ప్రస్తావించిన ఎలెక్షన్‌ కమిషన్‌- నవంబరు 25నాటికల్లా నూరుశాతం ఓటర్లకు అవి అందించాలని జీహెచ్‌ఎంసీ అధికారుల్ని ఆదేశించింది. ఇటీవలి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొన్న వారూ తమ ఓట్లు గల్లంతయ్యాయని వాపోతుండటానికి ఎస్‌ఈసీయే జవాబుదారీ! క్రితంసారి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరులక్షల ఓట్లు గల్లంతు కావడం గగ్గోలు పుట్టించింది. ఓటర్ల జాబితాలో పేర్లను ఏకపక్షంగా తొలగించడం కుదరదని, అధికారులు సహజ న్యాయ సూత్రాల్ని అమలుపరచాల్సిందేన్న న్యాయపాలిక ఆదేశాలకూ మన్నన దక్కకపోవడం- స్థానిక ప్రజాస్వామ్యాన్ని ప్రహసనప్రాయం చేస్తోంది!
 

స్వేచ్ఛగా సక్రమంగా ఎన్నికల నిర్వహణకు ఎలాంటి తప్పులూ లేని కచ్చితమైన ఓటర్ల జాబితాలే జీవనాడి! వార్డుల పునర్విభజన, స్థానాల రిజర్వేషన్‌ వంటి అధికారాలన్నీ రాష్ట్ర కమిషన్లకే దఖలుపరచాలని 2012లో సూచించిన డాక్టర్‌ హెచ్‌.పాండా టాస్క్‌ఫోర్స్‌- ఎస్‌ఈసీ విధుల సక్రమ నిర్వహణకు సొంత సిబ్బంది అవసరమైనా, డిప్యుటేషన్లతోనే సరిపుచ్చాలని సూచించింది. ఓటర్ల జాబితాలు సక్రమంగా లేకపోవడానికి, స్థానిక నేతాగణాల ఒత్తిడితో జాబితానుంచి అర్హుల పేర్లు గుంపగుత్తగా గల్లంతుకావడానికీ ఆ తరహా తాత్కాలిక ఏర్పాట్లే పుణ్యం కట్టుకొంటున్నాయి. ఈ దురవస్థకు విరుగుడుగా- లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఒకే ఓటర్ల జాబితా ఖరారు యత్నాలను కేంద్ర సర్కారు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఓటర్ల పట్టికలో ఎనిమిదిన్నర కోట్ల పేర్లు నకిలీ లేదా బోగస్‌వేనని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా హెచ్‌ఎస్‌ బ్రహ్మ 2015లో నిష్ఠుర సత్యం పలికారు. అన్ని ఎన్నికలకూ ఒకే ఓటర్ల జాబితా ఎంత అవసరమో, అది దోషరహితంగా రూపుదిద్దుకోవడమూ అంతకంటే కీలకం! సొంత ఊళ్లో లేనందువల్ల 2014 సార్వత్రిక ఎన్నికల్లో 28 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోయిన దేశం మనది. పౌరులు ఎక్కడినుంచైనా ఓటుహక్కు వినియోగించుకొనే వెసులుబాటు కల్పిస్తున్న ఆస్ట్రేలియా నుంచి ఎన్నికల సంఘం గుణపాఠాలు నేర్వాలి. ప్రపంచవ్యాప్తంగా 20కిపైగా దేశాలు నిర్బంధ ఓటింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. పల్లెల్లో ఓటింగ్‌ 80శాతం దాటుతుంటే నగరాల్లో అది 50శాతానికీ చేరకపోవడం జనస్వామ్య స్ఫూర్తికి శరాఘాతమే. నిక్కచ్చి ఓటర్ల జాబితాలు, జనజాగృత కార్యక్రమాలతో ఈసీ, మేలిమి అభ్యర్థులతో పార్టీలూ నిబద్ధత చాటుకొంటే- పౌరుల్లో ఉదాసీనత పారదోలేందుకు నిర్బంధ ఓటింగ్‌ పద్ధతినీ అవశ్యం పరిశీలించాల్సిందే!
 

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 11-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాష్ట్రీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం